హక్కుల రక్షకుడు ఈ ప్రవక్త

  • ముహమ్మద్‌ వహీదుద్దీన్‌

కారుణ్యమూర్తి అంతిమ మహాప్రవక్త, ముహమ్మద్‌ (స) సమస్త మానవాళి కొరకు ప్రభవింపజేయబడిన దైవ సందేశహరులు. ప్రళయం వరకూ ఆయన (స) మానవులందరికీ ప్రబోధకునిగా, మార్గదర్శిగా, కారుణ్యంగా వెలుగొందుతారు.

దైవ ప్రవక్త (స) వంశావళి హజ్రత్‌ ఇబ్రాహీం (అ)దాకా చేరుతుంది. ఆయన (స) ప్రముఖ ఖురైష్‌ వంశానికి చెందినవారు. కాబా గృహం అర్చకులు ఆయన (స) వంశంవారే. తండ్రిపేరు అబ్దుల్లా, తాత పేరు అబ్దుల్‌ ముత్తలిబ్‌ ఆయన (స) మక్కా నగరంలో 22 ఏప్రిల్‌ క్రీ.శ. 571 అనాధగా జన్మించారు. ఆరు సంవత్సరాల తరువాత తల్లి బీబీ ఆమీన పరమపదించారు. ఎనిమిదవ ఏట వరకు తాత పోషించారు. ఆ తరువాత బాబాయి అబూతాలిబ్‌ అల్లారుముద్దుగా పెంచిపోషించారు.

దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) అమితమైన సిగ్గరి. ఆయన బాల్యంలో కాబా గృహంలో మరమ్మతులు జరుగుతున్నప్పుడు అందరితో పాటు ఆయన రాళ్ళు మోసేవాళ్ళు. భుజాలు ఎర్రగా కందకుండా ఉండడానికి ఆయన (స) బాబాయి తన అంగిని విప్పి భుజంపై వేయబోతే ఆయన (స) సిగ్గుతో స్పృహ తప్పి పడిపోయారు.

మృదు స్వభావం

ఆయన (స) ఎంతో మృదువుగా వ్యవహరించేవారు. ప్రతి చిన్న విషయానికి చికాకు, కోపం ప్రదర్శించేవారు కాదు. అందరినీ తన చిరునవ్వుతో పలకరించేవారు. మీలో పరాక్రమశీలి ఎవరంటే కోపం వచ్చినప్పుడు నిగ్రహం పాటించేవాడు అని మహా ప్రవక్త (స) సెలవిచ్చారు. 

తల్లిదండ్రుల సేవ

దైవ ప్రవక్త (స) తల్లిదండ్రుల సేవ, వారి పట్ల సత్ప్రవర్తన కలిగి వుండాలని హితవు పలికారు. దైవ ప్రవక్తకు (స) పాలు పట్టిన తల్లి దాయీ హలిమాను తన సొంత తల్లిలా చూసుకున్నారు.

సంతానం పట్ల తల్లిదండ్రుల బాధ్యత 

తమ పిల్లలను ప్రేమించడం, మంచి విద్యాబుద్ధులు నేర్పించడం, సజ్జనులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడం తల్లిదండ్రుల బాధ్యత. ప్రవక్త (స) తన కుమార్తె హజ్రత్‌ ఫాతిమాను ఎంతో అమితంగా ప్రేమించేవారు. ఆమెకు ఉన్నతమైన విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దారు.

ఉత్తమ భర్తగా

దైవ ప్రవక్త (స) తన ఇరవై ఐదవ ఏట, తనకన్నా వయస్సులో పదిహేనేళ్ళ పెద్దదైన, రెండోసారి వితంతువు అయిన హజ్రత్‌ ఖదీజా(ర)ను వివాహమాడి స్త్రీ జనోద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఆమెతో అత్యంత సంతోష జీవితాన్ని గడిపారు. ఆమె మరణానంతరం, ఇస్లామీయ ఉద్యమ అవసరాలు, అరబ్బు తెగల మధ్య ఐక్యత సాధించడానికి వేర్వేరు తెగల నుంచి వివాహాలు చేసుకున్నారు. అందులో ఆయేషా(ర) తప్ప మిగితా వారంత వితంతువులే. కుటుంబ జీవనం భార్యా భర్తల పవిత్ర బంధంతో ప్రారంభమవుతుంది. భార్యాభర్తలిద్దరు సంసారిక జీవితం, దాని నియమాల్ని, బాధ్యతలను సరిగ్గా అర్ధం చేసుకుని తదనుగుణంగా నడుచుకుంటే, ఆ కుటుంబం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వికసిస్తుందని చెప్పారు.

మృదుభాషి

దైవ ప్రవక్త (స) ప్రతి మాట ఆగి ఆగి స్పష్టంగా పలికేవారు. వినేవారికి ఆయన మాటలు పూర్తిగా అర్థమయ్యేవి. ఆయన గొంతు గంభీరంగా ఉండి స్పష్టంగా వినపడేది. ఆయన సంభాషణలో ఇతరులకు పూర్తిగా అవకాశం ఇచ్చేవారు. మధ్యలో కలుగజేసుకునేవారు కాదు. చెప్పే మాటను పూర్తి శ్రద్ధగా వినేవారు. 

మంచి మిత్రునిగా

దైవ ప్రవక్గ ముహమ్మద్‌ (స) తన సహచర మిత్రులను చాలా ప్రేమించేవారు. ఎప్పుడూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేవారు. సత్యం విషయంలో ఆయన అందరిని సమదృష్టితో చూసేవారు. ధనికులైన, పేదవారైనా, స్వతంత్రులైనా, బానిసలైనా ప్రతి ఒక్కరి ఆహ్వానాన్ని మన్నించే వారు వ్యాధి గ్రస్తులు స్వంతవారైనా, పరాయి వారైనా వారి పరామర్శకు వెళ్లేవారు ఇతరులను ఆ దిశగా ప్రోత్సహించేవారు.

సత్య సంధులు

దైవ ప్రవక్త ముహ్మద్‌ (స) జీవితంలో ఎన్నడూ అబద్ధం పలుకలేదు. హాస్యానికి కూడా అబద్ధం పలుకలేదు. ఆయన శత్రువులు కూడా ఆయన బోధనలను వ్యతిరేకించేవారు కాని ఆయన అబద్ధం పలుకుతారని మాత్రం చెప్పలేదు. ఒకసారి దైవ ప్రవక్త (స) దైవ దౌత్య ప్రారంభ దశలో ప్రజలను సమీకరించే ఉద్దేశ్యంతో ‘‘సఫా’’ కొండపైకి ఎక్కి ‘యా సబా, యా సబా’ అని ఎలుగెత్తి పిలుపునిచ్చారు. ప్రజలు గుమిగూడగానే దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా అడిగారు. ‘‘ఒకవేళ నేను మీతో ఈ కొండకు వెనుక వైపున ఒక శత్రు సైన్యం మనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉందని చెబితే మీరు నమ్ముతారా’’ వెంటనే అందరు నమ్ముతాం. ఎందుకంటే మీరు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. మీరు సాదిక్‌ (సత్య సంధులు) మీరు అబద్ధం చెప్పడం మేము ఏనాడూ వినలేదు అని ప్రవక్త (స) వారి సత్య సంధతకు సాక్ష్యం పలికారు.

దయార్ద్ర హృదయం

దైవ ప్రవక్త (స) ఒక విశాలమైన దృక్పథం, దయగల హృదయం గలవారు ఆయన గనక కఠిన హృదయుడయితే తన ఉద్యమంలో ఎన్నడూ విజయం సాధించేవారు కాదు.

ధనత్యాగం

మహాప్రవక్త (స) దైవ ప్రవక్తగా ఎన్నుకోబడక ముందు అంతర్జాతీయ వాణిజ్యం చేసేవారు. ఆయన సతీమణి ఒక సంపన్నురాలు (హజ్రత్‌ ఖదీజా (రజి). ఆమె స్వయంగా అతి పెద్ద వ్యాపారి. కాని ఆయన (స) దైవ ప్రవక్తగా ఎన్నుకోబడిన తరువాత ఆమె తన సంపదనంతా ధర్మ ప్రచారం కోసం ఖర్చు చేశారు. చివరికి ఆయనకు తాయెఫ్‌ నగరానికి కాలినడకన వెళ్ళవలసిన వచ్చింది. ఏ వాహనమూ లేకుండా పోయింది. మదీనాకు వలసపోయే సమయంలో ఖర్చులన్నీ హజ్రత్‌ అబూబకర్‌ (ర) భరించారు. ఆయన (స) వద్దకు సంపద వచ్చినప్పుడు ఖర్చుల వరకే తీసుకుని మిగతాది పేదలకుదానం చేసేవారు. ఆయన (స) చేయి చాపేవారికి ఎన్నడూ ఉత్తచేతులతో పంపలేదు.

నిరాడంబరత 

దైవ ప్రవక్త (స) పరిశుద్ధతను ఇష్టపడేవారు. ఆయన (స) నిరాడంబరంగా ఉండేవారు. అతుకులు వేసిన బట్టలు, తొడగడానికి న్యూనతగా భావించేవారు కాదు. బట్టలు పరిశ్రుభ్రంగా ఉండేవి. ధర్మ సమ్మతమైన ఆహారమే భుజించే వారు. ఎన్నడూ దేనిలోనూ లోపం వెతికేవారు కాదు. అందరితో కలిసి భుజించడాన్ని ఇష్టపడే వారు. చాలా సార్లు ఆకలి దప్పులకు తాళలేక కడుపుపై రాయి కట్టుకునే వారు. సమావేశంలో అందరితో పాటు కూర్చునేవారు. గొంతెత్తి మాట్లాడే వారు. ప్రగల్భాలు పలకడం గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అసలు నచ్చేవి కావు.

వ్యవహారాలు

దైవ ప్రవక్త (స) అందరితో పాటు సాధారణ సామాజిక జీవితం గడిపేవారు. ప్రజలతో కలిసేవారు. సామాజిక జీవితంలో ఇచ్చిపుచ్చుకోవడం ఇంకా విభిన్న రకాల వ్యవహారాలు ఉంటాయి. ఆ వ్యవహారాలలో ఆయన ఖరాఖండిగా ఉండేవారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రజలు ఆయన (స)తో శత్రుత్వం వహిస్తూ కూడా తమ సొత్తును ఆయన వద్దనే అమానతుగా పెట్టేవారు. హిజ్రత్‌ చేసిన నాటి రాత్రి ఆయన (స)ను అంతం చేయడానికి వచ్చిన వారి సొమ్ము కూడా ఆయన (స) దగ్గరే ఉంది. హజ్రత్‌ అలీ(ర)ని తన ప్రతినిధిగా చేసి ఇదిగో ఇవి ఫలానా ఫలానా వారి సొమ్ము. ఎవరి సొమ్ము వారికి ఇచ్చి వేయండని చెప్పారు. ఆ సమయంలో ఆయన (స) వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. హిజ్రత్‌ ఖర్చులన్నీ హజ్రత్‌ అబూబకర్‌ (ర)నే భరించారు.

పిల్లలకు సలామ్‌

దైవ ప్రవక్త (స) ఎక్కడికి వెళ్ళినా ముందుగా సలామ్‌ చేయటం ఆయన సంప్రదాయంగా ఉండిరది. సలామ్‌ చేయకుండా ఎవరైనా మాట్లాడితే బదుల్వికండి అని ప్రవక్త (స) చెప్పేవారు. పిల్లలకు కూడా ఆయన సలాం చేసేవారు.

సేవకుల హక్కుల గురించి

మోయలేనంత బరువు వారిపై మోపకండి. వారి కష్టానికి తగిన ఫలితం చెల్లించండం. ఇది వారి హక్కు. వారు మీ సోదరులు, మీరు ఏది తింటారో అదే వారికీ పెట్టండి. మీరు తొడిగే అటువంటి వస్త్రాలే వారికి తొడిగించండి అని హితవు చేయబడిరది.

అతిథుల హక్కుల గురించి

ఎవరైతే అల్లాప్‌ాను, పరలోక దినాన్ని విశ్వసిస్తారో వారు తమ అతిథిని ఆదరించి సత్కరించాలి అని దైవ ప్రవక్త (స) తెలిపారు. అతిథ్యం మూడు రోజుల వరకు ఉంటుంది. మొదటి రోజు విందు, సత్కరింపుల దినం. ఆరోజు అతిథికి వీలైనంత మంచి అన్న పానీయాలు సమకూర్చాలి. రెండవ మూడవ రోజు శ్రమించవలసిన అవసరం లేదు. మూడు రోజుల తరువాత అతిథి చేసే సేవలు సదకా (దానం)గా పరిగణించబడతాయి. ఇంటి వారిని కష్టపెట్టే వరకు బస చేయడం అతిథికి సమ్మతం కాదని ఉద్భోదించారు. 

అనాధల హక్కుల గురించి

వారి ఆస్తిపాస్తులను కాపాడండి. ఎవరు అన్యాయంగా వారి సొమ్ము తింటారో వారు తమ కడుపులో అగ్ని నింపుకుంటున్నారు. అనాధలతో కఠినంగా వ్యవహరించడాన్ని వారించారు. వారితో మేలైన రీతిలో వ్యవహరిస్తు, వారి బాధ్యతను ఎత్తుకుంటే వారికి స్వర్గం లభిస్తుందన్నారు. ఒక అనాధతో మంచిగా వ్యవహరించిన ఇల్లే ఉత్తమమయిన ఇల్లు వారితో దుష్ప్రవర్తనతో వ్యవహరించిన ఇల్లే అతి చెడ్డ ఇల్లు అని ఆయన (స) చెప్పారు.

పొరుగువారి హక్కుల గురించి

పొరుగున ఉన్న వ్యక్తి ఆకలితో అలమటిస్తుండగా కడుపునిండా భుజించిన వాడు విశ్వాసి కాలేడు. తన పొరుగువారు తన దౌష్ట్యానికి బలయితే అతడు విశ్వాసి కాజాలడు. ఏ పొరుగువారు మీకు ఎంత సమీపంలో ఉండాలో అతను మీ మంచి ప్రవర్తనకు అంతే హక్కుదారుడు. వారి సుఖదుఃఖాలలో, సంతోష సంబరాలలో మీరు పాలుపంచుకోవాలని ఆయన (స) హితవు పలికారు.

న్యాయాధిపతిగా

దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) ఒక న్యాయాధిపతిగా ఆదర్శ ప్రాయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. సమ న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయవ్యవస్థను స్థాపించారు. తద్వారా నల్లవారైనా, తెల్లవారైనా, అరబ్బైనా, అరబ్బేతరుడైనా, గొప్ప వంశస్థుడైనా, బానిస అయినా, ప్రవక్త వారి వంశానికి చెందిన వారైనా, తెగల సర్ధారులైనా న్యాయం, చట్టం శిక్షల ముందు సమానులైపోయారు.

ఒకసారి ఒక స్త్రీ దొంగతనం చేసి పట్టుబడి దైవ ప్రవక్త (స) సన్నిధికి తీసుకురాబడిరది. అప్పుడు కొందరు ఆ స్త్రీ గౌరవప్రదమైన కుటుంబానికి చెందినదని ఆమెను శిక్షించడకుండా వదిలి వేయాలని సిఫారసు చేయగా దైవ ప్రవక్త (స) ఇలా తెలిపారు.

వెనుకటి సమాజాలు పతనమవడానికి కారణం గౌరవప్రదమైన వారు లేదా ధనవంతులు నేరం చేస్తే శిక్షించేవారు కాదు. బీదలు, సామాన్యులు నేరం చేస్తే వెంటనే వారిని శిక్షించేవారు, ఇలాంటి పనులు చేయడం వల్లనే వెనుకటి సమాజాలు నాశనమయ్యాయి. ఒకవేళ నా కూతురు ఫాతిమా ఈ నేరం చేసినా నేను ఆమెను శిక్షించ కుండా వదిలి వెయ్యను అని ఆ స్త్రీని ఆమె చేసిన నేరానికి తగిన శిక్ష విధించడం జరిగింది. అందరికీ సమన్యాయం ఉండాలని చెప్పారు మహ ప్రవక్త ముహమ్మద్‌ (స).

త్యాగశీలిగా

ఒక విశ్వాసురాలైన స్త్రీ తన స్వహస్తాలతో ఒక దుప్పటిని నేసి దైవ ప్రవక్త (స) వారికి బహుమతిగా అందించింది. నిజానికి ఆ సమయంలో ప్రవక్త (స)కు ఆ దుప్పటి ఎంతో అవసరమై ఉండిరది, కాని పక్కనే ఉన్న ఒక సహాబీ ఓ దైవ ప్రవక్తా! దుప్పటి చాలా అందంగా ఉంది. ఈ దుప్పటిని నాకు ప్రసాదించండి అని అర్థించారు. ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స) తన అవసరాన్ని కూడా త్యజించి ఆ దుప్పటిని సహాబికి అందించారు.

పాలకునిగా

ఒక పాలకునిగా ప్రవక్త (స) ప్రజలందరి కనీస అవసరాలు తీర్చడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నారు. ముస్లీమైనా, ముస్లీమేతర సోదరుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా జన్మరీత్యా అందరూ సమానులే అని పేర్కొన్నారు.

పౌరులందరికి ధన, మాన, ప్రాణ రక్షణకు భరోసా ప్రసాదించారు. వయోవృద్ధులకు ఫింఛన్‌లు, ప్రజల ధార్మిక, సాంస్కృతిక హక్కులకు, తూనికలు, కొలతలు, వ్యాపారాల్లో జరిగే మోసాలను నివారించి స్వచ్ఛమైన వాణిజ్యాన్ని ప్రపంచానికి అందించారు. జూదం, మద్యపానం, వ్యభిచారం లేని ఒక సుందర సమాజ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టారు. నీటి బావులు, రహదారుల నిర్మాణం, వైద్యశాలలు, పాఠశాలలు అతిధి గృహాల నిర్మాణం చేశారు. జకాత్‌, ఫిత్రా, సదఖా లాంటి ఆర్థిక సంస్కరణల ద్వారా కేవలం 30 ఏళ్ల కాలంలో పేదరికాన్ని పారద్రోలి అద్భుతమైన ఆర్థిక మంత్రదండాన్ని ప్రపంచానికి అందించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, మానవ హక్కుల పరిరక్షణ అన్నింటికంటే మించి మానవులను సృష్టికర్త అయిన దేవునికే అందించాలని తెలిపారు.

కిరీటం లేని చక్రవర్తిగా, సంపదలేని మహరాజుగా, రాజమహలు ఎరుగని పాలకునిగా, హంసతూలికా తల్పం తెలియని మహా మనిషిగా మరణించే రోజున దీపంలోనైనా నూనె సైతం లేని సామ్రాజ్యాధిపతిగా ప్రపంచ చరిత్రలో కనివిని ఎరుగని నభూతో నభవిష్యత్‌ లాంటి గొప్ప వ్యక్తిత్వం గల సంక్షేమ రాజ్యస్థాపకునిగా ప్రపంచానికి ఆదర్శప్రాయుడయ్యారు.