|

వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు వెయ్యికోట్లు ఇవ్వండి

ప్రధానిని కోరిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం భూమిపూజ కార్యక్రమానికి ఢిల్లీ వెల్లిన సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీని కలిసి రాష్ట్రంలోని పలు సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వినతిపత్రాలు సమర్పించారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో పలు సమస్యలను ప్రధాని దృష్టికి తేగా ఆయన సానుకూలంగా స్పందించారు.

యాదాద్రి ఆలయాన్ని ఆగమశాస్త్ర ప్రకారం ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పునర్నిర్మించామని, పునఃప్రారంభానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జియర్‌స్వామి ముహూర్తం నిర్ణయిస్తారని సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీకి తెలిపారు. ఈ సందర్భంగా పది నుంచి పదిహేను వేల మంది రుత్విక్కులతో మహా సుదర్శన యాగం చేయ సంకల్పించినట్లు తెలిపారు. ఈ బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీరు ముఖ్యఅతిథిగా తప్పక హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాని మోదీ హాజరుకావడానికి హామీ ఇచ్చారు.  యాదాద్రి ప్రారంభోత్సవారిని తప్పకుండా వస్తానన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరగా అంగీకారం తెలిపారు. 

రాష్ట్రానికి సంబంధించి సమర్పించిన వినతి పత్రాల్లో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనా సంబంధమైనవి, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించినవి తెలియచేశారు. తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత పది జిల్లాలు 33 జిల్లాలుగా మారాయని, కమీషనరేట్లు పెరిగాయని, అందుకై ఐపీఎస్‌ క్యాడర్‌ అధికారుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. 139గా ఉన్న ఈ సంఖ్యను 195కు పెంచాలని కోరారు. 

వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు వెయ్యి కోట్ల రూపాయలు వన్‌టైం గ్రాంట్‌గా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. టెక్స్‌టైల్‌ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయంలో ప్రధానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో నాణ్యమైన పత్తి పండుతుందని, దారం ఎక్కువగా వస్తుందని తెలిపారు. దేశంలో పత్తి పంటలో తమ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని తెలిపారు. టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు వల్ల పత్తి రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 1600 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశామని, కేంద్రం వెయ్యి కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని, మిగతావి తాము సమకూర్చుకుంటామన్నారు. 

ప్రత్యేక గిరిజన వర్సిటీ 

విభజన హామీ మేరకు రాష్ట్రంలో ప్రత్యేక గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రం విడిపోయిన సందర్భంగా తెలంగాణకు పత్యేక గిరిజన వర్సిటీ ఇవ్వనున్నట్లు ప్రకటించారని, ఆ హామీ మేరకు ప్రత్యేక గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వర్సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు సైతం ఆ ప్రాంతంలో వర్సిటీ ఏర్పాటుకు అంగీకరించారని తెలిపారు. కానీ అప్పటి నుంచి ఎలాంటి ముందడుగు పడలేదని తెలిపారు. దీనికై పార్లమెంటులో బడ్జెట్‌ కేటాయించి వర్సిటీ స్థాపనకు సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం పది జిల్లాలను 33 జిల్లాలుగా చేయడం జరిగిందని, దానికి అనుగుణంగా కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు జవహర్‌ నవోదయా విద్యాలయాలను మంజూరీ చేయాలని  ప్రధానిని కోరారు. 

గ్రామీణ రోడ్లకు నిధులు

ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌యోజన కింద రాష్ట్రంలో 4వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులు ఉన్నాయని, వాటిని వెడల్పు చేయడానికి, బ్లాక్‌టాప్‌ చేయడానికి నిధులు మంజూరీ చేయాలని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం `2014లో వెనకబడిన ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేయాలని స్పష్టమైన నిబంధన ఉందని, దీని ప్రకారం పీఎంజీఎస్‌వై కింద అదనపు నిధులు ఇవ్వాలని సీఎం కోరారు. వామపక్ష తీవ్రవాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను అభివృద్ధిపరచాల్సిన అవసరం ఉందన్నారు. సీఎస్‌ఎస్‌ పథకం కింద 60ః40 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిష్పత్తి కాకుండా మొత్తం కేంద్రమే భరించి రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 

రెండు పెద్ద పారిశ్రామిక కారిడార్లు

రెండు పెద్ద పారిశ్రామిక కారిడార్‌లను ఏర్పాటు చేయాలని ప్రధానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఒకటి హైదరాబాద్‌`నాగపూర్‌ మధ్యలో, రెండవది హైదరాబాద్‌`వరంగల్‌ మధ్యలో ఏర్పాటు చేయాలని  కోరారు. హైదరాబాద్‌`నాగపూర్‌ మధ్యలో 585 కిలోమీటర్లకు ఇరువైపులా 50 కిలోమీటర్ల వెడల్పును పరిగణనలోకి తీసుకుంటే, పారిశ్రామిక అభివృద్ధికి అన్ని వసతి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. అలాగే హైదరాబాద్‌`వరంగల్‌ మధ్యలో కూడా పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. రెండు పారిశ్రామిక వాడలు మంజూరీ చేయాలని ప్రధానిని కోరారు. 

ఐఐఎం, ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయండి

రాష్ట్రంలో ఐఐఎం, ట్రిపుల్‌ ఐటీ, ఏర్పాటు చేయాలని కోరారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (హెచ్‌సీయు)లో ఐఐఎం ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు అవసరమయ్యే స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. హెచ్‌సీయులో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రెండువేల ఎకరాల స్థలం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలకు ఐఐఎంలను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ను (ఐఎస్‌బీ)ని సాకుగా చూపుతూ కొత్త ఐఐఎంను ఏర్పాటు చేయడంలేదని లేఖలో పేర్కొన్నారు. ఐఎస్‌బీలో ట్యూషన్‌ఫీజులను పేద విద్యార్థులు భరించ లేరని పేర్కొన్నారు. హెచ్‌సీయులో ఐఐఎం ఏర్పాటు చేయడానికి కేంద్ర విద్యాశాఖకు ఆదేశాలివ్వాలని సీఎం కోరారు. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెద్దదైన కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటుకు కరీంనగర్‌ ఎంతో అనుకూలమైన ప్రాంతమని పేర్కొన్నారు. ఇక్కడకు ట్రిపుల్‌ ఐటీ మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వైపున స్థలాన్ని సమకూర్చడంతో పాటు, పీపీపీ పద్ధతిలో వాటాను సైతం సమకూర్చగలమన్నారు. ఐటీ కంపెనీలు భాగస్వామ్య మయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రిపుల్‌ ఐటీని వీలైనంత త్వరగా మంజూరు చేస్తే ఈ విద్యా సంవత్సరమే ప్రవేశాలు పూర్తి చేస్తామని లేఖలో పేర్కొన్నారు. 

విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేయాలని కోరారు. ఇలా మొత్తం పది అంశాలపై ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వినతిపత్రాలు సమర్పించారు. యాదాద్రి ప్రారంభోత్స వానికి రావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి ఆహ్వానించారు.

హోంమంత్రి అమిత్‌షాను కలిసిన కేసీఆర్‌

ఢిల్లీలో ప్రధానిని కలిసిన మరుసటి రోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షాను కలిసారు. ముఖ్యంగా రాష్ట్రానికి అదనపు ఐపీఎస్‌ అధికారులను కేటాయించే విషయంలో ఆయనతో చర్చించారు.  ఐపీఎస్‌ క్యాడర్‌ అధికారుల 139గా ఉన్న ఈ సంఖ్యను 195కు పెంచాలని కోరారు. సీనియర్‌ డ్యూటీ అధికారుల సంఖ్యను 76 నుంచి 105కు పెంచాలని కోరారు.  2016లో ఐపీఎస్‌ క్యాడర్‌ రివ్యూ జరిగినపుడు 76 సీనియర్‌ డ్యూటీ పోస్టులతో సహా మొత్తం 139 పోస్టులు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో పది నుంచి 33 జిల్లాలు అయ్యాయి, కమిషనరేట్ల సంఖ్య 9కి పెరిగింది, అందువల్ల అదనపు పోస్టులు అవసరం ఉందన్నారు. ఈ మేరకు జూన్‌ 24న హోంశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు సీఎం తెలిపారు. 

కేంద్ర మంత్రులు షెకావత్‌, గడ్కరీలను కలిసిన సీఎం

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఉపరితల రవాణాశాఖా మంత్రి నితిన్‌ గడ్కరీలను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను వారితో చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర నీటివాటాల విషయమై ఏపీతో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో సీఎం జలశక్తి మంత్రిని కలిసి నీటి వాటాల విషయమై కూలంకషంగా చర్చించారు. తాము అనుమతిలేని ప్రాజెక్టులను చేపట్టడంలేదని తేల్చి చెప్పారు. వాటన్నిటికీ గతంలోనీ సీడబ్ల్యుసీ అనుమతులు ఉన్నట్లు తెలిపారు. ఇటీవల జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో రాష్ట్రంలో 11 ప్రాజెక్టులకు అనుమతులు లేవని ప్రకటించారన్నారు. వాటిని అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులను, వాటికి ఉన్న నీటి కేటాయింపులను తెలియచేస్తూ పూర్తి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. 

గోదావరి జలాల్లో 967.94 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయని, అందులో ఇప్పటికే 758.76 టీఎంసీల వినియోగానికి సంబంధించి సీడబ్ల్యుసీ అనుమతులు ఉన్నాయన్నారు. ఇచ్చంపల్లి, దేవాదుల, రాజీవ్‌సాగర్‌, ఇందిరా సాగర్‌ ఈ నాలుగు ప్రాజెక్టులకు 155 టీఎంసీలను కేటాయిస్తూ సీడబ్ల్యుసీ ఇచ్చిన అనుమతుల పత్రాన్ని కేంద్రమంత్రికి అందచేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు 240 టీఎంసీల అనుమతులు ఉన్నాయని తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల లాంటి చిన్న ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం వివరించారు. అందువల్ల గోదావరి నదీ యాజమాన్య బోర్డు సీడబ్ల్యుసీకి వివరించి అనుమతులు లేని జాబితా నుంచి ఆయా ప్రాజెక్టుల పేర్లను తొలగించాలని కోరారు. ఈ సమావేశంలో సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్సీలు మురళీధర్‌, హరిరామ్‌, గణపతిరెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.  

రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, రీజనల్‌ రింగ్‌రోడ్‌ నిర్మాణానికి సహకరించాలని, విజయవాడ`హైదరాబాద్‌ హైవేను ఆరులేన్ల రహదారిగా మార్చాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖా మంత్రి నితిన్‌ గడ్కరీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.  గతంలో మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం 3,306 కిలోమీటర్లు జాతీయ రహదారులుగా గుర్తించాల్సి ఉండగా, ఇప్పటికి 2,168 కిలోమీటర్లు మాత్రమే గుర్తించారని, మిగతా 1,139 కిలోమీటర్లు కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలని సీఎం కోరారు.  ఇవే కాకుండా రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసం సెంట్రల్‌ రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (సీఆర్‌ఐఎఫ్‌) నిధుల నుంచి 744 కోట్ల రూపాయల నిధులను మంజూరీ చేయాలని కోరారు. పార్లమెంటు నియోజక వర్గాల వారీగా తమ పార్లమెంటు సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనలకు నిధులు మంజూరీ చేయాలని కోరారు. 2021`22, 2022`23 ఆర్థిక సంవత్సరాలకు పూర్తి నిధులు విడుదల చేయాలని సీఎం కోరారు. అలాగే రాష్ట్రంలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల దాక 167 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారిగా నోటిఫై చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  కృష్ణా నదిపై సోమశిల వద్ద వంతెన నిర్మించాలని, దీనివల్ల హైదరాబాద్‌ నుంచి తిరుపతి, చెన్నైకి 80 కిలోమీటర్లు  దూరం తగ్గుతుందని దీన్ని మంజూరీ చేయాలని కోరారు. 

మంత్రి గంగుల కమలాకర్‌ 

కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి పీయూష్‌ గోయల్‌ను మంత్రి కేటీఆర్‌తో పాటు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కలిశారు. కేంద్రం తీసుకొనే బియ్యంలో 2020-21 యాసంగి సీజనుకు చెందిన బాయిల్డ్‌  రైస్‌ వాటా పెంపు, గత యాసంగిలో అందించాల్సిన లక్ష క్వింటాళ్ల బియ్యంపై 30 రోజులు అదనపు సీఎంఆర్‌ గడువు, వచ్చే వానాకాలంలో తెలంగాణలో 80లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు అనే అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. కేంద్ర మంత్రి ఆదేశాలతో ప్రజాపంపిణీ కార్యదర్శి సుధాన్షు పాండేను కలిసిన గంగుల సమస్యల్ని వేగంగా పరిష్కరించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఎఫ్‌.సి.ఐ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ సీఎండి, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర సివిల్‌ సప్లైస్‌ అధికారులు భేటి అయ్యారు, అలాగే ఎఫ్‌.సి.ఐ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అతీష్‌ చంద్ర, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి గంగుల ఢిల్లీలో సమావేశమయ్యారు. 

తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్న న్యాయబద్ధమైన అంశాలను కూలంకషంగా కేంద్రానికి వివరించారు. రైతు ఉత్పత్తులను సేకరించడంలో వ్యాపార కోణంలో మాత్రమే కాకుండా మానవీయ కోణంలో వ్యవహరించాల్సిన అవసరముందని గుర్తుచేసారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ దృష్టితో తీసుకున్న రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంటు, కాళేశ్వర జలాల అందుబాటు వంటి చర్యలు, రైతుల కోసం ఖర్చుచేసిన వేల కోట్ల రూపాయలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలిస్తు న్నాయని, ఈ సమయంలో కేంద్రం మద్దతు తెలపాల్సిన అవసరాన్ని వారికి గుర్తుచేశారు. 

దేశంలో కరోనా సంక్షోభంతో కోట్లాది ప్రజలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, పేదలందరికీ ఆహార ధాన్యాలు అందించాల్సిన క్లిష్ట సమయంలో ఆహార వృధాను అరికట్టడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యంగా ఉండాలన్నారు.

యాసంగిలో తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు 

ఉంటాయని ఆ పరిస్థితుల్లో పండిన ధాన్యాన్ని రారైస్‌గా మిల్లింగ్‌ చేసినప్పుడు విరిగిపోయి లక్షల క్వింటాళ్ల బియ్యం పనికిరాకుండా పోతాయన్నారు. ఈ కరోనా క్లిష్ట సమయంలో అంత ధాన్యాన్ని వృధా చేయడం సరికాదని అందువల్ల బాయిల్డ్‌ రైస్‌ రూపంలోనే వాటిని తీసు కోవాలని కోరారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన రైతు ఆదాయం రెట్టింపుకు సైతం దోహద పడుతుందన్నారు. అలాగే గత సంవత్సరాల్లో చాలా తక్కువ ధాన్యం ఉత్పత్తి జరిగినప్పుడు సైతం బాయిల్డ్‌ రైస్‌ అందించామని ఇప్పుడు రికార్డు స్థాయిలో దాదాపు కోటి క్వింటాళ్ల ధాన్యం దిగుబడులు వచ్చాయని గణాంకాలతో సహా మంత్రి గంగుల కేంద్రం ముందుంచారు, ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయడమే సవాళ్లతో కూడుకున్నదని ఇప్పుడు వాటిని రా రైస్‌ రూపంలో ఇవ్వడమంటే రైతుల్ని పూర్తిగా నట్టేట్లో ముంచడమే ఆవుతుందని కేంద్రం వద్ద తన ఆవేదనని వ్యక్తం చేసారు.

యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్‌ రైస్‌గా అందించడానికి సహకరించాలని కోరారు, అలాగే గత యాసంగి సీజన్లో ఎఫ్‌.సి.ఐ ప్యాడి స్టాక్‌ వెరిఫికేషన్‌ కోసం దాదాపు నెలరోజుల్ని నష్టపోవడం వల్ల 300కోట్ల విలువ చేసే లక్ష క్వింటాళ్ల బియ్యాన్ని అందించలేకపోయామని వాటిని అందించడానికి నష్టపోయిన నెలరోజుల్ని తిరిగివ్వా ల్సిందిగా కోరారు, ప్రస్తుతం నడుస్తున్న వానాకాలం సీజన్లో వరి దాదాపు 55లక్షల ఎకరాల్లో సాగువుతుందని, ఇంత పెద్ద ఎత్తున రైతులు పండిస్తున్న ధాన్యాన్ని తీసుకోవడం కోసం ఎఫ్‌.సి.ఐ 80 లక్షల క్వింటాళ్ల వరకు తెలంగాణకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. వరుసగా కేంద్ర ఆహార, ప్రజాపంపిణి శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, కేంద్ర కార్యదర్శి సుధాన్షు పాండె, ఎఫ్‌.సి.ఐ. సీఎండీలతో జరిపిన చర్చల్లో తాను చెప్పిన అంశాల పట్ల సానుకూలత వ్యక్తమయిందని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. 

కార్మిక మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి సి.హెచ్‌ మల్లారెడ్డి కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని కలిసారు. రాష్ట్రానికి కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో ఇవ్వవలసిన మిగులు బడ్జెట్‌ ను విడుదల చేయాలని కోరారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌ శాఖ అధీనంలో గల డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ ద్వారా అమలు చేయవలసిందిగా కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాల లో రూ. 16.57 కోట్లు పెండిరగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరలో విడుదల చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరినారు.

కేంద్ర కార్మిక, పర్యావరణం, అడవుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కూడా రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కలిసారు. కార్మిక ఉపాధి శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తరాల ద్వారా మీకు పూర్వమే తెలపడం జరిగిందని, 2019-20 సంవత్సరానికి సంబంధించిన మిగిలిపోయిన బడ్జెట్‌ రూ. 104.50 విడుదల చేయాలని కోరారు. 

మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌

కేంద్ర ప్రభుత్వం దేశంలోని చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీల ఆరోగ్యం కోసం చేపట్టిన వివిధ పథకాల గడువు ముగుస్తుండడం, వాటి కేంద్ర వాటా తగ్గించడం, కొనసాగించకపోవడంపై చర్చించడానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ కవిత, గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ మేయర్‌ గుండు సుధారాణి, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌లతో కలిసి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కలిసారు. ప్రారంభించిన కేంద్ర పథకాలను కొనసాగించాలని, గతంలో మాదిరిగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను భరించాలని విజ్ణప్తి చేశారు.  

పిల్లలు, బాలింతలు, గర్భిణీలలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఉద్దేశించిన పోషన్‌ అభియాన్‌ గడువు సెప్టెంబర్‌ 30 వ తేదీతో ముగుస్తున్నందున ఈ పథకాన్ని కొనసాగించాలని విజ్ణప్తి చేశారు. కోవిడ్‌ -19 సందర్భంగా పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తల బీమా కోసం ప్రారంభించిన ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీని కోవిడ్‌ సందర్భంగా ఇంటింటికి రేషన్‌ ఇస్తూ కోవిడ్‌ రోగుల బాగోగుల కోసం తీవ్రంగా కృషి చేసిన అంగన్‌ వాడీ టీచర్లు, హెల్పర్లకు కూడా వర్తింప చేయాలని కోరారు. కేంద్ర న్యూట్రిషన్‌ ప్రొగ్రాం కింద అదనపు పోషకాహార కార్యక్రమంలో ఇచ్చే జొన్నలు, సజ్జల చిరుధాన్యాల కోటాను పెంచాలని కోరారు. 2021 సంవత్సరానికి 5427 మెట్రిక్‌ టన్నుల జొన్నలు, 2714 మెట్రిక్‌ టన్నుల సజ్జలను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని విజ్ణప్తి చేశారు. 

సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసిడిఎస్‌) కింద కేంద్రం కొన్ని సేవలు ఉపసంహరించడం, కేంద్ర కోటాను తగ్గించడం వల్ల రాష్ట్రంలో పిల్లలు, బాలింతలు, గర్భిణీల కోసం చేపట్టే కార్యక్రమాలకు ఇబ్బంది జరుగుతుందని, 2017 వరకు గల కోటాను తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర మంత్రిని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ కోరారు. రాష్ట్ర ఐసీడిఎస్‌ ప్రాజెక్టులో అంగన్‌ వాడీల వేతనాలను గతంలో 60ః40 శాతంగా కేంద్రం, రాష్ట్రం భరిస్తే వాటిని 25ః75 శాతానికి తగ్గించారని, కొన్ని పోస్టులను తొలగించారని, తగ్గించిన కోటాను ఇంతకు ముందు వలె కొనసాగించాలని, తొలగించిన పోస్టులను పునరుద్ధరించా లని కోరారు. వీటితో పాటు రాష్ట్ర, జిల్లా, ప్రాజెక్టు కార్యాలయాల్లోని పరిపాలనా వ్యయం మొత్తాన్ని ఆపేశారని, కిరాయిలు, ఐఈసి కాంపోనెంట్‌ ను కూడా ఆపేశారని, వీటిని పునరుద్ధరించాలని కోరారు. 

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఆహ్వానించగా, ఆమె వెంటనే అంగీకరించారు. త్వరలోనే తెలంగాణకు వచ్చి మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలు పరిశీలించి, దేశవ్యాప్తంగా వీటిని అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా పోషణ్‌ అభియాన్‌ పథకానికి 2021 సెప్టెంబర్‌తో గడువు ముగుస్తుండడంతో దీనిని మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని, ఆపే ప్రసక్తి లేదని హామీ ఇచ్చారు. అదేవిధంగా కేంద్రం వాటా పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తామిచ్చిన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, వీటన్నింటిని పరిష్కరిస్తే మహిళలు, శిశువులకు మరింత ప్రయోజనం కలుగుతుందని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి స్వదేశీ దర్శన్‌, ప్రసాద్‌ స్కీం లలో చేర్చి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. 

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిలో భాగంగా స్వదేశీ దర్శన్‌ స్కీంలో  చరిత్రాత్మక కోటల సంరక్షణ, మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని పిలిగ్రీమేజ్‌ అండ్‌ నేచర్‌ టూరిజం సర్క్యూట్‌ ను, ప్రసిద్ధ బుద్ధిజం కేంద్రాల అభివృద్ధి చేయాలని కోరారు. వాటికి సంబంధించిన వివరాలు అందించారు. ప్రసాద్‌  స్కీం లో భాగంగా భద్రాచలం లోని సీతా రామచంద్ర స్వామి దేవస్థానం, మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాలను అభివృద్ధి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 

మహబూబ్‌ నగర్‌ పట్టణంలో సుమారు 25 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న కల్చరల్‌ సెంటర్‌ కు ఠాగూర్‌ కల్చరల్‌ కాంప్లెక్స్‌ స్కీం ద్వారా 15 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం ను అందించాలని విజ్ఞప్తి చేశారు. అడాప్ట్‌ ఎ హెరిటేజ్‌ స్కీం లో ఎంపికైన గోల్కొండ కోట, అలంపూర్‌ జోగులంబా దేవాలయం, రామప్ప దేవాలయంల పనులను తక్షణమే ప్రారంభించాలని  మంత్రి కోరారు. హైదరాబాద్‌ నగరం టూరిజం, మెడికల్‌ క్యాపిటల్‌ గా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం లో ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్మెంట్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన భూమిని ఉచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుందని అందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  కిషన్‌రెడ్డికి  విజ్ఞప్తి చేశారు.

ఐటీఐఆర్‌ ప్రాజెక్టును పునరుద్ధరించాలి కేంద్రమంత్రికి కేటీఆర్‌ వినతి

సీఎం కేసీఆర్‌ డిల్లీ వెల్లిన సందర్భంగా అక్కడకు వెళ్ళిన పలువురు రాష్ట్ర మంత్రులు తమ తమ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలిసి అభివృద్ధి, సంక్షేమ, పాలనా పరమైన విషయాలను వివరించారు. వారికి వినతిపత్రాలు సమర్పించారు. ఇలా కేంద్ర మంత్రులను కలిసిన వారిలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌ ఉన్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టును పునరుద్దరించాలని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన కేటీఆర్‌ ఐటీఐఆర్‌ ప్రాజెక్టు ఐటీ రంగాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని, నిరుద్యోగ సమస్య కొంతమేర తీరుతుందని తెలిపారు. ఈఎంసీ`2.0 స్కీం కింద దివిటిపల్లిలో ఎనర్జీస్టోరేజ్‌ సొల్యూషన్‌ విస్తరణకు సహకరించాలని కోరారు. కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగాన్ని ప్రోత్స హించేందుకు దుండిగల్‌ వద్ద 450 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు కేంద్ర మంత్రికి వివరించారు. గ్రామ పంచాయతీలను టీ ఫైబర్‌తో అనుసంధానించేందుకు ఉద్ధేశించిన భారత్‌ నెట్‌ ఫేజ్‌ `2 ప్రాజెక్టు అవగాహన ఒప్పందం ప్రకారం చెల్లింపులు చేయాలని కోరారు. గ్రామ పంచాయతీలతో చిన్న గ్రామాలను అనుసంధా నించేందుకు గాను రూ. 1200 కోట్ల అదనపు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నేషనల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఫేజ్‌`1 నెట్‌వర్క్‌ను టీ`ఫైబర్‌కు అప్పగించాలని కోరారు.