‘టెట్’లో సైకాలజీ మార్కులు కీలకం
By: కేశవపంతుల వేంకటేశ్వర శర్మ

టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 12 పరీక్ష జరుగనున్నది. తరగతి గదిలో విద్యార్థులకు పాఠం అర్థమైందా, వారి మానసిక, శారీరక స్థితిని అర్థం చేసుకోవడం ఉపాధ్యాయుడికి చాలా ముఖ్యం. కేవలం పాఠం బోధించి వెళ్లిపోతే లక్ష్యం నెరవేరదు. విద్యార్థికి సంబంధించిన సమగ్ర అభివృద్ధిపై ఉపాధ్యాయుడు దృష్టి పెట్టినప్పుడు మాత్రమే భావి తరాన్ని తయారుచేయగలడు. దీనిలో సైకాలజీ పాత్ర చాలా కీలకం. ఒక తరగతిలో ఎంతమంది విద్యార్థులున్నారో ఎవరైనా చెప్పగలరు. కానీ విద్యార్థి మనస్సులో ఏముందో సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడు మాత్రమే చెప్పగలడు. అంతటి శక్తిమంతమైన విషయాన్ని ముందుగా నేర్చుకొని తర్వాత తరగతిలో అనుప్రయుక్తం చేసేలా చేసేదే సైకాలజీ సబ్జెక్ట్. టెట్‌లో సైకాలజీలో 30 కి 30 మార్కులు ఎలా తెచ్చుకోవాలో నిపుణుల సలహాలు సూచనల ద్వారా తెలుసుకుందాం..
సిలబస్ అవగాహనే విజయానికి సోపానం
ఏ పరీక్షలోనైనా సిలబస్ పై అవగాహన లేకుంటే ఆ పరీక్షలో విజయం సాధించలేరు. మొదట పరీక్ష స్వభావం, సిలబస్‌పై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పర్చుకోవాలి. టెట్ సైకాలజీలో ఏముంది? ఏం చదవాలో తెలుసుకుందాం.
టెట్‌లో మూడు యూనిట్లు ఉన్నాయి. అవి..
1) శిశువికాసం (చైల్డ్ డెవలప్మెంట్)
2) అభ్యసనం (లెర్నింగ్)
3) అధ్యాపన శాస్త్రం (పెడగాగీ)
ప్రీవియస్ పేపర్ల విశ్లేషణ
– గత ప్రశ్నపత్రాల సరళిని గమనిస్తే జ్ఞానపరమైన ప్రశ్నల కంటే అవగాహన, అనుప్రయుక్తం (అప్లికేషన్‌తో కూడిన ప్రశ్నలను ఎక్కువగా ఇచ్చారు. ఈసారి టెట్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున ఎక్కువ పేపర్లు తయారు చేయాలి. కాబట్టి ఏ పేపర్ ఎలా వస్తుందో చెప్పలేని పరిస్థితి. అందువల్ల సైకాలజీ సబ్జెక్టులో ఏ ఒక్క అంశాన్ని వదలకుండా అధ్యయనం చేస్తేనే ప్రశ్న ఎలా అడిగినా సమాధానాన్ని సులభంగా గుర్తించవచ్చు.
ఎలా చదవాలి?

శిశు వికాసం: శిశు వికాసం అంటే శిశువుల్లో శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఉద్వేగంగా, నైతికంగా, భాషాపరంగా జరిగే అభివృద్ధి. కాబట్టి ముందుగా వీటికి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం (బేసిక్ నాలెడ్జ్) తెలుసుకోవాలి. అలా అయితేనే అనుప్రయుక్తం ప్రశ్నకు సమాధానం గుర్తించవచ్చు. డీఈడీ/బీఈడీలో ఉన్న పాఠ్యాంశాల ఆధారంగా సిలబస్ ప్రకారం సొంత నోట్స్ తయారుచేసుకోవాలి. పెరుగుదల, వికాసం, పరిపక్వతలు ఇవన్నీ కూడా ఒకటే అనుకుంటారు. చాలామంది కానీ వాటి మధ్య చాలా తేడా ఉంది.
ఉదా: 1) కాళ్లు, చేతులు, గుండె, ఎదగడం- పెరుగుదల
2) చదవడం, రాయడం, ఈదడం- వికాసం
3) పాకడం, నిలబడటం, నడవటం, పరుగెత్తడం- పరిపక్వత
ఉదాహరణకు గత టెట్‌లో వచ్చిన ప్రశ్నలను పరిశీలిద్దాం.
1. వ్యక్తి పెరుగుదల, వికాసాలకు సంబంధించి సరైనదానిని గుర్తించండి? (2017, పేపర్-1) (1)
1) పెరుగుదల, వికాసంలో లీనమై ఉంటుంది
2) వికాసం, పెరుగుదలలు వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి
3) వికాసం, పెరుగుదలలో వైయక్తిక భేదాలుండవు
4) వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం
వివరణ:
ఆప్షన్ 1- వికాసంలో పెరుగుదల ఎల్లప్పుడూ అంతర్భాగంగా ఉంటూ ఇవి రెండూ పరిపక్వతకు దారితీశాయి.
ఆప్షన్ 2- పెరుగుదల జీవితాంతం కొనసాగక శారీరక అవయవాలు పరిపక్వత చెందగానే ఆగిపోతుంది. కానీ వికాసం జీవితాంతం కొనసాగుతుంది.
ఆప్షన్ 3- పెరుగుదల, వికాసం, పరిపక్వత, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా వ్యక్తికి, వ్యక్తికి మధ్య కచ్చితంగా భేదాలు ఉంటాయి.
ఆప్షన్ 4- పెరుగుదలను కచ్చితంగా కొలవగలం. కాబట్టి పరిమాణాత్మకం/గుణాత్మకం వికాసాన్ని కచ్చితంగా కొలవలేం. కాబట్టి గుణాత్మకం. ఈ విధంగా విశ్లేషిస్తూ ప్రతి టాపిక్‌ను చదివితే సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. కాబట్టి పై ప్రశ్నలకు సమాధానం 1.
అభ్యసనం:
సాధారణంగా నేర్చుకోవడాన్నే అభ్యసనం అంటారు. చాలామంది అభ్యాసం, అభ్యసనం ఒక్కటే అనుకుంటారు. కానీ వాటి మధ్య చాలా తేడా ఉంది.
ఏదైనా ఒక కృత్యాన్ని పదే పదే చేయడం అభ్యాసం
అభ్యాసం చేయడం ద్వారా వచ్చిన ఫలితమే- అభ్యసనం
అతి అభ్యాసం చేయడం ద్వారా పొందేదే- నైపుణ్యం
1. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి తన ఉపాధ్యాయుని రాతపనిని గమనించి తాను అదేవిధంగా రాయడాన్ని అలవర్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం? (2017, పేపర్-1) (3)
1) యత్నదోష అభ్యసనం
2) అంతరదృష్టి అభ్యసనం
3) సాంఘిక అభ్యసనం
4) కార్యక్రమయుత అభ్యసనం
వివరణ: ఆప్షన్ 1- మానవుని శారీరక అవయవాల్లో కాళ్లు, చేతులను ఎక్కువగా ఉపయోగించి, మెదడును తక్కువగా ఉపయోగించడం ద్వారా అభ్యసనం జరిగే విధానాన్ని సూచించేదే యత్నదోష సిద్ధాంతం.
ఆప్షన్ 2- మానవుని శారీరక అవయవాల్లో మెదడును ఎక్కువగా, కాళ్లు, చేతులను తక్కువగా ఉపయోగించడం ద్వారా అభ్యసనం జరిగే విధానాన్ని సూచించేదే అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం.
ఆప్షన్ 3- మానవుడు తన ప్రారంభ పాఠాలను చిన్నప్పుడు ఎక్కువగా పరిసరాల్లోని విషయాలను పరిశీలిస్తూ, వాటిని అనుకరిస్తూ అభ్యసనం చేస్తాడని తెలిపేదే సాంఘిక అభ్యసన సిద్ధాంతం.
ఆప్షన్ 4- ఉపాధ్యాయుని ప్రమేయం లేకుండా బోధనా యంత్రం సహాయంతో విద్యార్థి స్వయంగా నేర్చుకునే పద్ధతే కార్యక్రమయుత అభ్యసనం.
పై విశ్లేషణ ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం 3
పెడగాగీ :
ఈ యూనిట్ పూర్తిగా బోధన, అభ్యసనం ప్రక్రియ తరగతిలో ఎలా జరగాలి? ఎలా జరుగుతుంది? ఎలా బోధించాలి? ఎలా బోధించకూడదు? అని తెలుపుతుంది.
1. ప్రధానోపాధ్యాయుడు తనంతట తానే నిర్ణయాలు తీసుకునే నాయకత్వ లక్షణం? (2017, పేపర్-2) (4)
1) జోక్యరహిత 2) ప్రజాస్వామ్య
3) అనుజ్ఞ 4) నిరంకుశ
వివరణ:
ఆప్షన్ 1- లక్ష్యాలు, నిర్ణయాలు తీసుకోవడంలో నాయకుడికి కాకుండా సమూహంలో సభ్యులకే స్వేచ్ఛ ఉండేదే జోక్యరహిత/అనుజ్ఞ నాయకత్వం
ఆప్షన్ 2- అభిప్రాయాలు తెలపడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో అందరికీ ఆమోదయోగ్యమైన/మెజారిటీ సభ్యుల ఆమోదంతో ప్రవర్తించడమే ప్రజాస్వామిక నాయకత్వం
ఆప్షన్ 3- అనుజ్ఞ నాయకత్వాన్నే జోక్య రహిత/అనుమతించే నాయకత్వం అంటారు.
ఆప్షన్ 4- సమూహంలో సభ్యుల ప్రమేయం లేకుండానే నాయకుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేదే నిరంకుశ నాయకత్వం
గతంలో కంటే ఈసారి టెట్ కఠినంగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి టాపిక్‌ను లోతుగా విశ్లేషణ చేసి నేర్చుకుంటేనే 30 మార్కులు సాధించవచ్చు.
గరిష్ఠ మార్కులు పొందడం ఎలా ?
సైకాలజీ పాఠ్యాంశాలను మొదట అవగాహన చేసుకోవాలి. తర్వాత ప్రీవియస్ పేపర్లను పరిశీలించి వాటి ఆధారంగా ఏ విధమైన ప్రశ్నలు అడుగుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ప్రాక్టీస్ బిట్లు ఎక్కువగా చేయాలి. తర్వాత మోడల్ టెస్టులను ఎక్కువగా వీలైతే చాప్టర్ల వారీగా రాస్తే ఆయా పాఠ్యాంశలపై పట్టు వస్తుంది. పరీక్షలో ఎటువంటి ప్రశ్నలు ఇచ్చినా సులభంగా జవాబులు గుర్తించగలరు.
– పరీక్షలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. దీనివల్ల కొంత ప్రయోజనం కలుగుతుంది. అవగాహన, అనుప్రయుక్తంతోపాటు చదివిన అంశాన్ని గుర్తించడం లేదా గుర్తుకు తెచ్చుకోవడం చేయాలి. ఇది కొంత శ్రమిస్తే సులభంగా జవాబు గుర్తించగలం. భయపడకుండా, ఆందోళన చెందకుండా ప్రాక్టీస్ చేయండి సులభంగా సైకాలజీలో 30 మార్కులు సాధించవచ్చు.