ఇప్పుడు బోరంచకు పిల్లనిస్తున్నారు!

సంగమేశ్వరం, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతులమీదుగా శంకుస్థాపన చోసుకోవడం సంగారెడ్డి జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయే ఒక అద్భుత కార్యక్రమమని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు.

మంజీరా నీళ్ళు గోదావరిలో కలవడమనేది ప్రకృతి సృష్టించిన అద్భుతమని, మన ముఖ్యమంత్రి ఈ రోజు గోదావరి నీళ్ళను వెనక్కి మళ్ళించి మంజీరాలో కలిపే ఒక మహా అద్భుతాన్ని మనకు కల్పించారని అన్నారు. ఎక్కడోకింద ప్రవహిస్తున్న గోదావరి జలాలను మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్‌కు, అక్కడి నుంచి సింగూరు ప్రాజెక్టుకు, అక్కడి నుంచి జహీరాబాద్‌, నారాయణ్‌ ఖేడ్‌, ఆందోల్‌, జోగిపేటకు అందించడం ఒక మహత్తర కార్యక్రమమని హరీష్‌ రావు అన్నారు.

రామాయణంలో రాముడు కాలుతగిలి రాయి అహల్యగా మారిందని, ఇవ్వాళ కేసీఆర్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ అంతా సస్యశ్యామలమవుతోందని మంత్రి హరీష్‌ రావు అన్నారు.ఇవ్వాల కోటి ఎకరాల మాగాణీగా తెలంగాణ ను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ది అని చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు ఒకసారి గతంలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. తాను నారాయణ్‌ఖేడ్‌లో పనిచేసినప్పుడు అక్కడివారు మనూరు మండలం బోరంచకు పిల్లనియ్యద్దు, హద్దునూర్‌ కు ఎద్దునియ్యద్దు అనేవారని, బోరంచకు పిల్లనిస్తేనీళ్ళుమోయ పెడతరు, నాబిడ్డను కష్టపెడుతరని చెప్పి ఎవ్వరు కూడా ఆరోజుల్లో అక్కడికి పిల్లనిచ్చేవారు కాదు. న్యాల్‌ కల్‌ మండలం హద్దునూరుకు ఎద్దునిస్తేదానికి గాసం దొరకదని, తాగడానికి నీళ్ళు దొరకవని, ఆ ఎద్దును గోసపెడతరని చెప్పి ఎద్దునియ్యడానికి ఎనుక ముందైనటువంటి రోజులున్నాయని, అయితే, నేడు మిషన్‌ భగీరథ పథకంతో ప్రతి గడపగడపకూ నీరు వచ్చిందని, ఈ రోజు బోరంచకు పిల్లనివ్వడానికి ముందుకొస్తున్నారని మంత్రి హరీష్‌ రావు వివరించారు. బసవేశ్వర, సంగమేశ్వర పథకంతో రేపు హద్దునూరుకు ఎద్దునిచ్చే కాలం కూడా త్వరలో రాబోతోందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మరో ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. తాను గతంలో కంగ్జి మండలంలో సర్దార్‌ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన చిమ్లిబాయి, సార్‌ మా ఊరికి ఎవరూ పిల్లనిస్తలేరు. మా తండాకు కరెంటులేదు. రోడ్డు లేదు. నీళ్ళు లేవు… అని చెప్పిందని, ఈ రోజున ముఖ్యమంత్రి సహకారంతో ఆ తండాకు రోడ్డు వేశాం. త్రీఫేస్‌ కరెంటు ఇచ్చాం. తాగునీరు ఇచ్చాం. ఇప్పుడు ఆ తండాకు పిల్లను పిలిచి పిలిచి ఇస్తున్నారని చెప్పారు.

ఈ సమయంలో సభలోనే ఉన్న చిమ్లిబాయిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్టేజీమీదకు పిలిచి, పక్కసీటులో కూర్చోపెట్టుకొని మాట్లాడటం కొసమెరుపు.

నారాయణఖేఢ్‌ ప్రాంత అభివృద్ధిని వివరిస్తూ, నారాయణఖేడ్‌కు విద్యకోసం ఎనిమిది రెసిడెన్షియల్‌ పాఠశాలలు తెచ్చుకున్నాం. 15 విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు తెచ్చుకున్నాం. మార్కెట్‌ యార్డుతోపాటు నారాయణఖేడ్‌ ప్రాంతంలో 54 తండాలను గ్రామపంచాయతీలను చేసుకున్నామని మంత్రి హరీష్‌ రావు వివరించారు.