ఇంటింటికీ మంచినీరు వాటర్‌ గ్రిడ్‌

water

ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. కాని ఇప్పటివరకు ప్రభుత్వాలు మంచినీటి పథకాల పేరుమీద కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అందరికి మంచినీళ్లు మాత్రం అందలేదు. కలుషిత నీరువల్లనే ఎక్కువ వ్యాధులు సంక్రమిస్తాయనేది కూడా వాస్తవం అంటే రోగాలు పెరగడానికి కూడా మంచినీరు అందుబాటులో లేకపోవడమే కారణం. అయినప్పటికి ఇప్పటివరకు అందరికి మంచినీరు అందించే విషయంలో సమగ్ర అవగాహనతో కూడిన కార్యక్రమం అమలు కాలేదు. ఈ లోపాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికి మంచినీళ్లు అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ గ్రిడ్‌ అనే పథకానికిరూపకల్పన చేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మానస పుత్రికగాఈ గ్రిడ్‌ పనులు అత్యంత ప్రాధాన్యత క్రమంలో జరుగుతున్నాయి.

2050 నాటి వరకూ ఉపయోగపడేలా…

ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద వున్న లెక్కల ప్రకారం తెలంగాణలోని 25 వేల ఆవాస ప్రాంతాల్లో 31 శాతం ప్రాంతాలకే పూర్తి స్థాయిలో మంచినీరు అందుతున్నది. దాదాపు 95 శాతం వరకు గ్రామాలు, పట్టణాలకు మంచినీటి సౌకర్యం కోసం పథకాలు వచ్చాయి. అవన్నీ కొంతమేరకు పనిచేస్తున్నాయి. కానీ ఒక గ్రామంలో మంచినీటి పథకం ఉన్నప్పటికి అది ప్రధాన గ్రామానికి మాత్రమే నీరు అందిస్తున్నది. దళిత వాడలకు, గిరిజన తండాలకు, ఆదివాసి గూడేలకు నీరు అందడం లేదు. దీనివల్ల వందశాతం గ్రామాలకు నీరు వెళుతుందని చెప్పుకుంటున్నప్పటికి వంద శాతం ప్రజలకు మాత్రం మంచినీరు అందడం లేదు. ప్రస్తుతం ఉన్న మంచినీటి పథకాలు కూడా ఒక్కొక్కరికి రోజుకు 20 నుండి 40 లీటర్ల మంచినీళ్లను మాత్రమే అందిస్తున్నవి. ఆ నీళ్లు కూడా పూర్తి స్థాయిలో సురక్షితమైనవని చెప్పలేము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం వాటర్‌ గ్రిడ్‌ కు అంకురార్పణ చేసింది. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మనిషికి 100 లీటర్ల చొప్పున, పట్టణ ప్రాంతాల్లో ప్రతి మనిషికి 135 లీటర్ల చొప్పున నల్లాల ద్వారా మంచినీరు అందివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. రాబోయే 30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రిడ్‌ కు డిజైన్‌ చేశారు. తెలంగాణలో హైదరాబాద్‌ మినహా ప్రస్తుతం 2.19 కోట్ల గ్రామీణ ప్రజలు, 67 లక్షల మంది పట్టణ ప్రజలు ఉన్నారు. కానీ వాటర్‌ గ్రిడ్‌ మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో 3.24 కోట్ల మందికి, పట్టణ ప్రాంతాల్లో 1.46 కోట్ల మందికి మంచినీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. గోదావరి బేసిన్లో 51.35 టిఎంసిలు, కృష్ణా బేసిన్లో 38.69 టిఎంసిలు… మొత్తం 90.04 టిఎంసిల నీరు అవసరం పడుతుందని అంచనా. 2050 సంవత్సరం వరకు మంచినీరు అందించడం కోసం ఈ గ్రిడ్‌ ను రూపొందిస్తున్నారు. అంటే ఒక్కసారి ఈ గ్రిడ్‌ పనులు పూర్తయితే 2050 వరకు మళ్లి ఎక్కడా కొత్తగా పనులు చేయాల్సిన అవసరం రాదు. కేవలం నిర్వహణ మాత్రమే ఉంటుంది.

ప్రతీ ఇంటికి నదీజలం…

ప్రస్తుతం ఉన్న మంచినీటి పథకాలు వివిధ కారణాల వల్ల అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడం లేదు. భూగర్బ జలాల్లో ఫ్లోరైడ్‌ శాతం పెరిగిపోవడం, భూగర్బ జలాలు అడుగంటిపోవడం, నీటి వనరుల్లో ఏడాది పొడుగునా నీరు అందుబాటులో లేకపోవడం లాంటి కారణాల వల్ల చాలా మంచినీటి పథకాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడం లేదు. అందుకే 365 రోజులు అందుబాటులో ఉండే కృష్ణా, గోదావరి నదుల నీళ్లను ప్రజలకు తాపించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. అయితే మంచినీటి పథకాల కోసం కృష్ణా, గోదావరి నుంచి నేరుగా గ్రామాలకు పైపులైన్లు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ రెండు నదుల నీళ్లను ఉపయోగించుకోవడానికి తెలంగాణలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. వాటితోనే గ్రిడ్‌ కు అనుసంధానం చేస్తారు. కృష్ణా నది నీటిపై నిర్మించిన జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌, కోయిల్‌ సాగర్‌, ఎస్‌ఎల్బిసి, గోదావరి బేసిన్‌ లోని ఎస్‌ఆర్‌ఎస్పి, సింగూర్‌, ఎల్‌ఎండి, మిడ్‌ మానేర్‌, కొమురం భీమ్‌, కడెం, నిజాంసాగర్‌, దేవాదుల తదితర ప్రాజెక్టులనుండి అవసరమైన నీటిని మంచినీటి కోటా కింద తీసుకుంటారు. కేవలం ప్రజలకు తాగునీరు అందించడమే కాకుండా పరిశ్రమలకు కూడా ఈ గ్రిడ్‌ ద్వారానే నీరిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ప్రాజెక్టుల్లో పది శాతం నీటిని పరిశ్రమలకు, పది శాతం నీటిని మంచినీటి కోసం రిజర్వ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం మంచినీరు అందించడం కోసం గ్రామాల్లో ఉన్న వాటర్‌ ట్యాంకులు, పైపులైన్లను వినియోగించుకుంటారు. వాటిని విస్తరిస్తారు. అవసరమైన చోట బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు, సమ్మర్‌ స్లోరేజ్‌ ట్యాంకులు నిర్మిస్తారు. నీటి వనరుల నుండి ఇంటికి నల్లా ఏర్పాటు చేసే వరకు వివిధ దశల్లో పైపులైన్ల నిర్మాణం చేపడతారు. మేయిన్‌ గ్రిడ్‌ కోసం 5227 కిలోమీటర్ల పొడవైన మేయిన్‌ ట్రంక్‌ లైన్‌ పైపులెన్‌, సెకండరీ నెట్‌ వర్క్‌ కోసం 45809 కిలోమీటర్ల పైపులైన్‌, 75 వేల కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ నెట్‌ వర్క్‌ పైపులైన్లు నిర్మిస్తారు. గతంలో మంచినీటి పథకాల నిర్వహణ బాధ్యత ఆర్‌.డబ్లు.ఎస్‌, మెట్రో వాటర్‌ వర్క్స్‌, పబ్లిక్‌ హెల్త్‌ లాంటి శాఖలు నిర్వహించేవి. వీటివల్ల సమన్వయ లోపం ఎదురయ్యేది. దీనిని నివారించడానికి గ్రిడ్‌ పనులన్నీ ఆర్‌.డబ్లు.ఎస్‌ పరిధిలోకే తీసుకొచ్చారు.

26 గ్రిడ్‌లుగా విభజన

గుజరాత్‌ తరహాలోనే తెలంగాణలో వాటర్‌ గ్రిడ్‌ నిర్మిస్తున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాని గుజరాత్‌ నమూనాకు తెలంగాణ నమూనాకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. గుజరాత్‌ లో నర్మదా ఎడారి ప్రాంతమైన కచ్‌ తదితర ఎడారి ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. కాని తెలంగాణలో ఎక్కడి వనరును అక్కడే వినియోగించుకుంటారు. ఇందుకోసం ప్రభుత్వం 26 పాయింట్లను కూడా గుర్తించింది. ఎక్కడి నుండి ఎంత నీరు తీసుకుని ఎక్కడికి పంపింగ్‌ చేయాలో కూడా నిర్ణయించుకున్నది.

శ్రీ శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ద్వారా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని ఎల్లూరు నుండి నీటిని తోడి మహబూబ్‌నగర్‌,రంగారెడ్డి జిల్లాలోని 23 మండలాలకు, 5 మున్సిపాలిటీలకు నీరు అందిస్తారు. కొల్లాపూర్‌, కొడంగల్‌, అచ్చంపేట, జడ్చర్ల, నాగర్‌ కర్నూల్‌, షాద్‌ నగర్‌, కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు దీని ద్వారా మంచినీరు అందుతుంది.

శ్రీ జూరాల ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ నుండి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని ఆలంపూర్‌, దేవరకద్ర, గద్వాల, మహబూబ్‌ నగర్‌, మక్తల్‌, నారాయణపేట, వనపర్తి నియోజకవర్గాలలోని 36 మండలాలు, 5 మున్సిపాలిటీలకు మంచినీరు అందిస్తారు.

శ్రీ శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుండి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహింపట్టణం, మేడ్చల్‌, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాలలోని 14 మండలాలు, 3 మున్సిపాలిటిలకు నీరు అందుతుంది.

శ్రీ పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారారంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల, పరిగి, తాండూర్‌ నియోజకవర్గాలలోని 14 మండలాలు, మూడు మున్సిపాలిటీలకు నీరిస్తారు.

శ్రీ నాగార్జున సాగర్‌ అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుండి నల్లగొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలలోని 20 మండలాలు,రెండు మున్సిపాలిటీలకు నీరు అందిస్తారు.

శ్రీ ఉదయ సముద్రం ద్వారా నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలలోని 20 మండలాలు,రెండు మున్సిపాలిటిలకు నీరిస్తారు.

శ్రీ నాగార్జునసాగర్‌ లెప్ట్‌ కెనాల్‌ నుండి నల్లగొండ జిల్లాలోని హుజుర్‌ నగర్‌, కోదాడ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్‌ నియోజకవర్గాలలోని 15 మండలాలు, మూడు మున్సిపాలిటీలకు మంచినీరు అందిస్తారు.

శ్రీ సింగూర్‌ ప్రాజెక్టులోని మెదక్‌ గ్రిడ్‌ ద్వారా మెదక్‌ జిల్లాలోని దుబ్బాక, మెదక్‌, నారాయణ ఖేడ్‌ నియోజకవర్గాలలోని 14 మండలాలు, 2 మున్సిపాలిటీలకు నీరు సరఫరా చేస్తారు.

శ్రీ సింగూర్‌ ప్రాజెక్టు పరిదిలోని సంగారెడ్డి గ్రిడ్‌ ద్వారా మెదక్‌,రంగారెడ్డి జిల్లాలోని ఆందోల్‌, పటాన్‌ చెరువు, సంగారెడ్డి, వికారాబాద్‌, జహిరాబాద్‌ నియోజకవర్గాలలోని 19 మండలాలు, 4 మున్సిపాలిటీలకు మంచినీరు ఇస్తారు.

శ్రీ మంజీరా బ్యారేజి పరిధిలోని గజ్వేల్‌ గ్రిడ్‌ ద్వారా మెదక్‌ జిల్లాలోని గజ్వేల్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాలలోని 18 మండలాలు, 3 మున్సిపాలిటీలకు మంచినీరు అందిస్తారు.

శ్రీ ఎస్‌ఆర్‌ఎస్పి బాల్కొండ నుండి నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌, బాల్కోండ, కామారెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలోని 21 మండలాలు, 2 మున్సిపాలిటీలకు మంచినీరు ఇస్తారు.

శ్రీ నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుండి నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాలలోని 16 మండలాలు, 2 మున్సిపాలిటీలకు మంచినీరు సరఫరా చేస్తారు.

శ్రీ ఎస్‌ఆర్‌ఎస్పి ద్వారా కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలలోని 11 మండలాలు, 3 మున్సిపాలిటీలకు మంచినీరు అందిస్తారు.

శ్రీ ఎమ్‌.ఎమ్‌.డి. డెడ్‌ స్టోరేజ్‌ నుండి కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలలోని 9 మండలాలు, 2 మున్సి పాలిటీలకు మంచినీరు ఇస్తారు.

శ్రీ ఎమ్‌.ఎమ్‌.డి.డెడ్‌ స్టోరేజ్‌ నుండి మరో గ్రిడ్‌ ఏర్పాటు చేసి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల పరిధిలోని హుస్నాబాద్‌, జనగామ, స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గాలలోని 21 మండలాలు, 2 మున్సిపాలిటీలకు మంచినీరు సరఫరా చేస్తారు.

శ్రీ ఎల్‌.ఎమ్‌.డి. మానకొండూర్‌ నుండి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలోని మానకొండూర్‌, హుజూరాబాద్‌, వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, కరీంనగర్‌ జిల్లాల పరిధిలోని 16 మండలాలు, 2 కార్పోరేషన్లు, ఒక మున్సిపాలిటీకి మంచినీరు ఇస్తారు.

శ్రీ ఎల్లంపల్లి బ్యారేజ్‌ నుండి కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురి, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాలలోని 20 మండలాలు, 2 మున్సిపాలిటీలకు మంచినీరు అందిస్తారు.

శ్రీ ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి. బాల్కోండ నుండి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదిలాబాద్‌, బోధ్‌, నిర్మల్‌ నియోజకవర్గాలలోని 15 మండలాలు, 2 మున్సిపాలిటీలకు మంచినీరు ఇస్తారు.

శ్రీ కొమురం భీమ్‌ ప్రాజెక్టు నుండి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాలలోని 10 మండలాలు, ఒక మున్సిపాలిటీకి మంచినీరు సరఫరా చేస్తారు.

శ్రీ ఎల్లంపల్లి బ్యారేజ్‌ నుండి ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లి, చెన్నూర్‌, మంచిర్యాల్‌ నియోజకవర్గాలలోని 13 మండలాలు, 3 మున్సిపాలిటీలకు మంచినీరు ఇస్తారు.

శ్రీ కడెం ప్రాజెక్టు నుండి ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ నియోజకవర్గంలోని 5 మండలాలకు మంచినీరు ఇస్తారు.

శ్రీ పాలేరు రిజర్వాయర్‌ ద్వారా వరంగల్‌ జిల్లాలోని డోర్నకల్‌, మహబూబాబాద్‌, పాలకుర్తి నియోజకవర్గాలలోని 10 మండలాలు, ఒక మున్సిపాలిటీకి మంచినీరు సరఫరా చేస్తారు.

శ్రీ రామప్ప సరస్సు ద్వారా వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, పరకాల, వర్దన్నపేట నియోజకవర్గాలలోని 17 మండలాలు, 2 మున్సిపాలిటీలకు మంచినీరు ఇస్తారు.

శ్రీ గోదావరి నదిపై దుమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, వరంగల్‌ జిల్లాల పరిధిలోని అశ్వరావుపేట, భద్రాచలం, కొత్తగూడేం, నర్సంపేట, పినపాక, ఇల్లందు నియోజకవర్గాలలోని 30 మండలాలు, 6 మున్సిపాలిటీలకు మంచినీరు అందిస్తారు.

శ్రీ పాలేరు రిజర్వాయర్‌ ద్వారా ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలోని 8 మండలాలు, ఒక మున్సిపాలిటీకి మంచినీరు సరఫరా చేస్తారు.

శ్రీ వైరా రిజర్వాయర్‌ ద్వారా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మదిర, వైరా నియోజకవర్గాలలోని 13 మండలాలు, ఒక మున్సిపాలిటీకి మంచినీరు ఇస్తారు.

శ్రీ గడ్డన్న ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలోని 4 మండలాలకు, ఎల్‌.ఎమ్‌.డి. ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలోని 3 మండలాలకు, ఒక మున్సిపాలిటీకి ఇప్పటికే మంచినీరు అందుతున్నందున గ్రిడ్‌ నుండి మినహాయించారు.

సిద్దిపేట ఆదర్శం…

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సిద్దిపేట మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టారు. ఎల్‌.ఎమ్‌.డి. నుండి పైపులైన్ల ద్వారా నీటిని తరలించి సిద్దిపేటకు దగ్గరలో ఉన్న గుడ్డేలగుల గుట్ట పైకి నీటిని ఎక్కించారు. అక్కడి నుండి నీటిని గ్రావిటీ ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మంచినీరు అందిస్తున్నారు. ఇదే తరహాలో తెలంగాణ అంతటా సమీప నీటి వనరుల నుండి నీటిని తోడి ఎత్తైన కొండల పైకి ఎక్కించి అక్కడి నుండి గ్రావిటీ ద్వారా గ్రామాలకు నీరు అందించాలనేది ఈ గ్రిడ్‌ ప్రధాన ఉద్దేశ్యం.

నాలుగేళ్లలో ప్రతీ ఇంటికి నల్లా ద్వారా నీరు…

తెలంగాణలోని ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న వాటర్‌ గ్రిడ్‌ పనులు మూడున్నర ఏళ్లలో పూర్తి కావాలని, గరిష్టంగా నాలుగేళ్లలో ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా పనులు కూడా జరుగుతున్నాయి. పంచాయతిరాజ్‌ శాఖ మంత్రి కె.టి. రామారావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రేమాండ్‌ పీటర్‌ నేతృత్వంలోని బృందం ఇప్పటికే గుజరాత్‌ సందర్శించి పైపుల నాణ్యతతో పాటు ఇతర సాంకేతిక అంశాలపై అధ్యయనం చేసి వచ్చింది. పూర్తి సర్వే కోసం ప్రభుత్వం రూ.105 కోట్లను కూడా విడుదల చేసింది. గ్రిడ్‌ ను నిర్వహించడానికి అవసరమైన విద్యుత్‌ ను సమకూర్చుకోవడానికి, ప్రత్యేక సబ్‌ స్టేషన్లు నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్ష 26 కిలోమీటర్ల పొడవైన పైపులెన్లు అవసరం కాబట్టి, వాటి తయారీ ఎక్కడికక్కడ జరగాలని, ఆ పనులు కూడా వెంటనే ప్రారంభం అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.