స్వచ్ఛతే.. సిద్ధిపేట స్ఫూర్తి మంత్రం

  • నిత్యం వంద శాతం ఇంటింటి చెత్త సేకరణ 

By: యం. రామాచారి, సిద్ధిపేట

స్వచ్ఛతతోనే ఆరోగ్యం ఇది జగమెరిగిన సత్యం. ఇది నిజం చేయడానికి సిద్ధిపేట మున్సిపాలిటీ వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నది. చెత్త నుంచి సంపదను సృష్టించడమే లక్ష్యంగా పర్యావరణ హితంలో ముందు వరసలో సాగుతున్నది. తడి, పొడి చెత్త సేకరించి తిరిగి ప్రాసెసింగ్‌ చేస్తూ ఆదాయాన్నిపెంపొందించి స్థానిక సంస్థల నిర్వహణ ఖర్చు తగ్గించటంతో పాటుగా శత శాతం ఇంటింటా చెత్తసేకరణ చేస్తున్నది. వివిధ రకాలుగా అందరికీ ఉపయోగపడేలా శుద్ధిచేసి చెత్త రహిత పట్టణమే ధ్యేయంగా సిద్ధిపేట మున్సిపాలిటీ ముందడుగులు వేస్తున్నది. స్థానిక మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్‌ అధికారులతో పాటు ప్రజల భాగస్వామ్యం వారి సమన్వయంతో స్వచ్ఛత అన్నది ఓ ఉద్యమంలా సాగుతున్నది.  

స్వచ్ఛతతో.. మహిళలకు ఉపాధి అనే బహుళ ప్రయోజనాలే లక్ష్యంగా సిద్ధిపేట మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన మిడిల్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ పొడి వ్యర్థాల చెత్త సేకరణ కేంద్రం సత్ఫలితాలనిస్తున్నది. పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీ, బుస్సాపూర్‌ డంపింగ్‌ యార్డులో పొడి వ్యర్థాల వనరుల సేకరణ కేంద్రాలను నెలకొల్పారు. నిత్యం 55 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నది. ఇందులో 70 శాతం తడి, 30 శాతం పొడి చెత్త వస్తున్నది. ఈ లెక్కన 17 టన్నుల పొడి చెత్త సేకరణ జరుగుతున్నది. ఇందులో కాగితాలు, అట్ట ముక్కలు తదితర వాటిని ప్రత్యేకంగా వేరు చేసి విక్రయించేలా రెండు పొడి వ్యర్థాల వనరుల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ బాధ్యతలను మెప్మా మహిళా సంఘాలకు అప్పగించారు. ప్రస్తుతం వీటితో 25 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దే క్రమంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘానికి అప్పగించగా, సభ్యులకు చేతినిండా ఉపాధి దొరుకుతున్నది. సంఘ సభ్యులకు నెలకు రూ. 20వేల పైనే సమకూరుతుండగా, అటు చెత్త సేకరించి తెచ్చే కార్మికులకు అప్పటికప్పుడే చెల్లింపులు జరగడం ద్వారా కార్మికులకు అదనపు ఆదాయం వస్తున్నది. స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడం, సేకరణ ద్వారా స్థానిక మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సిద్ధిపేట మున్సిపాలిటీ పొడి చెత్త వనరుల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

వార్డుస్థాయిలో కంపోస్టు ఎరువులు తయారీ చేస్తూ… ఫోటోలు 

వార్డుల వారీగా ఎక్కడికక్కడ చెత్తను ఎరువుగా తయారు చేయాలని.. వార్డుస్థాయిలో కంపోస్టు ఎరువు తయారీ కేంద్రాలను నెలకొల్పారు. ప్రస్తుతం పట్టణంలోని 5 వార్డుల్లో ఏర్పాటు చేయగా, రెండు విధానాలలో ఎరువు తయారు చేస్తున్నారు. ఆయా వార్డుల్లోని కంపోస్టు తయారీ కేంద్రాల్లో ఏరోబిక్‌ పద్ధతిలో చెత్తను 48 రోజుల్లో సెమీ కంపోస్టు ఎరువుగా మార్చి రైతులకు నేరుగా కిలో రూ.3లకు విక్రయిస్తున్నారు. మిద్దె, పెరటి తోటలలో వివిధ రకాలను సాగు చేస్తున్న వారికి కిలో రూ.10  చొప్పున్న విక్రయిస్తున్నారు. తద్వారా  పట్టణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఎవరికి వారే మిద్దె తోటలు పెంచడనికి ఇష్టపడుతున్నారు. ఇట్టి ఎరువును ఉపయోగించి రకరకాల కూరగాయలను ఇంటి వద్దనే పండిరచి ఆరోగ్య పోషణని పాటిస్తూ ఆరోగ్య సమాజానికి బాటలు వేస్తున్నారు. ఇప్పటి వరకూ సేంద్రియ ఎరువులు అమ్మడం వల్ల రూ.2.60 లక్షల వరకూ సమకూరాయని మున్సిపల్‌ అధికార వర్గాలు తెలిపాయి. 

వ్యర్థమూ ప్రయోజనమే..! 

మానవ మల విసర్జితాలతో ఎరువు, తయారీ 

సిద్ధిపేట ఎఫ్‌ఎస్టీపీ శుద్ధీకరణ ప్లాంట్‌ లో ప్రారంభమైన సత్ఫలితాలు 

డంపుయార్డు పేరెత్తగానే చెత్తా చెదారం. దుర్వాసనే మన కళ్లముందు మెదులుతాయి. ఇక మల వ్యర్థాలను సేకరించే సెప్టిక్‌ట్యాంకర్లను చూడగానే మనలో ఓ రకమైన ఒకారం వస్తది. ఇంకా మల వ్యర్థాల నిల్వచేసే ప్రదేశమంటే అటువైపు వెళ్లడానికి కాదుకదా కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడం. కానీ అలాంటి డంపు యార్డులో వ్యర్థం అంటే అర్థంగా ప్రయోజనకరంగా మారింది. సిద్ధిపేట మున్సిపాలిటీ బుస్సాపూర్‌ శివారు డంపుయార్డులో ప్రారంభమైన మానవ మల వ్యర్థ విసర్జితాల యూనిట్‌ వ్యర్థాల నుంచి ఎరువు తయారీలో సత్ఫలితాలనిస్తున్నది. 

జాతీయ, రాష్ట్రస్థాయిలో స్వచ్ఛతలో గుర్తింపు పొందిన సిద్ధిపేట మున్సిపాలిటీ చేపట్టిన వినూత్న ప్రయోగం విజయవంతమైంది. స్వచ్ఛ సిద్ధిపేటలో భాగంగా ఫిబ్రవరిలో రూ.2 కోట్ల రూపాయల వ్యయంతో పట్టణ శివారు బుస్సాపూర్‌ డంపుయార్డులో ఎకరం స్థలంలో మానవ మల వ్యర్థ విసర్జితాల శుద్ధీకరణ యూనిట్‌- ఎఫ్‌ఎస్టీపీ ఏర్పాటైంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు చొరవతో ఎనిమిది నెలల క్రితం ప్రారంభమైంది. 

వ్యర్థ శుద్ధీకరణ తీరు… 

పట్టణ పరిధిలోని 42 వేల నివాస గృహాల నుంచి సెప్టిక్‌ ట్యాంకులోని మానవ విసర్జితాలను ఎఫ్‌ఎస్టీపీ- ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌కు తరలిస్తారు. ఇక్కడ అనారోబిక్‌ సేఫ్టీలైజేషన్‌ రియాక్టరులో విసర్జితాలను మెథనైజేషన్‌ పద్ధతిలో శుద్ధి చేసి విసర్జితం, నీటిని వేరు చేస్తారు. నీటిని పాలిషింగ్‌ ఫండ్‌లో పాస్పరేట్‌, సల్ఫర్‌ ద్వారా శుద్ధి చేసి ఫ్యూరీఫైడ్‌ వాటర్‌గా మార్చుతారు. ఇక 18 రోజుల తర్వాత మలం ఎరువుగా మారుతుంది. ఈ మొత్తం సాంకేతిక ప్రక్రియలో జరుగుతున్నది. ఇలా తయారైన ఎరువు పంట పొలాలకి, నర్సరీలకు ఎంతగానో ఉపయోగపడుతుంది, అంతేకాక సెప్టిక్‌ ట్యాన్క్‌ నిర్వాహకులకు వ్యయభారలు తగ్గడం వారికి పరోక్షంగా సమయభారంను తగ్గిస్తుంది. సిద్ధిపేట జిల్లా చుట్టూ ప్రక్కన ఉన్న గ్రామాల వ్యర్ధాలను కూడా సేకరించి సెప్టిక్‌ నిర్వహకులు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. 

లక్షా 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన శుద్ధీకరణ ప్లాంటులో ప్రతీరోజూ 20 వేల లీటర్ల విసర్జితాలు శుద్ధిచేసే అవకాశం ఉన్నది. ఆరు నెలల్లో 100 పైగా వాహనాల ద్వారా లక్షా 60 వేల లీటర్ల మానవ విసర్జిత వ్యర్థాలను సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. శుద్ధిచేసిన ఈ నీటిని మున్సిపాలిటీ పరిధిలోని హరితహారం మొక్కలకు వినియోగిస్తున్నారు. 

ఎఫ్‌ఎస్టీపీ ప్లాంట్‌ ఆవరణ ఓ పారిశుద్ధ్య ఉద్యానవనం

ఎఫ్‌ఎస్టీపీ ప్లాంట్‌ ను ఓ ఆదర్శవంతమైన పారిశుధ్య ఉద్యానవనంగా తీర్చిదిద్దడంలో మంత్రి హరీశ్‌ రావు కృషి, ప్రత్యేక చొరవ ఎంతగానో ఉన్నది. ఈ ప్లాంటులో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, పచ్చని చెట్లు, రంగురంగుల చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. 

ప్లాస్టిక్‌ ఇటుకలు ప్రత్యేకం… 

పట్టణంలో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్‌ ను ప్రాసెస్‌ చేసి వివిధ వస్తువులతో ఇటుకలు, టైల్స్‌ తయారు చేయాలని మంత్రి హరీశ్‌ రావు దిశానిర్దేశంతో మున్సిపల్‌ అధికారులు నడుం బిగించారు. ఈ క్రమంలో రూ.27.30 లక్షల వ్యయంతో ప్రత్యేక యంత్ర సామాగ్రిని కొనుగోలు చేసి ఇటుకల,పార్కింగ్‌ టైల్స్‌ ల వస్తువుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. నిత్యం ఉత్పత్తి అవుతున్న 660 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఇక్కడికి తీసుకొస్తారు. ఆగ్లోమీటరు అనే యంత్రం ద్వారా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి, వేడి చేసి ప్లాస్టిక్‌ ను కరిగిస్తారు. ఆ ద్రవంతో ఇటుకలు, టైల్స్‌ తయారు చేస్తున్నారు. తొలిదశలో తయారైన ఇటుకలను మున్సిపాలిటీలోని ప్రకృతి వనాలు, పార్కుల్లో వివిధ పనులకు ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో ప్రజలకు విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు మున్సిపల్‌ అధికార వర్గాలు పేర్కొన్నాయి. బుస్సాపూర్‌ రిసోర్సు పార్కులోని ప్లాస్టిక్‌ రీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ లో తయారైన ప్లాస్టిక్‌ ఇటుకలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. పట్టణంలో ఉత్పత్తి అయ్యే పనికిరాని ప్లాస్టిక్‌ వస్తువులతో ఇటుకలు, టైల్స్‌ తయారవుతున్నాయి. 

స్టీల్‌ బ్యాంకు వినియోగం 

ప్లాస్టిక్‌ నిర్మూలనలో భాగంగా మున్సిపాలిటీ వార్డుల్లో స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. వివాహాలు, పండుగలు, ఇతర శుభ కార్యాలలో ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించేలా బాల వికాస స్వచ్ఛంద సంస్థ, దాతల సహకారంతో యేడాది కిందటే స్టీల్‌ బ్యాంకుల పేరిట కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. వీటిల్లో స్టీల్‌ గ్లాసులు, పల్లెంలు, ఇతర అవసరమైన సామాగ్రిని బయట మార్కెట్‌ లో కన్నా తక్కువ అద్దెకే మున్సిపాలిటీ అందిస్తున్నది. స్థానిక మహిళా సంఘాలకు వాటి నిర్వహణను అప్పగించడంతో మహిళా సంఘాలకు ఆదాయ మార్గంగా మారింది. ఈ బ్యాంకు కోసం అండ్రాయిడ్‌ ఫోన్లలో వచ్చేలా ఓ యాప్‌ సైతం (Siddipet Steel Bank) అందుబాటులోకి తెచ్చారు. ఎవరికైనా సామాగ్రి అవసరం ఉంటే అందులో ఆర్డర్‌ చేసుకోవచ్చు. 

సీఏం కేసీఆర్‌ స్ఫూర్తితో.. 

స్వచ్ఛతకు నిదర్శనంగా శుద్ధిపేట చేస్తున్నాం

ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు

స్వచ్ఛతకు నిలువెత్తు నిదర్శనం సిద్ధిపేట. బాపూజీ కలల సాధనలో సీఎం కేసీఆర్‌ ఆశయాలు, ఆలోచన స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం. దేశంలో ఒక ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుతున్నాం. సిద్ధిపేట ప్రజల సహకారం, భాగస్వామ్యం గొప్పది. ఇంటింటా చెత్త సేకరణ, చెత్త నుంచి ఆదాయ అన్వేషణ, తడి చెత్త ద్వారా ఎరువు తయారీ లాంటి వాటికి సిద్ధిపేట ఆదర్శం. దూర భారం తగ్గించేలా మిడిల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యూనిట్‌, సిద్ధిపేట శివారు బుస్సాపూర్‌లో మానవ వ్యర్దాలను శుద్ధీకరణ చేసే ప్లాంట్‌, పనికి రాని ప్లాస్టిక్‌తో ఇటుకల తయారీ యూనిట్‌లు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. శుద్ధిపేటగా మార్చే క్రమంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ సిద్ధిపేట మున్సిపాలిటీ దేశానికి రోల్‌ మోడల్‌గా నిలవడం అభినందనీయం.

ప్రజల సహకారం సంపూర్ణ శుద్ధిపేట లక్ష్య సాధనకు దోహదం 

సిద్ధిపేట మున్సిపల్‌ కమీషనర్‌ 

డాక్టర్‌ కే.వీ. రమణాచారి

రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు దిశానిర్దేశం మేరకు ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే దేశ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలు సాధించాం. బుస్సాపూర్‌లో మానవ వ్యర్ధాలను శుద్ధీకరణ చేసే యూనిట్‌, ప్లాస్టిక్‌తో ఇటుకల తయారీ, తడి చెత్తతో ఎరువులు, పొడి చెత్త రీసైక్లింగ్‌ వల్ల ఆదాయ వనరులు రాబట్టడం సిద్ధిపేట మున్సిపాలిటీ ప్రత్యేకత. మున్సిపాలిటీ అధికార యంత్రాంగం, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజల సహకారంతో సంపూర్ణ శుద్ధిపేట లక్ష్య సాధనకు దోహదపడనున్నది. బుస్సాపూర్‌ లో 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఎఫ్‌ఎస్టీపీ ప్లాంటును ఏర్పాటు చేశాం. దీని ద్వారా 16 వేల లీటర్ల నీటిని శుద్ధి చేసి మొక్కలకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నాం. 20 వేల లీటర్ల మల వ్యర్థాల ద్వారా ప్రతీ రోజుకూ 800 కిలోల ఎరువు తయారవుతుంది.