|

పుస్తక ప్రపంచం

పుస్తకం ఒక మంచి స్నేహితుడులాంటిదని పెద్దలు చెప్తారు. ముద్రిత అక్షరాల విస్తరి పుస్తకం. అన్ని అలవాట్లలో కన్నా పుస్తక పఠనం అత్యున్నతం. సోషల్‌ మీడియా విస్తృతంగా వ్యాపించిన ఈ రోజులలో కూడా పుస్తక ప్రియులు ఎక్కువగా వున్నారని చెప్పవచ్చు. అందుకు ప్రత్యక్ష సాక్షి ఏటేటా జరుగుతున్న హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన. జ్ఞాన సముపార్జన కావాలనుకున్న ఏ వ్యక్తయినా పుస్తకాలతో సహవాసం చేయవలసిందే. ఫలానా పుస్తకం ఎక్కడ దొరుకుతుందో అని అనేక బుక్‌ స్టాల్స్‌ తిరిగే అవసరం లేకుండా సమస్త భాండాగారం ఒకే చోట లభించడం అనేది పుస్తక ప్రియులకు నిజంగా పండగే. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ గ్రౌండ్స్‌ (తెలంగాణ కళా భారతి)లో 33 వ జాతీయ పుస్తక ప్రదర్శన కొలువుదీరింది.ఈ ప్రదర్శనను గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇక్కడ కొలువుదీరిన ఎన్నెన్నో పుస్తకాలు సందర్శకులకు హస్తభూషణాలుగా మారాయి.

అక్షర బద్ధుడైన ప్రతి వ్యక్తి విజయం వెనుక ఒక మంచి పుస్తకం ఉంటుందని అంటారు. ప్రపంచ అత్యంత కుబేరుల్లో ఒకరైన వారెన్‌ బఫెట్‌ ప్రతిరోజూ కొన్ని వందల పేజీలు చదువుతారని ప్రతీతి. దాదాపు ఎనభైశాతం సమయాన్ని పుస్తక పఠనానికే కేటాయిస్తారట. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మార్క్‌ క్యుబన్‌ రోజుకు మూడు గంటలపాటు పుస్తకాలు చదువుతారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ఏడాదికి యాభై పుస్తకాలు చదవాలనే లక్షాన్ని నిర్దేశించుకుని చదువుతారని చెప్తారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇలా.. జీవితంలో ఉన్నతశిఖరాలను అధిరోహించిన వారందరి విజయం వెనుక పుస్తకం ఉంటుందని వారి అనుభవాలే మనకు తెలియ చెప్తున్నాయి. .

మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు వార్తాపత్రికలు,పుస్తకాలు పరిష్కారం చూపుతాయి. పుస్తకాలు చదివే అలవాటున్నవారికి సమస్యలేవైనా ఎదురైతే వాటికి తరుణోపాయం వెతుక్కునే గుండెధైర్యం నిండుగా వుంటుంది. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు మానసిక వికాసాన్ని కలిగించే పుస్తకాలను కూడా చదువుతుంటే భవిష్యత్తు బాగుంటుంది. హడావిడి జీవితాలతో, ఉరుకులు పరుగుల ఉద్యోగాలతో , సంపాదనకోసం చేసే ఆరాటంలో పుస్తక పఠనానికి దూరమవుతున్నారు. ఇలాంటి పరిణామాల వల్ల చిన్న సమస్యలకే మనుషులు కుంగిపోతున్నారని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. పుస్తకాలను బహుమతులుగా ఇచ్చే సంస్కృతిని పెంపొందించాలని పుస్తక ప్రదర్శన నిర్వాహకులు కోరుతున్నారు. దీన్నొక సంప్రదాయంగా మలచాలని సూచించారు. చిన్నారులు విజయాలు సాధించినపుడు వారిని అభినందిస్తూ పుస్తకాలు అందజేయాలని, అలా చిన్నతనం నుంచే పుస్తక పఠనాన్ని అలవాటుచేయాలని కోరారు.

దాదాపు 330 పుస్తక స్టాళ్లలో, లక్షలాది పుస్తకాలు కొలువుదీరాయి. వీటిలో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళం, ఆంగ్లంతో పాటు దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లోని రచనల్ని అందుబాటులో వుంచడం జరిగింది. ఈ సారి వెలసిన పుస్తక ప్రదర్శన 33వది కాగా, తొలుత నగరంలో 1984లో చిక్కడపల్లిలోని కేంద్ర గ్రంథాలయం వేదికగా పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. ఆ తర్వాత కేశవ్‌ మెమోరియల్‌ మైదానం, ఎగ్జిబిషన్‌ మైదానం, నిజాం కళాశాల, పీపుల్స్‌ ప్లాజాలు వరుసగా పుస్తక ప్రదర్శనకు వేదికలయ్యాయి. అయితే గత కొన్నేళ్లుగా కవాడిగూడలోని ఎన్టీఆర్‌ స్టేడియంలోనే ఈ ప్రదర్శనను ఏటేటా నిర్వహిస్తున్నారు. పిల్లలకు వినోదాన్ని,విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు, పెద్దలకు ఆధ్యాత్మిక గ్రంథాలు ఇక్కడ కొలువుదీరాయి. గతంలో లాగే కొత్త రచయితల పుస్తకాలను పరిచయం చేసుకునే అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాసిన రచనలతో ఓ ప్రత్యేక స్టాల్‌ ను ఏర్పాటు చేశారు. మొత్తానికి సాహితీ చర్చలు,పలు కథల సమీక్షలు,ఆధునిక సాహిత్యం పై మేధోమథనం కలగలుపుగా పుస్తక ప్రదర్శన పది రోజుల పాటు ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది.