సలక్షణ ప్రౌఢ రచన విలక్షణ పి.వి.

By: సుధామ

ఆయన దేశం పట్టనంతటి మహోన్నత వ్యక్తి రాజనీతి, సాహిత్య రచనాద్యుతి ప్రోది చేసిన ప్రతిభాదుతి.తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసినఅసమాన విలక్షణ భారతీయ చోదక శక్తి.

అవును! ఆయనే మాజీ భారత ప్రధానిగా అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించిన తెలుగుతేజం పాములపర్తి వెంకట నరసింహారావు. పి.వి అనే రెండక్షరాల్లోనే తన కీర్తి సాంద్రతనంతా ఒదిగించుకున్న విలక్షణుడు. పి.వి. నరసింహారావు పై పలు గ్రంథాలు ఈ సరికే వచ్చివుండవచ్చు గాక! కానీ ‘విలక్షణ పి.వి.’ పేరుతో డా॥ గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి రచించిన నరసింహారావు జీవిత చరిత్ర ఒక విలక్షణ నేతపై వెలువడిన విశిష్టరచన.

ఈ గ్రంథ రచనలో రచయిత పడిన శ్రమ, తీసుకున్న శ్రద్ధ, ఎన్నుకున్న ప్రణాళిక ఎన్నదగినవి. పి.వి.పై మునుపు ఒక నాయకునిగా, భారతదేశ భవిష్య నిర్మాణ ద్రష్టగా ఆయన గొప్పతనాన్ని రాబోయే తరాలకు సైతం కరతలామలకం చేసే సంకల్పంతో సమగ్ర సమ్యక్‌ పరిశీలనంతో చేసిన రచన ఇది. బాల శ్రీనివాస మూర్తి అత్యంత ప్రౌఢ రచన ఇది.

నాయక చంద్రుని గురించి నక్షత్ర మాలికలా ఇరవై ఏడు అధ్యాయాలలో ఈ సమగ్ర జీవిత చరిత్రను రచయిత సంతరించిన ప్రణాళిక ప్రథమంగా ప్రశంసనీయం. పి.వి. జీవితం కుటుంబంతో ప్రారంభించి చరిత్రలో చేరిన మహోన్నత జీవితం అనే అధ్యాయంతో ముగిసే మూడువందల పై చిలుకు పేజీల ఈ గ్రంథరచనను రచయిత కేవలం ఒక నాలుగు నెలల కాలంలో రాసారంటే పి.వి పట్ల ఆయనకున్న శ్రద్ధాభక్తులు, పట్టుదల, బహు గ్రంథ పఠనాసక్తి, చదివిన విషయాలపట్ల వివేచన, ఒక వింగడింపు, విశ్లేషణ, రచనా దక్షత యివన్నీ హేతువులు. రచయిత బాలశ్రీనివాస మూర్తి సాహిత్య విమర్శ పరిశోధనారంగాలలో సుప్రసిద్ధులు, ఈ ‘విలక్షణ పివి’ జీవిత చరిత్ర గ్రంథ రచన ఆయన రచనా  సామర్థ్యానికి ఒక కలికితురాయిగా నిలిచేలా ఈ గ్రంథం రూపొందింది.

రచయిత సాహిత్యాది అంశాలపట్ల క్షుణ్ణమైన పరిజ్ఞానం కలవాడు కావడం వలన పి.విలోని సాహిత్య సృజన శీలతను, భాషాపరశేష భోగిగా పివి పాండిత్యాన్ని విశదీకరించడం సులభసాధ్యమైన విషయం కావచ్చునేమోగానీ ఒక రాజకీయవేత్తగా పి.వి.ని అంచనా వేసి ఆ నాయత్వంలోని విలక్షణతనూ, వైభవ ప్రాభవాలనూ విశదీకరించిగలగటం సామాన్యమైన విషయమేమీ కాదు. తలపండిన రాజకీయవేత్తలకే పివిలోని రాజకీయ చాణక్య బుద్ధి కుశలత, ఆయన మౌనం వెనుక దాగిన సామాజిక పరివర్తనా విప్లవ ఆలోచనా పరిణితి అర్థం చేసుకోగలడం సాధ్యం కాదు. అటువంటిది ఆయన రాజకీయ జీవిత క్రమాన్ని, ప్రధానిగా ఆయన తలపెట్టి అభివృద్ధి దిశ కావించిన సంస్కరణలనూ, ఆయా పర్యవసానాలనూ, దిశా నిర్దేశకంగా నిలిచిన విజయాలను విశదీకరించడంలో బాల శ్రీనివాస మూర్తి కావించిన రచన ఎంతగానో కొనయాడదగింది. పి.వి.పై గల ప్రభావాలు, ప్రసారాలు, ఆయనను రాష్ట్ర మంత్రిత్వం నుండి ముఖ్యమంత్రిత్వానికి ఆపై కేంద్ర కేబినెట్‌ మంత్రియై సంక్లిష్టతల నడుమ ప్రధాని పీఠంపై తెలుగు తేజంగా సుప్రతిష్ఠితమైన క్రమాన్ని అలాగే సంస్కరణల సారధ్యం వహించి, కీలకమైన ప్రజాస్వామ్య ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కొని తన విదేశాంగ విధానాలతో అగ్రరాజ్య సంబంధాలను నెరపిన వైనాలు ఈ రచనలో రచయిత కూలంకషంగా కూర్చారు. ‘ప్రధానులు కొన్ని పోలికలు ` మరికొన్ని భేదాలు’ అన్న అధ్యాయం రచయిత తులనాత్మక అధ్యయన ప్రజ్ఞకు నిదర్శనం.

పి.వి.లోని వక్తృత్వవైభవాన్నీ విశ్వనాధ వారి వేయిపడ గలను హిందీ భాషలోకి ‘సహస్రఫణ్‌’ పేరిట తెలుగువా డయిన తాను రాసి మెప్పించడాన్ని, అలాగే పివిలోని సాహిత్య సృజనశీలతను కథకునిగా, నవలా కారునిగా, నాటక కర్తగా పి.వి. రచనా దక్షతను అదే విధంగా తన జీవన గమనాన్ని ఆయనే స్వయంగా ‘ఇన్‌సైడర్‌’ (లోపలి మనిషి) పేర ఎలా గ్రంథస్థం చేసిందీ అలాగే మరాఠీ నుంచి తెలుగులో వారు చేసిన అనువాదరచనలు గురించి వివరాలతో రచయిత విశదపరిచారు. కానీ ఎందుకో ప్రధాని స్థాయిగా ఎదిగాక కూడా పి.వి. అనువాదం చేసిన జయప్రభ ప్రేమకవితలకు ఆంగ్ల అనువాదం గురించి రచయిత ప్రస్తావించలేదు.

నీల్‌కమల్‌ ప్రచురణగా వెలువడిన ఈ విలక్షణ పి.వి. గ్రంథం తెలుగులో జీవిత చరిత్ర రచనా గ్రంథాలలో విలక్షణంగా నిలిచేలా రచించిన రచయితకు అభినందనలు.

విలక్షణ పి.వి. నరసింహారావు & జీవిత చరిత్ర
డా. గుమ్మనగారి బాల శ్రీనివాస మూర్తి,
నీల్‌కమల్‌ పబ్లికేషన్‌ ప్రై. లిమిటెడ్‌, సుల్తాన్‌బజార్‌, కోఠి,
హైదరాబాద్‌. వెల : రూ. 395/