|

నేనెరిగిన పి.వి. మన ఠీవి

శ్రీ టి. ఉడయవర్లు


అసలు చాణక్యుడిని ఈనాటి వారెవ్వరూ చూచి  ఉండరు. అయినాకాని ఆయనను అంతా ‘అపరచాణక్యుడంటారు.’ బొమ్మల్లో కనిపించే చాణక్యుడికి ఉండే శిఖ ఆయనకు లేకపోయినా, ఆయన లాంటి ఆహార్యం ఈయన ధరించకపోయినా తెల్లని కాగితంలాంటి ధోవతి కట్టుకుని, లాల్చీ – భుజాన కండువా వేసుకుని, అప్పుడప్పుడు నుదుట బొట్టు పెట్టుకుని, సులోచనాలు ధరించే ఆ బట్టతల పెద్దమనిషిని, సంస్కరణల శీలిని, బహుభాషాకోవిదుడిని, విలువలకు కట్టుబడిన రాజనీతిజ్ఞుడిని, మహామేధావిని, నిరాడంబర జీవిని – పీవీని అంతా అపరచాణక్యుడంటారు.

పీవీగా ప్రఖ్యాతుడైన ఆ ప్రముఖుడి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు.
ఆయన ఆయా అంశాల అవగాహన చేసుకునే తీరులో, ఆవశ్యమైన విధానాలు రూపొందించి సమయస్ఫూర్తితో అమలుచేసే పద్ధతిలో మాత్రం పి.వి. నరసింహారావు కచ్చితంగా చాణక్యుడినే ఆవాహన చేసుకున్నాడంటారు.

లేకుంటే, ఎప్పుడూ ఏవో ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఉద్యమాలు, రాజకీయాలు, అవిశ్వాస తీర్మానాల ప్రతిపాదనల హోరుతో చెలరేగే లోకసభా సాగరంలో మైనారిటీ ప్రభుత్వాధినేతగా, ఏకాభిప్రాయ సాధనమనే నావపై నైపుణ్యంతో నిండా ఐదేండ్లు ప్రయాణించి సురక్షితంగా దేశాన్ని ప్రగతి తీరానికి చేర్చడం ఎల్లా సాధ్యమవుతుంది!
నిజంగానే దేశం కష్టకాంలో ఉన్నప్పుడు కావలసిన లక్షణాలు గల నాయకుడై వచ్చి కాపాడిన, గ్రూపు కట్టని రాజకీయవేత్త, అజాత శత్రువు, స్థిత ప్రజ్ఞుడు, దార్శనికుడు – పి.వి. నరసింహారావు.

ఇవ్వాళ మనం చూస్తున్న శీఘ్ర ప్రగతి, విస్తరించిన ప్రైవేట్‌ భాగస్వామ్యం, ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి దేశ ప్రధానిగా పి.వి. ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే.

మూడు దశాబ్దాల క్రితం మన దేశం ఎట్లా ఉండేదో నేటి తరానికి ఊహకైనా అందదు. ఇవ్వాళ ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ ఫోన్‌ ఉంది. ఏ మోటార్‌ సైకిల్‌, ఏకారు కావాలంటే అది ఇట్టే కొనుక్కోవచ్చు. ఈ తరానికి కేవలం ప్రభుత్వ ఉద్యోగమే ఆధారం కాదు. సిమెంట్‌ కొనడానికి పర్మిట్‌ అక్కరలేదు. ల్యాండ్‌ ఫోన్‌ కావాలంటే రెండు మూడేండ్లకు పైగా ఎదిరి చూడవలసిన అవసరం లేదు. స్కూటర్‌ బుక్‌ చేసుకుంటే అది ఐదారేండ్లకు గాని చేతికి వచ్చేది కాదు. వ్యాపారం మొదలుపెట్టాలంటే ప్రభుత్వం చుట్టూ లైసెన్సు కోసం తిరిగి తిరిగి విసిగి వేసారి పోవలసిన పరిస్థితి. సుమారు మూడు దశాబ్దాల క్రితం ఉండేది. అప్పుడంతా ప్రభుత్వ నియంత్రణే. దానికి తోడు అదుపుతప్పిన ద్రవ్యోల్బణం. అధికలోటు, అప్పులు పుట్టని పరిస్థితి. దిగుమతులకోసం అవసరమైన విదేశీ మారకద్రవ్యనిల్వలు నిండుకున్న వైపరీత్యం.

ఎటుచూసినా నిరుత్సాహ వాతావరణమే. ఇలాంటి క్లిష్ట సమయంలో తలవని తలంపుగా దేశ ప్రధాని పీఠాన్ని అధిష్టించిన పి.వి. ఊహాతీతంగా ఆర్థిక శాఖ మంత్రిగా డా. మన్మోహన్‌ సింగ్‌ను తీసుకుని తక్షణ చర్యలతో ప్రధాని పదవికే అలంకారమయ్యాడు.

కేవలం ఆర్థిక సంస్కరణలు చేయడమే కాదు. ఎన్నాళ్ళుగానో రావణ కాష్టంగా రగులుతున్న పంజాబ్‌లో తనలోని రాజకీయ చతురతను ప్రయోగించి ప్రశాంతంగా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించారు. శాంతిని సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు దోహదం చేశారు.

ఖలిస్తాన్‌ ఉద్యమాన్ని ఇట్లా అంతమొందించి పంజాబ్‌ను జాతీయ జీవన ప్రధాన స్రవంతిలో భాగం చేయడం పి.వి. సాధించిన మరో రికార్డు.

ఇంకా అస్సాం, జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాదుల, మతో న్మాద జాతి వ్యతిరేక శక్తుల ఆటలు కట్టించి, ప్రజాస్వామ్య, సెక్యులర్‌ వ్యవస్థను నెలకొల్పారు. జాతి సమైక్యతకు, మతోన్మాద శక్తుల పీచమణచడానికి శాంతియుత చర్యల ద్వారా ఏనాడూ ఎవ్వరూ సాధించనన్ని విజయాలు పి.వి. సాధించారు. ఇంకా ఎన్నో అంశాలు ఇలా చెప్పొచ్చు.
అయినప్పటికీ బాబ్రీ మసీదు సంఘటనను పురస్కరించుకుని సమయానికి కఠినంగా వ్యవహరించలేదని ప్రతిపక్షం వారే కాకుండా స్వపక్షంలోని పెద్దలు కొందరు పివినే బదనామ్‌ చేశారు. వాస్తవానికి బాబ్రీమసీదు వివాదానికి పి.వి. వద్ద పరిష్కార సూత్రం ఉంది. మసీదును యధాతథంగా వదిలేసి, ఇరువర్గాల వారు చర్చించుకుని, ఆ ప్రక్కనే దివ్య మందిరాన్ని నిర్మిస్తామని కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికలో చెప్పాడు. అదే అంశాన్ని స్వాతంత్రోత్సవం సందర్భంగా దేశ ప్రధానిగా ఎర్రకోట నుంచి కూడా పి.వి. ఈ ప్రకటన చేశారు.

అక్షరానికి ఆప్తుడైన పి.వి. నరసింహారావు 1996లో ప్రధానిగా పదవీ విరమణ చేసిన తర్వాత ‘‘ఆత్మ చారిత్రాత్మక రచన’’ ‘ఇన్‌సైడర్‌’ పూర్తి చేయడంతో పాటుగా ‘అయోధ్య’లో ఏమి జరిగిందో వివరంగా వ్రాసిపెట్టుకున్నారు. ఆయన కోరికననుసరించి, పి.వి. మరణానంతరం ‘అయోధ్య 6వ డిసెంబర్‌ 1992’ అనే సుమారు 250 పేజీ గ్రంథాన్ని ప్రచురించారు. ఇంకా ‘ఇన్‌ సైడర్‌’ రెండో భాగం వేలువడవలసి ఉంది. ప్రెస్‌ ప్రతిని తొలిభాగం వేసిన ప్రచురణ కర్తకు పి.వి. అందజేశారు కూడా. కాని అది ఇంతవరకు వెలుగు చూడలేదు మరి.

ఇది ఇలావుండగా, కావాలని కొందరు అభియోగాలతో కోర్టుకెక్కి ఆయనను అపనిందపాలు చేశారు. ఈ కష్టకాలంలో కాంగ్రెసు పార్టీ ఆయనను పట్టించుకోకవ పోవడమే కాకుండా చిన్న చూపు చూసింది. అయినా ధైర్య సాహసాలతో నిలబడి అన్ని కేసులు వీగిపోగా మంచి ముత్యంలా పి.వి. నిగ్గుతేలారు.

వాస్తవానికి పాత కరీంనగర్‌ జిల్లా వంగరకు చెందిన పి.వి. నరసింహారావు బాల్యం నుంచి కూడా ఏదో వెనకోసుకోవాలనే యావ, భద్రత కల్పించుకోవాలనే ధ్యాస లేనివాడు.

‘ఏకసంథాగ్రాహి’గా ప్రసిద్ధికెక్కాడు. ఆనాడే అష్టభాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఆ తర్వాత మరికొన్ని భాషలు నేర్చుకున్నాడు. స్వాతంత్య్రోద్యమంలో, మరీ ముఖ్యంగా నిజాం వ్యతిరేకోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ‘వందేమాతరం’ ఆలపించినందుకు ఇంటర్‌ మొదటి సంవత్సరంలో రెస్టికెట్‌ ఇచ్చారు. దాంతో నాగపూర్‌ వెళ్ళి నాగపూర్‌ విశ్వవిద్యాలయంలో ఇంటర్‌మీడియెట్‌ పూర్తి చేశారు. అనంతరం పూనాలోని పెర్గుసన్‌ కళాశాలో బిఎస్సీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత నాగపూర్‌ విశ్వవిద్యాయంలో ఎల్‌ఎల్‌బి చదివి సర్వ ప్రథముడుగా ఉత్తీర్ణుడై స్వర్ణపతకం సాధించాడు. ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చి అప్పుడు బాగా ప్రాక్టీసువున్న వకీలు – బూర్గుల రామకృష్ణారావు దగ్గర జూనియర్‌గా చేరారు. క్రమంగా కాంగ్రెసు నాయకుడు స్వామి రామానంద తీర్థకు అనుచరుడై రాజకీయాల్లో ప్రవేశించాడు. తొలుదొలుత కరీంనగర్‌ జిల్లా మంథని నుండి శాసనసభకు ఎన్నికైనాడు. నీలం సంజీవరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, తొలి పర్యాయం మంత్రిగా పి.వి.కి జైళ్ళు, సమాచారశాఖలను కేటాయించారు. తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన ఆరోగ్య వైద్య, విద్యా శాఖలను నల్లేరు పై నడకలా కొనసాగించారు. వారితో ‘బృహస్పతి’గా పిలిపించుకున్నారు. ఆయన తర్వాత పాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పి.వి. నరసింహా రావు పదవీ స్వీకారం చేశారు. చారిత్రాత్మకమైన భూ సంస్కరణలను ప్రవేశపెట్టి ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. అనంతర కాలంలో ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ మంత్రి వర్గాల్లో కీలకమైన విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ, హోం శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రిగా వ్యవహరించి తన ముద్ర వేశారు. ఏ మంత్రిత్వ శాఖలోనైనా సంస్కరణలకే ప్రాధాన్యతనిచ్చారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ ఇరువురికి విశ్వాసపాత్రుడయ్యాడు. అనేక అంశాల్లో వారికి ‘సలహాదారు’గా వ్యవహరించారు. దేశం క్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు ప్రధాన మంత్రిగా పదవీ స్వీకారం చేసి, దేశాన్ని కష్టాల కడలినుంచి గట్టెక్కించారు. నిరంతర కృషితో ఆధునిక భారతదేశంగా తీర్చిదిద్దారు.

ఇంతటి చరిత్ర గల రాజనీతిజ్ఞుడు పి.వి. నరసింహారావు శతజయంతి సంవత్సరమిది. ‘దేశాన్ని రక్షించు, దేశాన్ని నిర్మించు’’ అనే మాటకు కట్టుబడి తన జీవితకాలమంతా కృషి చేసిన రుషి పివిని అర్ధశతాబ్దం నుంచి నేనెరుగుదును. నా ఎరుకలో జరిగిన కొన్ని మరుపురాని సంఘటనలు, అనుభవాలను పలువురితో పంచుకుంటున్నాను.

పి.వి. నరసింహారావు ఎవరో, ఏమిటో తెలియకముందు నుంచే, కనీసం ఆయనను చూడకముందు నుంచే మా ఇంట్లో పిల్లలందరికీ ‘పీ.వి.’ అనే పేరు ఒక ప్రామాణిక పురుషుడుగా, కొలబద్దగా మా తాతగారు ఉదాహరించడం తెలుసు. ముఖ్యంగా పిల్లల చదువు సంధ్యలు, తెలివితేటలకు సంబంధించిన ఏ విషయం వచ్చినా మా తాతగారు వేణుగోపాల స్వామి ‘పీవి’లాగా చదువుకోవాలనీ, తెలివి తేటలు సంపాదించాలని హితబోధ చేసేవారు. వారిని ఆదర్శప్రాయులుగా, అనుసరణీయులుగా అభివర్ణించేవారు.

మా తాతగారు అప్పటి వరంగల్‌ జిల్లాలోని శాయంపేటలో ప్రధానోపాధ్యాయులుగా ముప్పై సంవత్సరాలు పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కరీంనగర్‌ ప్రక్కనే గల స్వగ్రామం నుస్తులాపురంలో స్థిరపడ్డారు. తొలి పంచాయతీ ఎన్నికల్లో మా గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై ఎంతో సేవ చేశారు. అప్పట్లోనే అంటే 1952లో లోకసభకు జరిగిన ఎన్నికల్లో తొలిసారి పి.వి. నరసింహారావు కరీంనగర్‌ లోకసభకు పోటీ చేసి, ఓటమి పాలైనా, వారికి, మాతాతకి పరస్పరం బాగా పరిచయం పెరిగింది. అట్లా పివి ప్రతిభా సామర్థ్యాలు మాకందరికి ఎట్లా తెలుసో, మా ప్రాంతం వారికందరికీ వారిని చూసినా, చూడకపోయినా బాగా తెలిసిపోయింది. అందుకే పిల్లలను ఏ విషయంలోనైనా మార్గదర్శిగా చెప్పవలసి వస్తే ‘పీవీ’ని ఉదాహరణగా పేర్కొనడం అలవాటైంది.

నేను ‘పీవి’ ప్రసంగాన్ని కుతూహలంతో ముందు వరుసలో కూర్చొని విన్నది మొదటి సారి శ్రీ కృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం పాత భవనంలోని పై అంతస్థులో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణ రావు షష్టిపూర్తి మహోత్సవంలో. అప్పుడు వారు బహుశా రాష్ట్రంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సభలో ఆయన ఆత్మీయంగా చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. కాళోజీ మూర్తిమత్వాన్ని కళ్ళకు కడుతూ కవితాత్మకంగా ‘నోటి కస్సుబుస్సుకు కన్నీటి వింత జత గూర్చుతు ‘అంతరంగ నవనీతము ననారతము పంచియిమ్ము’ అన్నారు. ఆ తర్వాత ‘బ్రహ్మ నీకు పొరపాటున పాపుల వయసిచ్చుగాక / కాలుడు మా కాళయ్యను కలకాలము మరచుగాక’ అని ఆయన మనోగతాన్ని వ్యక్తం చేశారు.

అంతకుముందు కరీంనగర్‌ శ్రీ రాజరాజేశ్వర ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో నేను పి.యు.సి. చదువుతున్న 1964లోనే అక్కడ విద్యార్థులు ఉపన్యాసకులు తరచుగా ‘పి.వి’ వాక్చాతుర్యం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. ఎందుచేతంటే, అప్పటి మా ప్రిన్సిపాల్‌ ఐ.వి. చలపతిరావు కంటే ముందు, ఆ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా సుప్రసిద్ధ కవి విశ్వనాథ సత్యనారాయణ ఉండేవారు. వారి షష్టిపూర్తి ఉత్సవాలు కరీంనగర్‌లో ఘనంగా నిర్వహించారు. అయితే తొలిరోజు సాయంత్రం జరిగిన సమావేశంలో విశ్వనాథ నవలల గురించి ముఖ్యంగా ‘వేయిపడగలు’పై పివి విశ్లేషణాత్మకంగా ప్రసంగిస్తూ రోమన్‌ రోలాండ్‌ రచించిన ‘జీన్‌క్రిస్టోఫ్‌’ మాదిరిగా ఉందన్నారు. ‘వేయిపడగలు’లోని పాత్ర చిత్రణ ఎలా జరిగిందో, వాటిపై ప్రభావాన్ని కూడా ఆయన సుదీర్ఘంగా వివరించారు. ఆ సభలో తలపండిన ఎందరో విశ్వనాథ శిష్యులున్నారు. కానీ వారెవ్వరూ పి.వి. లేవనెత్తిన అంశాలకు సమాధానాలు గాని, వివరణలు గాని ఇవ్వలేని ఇరుకైన పరిస్థితిలో కూరుకుపోయారు. ఎప్పుడూ ఎవరినో వేలెత్తి చెప్పే విశ్వనాథ మోములో వర్ణాలు మారాయి. చివరికి విశ్వనాథ వారే లేచి ఆ రచనలు చేసిన నాటి పరిస్థితులు, తన అనుభవంలోని పలు అంశాలు, పాత్ర చిత్రణ తాలూకు తన అభిప్రాయాలు తెలుపవలసివచ్చిందట. ఇంత జరిగింది కాబట్టి కరీంనగర్‌లో ఏ సభ జరిగినా ఆనాటి విశ్వనాథ షష్టి పూర్తి సాహిత్యాంశానే స్థానికంగా కథలు పేని చాన్నాళ్ళు చెప్పుకునేవారు. ఈ సంఘటనకు మా నాన్నగారు వెంకటేశ్వర్లు కూడా ప్రత్యక్షసాక్ష్యం. వారప్పుడు కరీంనగర్‌లోనే ఉపాధ్యాయుడు.

ఇంత జరిగినా పి.వి.కి విశ్వనాథ పట్ల గౌరవం చెరగలేదు. అదే ‘వేయిపడగలు’ నవలను హిందీలోకి పి.వి. తర్జుమా చేశారు. దానికి ఉత్తమ అనువాద గ్రంథంగా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి ఇచ్చింది. ఇట్లా పి.వి.ని. ప్రత్యక్షంగా చూడనివారు కూడా కరీంనగర్‌లో వారి సాహిత్య ముర్మురాల రుచి చూసినవారే.

అనంతరకాలంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో పాత్రికేయ జీవితాన్ని నేను ప్రారంభించిన కారణంగా వృత్తి జీవితంలో భాగంగా అనేక పర్యాయాలు పి.వి. పాల్గొన్న కార్యక్రమాలను కవర్‌ చేసే సదవకాశం లభించింది.
పి.వి. ఏక సంథాగ్రాహి కావడం వల్ల ఒక్కసారి ఫైల్‌ చూస్తే, మొత్తం అంశాలు ఆయనకు కరతలామకమయ్యేవి. అందుచేత ఎవరి సహకారం లేకుండానే శాసనసభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు టక్కున తగిన సమాధానం చెప్పేవారు. సాధారణంగా శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కావలసిన సమాచారాన్ని అందించడానికి ఆయా శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండి, అనుబంధ ప్రశ్నలను బట్టి తాజాగా ఎప్పటికప్పుడు సమాధానాలు చీటీపై వ్రాసి పంపుతారు. కాని పి.వి. ఏ ప్రశ్నకైనా అధికారుల ప్రమేయం లేకుండా ఏ భాషలో ఏ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆ భాషలోనే సమాధానాలిచ్చి సభ్యులను కూర్చుండబెట్టేవారు. ఈ విద్య కేలం ఆయనకే ప్రత్యేకం.

పి.వి. ఏ పదవిని చేపట్టినా, దాని తీరుతెన్నులను సర్వ సమగ్రంగా అధ్యయనం చేయడం వల్ల, దాని నిర్వహణ నల్లేరుపై నడకలా సాగేది. 1962లో పాత ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ, జైళ్ళ, సమాచార శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎంతో కసరత్తు చేసి సంస్కరణలు ప్రవేశ పెట్టారు. ప్రప్రథమంగా ఆరు బయలు జైలును రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దేవాదాయశాఖను వారు నిర్వహిస్తున్న కాలంలోనే శిథిలమైపోతున్న చారిత్రక ప్రాధాన్యతగల దేవాలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ రెండు శాఖలను విలీనం చేసి ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్‌ ప్రాక్టీసును నిషేధించారు. పిదప వారు విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో ప్రాథమిక విద్యా స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి దాకా తెలుగును ప్రవేశపెట్టారు. తెలుగులో పాఠ్యపుస్తకాలను రూపొందించుటకు తెలుగు అకాడమీని నెలకొల్పారు.

రాష్ట్రంలో శిఖరాగ్రమైన ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేసిన తర్వాత ఆయన నేతృత్వంలో జరిగిన ఎన్నికలో వెనకబడిన తరగతుల, బలహీన వర్గాల వారికి పెద్దపీట వేసి, పెద్ద సంఖ్యలో శాసనసభకు వారు ఎన్నిక కావడానికి ఎంతగానో దోహదం చేశారు.కాంగ్రెసు పార్టీ చేసిన ఎన్నికల వాగ్దానాలని భూ స్థాపితం చేయకుండా, రాష్ట్రంలో భూ సంస్కరణలను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. ఈ చట్టం అమలు చేసినప్పుడు పిల్లల పేర, కుక్కల పేర, పుట్టబోయే పిల్లల పేర, మనమలు, మునిమనమల పేర తమ భూములను ఎన్నో విధాల బదలాయించి భూయజమానులు, సవాలక్ష దారులు తొక్కారు. కొందరు అన్యోన్య దంపతులు భూమి దక్కించుకునే యావతో కాగితాలకే పరిమితమైన విడాకులు తీసుకున్నారు. చివరికి స్వప్రయోజనపరులు ఉద్యమాన్ని పోషించి పి.వి. పదవికి ఎసరు పెట్టారు. స్వయంగా భూస్వామైన పి.వి. మాత్రం దాదాపు వెయ్యి ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేసిన ఆదర్శనీయుడు, నిస్వార్ధపరుడు.

ఈ విధంగా రెండు దశాబ్దాల పాటు వివిధ పదవులు తన ప్రతిభా సామర్థ్యాలతో నిర్వహించిన అనంతరం ఆయన జాతీయ కాంగ్రెసు కార్యదర్శిగా నియామకమయ్యారు. 1977లో హనుమ కొండ స్థానం నుంచి గెలుపొంది కేంద్రంలో ప్రతిపక్ష పార్టీలో కూర్చుని పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ అధ్యక్షుగా ఎన్నికై కీక బాధ్యతు చేపట్టారు. కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డ్‌ సభ్యుడు గాను వ్యవహరించారు. కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికలు, పార్టీ విధాన ముసాయిదాలు వ్రాయడంలో తనకుతానే సాటి అనిపించుకున్నాడు.

దేశంలో అత్యవసర పరిస్థితి తర్వాత ఇందిరా గాంధీ ప్రతిపక్ష నాయకురాలిగా పాత ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడానికి వచ్చారు. ఆ తరుణంలో ఆమెతోపాటు కలిసి, ప్రెస్‌పార్టీలో, అప్పుడు నేను పనిచేసిన దినపత్రిక పక్షాన రెండు, మూడు జిల్లాల్లో పర్యటించారు. అప్పుడు శ్రీమతి గాంధీ, పి.వి. ఒక కారులో, వారికి వెనకనే ఒక వ్యాన్‌లో ప్రెస్‌ పార్టీ వెళ్ళాము. ఇక్కడ శ్రీమతి గాంధీ ప్రజలనుద్దేశించి హిందీలో, ఒక్కొక్కసారి ఇంగ్లీషులో చేసిన ప్రసంగాన్ని ప్రక్కనే నిలబడి పి.వి. తెనిగించారు. అట్లా వారితో పాటు ప్రక్కప్రక్కనే ప్రెస్‌ పార్టీ అంతా కలిసి తిరుగుతూ పలు అంశాలను చర్చించుకున్న రోజు జ్ఞాపకం వచ్చినప్పుడు ఇప్పటికీ ఆ దృశ్యాలు కన్నుల్లో తిరుగుతాయి. ఇప్పుడైతే దేశ ప్రధాని స్థాయి మనిషిని, ప్రెస్‌కు సెక్యూరిటీ పేరిట ఎంత దూరంలో ఉంచుతారో అందరికీ తెలిసిందే.

ఇందిరాగాంధీ 1980లో మరో పర్యాయం ప్రధాని పీఠం అధిష్టించినప్పుడు పి.వి.ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా తీసుకున్నారు. వారు తమ మంత్రిత్వ శాఖకు న్యాయం చేస్తూ ఎన్నెన్నో దేశాలు పర్యటించి శ్లాఘనీయంగా మన విదేశీ విధానాన్ని అమలు చేశారు. వివిధ కమీషన్‌లు, ఉపసంఘాలకు అధ్యక్షులుగా వ్యవహరించి తన అపార పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 35వ సమావేశంలో పి.వి. చేసిన ప్రసంగానికి అనేక దౌత్య ప్రతినిధులు, అలీన దేశా ప్రతినిధుల ప్రశంసందుకున్నారు. మరీ ముఖ్యంగా ప్రధాని ఇందిరా గాంధీ మెప్పు పొందారు. ఆమెకు విశ్వాసపాత్రుడయ్యారు.

అంతేకాదు, ఆమె తర్వాత ప్రధాని పీఠం అలంకరించిన రాజీవ్‌గాంధీకి కూడా పి.వి. విశ్వసనీయుడయ్యాడు. ఆయన నేతృత్వంలో మానవ వనరుల మంత్రిత్వ శాఖ నూతనంగా ఏర్పాటు చేసి, దానికి ఒక స్వరూపమిచ్చారు. దేశంలో నూతన విద్యా విధానానికి పి.వియే రూపకల్పన చేశారు. అట్లాగే కొన్ని దశల్లో రక్షణ శాఖ మంత్రిగా, హోం శాఖ మంత్రిగాను తన సత్తా ఏమిటో చూపిన సంస్కరణశీలి ఆయన.

పి.వి. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్‌ రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొంటూ, సోదాహరణంగా, సుదీర్ఘంగా చేసిన ప్రసంగం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. నాలాంటి వారికి మరపురాకుండా ఉంది. ఎందుచేతనంటే తన శక్తి ఏమిటో, తనకే తెలియని హనుమంతుని పాత్ర తనకెంతో అభిమాన పాత్రమైందనీ, తన మనసుపై చెరగని ముద్ర వేసిందన్నారు.

తమ గ్రామానికి సమీపంలోని పల్లెకు చెందిన ‘మిత్ర భాగవతులు’ తమ ఊరి చావట్లో సుందరకాండ ప్రదర్శించినప్పుడు అందులోని హనుమంతుని పాత్ర, మరీ ముఖ్యంగా హనుమంతుడు లంకా దహనం చేసిన పద్ధతి తనను ఆకట్టుకున్నదన్నారు. భాగవతం ముగిసి, ఇంటికి వచ్చిన తర్వాత ప్రక్కనే గల తమ పెద్దనాయన పాకను హనుమంతుడు లాగా నిప్పు అంటించాల నే ఆలోచన వచ్చిందన్నారు. దాంతో ఆగ్గిపెట్టెను సంపాదించి, తాను వేసుకున్న దుస్తులన్నీ తొలగించి, నగ్నంగా దూడ తలుగును తోకగా ధరించి పాకకు నిప్పు తగిలించానన్నారు. నిప్పు అంటించగానే ఒక్కసారిగా పాకంతా భగ్గున మంటలు లేవగానే, తాను ఒక్కసారిగా భయకంపితుణ్ణి అయ్యానన్నారు. అది గమనించిన ఇరుగుపొరుగు జనం వచ్చి, నీళ్ళు చల్లి నిప్పు ఆర్పివేశారని వివరించారు. అయితే ఏనాడూ లేనిది ఆ ఒక్కనాడు తన వీపు విమానం మోత మోగిందన్నారు.

ఈ కారణంగాను, తాను ఆంజనేయపాత్రను ఏనాడు మరువలేనన్నారు. తన బాల్యంలో గ్రామ చావట్లో జానపద కళాకారులు ఎలాంటి టికెట్టు లేకుండా ప్రదర్శించిన భాగవత, యక్షగానాలు తనకు ఎంతో ప్రీతిపాత్రమైనవని, వాటి ద్వారా తానెంతో నేర్చుకున్నానన్నారు.

పి.వి. ప్రధాని అయ్యాక స్వరాష్ట్రంలోని హైదరాబాద్‌కు వచ్చి పాల్గొన్న మొట్టమొదటి సభ తెలుగు విశ్వవిద్యాలయం. ద్వితీయ స్నాతకోత్సవం. తెలుగు విశ్వవిద్యాలయం కాబట్టి కార్యక్రమమంతా తెలుగులోనే జరిగింది. పైగా ఈ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం తెలుగుదనం ఉట్టిపడేలాగా ఉండాలని ప్రసిద్ధ సంపాదకులు ముట్నూరి కృష్ణారావు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం వీరిరువురి తలపాగాల నమూనాలు కలిపి భిన్నమైన తలపాగ, గౌనులు పట్టుతో రూపొందించారు. అంతా వాటిని ధరించి పాల్గొనడం కన్నుల పండువుగా ఉంది. ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి ఇక్కడికి రావడం తల్లి ఒడిలోకి వచ్చిన అనుభూతిని కలిగిస్తున్నదని, సామెత చెప్పినట్టు ‘దిల్లీకి రాజైనా, తల్లికి కొడుకునే’ అని గద్గద స్వరంతో పి.వి. అన్నారు. తాను పుట్టిన గడ్డ ఈ రాష్ట్రంలోనే ఉన్నదనీ, ఈ గడ్డ మీదనే తాను ఓనమాలు దిద్దుకున్నానని, ఈ నేలమీదనే దేశసేవ చేస్తూ, తొలి అడుగు వేశానని గుర్తు చేసుకున్నారు. తన ఆప్తమిత్రులు, బంధువులు ఇక్కడే ఉన్నారనీ, ఇది భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన చోటు అన్నారు. రేపటి పౌరులైన విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శక సూత్రాలు నిర్దేశించే జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. దేశంలో ఇన్ని భాషలు ఉండడం వల్ల వైవిధ్యంతో కూడిన బోలెడు సాహిత్యం వెలువడిందన్నారు. ఒకే భాష ఉంటే మనకు ఇన్ని గ్రంథాలు, ఇంత విశిష్ట సాహిత్యం ఇందరు మహాకవులు ఉండేవారు కాదేమోనన్నారు. ఇదే విధమైన పరిణామాన్ని అభ్యుదయ వికాసాలను ప్రతి రంగానికి అనువర్తించుకోవచ్చునన్నారు.

పోతే హైదరాబాద్‌ నగరానికి నాలుగు వందల యేండ్లు నిండిన సందర్భంగా నగర జీవితం గురించి, కట్టడాల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ సుమారు యేడాదిపాటు నేను రోజూ వ్రాసిన వ్యాసాలను ‘నమస్తే హైదరాబాద్‌’గా 1996లో సంకలనం చేశాను. ప్రధానిగా అప్పట్లో హైదరాబాద్‌ పర్యటన పెట్టుకున్న పి.వి.ని నేను కోరినంతనే, ఆ పర్యటనలో భాగంగా, నా గ్రంథాన్ని తాను బస చేసిన రాజ్‌భవన్‌ అతిధి గృహంలో ఆవిష్కరించారు. రాష్ట్ర నాయకులు ప్రస్తుతం పి.వి. నరసింహారావు శత జయంతి సంఘం అధ్యక్షులు కె. కేశవరావు, అప్పుడు మాజీ మంత్రులైన కె. రోశయ్య, జె. గీతారెడ్డి, పార్లమెంటు సభ్యుడు పి.వి. రాజేశ్వరరావు ప్రభృతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పి.వి.కి శాలువాకప్పి సత్కరించాను. అనంతరం 250 పేజీకు విస్తరించిన నా గ్రంథాన్ని ప్రతి పేజీని తిరిగేసి చూస్తూ ఎంతో ఆసక్తి ప్రదర్శించారు. ‘బాగుందయ్యా!’ అంటూ గ్రంథాన్ని తన పిఎను పిలిచి ఇచ్చారు. ప్రధానిగా క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలోనే మరొకసారి ఆటవిడుపులా హైదరాబాద్‌కు వచ్చి ఒక అవధాన కార్యక్రమంలో పి.వి. సరదాగా పాల్గొన్నారు. ప్రపంచ వాఙ్మయచరిత్రలో మరో భాషలో లేని అవధాన ప్రక్రియను ఒక శాస్త్రంగా, ఒక కళగా అభివృద్ధి చేసి, అది అంతరించిపోకుండా చూచి, ముందు తరాలకు అందించవలసిన అవసరం ఎంతగానో ఉందని పి.వి. నొక్కి చెప్పారు. ఇంకా ఆయన ప్రసంగం కొనసాగిస్తూ, ప్రధానిగా తన పనితీరు ‘అవ ధానం’ చేసినట్టే ఉందన్నారు. అవధానికి ఒకరు సమస్య ఇస్తే, ఇంకొకరు అప్రస్తుత ప్రసంగంలోకి లాగుతారని, మరొకరు గంటలు కొట్టి దృష్టి మళ్ళిస్తారన్నారు. వేరొకరు నిషేధాక్షరి ఇస్తారు.

ఇట్లాగే పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు తమను అడ్డ దిడ్డంగా అడిగే ప్రశ్నలకు తెలివితేటలు ఉపయోగించి, చమత్కారంగా సమాధానాలు చెప్పవలసి ఉంటుందన్నారు. మరోవంక సభ వెలుపల ఎటుచూసినా, నిద్రావస్థలోను తన ముందు ప్రశ్నలే ప్రశ్నలు కనపడుతున్నాయి. ప్రతి మనిషి ఒక ప్రశ్నగానే తోస్తున్నది. తన పరిస్థితి గడ్డివాములో సూది పడితే వెదికినట్టున్నది. కొత్తగా తాను అవధానికి ఒక ప్రశ్న వేయలేను. తనను వేధిస్తున్న ప్రశ్నల సమూహం నుంచి ఏదో ఒక ప్రశ్న వేస్తే, తక్కిన ప్రశ్నలకు అన్యాయం చేసినవాణ్ణి అవుతాను కాబట్టి, ఈ క్షణంలో, అవధాని మనస్థితిని అనుసరించి, అన్నింటి కన్నా ఏది పెద్ద ప్రశ్నగా స్ఫురిస్తుందో దానికి జవాబు చెప్పుకోమని కోరారు. అప్పుడు అవధాని నాగఫణి శర్మ ‘సకల భారతమును శాసింపగల రేడు / ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసే / ప్రశ్న ఏది నాకు ప్రశ్నా సమూహాన / ప్రశ్న మిగిలె నాకు ప్రశ్నగాను’ అని ఆశువుగా చెప్పారు. ఆ తర్వాత పి.వి. ప్రతిభా సామర్థ్యాలను వర్ణిస్తూ మరో పద్యంలో మౌన ప్రశ్నకు స్పందించారు.

పి.వి. ప్రధానిగా ఉన్న తరుణంలో ఒక రకంగా, ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత మరో రకంగా ఆయన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ కొందరు రాజకీయ కుట్రలు పన్ని ఆయనకు ప్రశాంతత అన్నది లేకుండా చేశారు. అయినా ఆయన దేశ రాజధాని దిల్లీ నగరాన్ని విడిచిపెట్టకుండా, అక్కడే పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తూ, పుస్తకాల రచిస్తూ మిగిలిన కాలాన్ని సద్వినియోగం చేశారు.

సామాజిక, సాహిత్య, సాంస్కృతిక సేవా రంగాల్లో అసమాన కృషి చేసినందుకు అప్పాజోస్యుల – విష్ణుభొట్ల ఫౌండేషన్‌ 2002 సంవత్సరంలో పి.వి.కి ప్రతిభామూర్తి పురస్కారం ప్రధానం చేసింది. ఈ సందర్భంగా వెలువరించిన వారి సన్మానోత్సవ బృహత్‌ సంచిక ‘ప్రతిభా వైజయంతి 2002’ ని ఎడిట్‌ చేసే సదవకాశం నాకు లభించింది. 1/4 డెమ్మి సైజ్‌లో 920 పేజీలకు విస్తరించిన ఈ విశేష సంచికను దాదాపు రెండు మాసాల్లో రూపొందించడానికి ఎంతో చురుకుగా పని చేయవలసి వచ్చింది. ప్రముఖ రచయితలు, మిత్రులు, యంఎల్‌ నరసింహారావు, దేవులపల్లి ప్రభాకరరావుతో కలసి రాత్రింబవళ్ళు దీనికోసం పనిచేశాను. అయితే కనీసం ఈ సంచికలో ఏమున్నాయో కూడా తెలియని ఒకరిద్దరి పేర్లను మా ముగ్గురితో పాటు సంపాదకవర్గంలో చివరి నిమిషంలో అంటే ముద్రణకు ఇచ్చే ముందు చేర్చారు. అంతే కాకుండా ఎడిటోరియల్‌ బోర్డును రెండో పేజీలో కన్పించీ కన్పించని చిన్న పాయింట్‌లో వేసి, ఎనిమిదో పేజీలో మధ్యలో కొట్టొచ్చినట్టుగా ఎడిటరేమోననే అను మానం కలిగేటట్టుగా, పెద్ద పాయింట్‌లో బోల్డ్‌గా సంపాదకవర్గంతో సంబంధంలేని వ్యక్తి పేరును సంచాలకుడిగా వేశారు.

నిజానికి పి.వి. వివిధ సందర్భాలలో చేసిన ఇంగ్లీషు ప్రసంగాలను ఇంగ్లీషులో, దాదాపు రెండు వందల పేజీలు వేరుగా ప్రచురిస్తే బాగుండేది. ప్రత్యేక సంచిక ‘హాండీ’గా కూడా ఉండేది. కాని సంబంధంలేని వ్యక్తి ఒత్తిడి వల్ల ఈ సంచికలోనే చేర్చవలసి వచ్చింది. ఈ సంచిక రూపకల్పన చురుకుగా జరుగుతున్నప్పటికీ సరిగా జరగడం లేదని, నిజానికి ఏమీ జరగడం లేదని ఒకరిద్దరు పెద్దమనుషులు న్యూ దిల్లీలో ఉంటున్న పి.వి.కి ఫిర్యాదు చేయడంతో ఆయన నిజానిజాలు తెలుసుకోవడానికి హైదరాబాద్‌ ప్రయాణమై వచ్చారు. ఫలానా రోజున ఫలానా సమయంలో రాజ్‌భవన్‌ అతిధి గృహంలో పి.వి. మమ్ములను కలిసి సంచిక రూపకల్పన ఎలా వుందో, ఎంత పని జరిగిందో చూస్తానన్నారని వారి కార్యదర్శి మాకు కబురు చేశారు.

అందుకు మేము పూర్తి సరంజామాతో సిద్ధమై రాజ్‌భవన్‌కు వెళ్ళాము. పది పదిహేను నిమిషాల సమయమిచ్చిన పి.వి. గంటకు పైగా మాతో ముచ్చటిస్తూ గడపడం, కలుపుగోలుగా, ఆత్మీయంగా ప్రోత్సాహజనకంగా వ్యవహరించడం ఏనాటికీ మరువలేనిది. ముఖ్యంగా ఈ సంచిక చివరలో ఎనిమిదో విభాగంగా మేము పొందుపరచిన డెబ్బయి పేజీల ‘పి.వి. చిత్రాలు’ ఆయనను విశేషంగా ఆకర్షించింది. పి.వి. తల్లి తండ్రులు, ఆయన సతీమణితో, బంధువులు, బ్యా మిత్రులతో పి.వి. కలిసి వున్న ఛాయా చిత్రాలను విడవకుండా, పదే పదే చూస్తూ ఇన్ని చిత్రాలు మీరెలా సేకరించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన దగ్గర కూడా ఆ చిత్రాలు లేవన్నారు. విదేశాలకు వెళ్ళినప్పటి చిత్రాలు తన వద్ద దిల్లీలో ఉన్నాయనీ, వాటిని పంపుతాను ఇందులో చేర్చమని చెప్పి, దిల్లీ వెళ్ళగానే పంపించారు.

సిద్ధమైన వ్యాసాలను, మేము సేకరించిన తన ‘రామవ్వ’కథను, ప్రూఫులను చూసి ముచ్చటపడ్డారు. ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖుల నుంచి అందవలసిన వ్యాసాల గురించి చెప్పాము. సంచికను ఏఏ విభాగాలుగా ఎలా రూపొందించామో ఆయనకు చూపడంతో ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రముఖ చిత్రకారుడు చంద్రతో ముఖ చిత్రం వర్ణ స్ఫూర్తితోనే కాకుండా వివిధ విభాగాలకు అర్ధవంతంగా పి.వి. రేఖా చిత్రాలను గీయించినవి చూపాము. ఇట్లా మాతో గంట సేపూ సంతోషంగా నిర్విరామంగా మాట్లాడుతూ, నవ్వుతూ పి.వి. గడిపారు. మొత్తం మీద పి.వి. పై పరిశోధన చేసే వారికి బృహత్‌ సంచిక ‘తంగేడు జున్ను’లా రూపొందించాము. పి.వి.కి ప్రతిభా పురస్కారం ప్రదానం చేసిన సందర్భంగా సన్మానోత్సవ బృహత్‌ సంచిక ‘ప్రతిభా వైజయంతి`2002’ ఎడిట్‌ చేసినందుకు మాకు పి.వి. సత్కారం చేయడం ఒక మధురానుభూతి.

ఇట్లా తన జీవిత కాలమంతా దేశ సేవ లేదా సాహితీ, సాంస్కృతిక సేవలో నిరంతరం పాటుపడిన కవి, రచయిత, కర్మయోగి పి.వి. తన కడపటి రోజులు ఎంతో భారంగా, బాధగా దిల్లీలో గడుపుతూ తన 83వ యేట ఎయిమ్స్‌లో కాలధర్మం చెందారు. అయితే దిల్లీలోనే పూర్వ ప్రధాన మంత్రుల వలె పి.వి. అంత్యక్రియలు నిర్వహించి స్మృతి నిర్మాణం చేయవలసి ఉండగా, కాంగ్రెసు అధిష్టానం కక్షకట్టి ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్‌కు తరలించడం ఒక విషాదం, దుర్మార్గం.

వాస్తవానికి ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచి, ఇతర అనేక పీడ నుంచి భారత దేశాన్ని సంరక్షించి సభ్య ప్రపంచంలో తలెత్తుకునేలాగా నిలిపినందుకు ‘చంద్రునికో నూలుపోగు’లాగ కనీసం ‘భారత రత్న’ అవార్డునైనా ప్రదానం చేసి పి.వి. రుణం తీర్చుకొని గౌరవించవలసింది.

ఆలస్యం అయినప్పటికీ పి.వి. శతజయంతిని పురస్కరించుకుని కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కేవలం రాష్ట్రం లో, దేశంలోనే కాకుండా విదేశాలలో సైతం, మన తెలంగాణ తేజం పి.వి. శత జయంత్యుత్సవాలు యేడాది పొడవునా నిర్వహించడం వారే చెప్పినట్టు తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి ప్రతీక, పతాక. ఈ సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రే రాష్ట్ర శాసన సభలో పూర్వ ప్రధాని పి.వి. నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ పురస్కారం ప్రకటించాలని ప్రతిపాదించడం, ఆ తీర్మానాన్ని ఉభయ శాసన సభలు ఏకగ్రీవంగా ఆమోదించడం భారతీయుడైన ప్రతి వ్యక్తి సంతోషించే అంశం. ఈ తీర్మానం పై పార్లమెంటు అనుకూలంగా ప్రతిస్పందించగలదని, దేశభక్తి గల పౌరులెవరైనా విశ్వసిస్తారు. తీర్మానంలో ఆశించిన మేరకు పి.వి.కి ‘‘భారత రత్న’’తో పాటుగా హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయానికి పి.వి. నరసింహారావు పేరు పెడతారని, పార్లమెంట్‌లో పి.వి. చిత్రపటాన్ని, దాని ప్రాంగణంలో పి.వి. విగ్రహాన్ని ప్రతిష్టించి ముందు తరాలకు వారి స్ఫూర్తిని అందించాని ఆశించడం ఏమాత్రం అత్యాశకాదు. దేశ చరిత్రలో ఆయన చేసిన సేవలను ఏ శక్తి చెరిపివేయజాలదు. నిజంగా, నిస్సందేహంగా నేనెరిగిన పి.వి. మన ఠీవి – చిరస్మరణీయుడు.