పి.వి. ఉద్యమ గురువు కె.వి
By: డా. వద్దిరాజు వెంకట రామారావు
నిజాం నియంతృత్వాన్ని ఎదిరించి తెలంగాణ విమోచనకు కృషి చేసి, స్వాతంత్య్ర సమర యోధునిగా పోరాడి, అగ్రశ్రేణి నాయకునిగా రాణించి స్వామీ రామానంద తీర్థ ప్రశంసలకు పాత్రులైన వారిలో కె.వి.ఒకరు. ఆయన కేవలం సమరశీలియే కాదు, ఉత్తమ కార్య నిర్వహణా దురంధరుడు. ప్రతిభావంతుడైన న్యాయవాది. ఒక దశలో మాజీ ప్రధాని పి.వి. నరసింహరావు సైతం వారి నాయకత్వంలో పని చేశారంటే వారి గొప్పతనాన్ని ఊహించుకోవచ్చు. అంతేకాదు, 1972లో తెలంగాణాకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ముల్కీ రూల్ తీర్పుకు కె.వి. కృషి, దీర్ఘకాలిక న్యాయ పోరాటమే కారణమన్నది చారిత్రక సత్యం. అలాంటి విశిష్టతను కలిగివుండి కూడా చరిత్రకెక్కని చరితార్థుడు కె.వి.

కె.వి. పూర్తి పేరు కల్వకోట వేంకట నరసింగరావు. 1953-83 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రఖ్యాత హైకోర్టు న్యాయవాదిగా పేరు గాంచిన కె.వి.నరసింగ రావును ఆ రోజుల్లో అందరూ ‘‘కె.వీ.సాబ్’’ అని గౌరవంతో పిలిచేవారు.
కె.వి.నర్సింగ రావు 1923 జూన్ 17న హుజూరాబాద్ తాలూక కేశవపట్నం సమీపాన గల ఎఖలాస్ పురం గ్రామంలో మాతా మహుల ఇంటిలో కల్వకోట వెంకటరామారావు, భార్గవీ దేవి దంపతులకు జ్యేష్ట పుత్రుడిగా జన్మించాడు. వీరిది కరీంనగర్ జిల్లా లో రాష్ట్రంలోనే శిల్పకళకు ప్రసిద్ధి గాంచిన రామడుగు గ్రామం. కె.వి. నరసింగరావు తాత ‘పట్నం’ నరసింగరావుగా ప్రసిద్ధులు. ఆ రోజుల్లోనే (1895-1910) ఆయన పట్నం (హైదరాబాద్) లో ‘లా’ చదివి వకీలుగా పేరుగాంచాడు. కె.వి. తండ్రి వెంకటరామారావు కూడా ‘వకాలత్’లో సర్టిఫికేట్ కోర్సు చదివాడు. అయితే తండ్రి వలె ప్రఖ్యాత న్యాయవాది కావాలని ఆయన తన కుమారుడికి వెంకట నరసింగరావు అనిపేరు పెట్టుకున్నారు.
భూస్వామ్య కుటుంబానికి చెందిన కె.వి. తమ్ముళ్ళు కిషన్ రావు, సుధాకర్ రావు, హేంచందర్ రావు, సురేశ్ చందర్ రావు కాగా సుశీల, శశికళ, వినోదిని, సరస్వతి వీరి సోదరీ మణులు. వీరి పెద్ద తమ్ముడైన శ్రీకిషన్ రావు తిర్మలాపురం గ్రామ వాసి వొద్దిరాజు రాజేశ్వర్ రావుకి దత్తత వెళ్ళారు. కె.సుధాకర్ రావు రామడుగులోనే వ్యవసాయం చేశారు. తదుపరి తమ్ములలో డాక్టర్ హేంచందర్ వైద్యునిగా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. చివరి వాడైన సురేశ్ చందర్ రావు జిల్లా అటవీ శాఖాధికారిగా పదవీ విరమణ చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సాయి భక్తులైన వీరు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘం సేవా కార్యక్రమాలతో పాటు వివాహ వేదికను నిర్వహిస్తున్నారు.
కె.వి.నరసింగరావు ప్రాథమిక విద్యాభ్యాసం రామడుగులో, హైస్కూలు చదువు కరీంనగర్‌లో, ఇంటర్ విద్య హన్మకొండలో జరిగింది. ఉస్మానియా యూనివర్సిటిలో బి.ఏ. ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. తదుపరి అదే యూనివర్సిటి ‘బి’ హాస్టల్‌లో వుంటూ ‘లా’ చదివారు. ఆ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీకి నవాబ్ అలి యార్‌జంగ్ వైస్ ఛాన్సలర్‌గా ఉన్నాడు.
కె.వి. చదువులో చురుకుగా వుంటూనే విద్యార్థి సంఘానికి అధ్యక్షునిగా ఉండి పలు విద్యా సమస్యల పై తీవ్రంగా పోరాడేవాడు. ఆయనకు తోడుగా జువ్వాడి గౌతమరావు, వేముగంటి రాజేశ్వరరావు, బి.మురళీ ధర్ రావు, ఏ.కిషన్ రెడ్డి (మాజీ. ఎం.ఎల్.ఏ. ములక నూర్). మానుకోటకు చెందిన కేశిరాజు వెంకటరామారావు మొదలగు వారు ఉండేవారు.
కె.వి. 1946-48 మధ్య కాలంలో విద్యార్థిగా ఉద్య మాలు నిర్వహించడంతో నిజాం నవాబు ఆగ్రహించి అరెస్టుకు ఆదేశాలు జారీచేశాడు. కానీ కె.వి.ముస్లిం వేషం ధరించి హాస్టల్లో ఉంటూ పోలీసుల దృష్టి మరలించాడు. కె.వి.చురుకైన విద్యార్థియే కాకుండా ఉర్దూ భాషలో నిష్ణాతుడు కావడంతో వి.సి. అభిమానించేవాడు. ముస్లిం పర్సనల్ లా ‘‘షరియత్’’, ‘సివిల్ లా’ లో కె.వి.కి అపార పరిజ్ఞానం ఉండేది.
న్యాయశాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించిన కె.వి. 1948లో స్వామిజి పిలుపు మేరకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రేసులో చేరాడు. అదే సమయంలో పి.వి.సైతం న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పి కె.వి.తో చేరాడు. ఒకవైపు నిజాం పోలీసులు, మరోవైపు రజాకార్లు, ఇంకోవైపు భూస్వాముల దౌర్జన్యాలతో తెలంగాణ ప్రాంతంలో సామాన్య ప్రజలు దుర్భర జీవితం గడిపేవారు. రజాకార్ల దాడులతో నాటి ప్రజలు వణికిపోయారు. అలాంటి తరుణంలో కె.వి. అనుచరులతో కలసి రజాకార్లను ప్రతిఘటిస్తూ మారువేషాలలో తిరుగుతూ ప్రజలకు ధైర్యం చెప్పారు. కె.వి.పై అరెస్ట్ వారెంట్ జారీఅయింది. రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ కె.వి.ని అంతమొందించాలని ప్రణాళిక వేయగా కె.వి. తండ్రి భయపడి ఫోటోలు కనబడకుండా భూమిలో పాతి పెట్టారట. కె.వి. గడ్డం మీసం పెంచి టోపీతో సంచరించినా ఆయన పర్సనాలిటి తెలిసిపోతుందని భయపడేవారు.
నిజాం వ్యతిరేక పోరాటానికి తెలంగాణలో అనువైన వాతావరణం లేకపోవడంతో, కె.వి.నర్సింగరావు, గోవిందరావు షరాఫ్, డి.జి. బిందు, డా.జి .ఎస్. మెల్కోటె, పరాంజపె మొదలగు ముఖ్యనేతలకు ఉత్తర తెలంగాణా సరిహద్దులో వున్న ‘చాందా’ స్థావరంగా క్యాంపులు నిర్వహించి నిజాంకు వ్యతిరేక పోరాటంలో ప్రజలకు సాయుధాల వాడకంలో శిక్షణ ఇవ్వాల్సిందిగా స్వామీజి ఆదేశించాడు.
స్వామీజి ఆజ్ఞను శిరసావహించిన కె.వి. చాందా వెళ్ళి పోరాటానికి నాయకత్వం వహించగా ఆయన దళంలో పి.వి. సభ్యునిగా పనిచేశాడు. ఆ సమయంలో భారత సైన్యానికి చెందిన మేజర్ గహూన్ సింగ్ చాందాకు విచ్చేసి కె.వి. నాయకత్వంలోని దళ సభ్యులైనటువంటి జి.శ్రీరాములు (మంథని), మురళీధర్ (సిరిసిల్ల) గౌతంరావు, జె.ఆర్ గోపాల్, మహిష్కర్ (నాందేడ్) వైశంపాయన్ (రాయచూర్) సంజీవరావు (ఇరుకుల్ల) శంకరయ్య (పెద్దపెల్లి) పి.వి.నరసింహారావు (హుజురాబాద్), సి.హెచ్. రాజేశ్వర్రావు (సిరిసిల్ల) మొదలగు వారికి. తుపాకి వాడకంలో, గెరిల్లా. దాడులలో శిక్షణ ఇచ్చాడు. కె.వి. వ్యూహాలతో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో రజాకార్ల దాడులు విఫలమయ్యేవి. 1948 మార్చిలో విప్లవయోధుడు అన్నభేరి ప్రభాకర రావు (1910-48) రజాకార్ల తూటాలకు ఆహుతి కావడంతో కె.వి. పోరాటాన్ని మరింత తీవ్రం చేశారు.
ఓసారి వరంగల్ జిల్లా రాయికల్ పోలిస్ స్టేషన్ పై జి.ఎస్. రాములు, మురళీధర్ దాడి చేశారు. అప్పుడు రజాకార్లు వారిని వెంటాడి కాల్పులు జరుపగా వారిద్దరు గాయపడినప్పటికీ ఎలాగో తప్పించుకొని గోదావరి దాటి చాందా చేరారు. కె.వి. వారిద్దరికి క్యాంపులోనే చికిత్స చేయించి తానే స్వయంగా ఉద్యమించిన తీరును, జమలాపురం కేశవరావు ఎంతో మెచ్చుకొన్నాడు. తదుపరి స్వామీజి కే.వి.ని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు స్టేటు కాంగ్రేసు సెక్రటరిగా నియమించాడు.
1948 సెప్టెంబర్ 17 వ తేదీన నిజాం స్టేటు భారత్ లో విలీనం అయ్యాక కే.వి. కాంగ్రేసు పార్టీలో కొంత కాలం ప్రముఖ పాత్రనే పోషించారు. 1952 లో పి.వి. నరసింహారావును హుజూరాబాద్ ఇన్‌చార్జ్‌గా నియమించి పలసాని నర్సింగరావు ను తప్పించినపుడు పార్టీ నుంచి విమర్శలెదుర్కొన్నాడు. కాని పి.వి. సామర్థ్యం గురించి కె.వి. నాటి హైకమాండ్‌కు వివరించి అసమ్మతీయుల ఆరోపణలు నిరాధారమని రుజువుచేశాడు.
1952లో కె.వి. కాంగ్రేసును వీడి ‘‘ప్రజా సోషలిస్టు పార్టీలో’’ చేరి, కరీంనగర్ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా పోటీ చేశారు. కె.వి. గెలుపు కోసం జాతీయ నాయకులైన అశోక్ మెహతా, రాం మనోహర్ లోహియా, బద్రీ విశాల్‌పిట్టి, మహదేవ్ సింగ్ వంటి జాతీయ స్థాయి నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు. కానీ. పి.డి.ఎఫ్.అభ్యర్థి సి.హెచ్.వెంకట్రావు చేతిలో కె.వి. ఘోరంగా ఓడిపోయాడు. నిజాం వ్యతిరేక పోరాటంలో ‘‘తన వెంట ఉన్న వారు ప్రజలు’’ ఓటు వేస్తారనుకొన్న కె.వి.కి ‘‘అసలు రాజకీయాలు’’ అర్థ మయ్యాయి. దాంతో రాజకీయాలకు స్వస్తి చెప్పి కరీంనగర్‌లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించి అనతి కాలంలోనే మంచి వకీలుగా పేరు తెచ్చుకున్నాడు. పి.వి. 1957 ఎన్నికల్లో గెలిచి కె.వి.ని కలిసి. ‘‘కాంగ్రేసు లోనే ఉంటే నీవూ గెలిచేవాడివేమో’’ అని అన్నాడు. కె.వి. మాత్రం పశ్చాత్తాప పడలేదు.. ఆయన సాలోచనగా.. ‘‘రాజకీయం ఆరంభం బాగానే ఉంటుంది. అంతం మాత్రమే అధ్వాన్నం’’ అని అన్నాడు. ‘‘ఆయన ఏ ఉద్దేశంతో అన్నప్పటికి పి.వి. జీవితానికి తుది దశలో మాత్రం ఆయన మాటలు సరిగానే వర్తించడం గమనార్హం.
కె.వి. 1968లో కరీంనగర్ వీడి హైకోర్టు న్యాయవాదిగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పి.వి. 1971లో ముఖ్యమంత్రి అయ్యాడు. తన రెండవ కూతురు డాక్టర్ సరస్వతిని కె.వి. పెద్ద కొడుకు డా.శరత్ చంద్ర కిచ్చి వివాహం జరిపించి బంధుత్వం కలుపుకున్నారు
1971-72 మధ్య కాలంలో కె.వి. ఆంధ్రప్రదేశ్ రెండవ ప్రభుత్వ ప్లీడరుగా పనిచేశాడు. తెలంగాణా విషయంలో కె.వీ. ప్రధాన ఘన విజయం ముల్కీ కేసు… ఈ ముల్కీ సమస్య నిజానికి 1952 లోనే తలెత్తింది. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగాలలో తమిళులు, ఆంధ్రులే ఎక్కువ ఉండటంతో ‘‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’’ అని వరంగల్‌లో తొలుత టీచర్లు ఉద్యమించారు. అది తీవ్రమై హైదరాబాద్ సిటి కళాశాల వద్ద నలుగురిని బలిగొన్నది. 1956 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తదుపరి తెలంగాణా వారికి ఉద్యోగ నియకాలలో న్యాయం జరగలేదు. చివరికి ముల్కీ నిబంధనల విషయంలో 1969 లో హైకోర్టు ధర్మాసనం వ్యతిరేకంగా తీర్పునిచ్చినపుడు తెలంగాణా ఉద్యమం ప్రజ్వరిల్లింది. ఈ ముల్కీ రూల్స్ విషయంలో తొలుత 1969 ఫిబ్రవరి 3వ తేదీన హై కోర్టు జస్టిస్ చెన్నప్పరెడ్డి ‘చెల్లవని’ తీర్పునిస్తే అదే నెల 20వ తేదీన చీఫ్ జస్టిస్ పింగళి జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని బెంచి ‘చెల్లుతాయని’ తీర్పునిచ్చింది. మళ్ళీ 1969 మార్చి 28వ తేదీన హై కోర్టు బెంచి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హిదాయతుల్లా నాయకత్వాన గల 5గురు జడ్జిల బెంచ్ కొట్టేసింది. అలా కేవలం రెండు నెలల కాలవ్యవధిలోనే మూడు రకాల తీర్పులు వెలువడగానే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మరింత తీవ్రమైనది. ఈ అంశాన్ని రాజ్యాంగ పరంగా వివిధ కోణాలలో లోతుగా అధ్యయనం చేసి, 1972 ఫిబ్రవరి లో కె.వి. హైకోర్టు నుంచి అప్పీలేట్ అనుమతి తీసుకొని సుప్రీం కోర్టులో మూడు పిటీషన్లు వేశారు..సివిల్ అప్పిలేట్ నెం.993/1972 గల కేసును సుప్రింకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ, ఆధ్వర్యాన ఏర్పాటైన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం చేపట్టింది.
The Directorate of Industries and commerce Govt.of A.P. v/s. Venkatreddy others ఈ కేసు పిటీషన్లో కన్పిస్తుంది. కె.వి. నర్సింగరావు, మరో ఇద్దరు న్యాయవాదులతో (ఎం.సి.చాగ్లా, పి.పరమేశ్వర్ రావు) కలిసి దాదాపు 8 నెలలు వాదనలు వినిపించగా, ధర్మాంగాసనం 1972 అక్టోబర్ 3న ‘‘ముల్కీ రూల్స్ కొనసాగుతాయ’’నే చరిత్రాత్మకమైన తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును పి.వి. నరసింహారావు స్వాగతించారు. అయితే ఈ ముల్కీ వివాదం ‘‘జైఆంధ్ర’’ ఉద్యమానికి దారి తీసి, చివరికి పి.వి.ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించింది, కానీ తెలంగాణా అస్తిత్వాన్ని మాత్రం కాపాడగలిగింది.
కె.వి.ది గంభీర స్వభావం. ముక్కు సూటిగా వెళ్ళేవారు. స్వాభిమాన మెక్కువ! అది చూసేవారికి ‘అహంకారం’గా కనిపించేది. డొంక తిరుగుడు, సుదీర్ఘ సంభాషణ ఇష్టం వుండేది కాదు. జవాబు సూటిగా, స్పష్టంగా లేకుంటే విసుగుకొనేవారు. సందర్భోచితంగా సరైన భాషలో మాట్లాడాలనేవారు. ముఖ్యంగా తనతో ఎవరైన అతి తెలివిని ప్రదర్శిస్తూ వచ్చీ రానీ ఇంగ్లీషులో మాట్లాడితే ఒక్కోసారి విసుక్కొనేవారు. దాంతో ఆయనతో మాట్లాడడానికి ప్రముఖులు సైతం జంకేవారు. ఆయన ఎక్కువగా జె.చొక్కారావు, టి. హయగ్రీ వాచారి, జె.రమాపతిరావు ప్రభృతులతో సంబంధాలు కొనసాగించారు.
కె.వి. వాదనా పటిమను నాటి ఛీఫ్ జస్టిస్ గోపాల రావు ఎక్బోటే ప్రశంసించారు. ఒక దశలో ఆయనకు జడ్జి అయ్యే అవకాశాలు వచ్చినప్పటికీ న్యాయవాద వృత్తి వైపే మొగ్గు చూపాడు. ఆయనకు ‘లా’ అంటే ఎంతో ఇష్టం ఉండేది. తన బంధు మిత్రుల పిల్లలందరితో లా చదవాలని చెప్పేవారు.’’ “one must know the law of land. Ignorance of law is inexcusable” అని లా ఆవశ్యకత గురించి ఉటంకించేవారు.
పి.వి. భూ సంస్కరణల చట్టాన్ని సవాలు చేస్తు హైకోర్టులో చాలా పిటీషన్ లు దాఖలయినపుడు సైతం కె.వి. ప్రభుత్వానికి న్యాయ సలహాలు అందించారు. చాలా మంది భూస్వాములు కె.వి. కడకు వచ్చి తమ భూములు కోల్పోకుండా కాపాడాలని కోరినపుడు ఆయన సున్నితంగా తిరస్కరించాడు. కారణం మౌలికంగా ఆయన సోషలిస్ట్ కావడమే!
పి.వి. వలె కే.వి. సైతం కళా ప్రియుడు. సంగీతమంటే ఎక్కువ ఇష్టపడేవాడు. ద్వారం వెంకటస్వామి వైలెన్ వాద్యాన్ని అమితంగా ఇష్టపడేవారు. ఆయన వైలెన్ వాద్యాన్ని కొన్నాళ్ళు శ్రద్ధగా నేర్చుకొన్నారు. సంగీతంలో రాగాలను గుర్తుపట్టి చెప్పేవారు. తెలంగాణాకు చెందిన కర్నాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు పీతాంబరాచార్య, చౌటి భాస్కర్, పూసర్ల మనోరమ మొదలగు ప్రముఖులతో సంగీత కచేరీలు నిర్వహించేవారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ కూడా మిత్రులే. కరీంనగర్‌లో సువిఖ్యాతులైన హిందుస్థానీ సంగీత విద్వాంసుడు పండిట్. పి. నారాయణరావుతో మంచి స్నేహం వుండేది.
కె.వి.ది స్ఫురద్రూపం. ఆయన ఆజానుబాహువు. పసిడి ఛాయతో మెరిసేవారు. ఆయనకు కరీంనగర్ జిల్లాలో పలుకుబడి వుండేది. ఎపుడైన రామడుగుకు వచ్చినపుడు, ఆయనను చూడ్డానికే చాలా మంది జనాలు వచ్చేవారు! కొంతమంది న్యాయ సలహాలకోసం వచ్చేవారు. డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా వుండేవారు. ఆచీ తూచీ ఖర్చు చేసేవారు. ఆయనకు రామడుగు గ్రామమంటే ఎంతో ప్రేమ వుండేది. రామడుగులో పటిష్టమైన రాతి కోట ఆవరణలో ఉన్నత పాఠశాల స్థాపనకు కృషిచేశారు. 1955లో నాటి జిల్లా కలెక్టర్ ఖమురొద్దీన్ (ఐ.ఎ.యస్) చేత శంఖుస్థాపన చేయించారు. కేవలం సంవత్సర కాలవ్యవధిలో 1956 ఎప్రిల్ 25 వతేదీన పాఠశాల భవన ప్రారంభోత్సవానికి నాటి ముఖ్యమంత్రి డాక్టర్. బూరుగుల రామకృష్ణారావుని ఆహ్వానించారు. వారిని ఊరి పొలిమేరల నుండి 2 కి.మీ. మేర బ్యాండు మేళాలతో ఊరేగింపుగా తీసుకొనివచ్చి, వారి చేతుల మీదుగా జరిపించారు. నాటి కార్యక్రమానికి పి.వి, కూడా హాజరయ్యారు. ఆ శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం తాలూకు శిలాఫలకాలు నేటికీ సజీవ సాక్ష్యాలుగా స్కూలు ఆవరణలో ఉన్నవి. (ఈ వ్యాసం కోసం ఆ ఫోటోలను కోరగానే పంపించిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌కి కృతజ్ఞతలు).

రామడుగు గ్రామానికి ముందొక వాగు చిన్నపాటి నది వలె వున్నది.. వర్షాకాలంలో ఆ వాగు ఉధృతంగా ప్రవహించడం వలన కరీంనగర్‌కు రాక పోకలు స్థంభించేవి. 1968 లో కె.వి. పరోక్ష కృషి వలనే వాగుపై బ్రిడ్జి వేశారు. 1969 లో ఆయన కారు ప్రమాదానికి గురయి ఏడాది పాటు కాలి ఫ్రాక్చర్ తో బాధపడి కోలుకున్నారు.
కె.వి.రాజకీయాల లోంచి వైదొలగి నప్పటికీ కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం శ్రద్ధ తీసుకొన్నారు. కరీంనగర్‌లో డిగ్రీ కళాశాల స్థాపన కోసం కె.వి, పి.వి., వై. హనుమంత రావు, సిహెచ్. రాజేశ్వరరావులు రాజకీయ విభేదాలు ప్రక్కన బెట్టి, కలిసి కట్టుగా కృషి చేశారు. తొలుత ప్రజల నుండి విరాళాలు సేకరించాలని సంకల్పించింది కె.వి. నర్సింగరావేనని సిహెచ్. రాజేశ్వర రావు పేర్కొన్నారు. (ప్రతిభా మూర్తి పి.వి. ప్రత్యేక సంచిక 2020 అజోవిభో. పేజి35) రాష్ట్రంలోని ప్రముఖులు తరచు కె.వి.గారింటికి వచ్చిపోతుండేవారు.
భారత ప్రభుత్వం 1984లో కర్నాటక, మహారాష్ట్ర తెలంగాణా ప్రాంతంలోగల స్వాతంత్య్ర సమర యోధులకు కేంద్ర ప్రభుత్వ పింఛను అందించడం కోసం కమిటిని వేస్తూ కె.వి.నర్సింగరావుని గోవిందరావు షరాఫ్, కోదాటి నారాయణరావులతో పాటు స్క్రీనింగ్ కమిటి సభ్యునిగా నియమించింది. అప్పుడు వారి సిఫార్సు వల్ల ఎందరో మరుగుపడిన స్వాతంత్య్ర సమర యోధులు లబ్ది పొందారు.
1986లో భార్య, సరోజిని దేవి మృతి కె.వి. నరసింగరావుని క్రుంగదీసింది. ఆయన మొదటి నుంచి తన ఆరోగ్యం గురించి ఆందోళన పడేవారు. పాతతరానికి చెందిన డా.పార్థ సారథి మొదలైన వైద్యులను సంప్రదించేవారు. ఏదైనా వ్యాధి వస్తుందేమోననే అనుమానం ఉండేది. తరచు డాక్టర్లకు ఫోన్ చేసి చెకప్ చేయించుకొనేవాడు. ఆ అలవాటు ఒక మానసిక రుగ్మతగా పర్యవసించింది. అలా మధనపడుతూనే గొంతు, ఉదర సంబంధిత సమస్యలతో, 1991జనవరి 26న తుది శ్వాస విడిచాడు.
కె.వి.నరసింగారావుకి ఇద్దరు కుమారులు.పెద్దవాడు డాక్టర్ శరత్ అమెరికాలో యూరాలోజిస్టు గా పేరు తెచ్చుకున్నాడు. చిన్న వాడు డాక్టర్.సంపత్ ఇ.ఎన్.టి స్పెషలిష్టు గా కొన్నాళ్ళు కరీంనగర్ లో ప్రాక్టీసుచేసి. ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడినారు. వీరి అర్ధాంగి ఉష, కీ.శే.వేముగంటి వేణుగోపాల్ రావు (ఐ.ఏ.యస్.) కూతురు.
పి.వి. దృష్టిలో కె.వి.ఒక ఉత్తమ న్యాయనిపుణుడు. సలహాదారు. సచివుడు. జీవితం విలువను ఎరిగినవాడు. కె.వి.న్యాయవాదియే కాదు తెలంగాణావాది కూడా. తెలంగాణకు ముల్కీ రూపంలో ఊపిరి పోశాడు. ఆయన ఎన్నడూ ప్రచారం చేసుకోలేదు. దాంతో చరిత్ర ఉపేక్షించింది. జనాలు మరచిపోయారు. నాటి తరం మనుషులు లేకపోవడంతో కె.వి. మరుగు పడిన మహీధరమయ్యాడు. ‘‘మట్టిలో మాణిక్యం’’గా మిగిలి పోయాడు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక రాష్ట్ర చరిత్రను తిరగరాసుకొంటున్న నేటి కాలంలో, కె.వి. నర్సింగరావు గురించి భావితరాల కోసం ‘అక్షర నిక్షిప్తం’ చేయాల్సిన అవసరమున్నది.
(రచయిత కె.వి. సోదరుని కుమారుడు)