పేదలచెంతకు నాణ్యమైన వైద్యం బస్తీ దవాఖానలతోనే సాధ్యం: మంత్రి హరీష్‌

పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించడంలో బస్తీ దవాఖానలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి ప్రారంభించారు. దీనితోపాటు నగరంలో వివిధ బస్తీలలో 31 బస్తీ దవాఖానలను మంత్రి కేటీఆర్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఉప సభాపతి తిగుళ్ళ పద్మారావు, మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.

మంత్రి హరీష్‌ మాట్లాడుతూ, తమ ఆరోగ్య సమస్యల గురించి పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా, వారికి ఆర్థికంగా భారం కాకుండా ఉండడానికే పేదల బస్తీలకు చేరువలో బస్తీ దవాఖానలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గతంలో 226 బస్తీ దవాఖానలను ప్రారంభించినామని తెలిపారు. ఈ బస్తీ దవాఖానాలు పేదల సుస్తీ తగ్గించే దోస్తీ దవాఖానలుగా మారాయని వాటి పనితీరును ప్రశంసించారు. ప్రతిరోజు సగటున వందమంది ఈ దవాఖానల్లో వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. దీంతో మరో 92 ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారని తెలిపారు. డిసెంబరు 3న ఒకేరోజు 32 బస్తీ దవాఖానలను ప్రారంభించినట్లు మంత్రి హరీష్‌ తెలిపారు. మిగతావి కూడా వివిధ స్థాయిల్లో ఉన్నాయని, త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.

ఇక్కడ వైద్యం చేయడమే కాకుండా రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ లాంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారన్నారు. ఉదయం పరీక్షలు నిర్వహిస్తే సాయంత్రానికల్లా మీ సెల్‌ఫోన్‌కు రిపోర్టులు పంపిస్తారని తెలిపారు. అందువల్ల ఈ దవాఖానలను ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఇప్పటివరకు ప్రారంభించిన దవాఖానల్లో 60 లక్షల మంది వైద్యం చేయించుకుని లబ్ధిపొందారని, 11 లక్షల 60వేల మంది రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు.

నాలుగు సూపర్‌ స్పెషాలిటీ వైద్య శాలలు

రాష్ట్ర రాజధాని భాగ్యనగరానికి నలుదిక్కుల నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్‌ త్వరలో శంకుస్థాపన చేస్తారన్నారు. ఎర్రగడ్డ, గచ్చిబౌలి, అల్వాల్‌, ఎల్‌.బి.నగర్‌లోని గడ్డి అన్నారంలలో ఏర్పాటుచేస్తామన్నారు. రాష్ట్రంలో టీ`డయగ్నాస్టిక్‌ సెంటర్లను ఏర్పాటు చేసి 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.

మాస్కులు విధిగా ధరించండి

ఇక్కడ సమావేశానికి వచ్చిన వాళ్ళలో 25శాతం మంది మాస్కులు ధరించకుండానే వచ్చారు. దీనివల్ల వ్యాధి వ్యాప్తి జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలని మంత్రి హరీష్‌రావు ప్రజలకు సూచించారు. ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ వచ్చిందని ప్రజలు భయపడుతున్నారు. దీని నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని భరోసా ఇచ్చారు. అందరు వాక్సిన్‌ వేసుకోవాలన్నారు. ఎవరైనా వేసుకోకపోతే ఆయా బస్తీల పెద్దలు చొరవ తీసుకుని వేసుకోని వారికి వాక్సీన్‌ వేయించాలని కోరారు. బౌతిక దూరం పాటించడం, సమావేశాలు, సభలు నిర్వహించడం మానుకోవడం చేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న నివారణా చర్యలకు ప్రజల సహకారం కూడా ఎంతో ముఖ్యమని, అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఖైరతాబాద్‌లో ప్రారంభించిన మేయర్‌

ఖైరతాబాద్‌ మహాభారతనగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తో కలిసి మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. అందుకే ఆయా స్లమ్‌ ఏరియాలలో నివసించే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయంతో బస్తీ దవాఖానలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలకు విశేష స్పందన వస్తుండడంతో మరిన్ని ఏరియాలలో ఏర్పాటుకు మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.టి.ఆర్‌ విశేష కృషి చేశారన్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 226 బస్తీ దవాఖానలు ఉండగా, నగర వ్యాప్తంగా మరో 32 బస్తీ దవాఖానలను ప్రారంభిస్తున్నామన్నారు. బల్దియా పరిధిలో మొత్తం 350 బస్తీ దవాఖానల ఏర్పాటుకి జిహెచ్‌ఎంసి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అందులో ముందుగా 220 దవాఖానలు ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నా యన్నారు. మరో 32 దవాఖానలను అందుబాటులోకి తెచ్చామని, మిగితా 7 బస్తీ దవాఖానలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఇప్పటికే 35 కమ్యూనిటీ హాళ్లను గుర్తించడం జరిగిందని, ప్రజల అభీష్టం మేరకు మరో 35 బస్తీ దవాఖానల ఏర్పాటుకు జిహెచ్‌ఎంసి ప్రణాళికను తయారు చేసిందని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. పేద ప్రజలకు ఆరోగ్య పరంగా ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఈ క్రెడిట్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్‌గాంధీనగర్‌లో ప్రారంభించిన కేటీఆర్‌

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం, షేక్‌పేట్‌, రాజీవ్‌గాంధీ నగర్‌లోని బస్తీ దవాఖానను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, బస్తీ దవాఖానల్లో ఓపిడి కన్సల్టేషన్‌, టెలి-కన్సల్టేషన్‌, బేసిక్‌ ల్యాబ్‌ డయాగ్నోసిస్‌, సాధారణ వైద్య చికిత్స, ఇమ్యునైజేషన్‌ వంటి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఈ బస్తీ దవాఖానలో కేటీఆర్‌ బి.పి. పరీక్షలు చేయించుకున్నారు. వైద్య సేవలందిస్తున్న సిబ్బందిని ప్రశంసించారు.