ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కోటా

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యూ.ఎస్‌.) పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగావకాశాలలో పది శాతం రిజర్వేషన్లు అమలుచేయాల్సిన అవ సరం ఉన్నదని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందు తున్న వర్గాలపై ఏమాత్రం ప్రభావం చూపకుండా, ఆయా వర్గాల రిజర్వేషన్లు యథాతధంగా కొనసాగిస్తూనే ఆర్థికంగా వెనుకబడిన వర్గా లకు 10శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

రాష్ట్రంలో ఇప్పటివరకూ బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా అమలుపరచనున్న ఇ.డబ్ల్యూ.ఎస్‌. రిజర్వేషన్లు కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరుకుంటాయి.

త్వరలో ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహించి ఈ 10 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తగు ఆదేశాలు జారీచేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెల్లడించారు.

కేంద్రప్రభుత్వం 103 రాజ్యాంగ సవరణ ద్వారా తమ పరిధిలోని శాఖలు, సంస్థల్లోని విద్య, ఉద్యోగాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి 10 శాతం కోటాను 2019 ఫిబ్రవరి నుంచి అమలులోకి తెచ్చింది. రాష్ట్రాల పరిధిలో వీటి అమలు అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చింది. దీంతో ఈ 10 శాతం కోటాను అమలు చేయాలని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

కేంద్ర నిబంధనల ప్రకారం, సదరు అభ్యర్థి కుటుంబ ఆదాయం సంవత్సరానికి 8 లక్షల రూపాయలకు మించకుండా ఉంటే ఈ ఇ.డబ్ల్యూ.ఎస్‌. రిజర్వేషన్లకు అర్హత కలిగి ఉంటాడు. అలాగే 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగి ఉండొచ్చు.నివాస ప్రాంతం వెయ్యి చదరపు అడుగులకంటే తక్కువ కలిగి ఉండాలి.

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ రిజర్వేషన్లకు సంబంధించి విడిగా నియమ నిబంధనలు జారీచేయనుంది.