|

వైవిధ్యం – వైశిష్ట్యం -టి.ఉడయవర్లు

డెబ్బయేండ్ల వయస్సులోను ఒకచోట కూర్చొని
”రామా కృష్ణ” అనుకోకుండా ప్రయోగశీలంతో నిరంతరం రామకృష్ణ వివిధ పదార్థాలతో వినూత్న కళారూపాలను రూపొందిస్తున్న సృజనాత్మక కళాకారుడు.

నిజానికి రామకృష్ణ కొంతకాలం చిత్రకారుడుగా, కొంతకాలం శిల్పిగా తన బహుముఖ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.
చిత్రకారుడుగా పెన్సిల్‌ డ్రాయింగ్‌లను, కలం చిత్రాలను, నీటిరంగుల చిత్రాలను, తైలవర్ణ చిత్రాలను, గాజుపై చిత్రాలను, గ్రాఫిక్‌లను వేసి చూపరులను అబ్బురపరుస్తాడు. అందులోనూ వ్యక్తి చిత్రాలను, ప్రకృతి చిత్రాలను, అలంకరణ చిత్రాలను, సంఘటనల చిత్రాలను ఆయన అపురూపంగా గీస్తాడు.

శిల్పిగా కంచు, ఇత్తడి, రాగి, ఇనుము తదితర లోహాలతో పాటుగా కర్రతో దారు శిల్పాలను, మృణ్మయ శిల్పాలను, టెర్రకోటా శిల్పాలను, పింగాణి తదితర పదార్ధాలతో వైవిధ్యమైన శిల్పాలను తీర్చిదిద్దడంలో రామకృష్ణ సృజన, పనితనం చెప్పుకోదగింది. ఇక ఫోటోగ్రఫీలో ఆయన తీరు ఆయనదే.

ఇన్ని కళలలో పండిపోయిన రామకృష్ణ ఏ ఒక్క ప్రక్రియకు కట్టుబడి పోకుండా, ఏదో ఒక పదార్ధాన్ని మాత్రమే ఉపయోగించకుండా తాను ఆశించిన ఫలితాన్ని రాబట్టడానికి అవసరమైన దాన్ని ఆయన మాధ్యమంగా వాడుతున్నారు. ఇన్ని మాధ్యమాలను సుతారంగా ఇంత సుందరంగా వాడుతున్న సమకాలీన కళాకారులు బహుశా మరొకరు లేరు.

పైగా పలు ప్రక్రియలను తన వరకే పరిమితం చేయకుండా ఎప్పటికప్పుడు కార్యశాలలు నిర్వహించి అందులో కొత్త వారికి తర్ఫీదు ఇవ్వడంలోనూ ఆయన ముందున్నారు. అభిరుచిగల వారికి బాల్యంలోనే బొమ్మలు వేయడంలో సరైన శిక్షణ ఇస్తే వారు గర్వించదగిన చిత్రకారులుగా, శిల్పులుగా తయారవుతారని ఆయన ఆ దిశలో కృషిచేస్తున్నారు.

కాగితపు చిత్రాలను ఎందరో రూపొందించారు. కాని రామకృష్ణ ఈ ప్రక్రియలో ప్రదర్శించిన రూపులేఖన విధానం వినూత్నమైనది, విశిష్టమైంది. ఉబ్బెత్తు పద్ధతి, పార్శ్వశిల్పం, అర్థ శిల్పం, ఉద్భూతి శిల్పం, కల్పన ఆయన చేతిలో మైనంలా చక్కగా ఒదిగిపోయింది. ఎత్తుపల్లాలను, వెలుగు నీడలను, వాలు రేఖలను చూపి స్పుటత్వాన్ని ప్రదర్శించారు. కఠినమైన ”జేడ్‌”ను లొంగదీసుకుని జపాన్‌ శిల్పులు తీర్చిదిద్దిన కళాఖండాలలాగా ఎంతో మెత్తని మృదువైన కాగితాన్ని కావలసిన తీరులో, ఊహాతీతంగా మలచిన కళాకారుడు రామకృష్ణ. ఈ ప్రక్రియలో చెట్లు, చేమలు, అలంకరణ చిత్రాలతో పాటుగా వ్యక్తి చిత్రాలను వివరణాత్మకంగా, కనువిందుగా మూడు ఆయతనాలలో రూపొందించడం విశేషం.

ఇట్లా కళకే అంకితమై జీవనయానం సాగిస్తున్న రామకృష్ణ గౌరవరం రాంచందర్‌రావూ బ్రహ్మనాయకిల పదిమంది సంతానంలో ఒక్కడు. ఆయన తెలుగువాడైనా పుట్టింది బీహార్‌లో, అంటే వారినాన్న రైల్వే ఉద్యోగిగా దాదాపు జీవితమంతా బీహార్‌ రాష్ట్రంలోనే గడిపినందున రామకృష్ణ అక్కడే పుట్టాడు. అయితే ఆయన ఉద్యోగ విరమణానంతరం హైదరాబాద్‌ వచ్చి స్థిరపడడంతో రామకృష్ణ ప్రాథమిక విద్య కేశవ మెమోరియల్‌ పాఠశాలలో సాగింది. తరగతిలో ప్రథమశ్రేణి విద్యార్థిగా అధ్యాపకుల గుర్తింపు పొందిన రామకృష్ణ మాతృభాష తెలుగు చక్కగా మాట్లాడుతున్నప్పటికీ వ్రాయడంలో కొంత ఇబ్బందిపడేవాడు. ఇంత ప్రతిభగల విద్యార్థి కేవలం తెలుగు వల్ల వెనకబడి పోవడమేంటని భావించిన వారికి తెలుగు బోధించే రంగాచార్యులు రామకృష్ణ గీసే బొమ్మలు చూసి రెండో బాషగా డ్రాయింగ్‌ తీసుకొమ్మని ప్రోత్సహించాడట. వారిది బహుళార్ధ సాధకోన్నత పాఠశాల కావడం వల్ల ద్వితీయ బాషగా సంస్కృతం, మరాఠీ, తెలుగు, డ్రాయింగ్‌లు ఉండేవి. రామకృష్ణ నాన్న తెలుగు తీసుకుంటే మంచిదన్నారు. కాని రంగాచార్యుల సలహా మేరకు ప్రధానోపాధ్యాయుడు గుండేరావు కులకర్ణిని రామకృష్ణ సంప్రదిస్తే విద్యా సంవత్సరం మధ్యలో రెండవ బాష మార్చుకోవడమేంటని అభ్యంతరం చెప్పాడట. కాని రంగాచార్యులు ప్రధానోపాధ్యాయుడిని కలిసి నచ్చచెప్పాడట దాంతో రామకృష్ణ జీవిత గమనమే మారిపోయింది.

వాస్తవానికి జీవ, రసాయన, భౌతిక శాస్త్రాలు ఐచ్చికంగా చదివిన రామకృష్ణను డాక్టర్‌ను చేయాలని వారి నాన్న ఆశపడ్డాడు. అప్పట్లో ఎంట్రెన్స్‌ ఉండేదికాదు. ఎంబిబిఎస్‌లో సీటు రావడానికి కావలసినన్ని మార్కులు రామకృష్ణ పన్నెండో తరగతిలో సాధించాడు. కానీ చిత్రలేఖనం పట్ల పెరిగిన అభిరుచి వల్ల ఎంబిబిఎస్‌ సీటుకోసం కనీసం దరఖాస్తు కూడా చేయకుండా నేరుగా ఆయన జవహార్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం తాలూకు లలితకళల కళాశాలలో ఐదేండ్ల పెయింటింగ్‌ డిప్లొమా కోర్సులో చేరిపోయారు.

పాఠశాలలో సుప్రసిద్ధ చిత్రకారులైన విద్యాభూషన్‌, నరేంద్రరావు, జోషి ప్రభృతులు అధ్యాపకులుగా ఉండేవారు. అందుచేత వారి ప్రభావం విద్యార్థులపై అధికంగా పడేది. పైగా రామకృష్ణకు చిత్రలేఖనంలో గల నైపుణ్యాన్ని గమనించి అధ్యాపకులు డ్రాయింగ్‌లో గుర్తింపు గల పరీక్షలకు కూర్చుండ పెట్టగా అఖిలభారత స్థాయిలో ప్రథముడుగా బంగారు పథకాన్ని సాధించారు. దానితో చిత్రకళనే జీవితంగా భావించి రాత్రింబవళ్ళు అదే అభ్యాసం సాగించాడు. డిప్లోమా పూర్తికాకుండానే చిత్రకళా ప్రదర్శనలలో పాల్గొనడం, వ్యష్టి చిత్రకళాప్రదర్శన నిర్వహించే స్థాయికి ఎదిగాడు.

తొలిరోజులలో ఇరువురు మిత్రులతో కలిసి ప్రకృతి, మనిషి తదితర అంశాలపై చిత్రించిన పది,పన్నెండు చిత్రాలు ప్రదర్శించి రామకృష్ణ తన సత్తా చాటాడు.

ఆ తరువాత టెర్రకోటా, కాగితపు రూపు చిత్రాలు ప్రదర్శన ఏర్పాటు చేసి తన ప్రత్యేకతను వెల్లడించారు. పెయింటింగ్‌లో డిప్లొమా పూర్తిచేసిన కొంత కాలానికి ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడమీ స్కాలర్‌షిప్‌తో బరోడా వెళ్ళి ఎం.ఎస్‌. విశ్వవిద్యాలయంలో గ్రాఫిక్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. ఇది ఆయన కళాదృష్టిని విస్తృతం చేసింది. వైవిధ్యం వైపు మళ్ళించింది.

సుమారు నలభై సంవత్సరాల క్రితం ఆయన పట్టువస్త్రం ఆధారంగా రూపొందించిన చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌ చిత్రకారుల మండలి వార్షిక బహుమతి లభించింది. అట్లాగే ఆయన తల్లితండ్రుల వర్ణ చిత్రానికి నిరాశాపూరిత నిరీక్షణ అనే టెర్రాకోట్‌ శిల్పానికి రెండేండ్లు హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ అవార్డులు గెలుచుకున్నాడు.

కొంతకాలానికి జవహార్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం తాలూకు లలితకళల కళాశాలలో ప్రకృతి చిత్రాలు గీయడంలో విద్యార్థులకు పాఠాలు నేర్పాడు. ఆ తరువాత మరికొంత కాలం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో శిల్ప విభాగంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చాడు.

ఏమైనా ఆయన శ్రీ వెంకటేశ్వర వాస్తుకళాశాలలో ఇసుకతో చేసిన 14 అడుగులు I 15 అడుగుల కుడ్య చిత్రం శామీర్‌పేటలో రాష్ట్ర పర్యాటకశాఖ భవనంపై పరిసరాల పరిరక్షణపై రూపుదిద్దిన కుడ్యచిత్రం జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం తాలూకు, లలితకళల కళాశాలలో లోకప్పుపై వేసిన తైలవర్ణ చిత్రం రామకృష్ణలోని రమణీయ భావనలకు మచ్చుతునకలు.

ఇవి కాకుండా ఆయన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో, కొన్ని జిల్లాల్లో, హోటల్స్‌లో అలంకరణకు రూపొందించిన భారీ గాజువర్ణ చిత్రాలు ఆయన కళాహృదయానికి ప్రతిబింబాలు. ఆయన ఏ చిత్రం గీసినా, ఏ శిల్పం చేసినా దృశ్య రమణీయతకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మానవ అనుభూతులకు, పరిసరాలకు అంతగా ప్రాధాన్యత ఇస్తారు. అవి సృజనాత్మకంగా, సుందరంగా, సులభ గ్రాహ్యంగా, వైవిధ్యంగా, వైశిష్ట్యంగా ఉండడం ఆయన ప్రత్యేకత.