రామప్పా! జయహో!!

‘‘శిలలా కావివి ఉలితాకిడితో జలజల పొంగిన అలలు,

అలలా కావివి ఆకృతి దాలిచి నిలిచిన బంగరు కలలు’’

మహాకవి ఆచార్య సినారె సుమారు ఏడు దశాబ్దాల క్రితం రాసిన ‘రామప్ప’ నృత్యరూపకంలో, శిల్పసంపద చూసి పులకించిన  ఘట్టంలో జాలువారిన భావన అది. ఎనిమిది వందల యేళ్ళ క్రితం ఆకృతి దాల్చిన రామప్ప గుడిలో అపూర్వ శిల్ప కళా వైచిత్రి యునెస్కో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం ‘తెలంగాణ’కు గర్వకారణం. ఇసుక పునాదులపై ఆలయాన్ని నిర్మించడం, నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని, తీర్చిదిద్దడం, శతాబ్దాలు గడిచి పోతున్నా దేవాలయం నిర్మాణానికి వాడిన రాయి నేటికీ రంగు వెలిసిపోకుండా చెక్కు చెదరకుండా కాంతులీనడం, రామప్ప విశిష్టత విశ్వవ్యాప్తం కావడానికి ప్రధానపాత్ర వహించాయి.

పాలంపేటలో రూపుదిద్దుకున్న రామప్ప గుడి అపూర్వమైన శిల్ప సంపదకు నెలవుగా అలరారుతోంది. కాకతీయ రాజుల పాలనా కాలంలో రేచర్ల రుద్ర దేవుడు నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలున్న ఈ ఆలయం, జాయప సేనాని రాసిన నృత్త రత్నావళికి భూమిక కావడం మరో విశేషం. ఈ ఆలయంలోని శిల్ప కళా కృతుల్లో ‘నాగిని’, నవరస సమ్మేళనంగా వీక్షకుల పై చెరగని ముద్రవేస్తుంది. విభిన్న భంగిమల్లో నాగిని శిల్పాలు, శిల్పి కళా చమత్కృతిని కళ్ళకు కడతాయి. వందల యేళ్ళ క్రితమే మన పెద్దలు అపూర్వ సాంకేతిక నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకున్నారనే వాస్తవం నేడు మరోసారి రుజువైంది. ఈ మహోన్నత నిర్మాణం శిల్పిపేరిట రామప్ప గుడిగా ప్రజల పలుకుబడిలో ఉండడం విశేషం. పేరిణి శివతాండవంగా పేరొందిన వీరనాట్యం ఈ దేవాలయ శిల్పాల్లో దాగి ఉండడం మరో విశేషం.

ఇన్ని అంశాల సమాహారమైన రామప్పగుడికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు రావడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అనిర్వచనీయమైన పాత్ర నిర్వహించారు. ఈ స్ఫూర్తితో హైదరాబాద్‌కు ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు లభించేలా కర్తవ్యాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం, నిశిత పరిశీలనకు అంకిత భావానికి అద్దం పడుతుంది.

రామప్పకు లభించిన ఈ ఖ్యాతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనం సాధించిన విజయాల్లో కలికితురాయి వంటిది. మన తెలంగాణ ముద్దుబిడ్డ, పూర్వ ప్రధాని స్వర్గీయ పి.వి. నరసింహారావు యాభై సంవత్సరాలకు పూర్వమే ‘రామప్పగుడి’కి ఈ ప్రాధాన్యత లభించాలని వాంఛించినట్టు ఆధారాలతో స్పష్టమవుతోంది. కాగా అపూర్వ శిల్పకళా శోభితంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్మించిన యాదాద్రి ఆలయానికి సైతం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు రావాలని కోరుకుందాం.