|

రంగనాథ రామాయణం శాసనాలు (తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం)

-డా. సంగనభట్ల నరసయ్య
తెలంగాణలో పుట్టిన రంగనాథ రామాయణము తెలుగు సాహిత్య లోకంలో అతి విశిష్టమైన రచన. దీని రచయిత గోన బుద్ధారెడ్డి. ఈయన కాలం క్రీ.శ. 1250-1320.

మహబూబ్‌నగర్‌ జిల్లా వర్ధమానపురం ఏలిన ప్రభువు. కాకతీయ ప్రభువులకు ఈ వంశం సామంత వంశం. వీరి వంశం పేరు కోన. తెలుగునాట గోన అని ఎందుకు ప్రసిద్ధమైందో అర్థంకాదు. కోన పేరు రంగనాథ రామాయణంలో ప్రముఖంగా రాసి ఉంది. వీరిది నతవాటి సీమ. తరువాత వర్ధమానపురానికి వచ్చినారు. గోన కాటయ వంశంలోని తొలి రాజుగా (అందినంతవరకు) పేర్కొనబడ్డాడు. అతని కుమారుడు కాటయ. ఇతనికి గణపతి దేవుని చెల్లెలు మైలమనిచ్చినట్లు త్రిపురాంతక శాసనం పేర్కొనగా, ఇటీవల నాకు లభించిన ”రెడ్డివాడ” శాసనం (అముద్రితం)లో ఈ విషయం బలపరచబడింది. రుద్రుని భార్యయైన ఈ మైలమకు మరో కూతురు మైలమ ఉంది. ఈమె ఇనుగుర్తి శాసనంలో పేర్కొనబడింది.
tsmagazine
రుద్రుని కుమారుడు కాటయ, గణపతి దేవుని సైన్యాధిపతిగా కాంచీపురం (తమిళనాడు) గెల్చి 1250లో శాసనం వేయించాడు. గణపతిదేవుని నాయనమ్మ ముప్పాంబ నతవాటింటి ఆడబడుచు. నతవాటి దుగ్గ రాజు సోదరి. ఈ విధంగా రామాయణ కర్త (కోన) వంశానికి, కాకతీయ వంశానికి చాలా దగ్గరి బంధుత్వం ఉంది

మరో విశేషం నతవాటింటికి వెళ్లిన గణపతి దేవుని చెల్లెలు మైలమకు ఐదుగురు (పాండవుల వలె) సంతానం కాగా, వారిలో ఒకరి భార్య అచ్చంగా మన రుద్రమదేవిలా యుద్ధాల్లో విజేతగా పేర్కొనబడడం రెడ్డివాడ శాసనంలో లభిస్తోంది. ఈమె రుద్రమకు సమకాలికురాలే.

రంగనాథ రామాయణం కర్త గోన (కోన) బుద్ధారెడ్డి తండ్రి విఠలుడు. ఆయనకు రామాయణం తన పేరిట రాయించుకోవాలని సంకల్పం కలిగింది. సభలోని వారిని అడుగగా, నీ కుమారుని కంటే యోగ్యుడెవరు? అతనితోనే రాయించమన్నారు. ఈ విషయం గోన బుద్ధారెడ్డే చెప్పుకున్నాడు. తండ్రి ఆజ్ఞతో తండ్రి పేరిట రామాయణం రాసినాడు. నాతీత కృతిపేర నతిపుణ్య పేర, మా తండ్రి విఠల క్ష్మానాథు పేర అని రాసుకున్నాడు.మరో విశేషం యేమంటే పూర్వ రామాయణం ఆరు కాండలు పూర్తి చేశాడు. ఇంక మిగిలింది ఏడవదైన ఉత్తర కాండ. ఈలోగా ఆరోగ్యం పాడైందో! వృద్ధుడైనాడో! విష్ణువు రమ్మని పిలిచాడు.

వైకుంఠానికి విష్ణువు నీవింక మము గూడి నెమ్మి నెతెమ్ము

నీ వాంఛితార్థంబు నిర్వహింప

నీ వర నందనుల్‌ నిపుణమానసులు

వారి నియోగింపు వారు నీ కోర్కి” అని ఉత్తరకాండలో మనమలిద్దరు ఈ విషయాన్ని రాసినారు.

మరి ఏడవ కాండ రాయకుండా ఎలా రావాలని అన్నాడు. నీ కుమారులు కాచవిభుడు, విఠలనాథుడున్నారు కదా! వారు రాస్తారు వచ్చేయి అన్నాడట. ఈ విషయం

ఉత్తర కాండ రచయితలు కాచ, విఠలురు పై విధంగా రాసుకొన్నారు. అంటే ఈ రామాయణం తాతా, కొడుకు, మనుమల ఆకాంక్ష ఫలం. తెలుగు వారి పుణ్యఫలం.

ఈ కోన వంశంలో రామాయణ కర్త బుద్ధారెడ్డి(2) మేనత్త, మరొక ప్రసిద్ధురాలైన వ్యక్తి కుప్పమ. ఈమె కవయిత్రి. మల్యాల గుండన భార్యగా ఆమె ప్రసిద్ధురాలై మూడు శాసనములకు కారణమైన వీర నారీమణి. రాచకార్య ధురంధరురాలైన ఈమె బూదపుర శాసనం వేయించింది. బూదపుర శాసనం తాను వేయించిన దానిలో (క్రీ.శ. 1272నాటి) శాసనంలో తాను
tsmagazine

శ్రీగోనవంశ నిజశేఖర బుద్ధయాఖ్య
పుత్రీ పవిత్ర చరితా భరితా గుణే ఘైః
శృంగార సార కరణిః కరణీయ దక్షా
కుప్పాంబికా… అని రాసుకుంది.

ఈమె భర్త మల్యాల గుండన మహా పరాక్రమ శాలియైన కాకతీయ గణపణపతి దేవుని సైన్యాధిపతి. ఈమె అన్నలు ఇద్దరు విఠలుడు (రామాయణ కర్త తండ్రి), ఆయన అన్న గన్నారెడ్డి మహాపరాక్రమ శాలురే కాక రాయచూరు (క్రీ.శ. 1294) శాసన కర్తలు. వీరిలో గన్నారెడ్డి రుద్రమదేవి సేనాని కాగా, తమ్ముడు ‘రాజ్యరక్షామణి’గా సేవలందించి, కీర్తిమంతుడై, కొడుకుతో రామాయణము రాయించినాడు. ఆ కొడుకు, తన కొడుకులకు ఉత్తర కాండ రాయమని ఆదేశించి విష్ణు సాయుజ్యము పొందినాడు.

మల్లంపల్లి సోమశేఖర శర్మ లభించిన 3 శాసనములతో ఒక వంశ వృక్షము నిర్మించినాడు. నాకు లభించిన గోనవంశపు 11 శాసనములను బట్టి ఈ వంశవృక్షమును సవరించినాను. మల్లంపల్లి వారు బుద్ధ భూపతిని రెడ్డి అనుటకు సందేహించినా, గోనవంశీకుల (మలి) రాజధాని ఐన వర్ధమానపురం (నాగరకర్నూల్‌ తాలూకా)లోని 24, జనవరి 1229 నాటి శాసనంలో ”అరిగండ భైరవ గోన బుద్ధా రడ్డియ మగ గణపయ్యార్‌ స్వామి” అని బుద్ధారెడ్డి (1) కుమారుడు గణపయ, రెడ్డి పేరుతో (వీరి వంశీకుల పేర రెడ్డి పదం) ఆధారం లభిస్తోంది. ఈ గణపయ మన రామాయణ కర్తకు పిన తండ్రి.

పింగళి లక్ష్మికాంతం రంగనాథ రామాయణంలోని ఒక సూక్ష్మాంశాన్ని పైకి తెచ్చినారు. అసలీ రామాయణ కర్త బుద్ధారెడ్డి తండ్రి ఎవరు అని. ఈ రామాయణంలో పూర్వ పీఠికలో బుద్ధారెడ్డే (2) స్వయంగా తన తండ్రి విఠలనాథుడని, ఆయన కోరికతో తాను రామాయణం రాస్తున్నానని చెప్పుకొన్నాడు. ఆయన కొడుకులు కాచ, విఠలులు తమ తండ్రి బుద్ధారెడ్డి (2)ని

కొనవంశార్ణవ కువలయ ప్రియుడు
నానొప్పు కోన గన్న క్షీతీంద్రునకు
నానుకూల యై యున్న యన్నమాంబికకు
తనయుండు సాహిత్య తత్త్వకోవిదుడు
దాన ప్రసిద్ధుండు ధర్మశీలుండు
భూనుతాచారుండు బుద్ధ భూవిభుడు

గన్నారెడ్డి అన్నమాంబల తనయుడని చెప్పినారు రంగనాథ నామాయణం బుద్ధారెడ్డి రాయలేదన్న ఓ అబద్ధ చరిత్రకు ఇది తోడైంది. అసలీపుత్రులు (ఉత్తర రామాయణ కర్తలు) బుద్ధారెడ్డి ప్రతులు కాదేమో అన్న వరకు శంక తీగలు సాగింది. పింగళి లక్ష్మి కాంతం సంపన్నరెడ్డి కుటుంబాల్లో ఒకే వ్యక్తికి రెండు పేర్లుండచ్చునని గోన గన్నయ్య, విఠలనాథుడొకరే అని ఊహ చేశారు. ఈ సమస్య రాయచూరు శాసనంతో మరింత జటిలం ఐనట్టైంది. ఈ శాసనం వేయించిన రామాయణకర్త తండ్రి విఠనాథుడు తన అన్నను పేర్కొని తాను అన్నకు తోడుగా రాజ్య రక్షకునిగా ఉన్నానన్నాడు.

”శ్రీమతు మీసియర గండ గోనగన్నయ రెడ్డి వారు వర్ధమానపుర మందు సుఖ సంకథా వినోదంబున పృథ్వీరాజ్యము సేయుచుండగాను తద్రాజ్య రక్షా మణియైన విఠల భూనాథుండు రాచూరి పట్టణ ప్రవేశాభిముఖుండై”.. ఇత్యాదిగా రాయచూరు (కర్ణాటక రాష్ట్రం) శాసనం చెపుతోంది. గన్నారెడ్డి వర్ధమానపుర రాజు. తమ్ముడు విఠలుడు సైన్యాధిపతి అని తెలుస్తోంది. పింగళి వారి పరిష్కారం పరాస్తవమౌతుంది ఈ శాసనంతో. ఈ శాసనం పూర్తి పాఠం పరిష్కర్తగా తెలుగు విశ్వ విద్యాలయం వారి రంగ.రామా. పీఠికాంతంగా ఇచ్చాను.

బుద్ధారెడ్డి విఠలుని కుమారుడే అని నాకు నిర్ధారణమైంది. కారణం ”నీ తనూ జన్ముండు నిపుణమానసుడని” తనూ జన్ముడని బుద్ధుడు పేర్కొనుటలో స్వయంగా కొడుకేనని చెప్పవచ్చు. అంతే కాదు మనుమలు ఉత్తర రామాయణంలో బుద్ధుడు ”గన్న, అన్నమమ్మ”లకు ”తనయుండు సాహిత్య కోవిదుండు” అని చెప్పడంలో తనయుడన్నమాటకు ఔరసుడు కాక వారసుడని అర్థం తీసికోవాలి.

గన్నయ, రాజు. ఆతనికి సంతానం లేదు. తమ్ముడు విఠల నాథునికి సంతానం ఉంది. ఆయనే బుద్ధారెడ్డి (2) ఈతనిని (తమ్ముని కొడుకును) తన తదనంతర ప్రభువుగా పట్టముకట్టినాడు. అది దత్తత ద్వారా రాజ్యాధికార ప్రాప్తి గన్నయవల్ల. కనుక గన్నయ కుమారునిగా పట్టం కట్టుకున్నాడు. దత్తత తీసుకొన్నా, తీసికోకున్నా ప్రజల దృష్టిలో రాజు (గన్నయ) కొడుకు, రాజు (బుద్ధుడు). రాజ్యాధికారం వల్ల కృతజ్ఞతాభావం (లేదా దత్తత) కారణమై కోన బుద్దుడు పెద తండ్రి గన్నయ కుమారుడైనాడు. ఆ విషయం జరిగిన తరువాతి కాలంలో మనుమలు రంగనాథ రామాయణంలో పుత్రుడని రాసినారు. ”తనూజన్ముడు, తనయుడు” అన్న విశేషణాలు సాభిప్రాయాలు.

నా ఈ నిర్ధారణకు మరో సాక్ష్యం ఇస్తాను. గణపతి దేవచక్రవర్తి మహాదేవుని తనూజుడు. కాని రుద్రుని (పెదనాన్న) తరువాత కాకతీయ సామ్రాజ్యానికి పట్టం కట్టుకొన్నాడు. (మొదటి) రుద్రుని వారసునిగా పెదనాన్న గద్దెపై కూర్చున్నాడు. ఇపుడు అతడు రుద్రుని తనయుడని లోకంలోకి వాడుక కెక్కినాడు. ఇది ఊహకాదు. ఇది నాటి రివాజు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ తాలూకా గొడిశాల శాసనంలో గణపతి దేవుడు రుద్రుని కుమారునిగా పేర్కోబడినాడు. ఈ శాసన కాలం 24 జనవరి క్రీ.శ. 1236 ” విజయలక్ష్మీ నివాసుండైన రుద్ర నరేంద్ర సుపుత్రుండును, సదారాధిత త్రినేత్రుండును… వైభవ అమరేంద్రుడును నైన గణపతి దేవ మహానాథునకు…” రుద్రుని ”సుపుత్రు ని”గా పేర్కొనుట ఒక సాభిప్రాయ విశేషణం. కుమారుడుగా, వారసుని గా, తదనంతర ప్రభునిగా నిలుచుటచే తండ్రికాని తండ్రికి (రుద్రునికి) సుపుత్రునిగా పేర్కొనబడినాడు. అలాంటిదే గన్నారెడ్డికి బుద్ధ రాజు తనయుడనుట, విఠలునకు తనూజుడనుట రంగనాథ ఉత్తర, పూర్వ రామాయణోక్తులుగా నిర్ధారించవచ్చునని నా సిద్ధాంతము.

తెలంగాణ నుండి వెలువడి, జనరంజకమై, మనోహర కవితాపరిమళాలతో ప్రసిద్ధిగాంచిన రంగనాథ రామా యణం, కర్తృత్వ విషయంగా, గేయ ఫణితి విషయకంగా, అవాల్మీక గాథల విషయకంగా, పితరుల విషయకంగా అనేక వివాదాలు సృష్టించబడ్డా అవన్నీ సాహిత్య చరిత్రకారుల తప్పిదాలే. పింగళివారికి బుద్ధారెడ్డి తెలంగాణ వాడనుటకు నోరు రాక ”పశ్చిమాంధ్రు”డన్నారు.

కోన కుటుంబ సభ్యుల శాసనాలు నాకు విస్తారంగా లభించినా, బుద్ధుని శాసనం ఒక్కటైనా దొరకలేదు. కాని వేసి ఉంటాడు. రామాణంలోని వారధి నిర్మాణ సందర్భంగా నీలుడు సముద్రంలో నిర్మాణార్థం వేసిన మొదటి రాయి రాముని కీర్తికి, విభీషణ పట్టాభిషేకానికి, వేసిన శాసన స్తంభంలాగ.

తనచేయు సేతు బంధమునకు రాము,
ననుపమకీర్తికి, నావిభీషణుని
వినుద పట్టమునకు విశదప్రభాతి,
తనరారు శాసన స్తంభంము మాడ్కి

ఉందని బుద్ధుడు వర్ణించినాడు. భవిష్యత్తులో శాసన స్తంభం దొరుకుతుందని ఆశిద్దాం.