రసార్ణవ సుధాకరం

By: డా॥ కాకునూరి సూర్యనారాయణ మూర్తి

ఇది రసార్ణవ సుధాకరము. సర్వజ్ఞ సింగభూపాలుని రచన. డా॥ శ్రీరంగాచార్యుల సంపాదకత్వంలో తెలంగాణా సాహిత్య అకాడెమీ వారి పద్దెనిమిదవ ప్రచురణగా వెలుగులోకి వచ్చింది. రాచకొండను 1425-75 మధ్య అయిదు దశాబ్దాల కాలం పరిపాలించిన సర్వఙ్ఞ సింగభూపాలుడు పద్మనాయక ప్రభువులందరిలో మిక్కిలి కీర్తి పొందినవాడు. రత్న పాంచాలిక అనే నాటకంతో పాటు, కందప్ప సంభవ బాణమును కూడా అందించినవాడు. తన సంగీత విద్యా పాటవాన్ని విస్తృతంగా లోకానికి తెలియునట్లుగా శారఙ్ఞదేవుని సంగీత రత్నాకరానికి, సంగీత సుధాకరమనే వ్యాఖ్యను అందించినవాడు. ‘‘అనుక్తానా మిహాన్యేషాం… రసార్ణవ సుధాకరే’’ అని విశ్వేశ్వర కవి తన చమత్కార చంద్రికలో లేనివాటిని రసార్ణవంలో చూడవచ్చని చమత్కరించాడు. సింగభూపుని సర్వఙ్ఞ’ నామం జగత్ప్రసిద్ధం. ప్రత్యక్షర సత్యం. శ్రీనాధమహాకవి ‘సర్వఙ్ఞ’ శబ్దంపై చెప్పిన పద్యం అందరికీ తెలిసిందే! 

పరమేశ్వరుడు సర్వజ్ఞుడు.

1950వ సం.లో వెలువడిన బులుసు వెంకటరమణయ్య ఆంధ్రానువాదముతో కూడిన ప్రచురణ శ్రీరంగాచార్యుల హస్త భూషణమై ఏడు దశాబ్దాల అనంతరం, ఆచార్యులవారు శ్రద్ధతో చేసిన సవరణాదుల ‘అలంకారాలతో’ కొత్త సొబగులను సంతరించుకొని తెలంగాణ సాహిత్య అకాడెమి సౌజన్యంతో నేడు మనముందుకు వచ్చింది. ఈ కృషికి ఊతమిచ్చిన అకాడమి అధ్యక్ష కార్యదర్శులు డా॥ నందిని సిధారెడ్డి, డా॥ ఏనుగు నరసింహారెడ్డి అభినందనీయులు.

అలంకార శాస్త్ర గ్రంథాలలో ప్రతాపరుద్రీయం, నేటి సాహిత్య విద్యార్థులకు, కవి పండితులకు కరతలామలకమేకాని. రసార్ణవ సుధాకరం సర్వజన హృదయాహ్లాదకరం. రుద్రీయం, రాజనాయక వర్ణనాధారంగా, సూర్య సమాన వెలుగులతో సారస్వత ప్రియులకు ఆనందమిచ్చుచుండగా, రసవంతమైన కూర్పుతో, షోడశకళలతో అలరారే పున్నమి చంద్రుని వలె, సుధాకరం సర్వజనామోదమై హృదయంగమమగుచున్నది.

‘‘తెలంగాణమున కవి పండితులుందురా?’’ అని ముక్కున వేలిడి నొసలు పైకెగురవేయు కువిమర్శకుల నోళ్ళు మూతపడునట్లుగా, తెలంగాణా సాహిత్య అకాడమి వారు ఇటువంటి పలు గ్రంథాలను లెక్కకు మిక్కిలిగా అనతికాలంలోనే వెలువరింతురని మనం ఆశ పడుటలో తప్పేమి లేదు.

ఇది అర్ణవము. ఈ సంస్కృత పదానికి సముద్రము, కడలి అని అర్ధములున్నవి. అర్ణమనగా, వర్ణము అక్షరమనే అర్థాలుండగా అర్ణవములో నీరు కలిగినదిగా భాసించడం ఒక విశేషం. పంచార్ణో మనురీరితః’ అని తంత్రసారవాక్కు. అర్జస్సు అనగా కూడా నీరే! ఆనందవర్ధనుని ‘ధ్వని’, ఈ అలంకార శాస్త్ర గ్రంథనామకరణమందే కావ్యాత్మగా ‘స్ఫుటమై’ ‘కావ్యాత్మగా’ శోభిల్లుచున్నది. ‘గచ్ఛ గచ్ఛసి చేత్కాంత పంథానస్సన్తుతే శివాః’’` అను          ఉదాహరణ మందరకు తెలిసినదే కదా. ‘శబ్దము’ నిత్యమని, ‘ధ్వని’ శబ్ద గుణము అని అంగీకరించినచో, ఈ రసార్ణవ సుధాకరమందలి మూడు విలాసములు రంజకోల్లాసము, రసికోల్లాసము, భావకోల్లాసములు, ‘వేణీ’ విలాస భావములను రసికభావకులకు ఆనందమును చేకూర్చునవిగా మన మంగీకరించాలి.

రంజకోల్లాస నామంకల మొదటి విలాసంలో పీఠికనందొక యేబది అయిదు శ్లోకాలలో కృతికర్త వంశావళి ఉట్టంకింపబడినది. నాట్య వేద ప్రశస్తి కూడా చేయబడినది. శాడిల్యుడు, కోహలుడు, దత్తిలుడు, మతంగుడు మొదలైన భరతపుత్రులు వేర్వేరు, నాట్య శాస్త్ర గ్రంథములందివ్వగా, బ్రహ్మతో ప్రేరితుడైన భరతుడే స్వయంగా నాట్య శాస్త్రము రాయగా, కాలమహిమకులోనై అవన్నీ చెల్లాచెదురైనవి. నాట్య లక్షణమును వివరించుటకే ఈ గ్రంథము, సారమును స్వీకరించే విద్వాంసుల మనస్సు నానందపరచుటకే ఈ గ్రంథము అని గ్రంథాదిలోనే కవి చెప్పి ఉన్నాడు.

‘అలంకారచర్చ అడుగంటుతున్నదశ’ అని ఈ గ్రంథానికి, ‘సింగ భూపాలుడి సృజన కాంతుల’ పేరిట తొలిపలుకులందించిన డా॥ నందిని సిధారెడ్డి మాటలిక్కడ ఉదహరించతగినవి. ఈ తెలంగాణ నాగేటి చాళ్లలో, యుద్ధాలు ఉద్యమాలే కాక, అలంకార సౌందర్య భరిత కావ్య కుసుమాలూ విరిసి. సువాసనలను నలుదిక్కులా విరజిమ్మాయనడానికి రసార్ణవమే ఉదాహరణం.

చంద్రాలోకం పేరిట పీఠికను వెలియించిన శ్రీరంగాచార్యులు, అయిదు వందల నలుబదియారుపుటల అలంకార రసామృతాన్ని ఒక పది పుటలలో బహు చమత్కారంగా, కొండను అద్దంలో చూపించారు.

ఈ గ్రంథం మొత్తం మూడు ఉల్లాసాల పరిమితం కాగా, మొదటి రంజకోల్లాసం వంశచరిత్ర అనంతరం, నాట్య వేదోత్పత్తి, నాట్య లక్షణం, రసలక్షణం, నాయక, నాయికా ప్రకరణాలు, శృంగార రసోద్దీపనం, ఋద్ధ్యారంభ అనుభవాలు, సాత్త్వికభావాలు, రీతి, వృత్తి ప్రవృత్తి గుణాది విషయ వివరణలతో, సాత్త్వికాదుల నిరూపణలతో పూర్తి అవుతుంది. కైశికీ వృత్తి శృంగార హాస్యములను సాత్వతి వృత్తి ` రౌద్ర, వీర, అద్భుతములను, ఆరభటి ` భయానక, భీభత్స రౌద్రములను ఆశ్రయించి ఉండగ  భారతీ వృత్తి కరుణాద్భుత రసములందుండునని సింగభూపుని వివరణ. 

అట్లే భావుకులగు పండితులు సమస్త భావములకు సత్త్వము మూలమన్నారు. అటువంటి సత్త్వము కల భావములు సాత్వికములని సింగభూపుడే గ్రంధమందు నిరూపించినాడు. ఇవి ఎనిమిది స్తంభము, స్వేదము, రోమాంచము, సర్వభేదము, కంపము, వైవర్ణ్యము, అశ్రువు, ప్రళయము అనేవి. ఇవి పరుల కష్ట సుఖాలను భావించు సహృదయుని చిత్త సంస్కారముననుసరించి ఏర్పడేవి.

ఇక రెండవది రసికోల్లాసము. ఇందులో వ్యభిచారి భావాలు స్థాయి, రస, రసాభాసాదులు, నవరసాదుల వివరణలు ఉన్నవి. అంగముగా నుండు రసము స్వేచ్ఛా వృత్తిచే వృద్ధి నొందినచో నంగిరసము, అవినీతుడగు మంత్రి వలన ప్రభువు వలె నాభాసతను బొందును’’ ఇది రసాభాస వివరణ శ్లోకానికి తాత్పర్యం. ‘‘హాస్య భూయిష్ఠమగు శృంగారము శృంగారాభసమగును భీభత్సములతో నిండిన హాస్యము హాస్యాభాసమగును… ‘‘భావ ప్రకాశికలో ఉదాహృత శ్లోకానికి ఇది తాత్పర్య పరిభాష. ఇట్టివి కోకొల్లలు. ఎంత మేరకు అవసరమో అంతమేరకు మాత్రమే ఉపమాదుల అలంకారిక భాషను ఉపయోగించి పాఠకులను రసిక జనమనోభిరామముగా ఆహ్లాదపరిచిన శైలి ఈ గ్రంథమున కలదు. 

అరాగము, అనేకరాగము, తిర్యగ్రాగము, మ్లేచ్ఛరాగము అనే భేదాలతో శృంగార రసాభాసము నాలుగు విధములుకాగా ఇరువురిలో ఒకరికి అనురాగము లేకపోవుట అరాగము. ఇది మళ్ళీ మూడు విధములు 1. ప్రాగభావము 2. అత్యంతాభావము, 3. ధ్వంసాభావము.

మూడవ భావకోల్లాసములో దశ రూపక వివరణలు, సంధి సంధ్యంగాది రూపక సామగ్రి తదితర విషయాలతో పరిభాషగా సంస్కృత ప్రాకృత భాషా ప్రయోజనాదులతో, ఈ సుధాకరం పూర్తి అవుతుంది.

రసార్ణవం 1895 నాటి తొలి ముద్రణ ప్రతి ముఖచిత్రాన్ని కూడా ఈ గ్రంథం చివరన రంగాచార్యులు గా మనకందించారు. అదే విధంగా 1950 నాటి బులుసు వారి ప్రతిలోని, రావు వెంకటకుమార మహిపతి సూర్యారావు తొలి పలుకులు, గిడుగు వెంకట సీతాపతి ఉపోద్ఘాతము, ఋలుసు వేంకట రమణయ్య విజ్ఞాపనము (మూలప్రశస్తి), పాఠకులకు మనోల్లాసం కలిగిస్తాయి.

సుఖమువేరు, సుఖానుభూతి వేరు. అనుభూతి అనేది మనస్సుకు సంబంధించిన భావము. అది మధురమైనదైనచో వినియోగించెడి భాషకూడా మధురమైనదే కావాలి. ఒక కావ్య పఠన శ్రవణాదుల చేత కలిగే ఆలోచనల్లో అమృతత్వంభాసిస్తుంది. సంగీత చిత్ర లేఖనాది కళలను చూచి ఆనందించడం కోసం విశేష జ్ఞానం అక్కరలేదు కాని, కవిత్వం అట్లాకాదు, ఇక్కడ పఠితకు కొంత పాండిత్య ముండి తీరాలి. మాటల కూర్పులోని ధ్వనిని గుర్తించి ఆనందించాలంటే రసభావాల సమాహార సుకుమారపు ఊహలుండాలి. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణములలో, నాల్గవదానిని తట్టిలేపి పఠితకు కావ్యానంద రసభావనలు కలిగించాలంటే సునిశితమైన వివేచనా శక్తి ఉండాలి.

కావ్యంలో ఉండే పలు విషయాలలో రెండు ప్రధానమైనవి, లోక ప్రవృత్తి మరియు కవి కల్పన. ‘‘కవి ప్రతిభలో నుండును కావ్య గత శతాంశముల యందు తొంబది పైన పాళ్ళు’’ అని విశ్వనాధ కల్పవృక్షమందు సూచించి, ఆ వెంటనే ‘‘లోకమ్ము వీడి రసమ్ము లేదు’’ అని కూడా ముక్తాయించాడు. లోక ప్రవృత్తిని కొంత వరకు, అందరు గుర్తించెదరు కానీ, కవికల్పనలోని రసభావనలు తెలియాలంటే ‘రసార్ణవ సుధాకర’ పరిభాష తెలిసి ఉండాలి. అది తెలిసినవాడు కావ్యఙ్ఞుడు, రసభావనలు తెలిసినవాడు. 

కోపము, హాస్యము, భయము మొదలైన మనోవికారములకు భావములని పేరు. ఈ భావములు ఊహల చేత మనస్సులో స్థిరపడుతాయి. వీటిని పరిశీలన చేసి, వానిలోని రసాదుల స్థితి అనుభవైక వైద్యం కావాలంటే రసార్ణవ సుధాకరపు వెలుతురు తప్పనిసరి.

వేదములు ప్రభు సమ్మితములు, పురాణములు మిత్రసమ్మితములు. కావ్యములు కాంతా సమ్మితములు. రసార్ణవం శాస్త్ర కావ్యం. భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహానికి, విద్యానాధుని ప్రతాపరుద్రయశోభూషణానికి ఏమాత్రం తగ్గిందీ కాదు.  విద్వజ్జనులకీ గ్రంథ పరిచయం ఉన్నప్పటికీ విద్యార్థి లోకానికి కొంచెం దూరంగా ఉండడం చింతనీయం. ఈ చింతను దూరం చేసేందుకై నడుం బిగించిన శ్రీరంగాచార్యులు అభినందనీయులు. జయదేవుని ‘చంద్రాలోకం’ స్ఫురించే విధంగా వారి పీఠిక ఈ గ్రంథానికి ఒక అలంకారం.

చమత్కారంగా చెప్పుకోవాలని ఒక సన్నివేశాన్ని ఊహిస్తే భర్త ముందు గదిలో దిన పత్రికను పదోసారి తిరగేస్తున్నాడు. ఇల్లాలు వంటింట్లో భర్తపై అల్లిన అష్టోత్తర శతనామావళిని గొణుగుతున్నది. వింటున్న భర్త, ఆ మాధుర్యాన్ని భరించలేక, కొంచెం కోపంతో, ‘లేస్తే నేను మనిషిని కాను, నాకు కోపం తెప్పించకు’ అన్నాడు. లోపలి నుండి ‘ఇప్పుడు మాత్రం!’ అని అష్టోత్తరానికి ఫలశ్రుతి మొదలయ్యింది. ‘ఛీ! నాకు బుద్ధిలేదు’ అన్నాడు భర్త. ‘మీకు ఇప్పుడు తెలిసిందా ఈ సంగతీ!’’ ఇల్లాలి సమాధానం. ‘‘ఛీఛీ! మూర్ఖులతో నేను మాట్లాడను’ అని భర్త అంటే, ఇల్లాలు, ‘‘నేను మాట్లాడుతున్నాగా!’’ అని ముక్తాయించింది. విసిరేసిన కాఫీ కప్పు శబ్దం ఈ సన్నివేశానికి భరత వాక్య మయ్యింది.

‘A thing of eauty is a joy for ever’ (Keats) అని కీట్సు మహాశయుడన్నాడు. సౌందర్యపు ఊహ శాశ్వతానంద సందాయకం.

ఈనాటి కాలంలో లోకులలో రసదృష్టి లోపించింది. కుటుంబ సంబంధాలు అవగాహనా రాహిత్యంతో దెబ్బతింటున్నాయి. మనుషుల మధ్య మాటలు, అర్ధాలు మారి, అపార్థాల గోడలకు ఇటుకలవుతున్నాయి. అంత రంగపు యుద్ధాలలో, అంతా గళ్ళనుడికట్టులోని గదులలో బందీలవుతున్నారు. ఈ పరిస్థితులు మారాలంటే ‘రసార్ణవం’ అనే దివ్య ఔషధం కావాలి. శబ్ద లక్షణం తెలిస్తే, జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.

‘‘రసార్ణవం, తెలంగాణములో వెలువడిన అత్యుత్తమ అలంకార శాస్త్ర గ్రంథం. యుద్ధాలు, ఉద్యమాలు మాత్రమే కాదు అలంకార సౌందర్య నిర్మాణంలో కూడా తెలంగాణ పాత్ర విశిష్టమైనది, విస్మరించరానిది. ఆ కోణంలో తిరిగి చెర్చించి, తెలుగు సాహిత్య చరిత్రలో ప్రతిష్టించవలసి ఉన్నది.’’ అనే నందిని సిధారెడ్డి మాటలు అక్షర సత్యాలు.

తెలంగాణ, మహబూబు నగరంలో కమ్మదనం అని ఒక గ్రామం పేరు. కాకునూరి గ్రామానికి ఇది దగ్గర. తెలంగాణలో అద్భుతమైన ఒక పదం, ‘కమ్మగా’ ఉన్నదని రుచిని వర్ణించడం. స్వాదువు, మధురమనే సంస్కృత పదాలకు మించి, ‘కమ్మగా’ అన్న పదం నోటిలో నీటి ఊటలను పుట్టిస్తుంది. మనస్సు ఆనందరసార్ణవంలో ఈదులాడుతుంది.

కమ్మనైన గ్రంథం, రసార్ణవసుధాకరం. ఆ కమ్మదనాన్ని రుచి చూసిన శ్రీరంగాచార్యులు, నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డిలు మనకు కూడా ‘చవు’లూరగ రుచులు పుట్టేటట్లు, అందమైన ప్రతిగా ఈ గ్రంథాన్ని అందించారు. రసిక భావ విదులదే ఆలస్యం.