హరితహారం స్ఫూర్తితో రాశివనం

By: డా.వి. శంకర్‌

‘తన భద్రత గురించి ఆలోచించేవాడు కుక్కను పెంచుతాడు, సమాజం భద్రత గురించి ఆలోచించేవాడు మొక్కను పెంచుతాడు’ అనే మాట చమత్కారవంతంగా కనిపించినా ఏంతో ఆలోచించదగింది. కుక్క మనిషికి భద్రత ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు కానీ చెట్టు మాత్రం జీవుల ప్రాణం నిలుపుతుంది. మానవ మనుగడకు సంబంధించిన సమస్త వనరులు చెట్ల మనుగడపైనే ఆధారపడ్డాయని మనిషి గుర్తించి, తదనుగుణంగా నడుచుకున్నప్పుడే భావితరాలు బతికే అవకాశం ఉంటుంది. ఈ సత్యాన్ని గుర్తించిన తెలంగాణ, దేశంలో హరిత సంపద పెంపొందించే రాష్ట్రాల్లో ముందువరుసలో ఉంటున్నది. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం ప్రత్యక్షంగా, పరోక్షంగా మనిషి జీవన సరళిపై విశేష ప్రభావం చూపుతున్నది. అది స్పూర్తిగా ఎటు చూసినా పచ్చదనం పరచుకునేలా అందరూ పనిచేస్తున్నారు. అట్లాంటి స్పూర్తి తోనే కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలో ‘రాశివనం’ ప్రారంభమైంది.

కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ 1964లో ఒక విద్యా సొసైటీ చేత స్థాపించబడిరది. తర్వాత కాలంలో ప్రభుత్వ కళాశాలగా మారింది. నేను ఈ కాలేజీలోనే చదువుకుని, ఇప్పుడు ఇక్కడే అధ్యాపకునిగా పనిచేస్తున్నా. కళాశాలకు 158 ఎకరాల విశాలమైన ప్రాంగణం ఉంది. అందులో ఎక్కువభాగం బండరాల్లున్న నల్లరేగడి నేల. మొక్కలు పెరిగే అవకాశాలు తక్కువ. మేము చదువుకునే రోజుల్లో కాలేజీకి వెళ్ళే మార్గంలో చిన్న చిన్న రేగుపండ్ల మొక్కలు, అక్కడక్కడా కొన్ని తంగేడు మొక్కలు మాత్రమే ఉండేవి. మిత్రులతో కలిసి వాటికి కాసిన చిన్న రేగుపండ్లు తినేది. కళాశాల భవనం ముందు, ప్రధాన రోడ్డు మార్గంలో కొన్ని చెట్లు ఉండేవి. ప్రతి సంవత్సరం అధ్యాపకులు విద్యార్థులతో మొక్కలు పెట్టించినా నీటి కొరత వల్ల అవి బతికేవి కావు. మొక్కలు నాటడం ఒక ఉద్యమంగా చేపట్టిన సందర్భం, కార్యక్రమం అప్పుడు లేదు.

2015లో హరితహారం ప్రారంభించినప్పుడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కాలేజీ భవనం ముందు ఒక మొక్క నాటారు. అప్పుడు మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ కూడా మొక్కలు నాటారు. అవిప్పుడు ఏపుగా పెరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణల్లో భాగంగా 2016లో కామారెడ్డి కొత్త జిల్లాగా అవతరించింది. ఈ కళాశాల పూర్వ విద్యార్థి డా.యన్‌. సత్యనారాయణ కలెక్టర్‌గా రావడంతో కళాశాల గతి మలుపు తిరిగింది. ఒకరోజు కాలేజీని సందర్శించి ఖాళీ స్థలం, ముఖ్యమంత్రి, మంత్రులు నాటిన మొక్కలను పరిశీలించారు. ఆ ప్రాంతాన్ని ఆహ్లాదం, ఆరోగ్యం పంచే కేంద్రంగా తీర్చిదిద్దాలని భావించారు. ఆ మొక్కలను కలుపుకొని ఒక విశిష్టమైన ప్రాజెక్టుకు రూపకల్పన చేసినారు. దాని పేరు ‘రాశివనం.’ దాదాపు మూడు ఎకరాల్లో 12 రాశుల మొక్కలతో కూడిన రాశివనం, మరో నాలుగు ఎకరాల్లో పండ్లతోటతో మొత్తం ఏడెకరాల్లో ఉద్యానవనం ఏర్పాటుకు రూపకల్పన జరిగింది. దాని అభివృద్ధి, నిర్వహణ నిమిత్తం కళాశాల ప్రిన్సిపాల్‌ చైర్మన్‌ గా, ఒక అధ్యాపకుడు కన్వీనర్‌గా, మరో ఎనిమిదిమంది సభ్యులుగా రాశివనం కమిటీ రూపు దిద్దుకున్నది. వీరందరికీ ఇది కళాశాల విధులకు అదనపు పని. ఒక రకంగా ఇది వ్యవసాయం చేయడం లాంటిది. అయినా కలెక్టరు ప్రోత్సాహంతో అధ్యాపకులు ఉత్సాహంగా పనిచేశారు. ఉద్యానవన, ఆటవీ, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా విభాగాల సహకారం కూడా లభించింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉద్యానవనం ఏర్పాటుకు నిధులు ఉండవు, కనుక ఆర్ధికవనరులు కూడా సొంతంగా సమకూర్చుకోవాలి. అందుకు ప్రజల భాగస్వామ్యం తీసుకోవాలి. అందుకోసం వారితో వారి రాశి మీదుగా మొక్క నాటించాలి. వారి పేరుతో ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. వాళ్ళు తమ పుట్టినరోజు లేదా పెండ్లిరోజు లాంటి వేడుకలు ఆ మొక్కవద్ద చేసుకోవచ్చు. రోజూ వాకింగ్‌కు వచ్చి తన మొక్కను చూసుకోవచ్చు. దాని సంరక్షణ బాధ్యత రాశివనం కమిటీ చూసుకుంటుంది. అందుకు మొక్క పెట్టిన వారి నుంచి డబ్బులు వసూలు చేయాలని కమిటీ నిర్ణయించింది.

అయితే కమిటీలో ఎందరున్నా కన్వీనరే ప్రధాన కార్యకర్త. అన్ని పనులకూ బాధ్యుడు. రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం నేలను చదును చేయడమైంది. రాళ్ళనేల కనుక మొక్క బతకాలంటే జేసిబితో పెద్ద గుంతలు తీసి, అందులో ఎర్రమట్టి నింపి నాటాలి. 2017 జూన్‌ లో రాశుల ప్రకారం మొక్కలు నాటడం ప్రారంభమైంది. రాశుల మీద నమ్మకం లేని వాళ్ళు నచ్చిన మరో రాశిమొక్క నాటారు. కళాశాల భూముల రిజిస్ట్రేషన్‌ పూర్తయిన సందర్భంగా కలెక్టర్‌ డా.యన్‌. సత్యనారాయణ ఏకముఖి రుద్రాక్ష మొక్క నాటారు. నడక మార్గం నిర్మాణమైంది. దాని చుట్టూ క్రోటను మొక్కలు వరుసగా ఏర్పాటు చేయబడ్డాయి. ఎన్‌.సి.సి. విద్యార్థులు రాశివనం చుట్టూ ఫెన్సింగ్‌ వేయించారు. కాంట్రాక్టరుతో పనిచేయించుకున్న దానికంటే మూడోవంతు డబ్బులతోనే కంచె నిర్మాణమైంది. పెట్టిన మొక్కలకు నీళ్ళకోసం ఒక బోరుబావి తవ్వించబడిరది. అదృష్టవశాత్తు నీళ్ళు బాగా వచ్చినాయి. జిల్లా ఉద్యానవన శాఖ సహకారంతో బిందుసేద్యం కోసం డ్రిప్‌ ఏర్పాటు చేయబడింది.

క్రమంగా రాశివనంకు పాదచారులు రావడం ప్రారంభమైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్మానుష్యంగా ఉండే కళాశాల ప్రాంగణంలో జన సంచారం పెరిగింది. పాదచారులు కూడా కొన్ని మొక్కలు నాటారు. వారి భాగస్వామ్యం కూడా రాశివనం అభివృద్ధికి చేదోడుగా నిలిచింది.

కలెక్టర్‌ డా.సత్యనారాయణ జిల్లా కేంద్రానికి మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారి ఎవరు వచ్చినా ఇక్కడ ఒక మొక్క నాటించడం మొదలు పెట్టారు. ఆయన పురపాలక శాఖ డైరెక్టర్‌ గా బదిలీ అయ్యేంత వరకు ఆ సంప్రదాయం కొనసాగించారు. అంతేకాదు వారిలో కొందరితో రాశివనం నిర్వహణ నిమిత్తం కమిటీకి డబ్బులు కూడా ఇప్పించారు. స్వయాన తను రాశిప్రకారం జమ్మిమొక్క నాటి డబ్బులు చెల్లించారు. ఎస్పీ శ్వేతతోనూ మొక్క నాటించి డబ్బులు ఇప్పించారు. కన్వీనర్‌ తో సహా రాశివనం కమిటీ సభ్యులు, అధ్యాపకులు, సిబ్బంది కూడా డబ్బులు చెల్లించే మొక్కలు నాటినారు. ఆ డబ్బులను నామఫలకము, గద్దె, వర్మి కంపోస్ట్‌ ఎరువు, నిర్వహణ, అభివృద్ధి తదితర అవసరాలకు కమిటీ వినియోగిస్తుంది.

ఇప్పుడు రాశివనంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో పాటు, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యే హన్మంత్‌ షిందే, సాహిత్య అకాడమి అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి, రాష్ట్ర ఫుడ్‌ కమీషన్‌ చైర్మన్‌ కొమ్ముల తిరుమల్‌ రెడ్డి, గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ డా.అయాచితం శ్రీధర్‌, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పోరేషన్‌ చైర్మన్‌ రఘువీర్‌, ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్‌, రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ నాగిరెడ్డి నాటిన మొక్కలున్నాయి. అలాగే హరితహారం ప్రత్యేకాధికారిణి ప్రియాంక వర్ఘీస్‌, ముఖ్య అటవీ సంరక్షణ అధికారిణి శోభ, సీనియర్‌ ఐ.ఏ.ఎస్‌. అధికారులు డా.బి.జనార్ధన్‌ రెడ్డి, రఘునందన్‌ రావు, క్రిస్టినా చోన్గ్తూ, రోనాల్డ్‌ రాస్‌, ఎం.రామ్మోహన్‌ రావు, ప్రస్తుత కలెక్టర్‌ డా.ఎ.శరత్‌ లతో పాటు కామారెడ్డి అదనపు కలెక్టర్లు వెంకటేశ్‌ దోత్రే, తేజాస్‌ నందలాల్‌ పవార్‌, సత్తయ్య, యాదిరెడ్డిలు కూడా ఇక్కడ మొక్కలు నాటారు. ఇక జిల్లాలోని వివిధ శాఖల అధికారులు నాటిన మొక్కలు కూడా ఉన్నాయి. విశేషంగా చెప్పుకోవలసిన విషయం ఏమంటే, 1964 లో నిజామాబాదు జిల్లా కలెక్టరుగా పనిచేసిన, కామారెడ్డి కళాశాల స్థాపనలో ముఖ్యకారకులు, చోదకులు అయిన బి.ఎన్‌.రామన్‌ తో కూడా మొక్క నాటించడం. 2019 లో జరిగిన కళాశాల వార్షికోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైనప్పుడు ఆయన తన సతీమణితో కలిసి ఇక్కడ మొక్క నాటారు. అయితే ఇవన్నీ ఒక్కసారి నాటినవి కావు. మూడేళ్ళ వ్యవధిలో నాటినవి. ప్రస్తుతం ఇందులో దాదాపు 4000 మొక్కలు పెరుగుతున్నాయి. ఇక అంతకు ముందు పూర్వ అధ్యాపకులు, ఎన్‌.ఎస్‌.ఎస్‌., ఎన్‌.సి.సి. విద్యార్థులు పెట్టినవి వీటికి అదనం.

తొలుత కన్వీనర్‌ గా పనిచేసిన డా.ఎ.సుధాకర్‌ 2018 లో బదిలీ కావడంతో డా. వి.శంకర్‌ (ఈ వ్యాసకర్త) కన్వీనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. రాశివనంలో మరిన్ని మొక్కలు నాటించి, దాని అభివృద్ధి దిశగా మరిన్ని చర్యలు తీసుకున్నారు. కలెక్టర్‌ సత్యనారాయణ తరచుగా రాశివనంలోకి వాకింగ్‌కు రావడంతో రాశివనం అభివృద్ధి గురించి చర్చించడంతో కొత్త పనులకు మార్గం సుగమమైంది. ఆయన కలెక్టరుగా మాత్రమే కాక తాను చదువుకున్న కాలేజీ పూర్వవిద్యార్థిగా ఆలోచించడం కాలేజీకి, రాశివనానికి ఎంతో మేలు చేసింది.
ఈ నేపథ్యంలో కళాశాల సిబ్బంది విజ్ఞప్తి మేరకు కలెక్టర్‌ పండ్లతోటలోనూ నడకమార్గం మంజూరుచేశారు. రాశివనం ఎదురుగా మున్సిపల్‌ నిధులతో ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేయించారు. అన్ని మూలలకు పెద్దలైట్లు ఏర్పాటు చేయబడ్డాయి. సిమెంటుతో చేయించిన అశోకుని ధర్మచక్రం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రాశివనం మధ్యలో నెమలి ప్రతిమ ఏర్పాటు చేయడంతో పిల్లలనూ ఆకట్టుకోవడం మొదలైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో వచ్చే పాదచారుల సంఖ్య ఐదు వందలకు చేరింది.

నీటి సంరక్షణ చర్యలు
రాశివనం ఏర్పాటుకు హరితహారం స్పూర్తి అయితే ఇక్కడ చేపట్టిన నీటిసంరక్షణ చర్యలకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రేరణనిచ్చింది. అందుబాటులో ఉన్న నీటివనరులను మళ్ళించుకొని అవసరమైన విధంగా మార్చి వినియోగించుకోవడమే ఆ ప్రేరణాసూత్రం. రాశివనానికి 2019 వేసవికి ముందే నీటి కష్టాలు ప్రారంభమైనాయి. మార్చి నెల మొదట్లోనే బోరు ఫెయిలయింది. చుక్క నీరు రాలేదు. ఒకపక్క ముదురుతున్న ఎండలు, నేలకింద బండరాళ్ళు. పైనుంచి ఎండలు, కింద రాళ్ళ సెగ. ఆ సెగకు ఒకసారి మొక్క వేళ్ళు మాడితే మొక్క చనిపోయి నట్లే. ఎట్లయినా రాశివనం మొక్కలు కాపాడు కోవాలనుకున్నాం. కొందరు వాకింగ్‌ మిత్రులతో సంప్రదిస్తే నీళ్ళ టాంకర్లు పంపడానికి ఒప్పుకున్నారు. కొన్నిసార్లు మున్సిపల్‌ ట్యాంకర్లు తెప్పించినా పట్టణ ప్రజల నీటి అవసరాల దృష్ట్యా రెగ్యులర్‌ గా రాకపోయేది. మరికొందరు డబ్బులిచ్చి ప్రైవేటు ట్యాంకర్లు తెప్పించి ఆదుకున్నారు. పైపులు పట్టి మొక్కలకు నీళ్ళు కూడా పోశారు. ఆ వేసవిలో రోజూ ఉదయం, సాయంత్రం పాదచారులకు, కన్వీనర్‌కు దినచర్యగా మారిపోయింది. రాశివనం ఇంకుడు గుంతల్లో నీళ్ళు నింపి అందులో రెండు మోటార్లు పెట్టి మొక్కలు కాపాడుకున్నాము. పాదచారులతో పాటు కలెక్టర్‌ సత్యనారాయణ కూడా స్వయంగా పైపుతో మొక్కలకు నీళ్ళు పట్టారు. అదంతా ఒక యజ్ఞంగా, ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. ఆ వేసవిలో నీటి సమస్యను అధిగ మించినా ఎల్లకాలం ట్యాంకర్ల మీద ఆధారపడటం సాధ్యం కాదు. శాశ్వత పరిష్కార మార్గాల గురించి అన్వేషణ మొదలుపెట్టినాము.

నిజానికి కళాశాలకు మొదటి నుంచి నీటి సమస్య ఉన్నది. కళాశాల నీటి అవసరాలకు ఎన్ని బోరుబావులు తవ్వించినా అవి కొంత కాలం పాటు నీళ్ళు అందించి విఫలమైనాయి. అయిదు దశాబ్దాలుగా అదే కథ పునరావృతమవుతోంది. రాశివనం కోసం తవ్వించిన బోరు పరిస్థితి కూడా ఆ వరుసలోకి చేరిపోయింది.
మరోబోరు వేసినా అదీ తాత్కాలికమే కావచ్చు. శ్రీధర్‌ దేశ్‌ పాండే సహకారంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను స్వయంగా చూసినందున అది స్ఫూర్తిగా కళాశాల రాశివనం నీటిసమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించాము. సమగ్ర నీటిసంరక్షణ చర్యలకు శ్రీకారం చుట్టినాము. కాలేజీకి విశాలమైన ప్రాంగణం ఉన్నందున వీలైనన్ని ఇంకుడుగుంతలు, రీచార్జి గుంటలు, నీటి సంరక్షణ కొలనులు ఏర్పాటుచేయాలని నిర్ణయం జరిగింది. ఆ విషయమై కలెక్టరుతోనూ, ఇంజనీర్లతోనూ చర్చించి ఒక ప్రణాళిక రూపొందించుకొని అమలుపరిచాము.
ఇక్కడకు సమీపంలో, కళాశాల స్థలంలో కామారెడ్డి మునిసిపాలిటీకి తాగునీరు సరఫరా చేసే ప్రధాన నీటి శుద్ధి కేంద్రం (ఫిల్టర్‌ బెడ్‌) ఉంది. దానికి పోచంపాడ్‌ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు వస్తాయి. ఆ కేంద్రంలోని టాంకును శుభ్రం చేసినప్పుడల్లా మిగిలిన వృథా జలాలను బయటకు వదులుతారు. వారంలో మూడు నాలుగు సార్లు అలా వెళ్తాయి. వదిలిన ప్రతిసారి 1 నుంచి 2 లక్షల లీటర్ల వరకు ఉంటాయి. నిజానికి ఆ నీళ్ళు ఎందుకూ ఉపయోగపడవు. క్లోరిన్‌, ఆలం కలిపిన నీళ్ళు కావడం వల్ల మొక్కలు పెంచడానికి అసలు పనికిరావు. ఫిల్టర్‌ బెడ్‌ నుంచి దిగువగా స్టేడియం పక్కనుంచి దిగువకు వెళ్లిపోయేవి. ఆ నీళ్ళతోనే మా ప్రణాళిక అమలుచేశాము.
2017లో హరితహారంలో భాగంగా కాలేజీ భవనం వెనుకవైపు జిల్లా అధికారులు కొన్ని మొక్కలు నాటారు. వాటి సంరక్షణ కోసం ఆ ఫిల్టర్‌ బెడ్‌ నుంచి వదిలే వృధాజలాలను కళాశాల వెనుకవైపు మళ్ళిస్తూ ఒక చిన్న కాలువ తవ్వించినారు. ఆ నీటిని అక్కడక్కడ నిలువ చేసుకోవడానికి 2 గుంతలు కూడా తవ్వించారు. క్లోరిన్‌, ఆలం కలిపిన నీళ్ళు భూమ్మీద కాలువలో కొంత దూరం పారితే కొంతవరకు శుద్ధి అవుతాయని, మట్టిలోని ఖనిజ లవణాలు కూడా ఆ నీటిలో కలుస్తాయని నిపుణులు సూచించడంతో ఆ కాలువ తవ్వించారు. నిలువగుంతల్లో పేరుకున్న నీళ్ళు మొక్కల ఎదుగుదలకు అవసరమైన పోషకాలను కూడా సంతరించుకుంటాయి కనుక ఆ నీటిని రాశివనం మొక్కలకు, తర్వాత బోరు వద్దకు తరలించడానికి పూనుకున్నాము. ఆ గుంత నుంచి 150 మీటర్ల కాలువ తవ్వించి కాలేజీ కుడివైపు నుంచి పండ్లతోటలోకి మళ్ళించాము. తర్వాత కాలంలో ఆ గుంతను కళాశాలలో ఫిషరీస్‌ కోర్సు చదివే విద్యార్థుల కోసం మత్స్యకొలనుగా అభివృద్ధి పరచబడింది.

తర్వాత రాశివనం బోరును ఇదే నీటితో రీచార్జీ చేయాలనే నిర్ణయానికి వచ్చాము. ఎండిపోయిన బోరుబావి చుట్టూ ఇంకుడుగుంత మున్సిపాలిటీ సహాయంతో నిర్మాణం చేయించాము. అందులోకి నీళ్ళు రావడానికి కళాశాల ఎడమ వైపు నుంచి 300 మీటర్ల పొడవైన మరో కాలువ త్రవ్వించినాము. నీరు అధికంగా వచ్చినప్పుడు నిలువచేసుకోవడానికి 40 మీటర్ల పొడవుతో ఒక కట్ట పోసి బోరు చుట్టూ నీటిసంరక్షణ కొలనుగా తయారుచేశాము. అందులో దాదాపు 3 లక్షల లీటర్లకు పైగా నీరు నిలువ ఉంటుంది. అయినా బోరులో ఆశించిన మేరకు నీళ్ళు పెరగకపోవడంతో కలెక్టర్‌ సూచనతో నాబార్డు విధానం అమలు చేయాలనుకున్నాము.
ఆ ప్రణాళిక ప్రకారం రాశివనం బోరుబావికి 100 మీటర్ల ఎగువన 4 లక్షల లీటర్ల నిలువ గల మరో నీటి సంరక్షణ కొలను చెక్‌ డ్యాం పద్ధతిలో నిర్మించినాము. ఫిల్టర్‌ బెడ్‌ నుంచి వచ్చే వ్యర్థజలాలు అక్కడ నిలువ అయ్యేలా కాలువ గమనంలో మార్పు చేశాము. ఆ కొలను నిండిన తర్వాత మత్తడి దుంకి నీళ్ళు బోరుబావి వద్దకు పోవాలి. బోరుబావి చుట్టూ ఆరడుగుల గుంత త్రవ్వి దాని కేసింగు పైపుకు చిన్న చిన్న రంధ్రాలు చేసి, మూడు వరుసల జాలీలు చుట్టాలి. ఆ గుంతను గులకరాళ్ళు, ఇసుకతో నింపాలి. బోరుబావి వద్ద గల నీటికొలను నిండిన పిమ్మట రాశివనంలోకి ప్రవేశించి, దిగువగల మరో గుంతలోకి చేరుతాయి. ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైంది. అప్పటినుంచి ఆ బోరుబావిలో నీళ్ళు పుష్కలంగా వస్తున్నాయి. కొలనుల్లోనూ పూర్తిస్థాయిలో నీళ్ళు ఉంటున్నాయి. భూగర్భజలమట్టం అనూహ్యంగా పెరిగింది. 600 అడుగుల లోతులో అంతంత మాత్రంగా ఉండే భూగర్భ జలాలు ఇప్పుడు 70 అడుగుల్లోనే సమృద్ధిగా లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలో కురిసిన వర్షపు నీరు కూడా ఇవే కాలువలు, కొలనుల ద్వారా ప్రవహించేటట్లు ఏర్పాట్లు చేశాము.
క్రిందటేడాది కేంద్రప్రభుత్వం తరఫున జిల్లాను సందర్శించిన జలశక్తి అభియాన్‌ అధికారులు ఈ ప్రయోగం చూసి అద్భుతం అని ప్రశంసించారు. ‘వృధా జలాలను సహజ జలాలుగా మార్చుతున్న మీకు అభినందనలు’ అని మెచ్చుకున్నారు. అది మా కాలేజీకి గర్వకారణమైన గుర్తింపుగా సిబ్బంది భావించారు. ఇక్కడ అమలుపరచిన విధానాలతో నీటి సంరక్షణ చర్యల విభాగంలో కేంద్రప్రభుత్వం ఇచ్చే స్కోచ్‌ అవార్డు కామారెడ్డి మున్సిపాలిటీకి లభించింది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి, మున్సిపాలిటీకి జాతీయస్థాయి లో గుర్తింపు లభించింది.
వర్షపు నీరు కూడా ఇవే కాలువల్లో ప్రయాణించి ఎక్కడికక్కడ కొలనుల్లోకి చేరుకుంటుంది. పండ్లతోటలోకి వచ్చిన నీరు అక్కడి గుంత నిండిన తర్వాత దిగువకు వెళుతుంది. ఆ నీటిని ఒడిసి పట్టుకోవడానికి క్రింది భాగంలో ఒక సమీకృత వలయాకార జలసంరక్షణ కొలను అభివృద్ధి చేసినాము. కళాశాల భవనం, దాని ముందు నుంచి వచ్చే వరదనీరు అందులోకి చేరుతుంది. 40 మీటర్ల వ్యాసం, 2.5 మీటర్ల లోతుతో ఉండే ఆ కొలనులో 20 లక్షల లీటర్లకు పైగా నీరు నిలువ ఉంటుంది.

ఈ ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణ కొలనుల వల్ల మొక్కలు, చెట్లు పచ్చగా కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు కూడా అనూహ్యంగా పెరగినాయి. రాశివనం బోరు మాత్రమె కాక సమీప కాలనీల్లోని బోర్లలోనూ నీటిమట్టం పెరగింది. ఏటా ఎండిపోయే బోర్లలో నిరాటంకంగా నీళ్ళు వస్తున్నాయని స్వయంగా కాలనీ వాసులే చెబుతున్నారు.

పండ్లవనంలోని ఖాళీస్థలాల్లో పండ్లమొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటుతూ దాన్నొక దట్టమైన అటవీప్రాంతంగా తీర్చిదిద్దేలా చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పాదచారులు అడవిలో నడిచిన అనుభూతి పొందుతున్నారు. రాశివనంలోని మిగిలిన స్థలంలోనూ రాశుల మొక్కలు పెట్టించి పరిపూర్ణం చేసే ప్రయత్నం జరుగుతున్నది. పచ్చదనం పెరగడంతో విభిన్న జాతుల పక్షులు, కుందేళ్ళు, నెమళ్ళు కూడా వస్తున్నాయి.

మొత్తంగా మొక్కలే పెరగవు అనుకున్న నేెల మీద హరితహారం స్పూర్తితో ఒక జీవావరణమే సృష్టించ బడిరది. ఇప్పుడు మా కళాశాల హరితశాలగా కూడా విద్యార్థులను ఆకట్టుకుంటున్నది. ప్రజలు, అధికారులు, స్వచ్చంద సంస్థల మద్దతుతో రాబోయే కాలంలో కామారెడ్డి పట్టణంలో ఇదో దర్శనీయ స్థలంగా కీర్తికెక్కుతుంది అనడంలో సందేహం లేదు!

పచ్చదనం పెంచడం ప్రాణవాయువు కోసమే కాదు
ప్రాణికోటిని కాపాడుకోవడానికి కూడా!
(రచయిత రాశివనం కమిటీ కన్వీనరు)