అయోధ్య 6 డిసెంబర్ 1992 పరివేదనలో నుంచి పరిశోధన
By: డాక్టర్ వి.వి. రామారావు
వాల్మీకి శోకం నుంచి శ్లోకం ప్రభవించింది. అది రామాయణ కావ్యమైంది.. పి.వి. వేదనలోంచి శోధన మొదలైయింది… ఆది ‘అయోధ్య ఘటనకు సాక్షర చారిత్రక రచనగా నిలిచింది. రామాయణము, రామజన్మ భూమి – రెండూ అయోధ్య రామునికి చెందినవే కావడం గమనార్హం.

అందరూ అనుసరించాల్సిన మనుజధర్మాన్ని ఆదికవి అక్షరీకరించాడు. అంతరించి పోతున్న మానవతా విలువల్ని పి.వి. వ్యక్తీకరించాడు. ఆర్థిక సంక్షోభంలో పడిపోయిన దేశాన్ని గట్టెంకించి, పలు విప్లవాత్మక సంస్కరణలతో, ప్రగతిపథం లోకి తీసుకెళుతున్న తరుణంలో ‘బాబ్రీ మసీదు కూల్చివేత’ పి.వి.ని అత్యంత క్షోభకు గురిచేసింది. ఈ వ్యధకు కారణాలనేకం. ప్రధానంగా తన నిష్కళంక వ్యక్తిత్వానికి మాయని మచ్చ ఏర్పడిందని, ప్రధానిగా వున్నప్పటికి రాజ్యాంగ నియమ నిబంధనల చట్రంలో నిస్సహాయునిగా వుండి పోవాల్సి వచ్చిందని…. స్వపక్షం మొదలు విపక్షం వరకు, తన ఒంటరి పోరాటానికి సహకరించకుండా దూరంగా వెళ్లిపోయారని.. సహనానికి, సామరస్యానికి మారు పేరుగా నిలిచిన దేశం, మతమౌఢ్యంతో మసకబారిపోయిందని.. హాని జరపమని హామీలిచ్చిన నేతలు నమ్మక ద్రోహం చేసినందుకు!….
ఇలా అనేకానేక కారణాలతో బాధాసర్పద్రష్టుడై పోయారు పి.వి. అయితే తన ఆవేదనలోంచి బయటపడి లోతైన పరిశోధనకే ఉపక్రమించారు. అయోధ్య ఘటనకు దారితీసిన పరిస్థితులను, లోతుగా పరిశోధించి, చారిత్రక ఆధారాలతో సమగ్ర రచనగా రూపొందించి, 250 పేజీల పైచిలుకు సిద్ధాంత గ్రంథంగా వెలువరించారు.
‘‘అయోధ్య 6 డిసెంబర్ 1992’’ శీర్షికన, పి.వి. ఆంగ్లంలో రాసిన యీ గ్రంథం, ‘ఇన్సైడర్’ వలె పాక్షిక కాల్పనిక రచన కాదు. సత్యాసత్యాలను, ధర్మాధర్మాలను, న్యాయన్యాయాలను, నిజానిజాలను వివరించిన సునిశిత విమర్శనాత్మక గ్రంథం. పి.వి ప్రధాని అయ్యాక, అయోధ్య అంశానికి సంబంధించి, సమకాలీన రాజకీయ సామాజిక సంఘటనలను ప్రస్తావిస్తు, తనను కూడా ఒక పాత్రగా చేసుకొని ఆత్మకథాత్మక రచనగా అందించారు. 1996లో, ప్రధానిగా పదవీ విరమణ చేసిన తదుపరి, యీ రచనను ప్రారంభించి, 2004లో తుదిశ్వాస వదిలే ముందు పూర్తి చేసి, తన మరణానంతరమే ప్రచురించాలని కోరుకున్నారు. ఆయన అభిమతం మేరకు, ‘పెంగ్విన్ బుక్స్ ఇండియా, పబ్లిషర్స్’ 2006లో ఆంగ్లంలో, తెలుగులోనూ ప్రచురించారు. తెలుగులో రావెల సాంబశివరావు అనువదించిన యీ గ్రంథం 2008లో ద్వితీయ ముద్రణగా వెలువడింది.
గ్రంథరచనకు సంబంధించి, పి.వి. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు. ప్రతి పదాన్ని ఆచి, తూచి ప్రయోగిం చారు. అధిక్షేపానికి, వ్యంగ్యానికి, శ్లేషకు ఎక్కడా ప్రాధాన్యమీయలేదు. ఒకవేళ ఎవరైనా, ఆయా పదాలకు విపరీతార్థాలు వూహిస్తారేమోనని పి.వి. ఎక్కడికక్కడే తన భావాలకు వివరణ యిచ్చారు.
గ్రంథం ఉపోద్ఘాతం లోనే పి.వి. తన ఆంతర్యాన్ని వెల్లడించారు. బాబ్రీమసీదు కూల్చివేతను మతోన్మాదుల దండయాత్రగా వర్ణించి, ‘‘అధికారపు కైపులో మనిషి ఆయుధాల సాయంతో దేవుడి రూపునే మార్చివేయాలను కున్నాడని’’ ఇది మనిషి ఆటవిక చర్య అని ఘాటుగా విమర్శించాడు. ఈ రచన ఒక అనుశీలనే గాని, తనపైన వచ్చిన ఆరోపణలు నిందలకు సమాధానంగానో, నిర్దోషి త్వాన్ని నిరూపించుకొనే డాక్యుమెంటుగానో భావించ రాదని మనవి చేశారు.
‘‘బాబ్రీ కట్టడం కూల్చివేత వంటి దురదృష్టకర ఘటన జరిగి ఇన్నేళ్ళయిన తరువాత, ఆవేశకావేషాల వత్తిళ్ళకు లోనుగాకుండా… గతించినది అందించే తార్కికపు సానుకూలతలకు దూరంగా 1992 డిసెంబర్ 6 నాటి దుర్ఘటనకు దారి తీసిన అంశాలను, విస్తృతమైన ఆధారాల ప్రాతిపదికన రాజ్యాంగ బద్ధంగా, న్యాయానుగుణంగా, చట్టపరంగా యీ గ్రంథం పరిశీలించ ప్రయత్నిస్తుంది. ఆనాడు జరిగిన దానికి.. జరగని దానికి గానీ, కావలసిన సమర్ధనను సమకూర్చుకునేందుకు గానీ.. స్వధర్మ బుద్ధిని చాటిచెప్పేందుకు గాని ఉద్దేశింపబడినది కాదిది. వాస్తవ ఘటనాక్రమాన్ని రాజ్యాంగంలో పొందుపరచిన అంశాల్లోని.. భాషలోని సంక్లిష్టతల్ని వివరించే ప్రయత్నమే యిది. రాజకీయ విభేదాలకు, ఉద్యమాలకు, సిద్ధాంతాలకు ధార్మిక విషయాలను సంపూర్ణంగా దూరంగా వుంచాల్సిన అవసరాన్ని మనసుకు హత్తుకునేట్లు చెప్పదలచింది’’ (అయోధ్య 6 డిసెంబర్ 1992. గ్రంథం. తెలుగు అనువాదం. పుట 15,16) అని పి.వి. వెల్లడించారు.

పి.వి. గారు వివరించిన దాన్ని బట్టి మూడు విషయాలు స్పష్టమవు తున్నాయి. ఒకటి, జాతీయ శ్రేయస్సు దృష్ట్యా ఫెడరల్ వ్యవస్థలో విశ్వాసం గల రాజకీయ పార్టీలు, ప్రజలపై తమ భావజాలాన్ని రుద్దకూడదని. రెండవది భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను అవకాశవాద రాజకీయాలకుప యోగించరాదని, మూడవది లౌకికవాదులమని చెప్పుకొనే మనం మత పరమైన, ఉద్యమాలు సిద్ధాంతాలు, దూరంగా వుంచాలని.
పి.వి. అయోధ్య ఉదంతాన్ని చారిత్రక, సామాజిక, ధార్మిక, రాజకీయ కోణాల్లో పరిశీలించారు. యాభై సంవత్సరాలుగా రావణ కాష్టం వలె రగులు తున్న అయోధ్య`బాబ్రీ మసీదు’, అంశం ప్రధాని బాధ్యతలతో పాటు ‘‘వారసత్వం’’ గా స్వీకరించాల్సి వచ్చిందని, పేర్కొనడంతో గ్రంథం మొదలవు తుంది. మెదటి నాలుగు అధ్యాయాల వరకు, 1949 డిసెంబర్లో మసీదులోకి శ్రీరామాదుల విగ్రహాలు చేర్చింది మొదట 1989 సంవత్సరంలో శిలాన్యాస్ వరకు చోటుచేసుకొన్న ఘటనలు, ప్రభుత్వ జోక్యాలు, కోర్టు ఉత్తర్వులు, వివిధ మతసంస్థల నినాదాలు, ఆర్.ఎస్.ఎస్. విశ్వహిందూ పరిషత్, బి.జె.పి.ల సమధికోత్సాహ ఉద్యమాలన్నిటిని, క్రమం తప్పకుండా విశదీకరించారు పి.వి.

‘‘అయోధ్య అంశం పట్ల తొలి ప్రధాని నెహ్రూ అంతగా ఆసక్తి చూపించ లేదు. పైగా, ‘‘మసీదు నుండి విగ్రహాలను తొలగించాలని,’’ నాటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యంత్రి గోవిందవల్లభ పంత్, నాటి రాష్ట్ర హోం మంత్రి లాల్ బహద్దూర్ శాస్త్రికి ఆదేశాలిచ్చారట (పుట. 22). అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడం అంత తేలిక కాదని, ఏ ఒక్క పూజారిని ఎంత ప్రలోభ పెట్టినా విగ్రహం తొలగించే ‘క్రతువు’ లో లభింపడని’’ పోలీసు డిప్యూటి కమీషనర్ కె.కె.కె. నాయర్ తన అశక్తతను వెల్లడిస్తూ సుదీర్ఘ అధికారిక లేఖల్లో ప్రభుత్వానికి విన్నవించారని (పుట 29) పి.వి. లేఖల ప్రతులతో సహా వివరించారు.
విగ్రహాల తొలగింపులో ప్రభుత్వం ఒత్తిడి చేస్తే తన బదులు మరో అధికారిని నియమించాలని, కె.కె. నాయర్ రాసిన లేఖ, కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభ భాయి పటేల్‌ను కాస్త ఆందోళనకు గురిచేసింది. విగ్రహాలను తొలగించే పనికి స్వస్తి చెప్పి కోర్టు ఉత్తర్వుల ప్రకారం గుడి తలుపులకు తాళాలు వేయించగలిగింది ప్రభుత్వం. ‘‘రామ మందిరము, ‘బందిఖాన’ వలె మారగా, భక్తులు దేవుడిని, చువ్వల సందుల నుంచే దర్శించే స్థితికి వచ్చిందని వి.హెచ్.పి. విమర్శించిందని పి.వి. పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతీ, సంప్రదాయాల పట్ల పి.వి.కి ఎంతో గౌరవం, విశ్వాసమున్నది. వ్యక్తిగతంగా ఆయన ఆధ్యాత్మిక యోగ…. కాని రాజకీ యాలలో లౌకికవాదిగా వుండటాన్నే ఇష్టపడ్డారు. ఆయనకు అన్ని మత విధానాలు, ధర్మాలు తెలుసు. విద్యార్థి దశలోనే ఖురాన్ చదివి వ్యాఖ్యానం చేశాడు. వేదోపనిషత్తుల సారమెరిగి, భగవద్గీతను అధ్యయనం చేసినవాడు . బైబిల్ లోని మౌలికాంశాలను భాగవత గాథలతో పోల్చి చర్చించిన మేధావి. అయితే భారత రాజ్యాంగ మూల సూత్రాలయిన లౌకిక వాదం, వంటి విషయాలలో కొన్ని రాజకీయ విపక్షాలు మాటి మాటికి మూల సూత్రాలను ఉల్లంఘిస్తూ, వేర్పాటు వాదం, మతపరమైన, ఉద్యమాలు, సాయుధ తిరుగు బాట్లు చేయడం పట్ల కలత చెందారు. జాతీయ సమైక్యతను భగ్నం చేసే విచ్ఛిన్నకర శక్తులను తీవ్రంగా ఖండించాడు. (పుట 36)
1960లో ద్రావిడ ఉద్యమం, 1980ల్లో ఖలిస్తాన్ ఉద్యమం, ఈశాన్య ప్రాంతంలో నాగాలాండ్, బోడో ఉద్యమాలు, జాతీయ ఏకతాభావాన్ని భగ్నం చేస్తే, బ్రిటిష్ వారి ‘విభజించు పాలించు’ సూత్రం కులాల మధ్య కుంపట్లు పెట్టినట్లయిందని పి.వి. విశ్లేషించారు.
లౌకిక వాదాన్ని బలంగా నమ్మిన కాంగ్రెసు పార్టీని, వివిధ మతశక్తులు 1947లో దేశ విభజన సమయం నుంచే ఇబ్బందుల్లో పెట్టాలని ప్రయత్నించాయి.
భారతీయ జన సంఘ్, అనేక పరివర్తనాలకు లోనై భారతీయ జనతా పార్టీగా పరిణమించి, ఆర్.ఎస్.ఎస్. వి.హెచ్.పి. శివసేన, భజరంగ్ దళ్ మొదదలైన కూటముల వత్తా సుతో కాంగ్రేసు ఓటు బ్యాంకును దెబ్బతీయాలని 1984 నుంచే, రాజకీయ చదరంగంలో పావులు కదపసాగింది. వారికి ‘అయోధ్య బాబ్రీమసీదు’ అంశం బ్రహ్మాస్త్రంగా పనికి వచ్చిందని, పి.వి. పేర్కొన్నారు. అయితే, బి.జె.పి.కి హిందూ కార్డు పనికి రావడంలో అర్థమున్నదని కానీ వాళ్ళతో జతకట్టి మూడు కాళ్ళ పరుగులో పాల్గొన్న అనేక లౌకిక వాద రాజకీయ పక్షాల వారు సైతం ‘హిందూ కార్డును’ వాడుకోవడాన్ని ఆక్షేపించడం, పి.వి. వాస్తవిక దృష్టిని సూచిస్తుంది (పుట37)
మొత్తానికి 1984లో ఇందిరా గాంధీ మరణం, మళ్ళీ కాంగ్రెసుకు పునర్జన్మనిచ్చింది. అయోధ్య విషయంలో రాజీవ్ గాంధి కాస్త చొరవ చూపారు. బిజెపి, అప్పుడే ‘గంగాజల ప్రచారం’ ప్రారంభించింది. అది హిందువుల మనసుల్లో – ఎంత గాఢముద్ర వేసిందంటే, తాము తెస్తున్న ‘‘గంగాజలం, ఎంత కాలుష్యంతో నిండినప్పటికీ, పవిత్రమైనదనే భావన కలిగించింది.’’ గంగాజల ప్రచారం ముందు రాజీవ్ గాంధీ భారీ వ్యయంతో తలపెట్టిన గంగాజల శుద్ధి పర్యావరణ హితకార్యక్రమం వెలవెల బోయిందని పి.వి. బిజేపి దీర్ఘకాలిక వ్యూహంలో తొలి అడుగుగా పేర్కొన్నారు. (పుట38) అయోధ్య అభివృద్ధికి, ఇందిరమ్మ ప్రతిపాదించిన ‘రామ్‌కి పౌరి ప్రాజెక్టు’ వంటి పలు పథకాల కుంటుపడ్డాయి.
పి.వి. అధ్యయనంలో 1985 అక్టోబర్ 25న మొదలైన బిజెపీ రథయాత్ర కాంగ్రెసు లౌకికవాదులను నిరుత్తరులను చేసింది. 1986 ఫిబ్రవరిలో ఫైజాబాద్ జిల్లా జడ్జి కె.ఎం.పాండే గుడి తాళాలు తెరవాల్సిందిగా ఆదేశించడం, జిల్లా యంత్రాంగం కేవలం నలభై నిమిషాల్లోనే కోర్టు ఉత్తర్వులు అమలు పరచడం చకచకా జరిగిపోయిన తరుణంలో కేంద్ర హోం మంత్రి బూటాసింగ్, స్వయంగా రంగంలోకి దిగారు. విషయమేమిటంటే, అయోధ్య అంశం తీవ్రతరమవుతున్న పరిస్థితులలో, 1980 నుండి 1988 వరకు కాంగ్రెసు పార్టీయే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో ఉన్నది. పి.వి.తో 1980లో స్నేహభావంతో ఉండి ప్రధాని పరుగు పోటిలో వ్యతిరేకించిన ఎన్.డి. తివారియే 1984-85, 1988-89 కాలంలో ముఖ్యమంత్రిగా వుండటం గమనించదగ్గ అంశం. గుడి తలుపుల తాళాలు తీయించినపుడు, కాంగ్రెసు పార్టీ అధిష్ఠానం నియమించిన వీరబహద్దూర్ సింగ్ ముఖ్యమంత్రిగా వున్నారు. పలువురు విహెచ్పి పథకాన్ని ముందుగా తామే (కాంగ్రెసు పార్టీ) అమలు చేసేందుకు ‘‘తొందరపాటుతో చేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంగా అభివర్ణించార’’ని (పుట41) పి.వి పేర్కొనడాన్ని బట్టి కాంగ్రెసు ‘హస్తం’ ఎంత శాతముందో తెలుస్తుంది.
కాంగ్రెసు పార్టీ తొందరపాటు చర్యలను, బి.జె.పి. విశ్లేషిస్తూ, ఆ పార్టీ రామజన్మభూమి విషయంలో హిందువులకు వ్యతిరేకం కాదని 155 పేజీల శ్వేతపత్రంలో ఎండగట్టింది (పుట 42) దీనికి తగ్గట్లు వీరబహదూర్ సింగ్, రామమందిర నిర్మాణం కోసం ట్రస్టును ఏర్పాటు చేసి, వి.హెచ్.పి. పైచేయి సాధించాలన్న ప్రణాళికను రాజీవ్ గాంధీకి పంపించారు. అది అంతగా పరిశీలింపబడలేదు – ఈ నేపథ్యంలో బి.జె.పి. శిలాపూజలు, రథయాత్రలు, గంగాజలం మోసుకు రావటం వంటి కార్యక్రమాలతో దేశానికి ప్రమాదకరంగా పరిణమించే దిశలో రాజకీయ ప్రక్రియను దారి మళ్ళించటంలో సఫలీకృతమైనదని (పుట.49) పి.వి. వివరించారు. కాంగ్రెేసును ఓడించాలనుకొన్న జనతాదళ్‌తో, చేతులు కలిపిన బి.జె.పి. తదుపరి వి.పి.సింగ్ ప్రభుత్వాన్నే దెబ్బ తీసింది.
ఇక్కడ పి.వి. తమ గురించి, కాంగ్రెసు పార్టీ గురించి నిర్ద్వంద్వంగా పేర్కొన్న మాటలు ఆయన నిష్పక్ష పాత వైఖరికి నిదర్శనం. ‘‘బి.జె.పి. కుహనా ధార్మిక ఉద్యమం స్వచ్ఛమైన ధార్మిక స్థరంలో నిలువలేక రాజకీయ లబ్ధికి దానికొక రాజకీయ ప్రతిస్పందన కావలిసి వచ్చింది. మేము కాంగ్రెసు వాళ్ళం (అధికారంలో ఉన్న సమయంలో) దాన్ని పెంచి పోషించామనే ఒక వ్యాకుల పాటు నన్ను వెన్నాడుతూ వుంటుంది. మేము కూడా యీ ధార్మిక సున్నితత్వాన్ని అమలులో ఉంచలేక పోయాం. మావైపు నుండి మత ప్రమేయ భావన ప్రకటిస్తే లౌకితత్వానికి భిన్నంగా చూస్తారేమోనన్న భయం. తత్ఫలితంగా ప్రజల మనసుల్లో బి.జె.పి. హిందూ మతానికి ఏకైక కాణాచిగా, రక్షక సంస్థగా ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. బి.జె.పి.కి తన చర్యలు బాకాలూదేవి. వి.హెచ్.పి. ఆర్.ఎస్.ఎస్. ఉన్నాయి.’’ అని (పుట 53) బిజెపి విజృంభణకు కాంగ్రెసు నిష్క్రియాతత్వానికి కారణాలు వెల్లడించారు.
గుడి తాళాలు తెరిపించటం, శిలాన్యాస్ మొదలగు విషయాల్లో ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెసు ప్రభుత్వం చొరవ తీసుకొనడం ప్రారంభించగానే, ముస్లింలు కాంగ్రెసుకు దూరమయ్యారు. కాంగ్రెసు పార్టీకి ఇది మరో దెబ్బగా, పి.వి. పేర్కొన్నారు.
మరోవైపు మందిరం గేట్ల తాళాలు తీయడం, శిలాన్యాస్ తదితర చర్యలతో బి.జె.పి. క్రమబద్ధంగా అయోధ్యను రాజకీయం చేస్తూ, సృష్టించిన సంక్లిష్టస్థితి, అనూహ్య పరిణామాల వల్లె ఎదురైందని, దీనికి ఎవరూ బాధ్యులు కారని, పి.వి. ఈ పుస్తకంలో వీలున్న చోటల్లా చెప్పారు. ‘‘నేను ఎవరో, ఏదో, ఎప్పుడో చేసిన దానిని విమర్శించటం లేదు. జరిగిన ఘట్టాల్ని తేదీల వారిగా వరుస క్రమంలో పెడుతున్నాను. అవి జరిగిన తీరును బట్టి నేపథ్యంలోని ఉద్దేశ్యాలను పరిగేరినట్లు ఏరుతున్నాను’’ (పుట 54) అని నొక్కి వక్కాణించారు.
రామ్‌టెక్ నియోజక వర్గం గుండా పోయే జాతీయ రహదారిలో దక్షిణాది రాష్ట్రాల నుండి వచ్చే పూజ చేయబడిన ఇటుక రాళ్ళ లారీల ఊరేగింపులు చూసిన పి.వి.కి, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రజలెంత సమాయత్తమవుతున్నారో తెలిసిపోయింది. ప్రజలే కాదు, ‘శిలాన్యాస్’ అనుమతి విషయంలో, అత్యున్నత స్థాయిలో అస్మదీయుల ‘హస్తం’ కూడా వుందన్న వార్తను విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్నారు. అందులో కేంద్ర హోం మంత్రి బూటా సింగ్ పాత్ర ‘‘ఉండటాన్ని, పి.వి గ్రహించారు. (పుట 54)- ఇందిరా గాంధికి అత్యంత విశ్వసనీయుడు, స్వర్ణ దేవాలయంలో, 1982లో ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహణలో పాల్గొన్నవాడు, రాజీవ్ గాంధీకి సన్నిహితుడైన, అంతటి సీనియర్ లీడర్, అయోధ్య వ్యవహారాల్లో తెరవెనుక పోషించిన పాత్రను పి.వి. సున్నితంగా స్పృశించి, అది పాఠకులకే వదిలేశారు.
శిలాన్యాస్‌ను అనుమతిస్తే శాంతి భద్రతల సమస్యకు దారి తీస్తుందని ‘సున్నీ కేంద్రీయ వక్ఫ్ బోర్డు,’ అలహాబాద్ హైకోర్టు ప్రత్యేక బెంచి ముందు దరఖాస్తు చేసింది. ఈ అభియోగాన్ని ఖండిస్తు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతి వాఙ్మూలంలో కట్టడపు భద్రతకు తగిన చర్యలు తీసుకొంటామని స్పష్టం చేయడంతో, 1989 నవంబర్‌లో వి.హెచ్.పి. శిలాన్యాస్‌కు మార్గం సుగమమయింది. అలా అనుమతించి, వి.హెచ్.పి.కి సాయం చేసిన నాటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో కాదు, ఇందిరా, రాజీవుల మరో సన్నిహితుడు నారాయణదత్ తివారి!
‘‘శిలాన్యాస్‌కు అనుమతించటం, హిందూ సనాతన వాదులతో కుమ్మక్కయిన చర్చ’’గా నాటి తివారి కాంగ్రెసు ప్రభుత్వాన్ని బి.జె.పి. తప్ప, మిగతా పార్టీలు విమర్శించాయి. ఈ చర్యవల్ల ఎన్నికల్లో కాంగ్రెసు ఘోరంగా ఓడిపోయింది. జనతాదళ్ అభ్యర్థిగా ములాయంసింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టారు.
ఆరవ అధ్యాయంలో కేంద్రంలో, రాష్ట్రంలో జనతాదళ్ (నేషనల్ ఫ్రంట్) ప్రభుత్వాలు 1990లో అయోధ్య సంక్షోభాన్ని కాస్త నివారించగలిగారని కారణం, ఆ ప్రభుత్వాలకు బి.జె.పి. పరోక్షంగా మద్దతునివ్వడమనే పి వి. పేర్కొన్నారు. అదే బి.జె.పి. మరోపక్క రథ యాత్రను ప్రకటించింది. వి.హెచ్.పి. ‘కరసేవ’ కోసం లక్షలాది మందిని పంపించటంతో ‘ములాయం సింగ్ యాదవ్ వివాదస్పద క్షేత్రం చుట్టూ భద్రతా వలయాన్ని నిర్మించింది. ప్రతి చోట కేంద్ర పారామిలటరీ బలగాలు మోహరించింది. బి.జె.పి. నేతలను అరెస్టు చేశారు. చివరికి అయోధ్యమందిరంలోకి చొచ్చుకువస్తున్న వేలాది కర సేవకులపైన కాల్పులు జరిపించారు. దాంతో బి.జె.పి. వి.పి.సింగ్ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకొంది. ‘‘ప్రధాని పదవిని కోల్పోయినప్పటికీ, వి.పి.సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయంసింగ్ బాబ్రీ మసీదు విధ్యంసాన్ని ఆపగలిగారని’’ పి.వి. ఈ అధ్యాయంలో కళ్ళకు కట్టినట్లు వివరించారు. అంతే కాదు పారా మిలటరీ బలగాలను రాష్ట్రప్రభుత్వం వాడుకున్న తీరును తన హయాంలో కల్యాణ్ సింగ్ ప్రభుత్వం తిరస్కరించిన తీరును చూపించారు. పి.వి.
‘‘ఇక్కడ నా ఉద్దేశ్యం 1990 నాటి రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని అదుపులో ఉంచిన తీరును 1992 డిసెంబర్లో కల్యాణ్ సింగ్ ప్రభుత్వం నిర్వాకంతో సరిపోల్చి చూపటమే. కేంద్ర ప్రభుత్వం ఆ రెండు సందర్భాల్లోనూ కేంద్ర పారా మిలటరీ దళాలను ఒకే విధంగా తగిన సమయంలో పంపింది. అది చేయగలి గింది అంతే! మీకు ఒక తేడాను వివరిస్తా- ములాయం సింగ్ గట్టిగా అడ్డుకుంటే కల్యాణ్ సింగ్ దేశవ్యాప్తంగా ప్రజాసమూహాల్ని ఆహ్వానించడం’’ (పుట 72)
ఏడవ అధ్యాయం నుంచి పి.వి. పాత్ర రంగ ప్రవేశం చేసింది. కేంద్రంలో తన మైనారిటీ ప్రభుత్వాన్ని, అతి పెద్ద మెజారిటీతో ప్రతిపక్షంలో కూర్చొన్న బి.జె.పి.
ఉత్తర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చి ఏకంగా రామునికి గుడి కట్టి తీరుతామని ప్రకటించింది. ఇక్కడి నుంచి పి.వి. ఇన్నింగ్స్ మొదలయింది.
క్రికెట్ క్రీడలో, చుట్టూ ఫీల్డర్లు మోహరించగా, భయంకరమైన బౌలింగ్‌తో బౌన్సర్లు యార్కర్లు సంధిస్తుంటే, ఆత్మరక్షణార్థం, డిఫెన్సు ఆడుతూ వికెట్లను కాపాడుకుంటూ, గాయాలపాలైన టేల్ఎండర్ బ్యాట్స్‌మెన్ లా, పి.వి. పరిస్థితి వుందని వర్ణించవచ్చు. పైగా వి.ఐ.పి. బాక్స్‌లో కూర్చుని వున్న సోనియా గాంధి. అర్జున్ సింగ్, అహమ్మద్ పటేల్ వంటి ప్రేక్షకులు, పి వి. ఎప్పుడు క్లీన్ బౌల్డ్ అవుతాడా అని ఎదురు చూసే స్వపక్షీయులు కావడం గమనించాలి. బౌలర్ అతివేగంగా వేసే బంతిని ఆడినపుడల్లా స్వపక్షీయులు చప్పట్లు కొట్టేవారు. ఆ చప్పట్లు పి.వి. డిఫెన్స్‌గా ఆడి వికెట్లు కాపాడుకున్నందుకు కాదు.. పి.వి.ని పరుగులు చేయనీయని ప్రతిపక్ష బౌలింగ్‌ను అభినందించడానికేనని పి.వి. గ్రహించాడు. అందుకే నాటవుట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచి ప్రభుత్వాన్ని కాపాడాడు.
ఏడవ అధ్యాయం మొదలు చివరి తొమ్మిదవ అధ్యాయం (అధికరణం-356ను ఎందుకు ప్రయోగించలేదు) వరకు దాదాపు 60 పేజీలలో, పి.వి. బాబ్రీ మసీదు కూల్చివేతను ఆపడానికి చేసిన తీవ్ర ప్రయత్నాలన్ని కీలకమైన రుజువులతో సహా ఉటంకించారు. తన తెలివితేటలు గాని, తనకు అత్యంత విశ్వాసపాత్రంగా పని చేసిన ఎస్.బి. చవాన్ మొదలగు మంత్రులు, సీనియర్ అధికారులు గాని అంతా కల్యాణ్ సింగ్ నమ్మకద్రోహన్ని ఎరిగి సైతం, రాజ్యాంగ నియమాల సంకెళ్లలో చిక్కుకొని చేష్టలుడిగి చూడాల్సి వచ్చిందని, ఈ అధ్యాయంలో నిశితంగా పేర్కొన్నారు.
చివరికి ధార్మిక మత సంస్థల నేతలు, సాధువులు, యోగులు, పీఠాధిపతులు సైతం శల్యసారథ్యం వహించడాన్ని పి.వి. జీర్ణించుకోలేక పోయారు. పి.వి.తో చర్చలు జరపడానికి వచ్చిన ధార్మిక నాయకులు, మహంతులు సాధువులలో ఎక్కువ శాతం నకిలీ యోగులేనని, గూఢచారి వర్గాలు తెలియజేశాయి. వారి ప్రవర్తన కూడా అహంకారంగా వుండేదని పి.వి.పేర్కొన్నారు. ‘‘నేను నాలుగు మాసాల సమయానికి అదనంగా మరో మాసం కోరాను. అయినా ఈ నాలుగైదు మాసాలు ఎవరికిస్తున్నట్లు? దేశమనుగడను సవాలు చేసే ఒక క్లిష్ట విషయానికి పరిష్కారాన్ని కనుగొనేందుకు దేశ ప్రధానికి యిస్తున్నారు… నేనేదో భిక్షకుణ్ణయినట్లుగా వాళ్ళు పరిష్కారం కోరటం లేదని స్పష్టమైపోయింది.’’ (పుట.158)
‘‘సంఘటన జరిగిన తరువాత.. అంతా ముందే గ్రహించిన ఋషుల్లా కన్పించినా అదంతా నటనేనని నేననాల్సివస్తుంది.. ఎందుకంటే ఈ విధ్వంస నాటకాన్నంత రక్తి కట్టించిన వారు వారే..’’ (పుట 160)
‘‘ఇక నా సహచర గణం విషయానికొస్తే.. అధ్యక్ష పాలన విధించాలని, కోరిన వాళ్ళెవరూ, తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతాయన్న ఆలోచనలు ఏమి చేయకుండానే సలహాలిచ్చారు.(పుట.160) అని తనవారి ‘హ్రస్వదృష్టిని’ ప్రస్తావించారు. మొత్తానికి అయోధ్య వ్యవహారంలో సాధువులు, సైతాన్ల వలే, స్వపక్షం వలె వ్యవహరించారని, పి.వి. మాటల్లో ధ్వనించింది. ఏదై తేనేం ప్రధానిగా ఉన్నపుడు బహిర్గతపరచలేని, బహిరంగంగా చెప్పుకోలేని అనేక కీలకాంశాలను అక్షర నిక్షిప్తం చేసి ఈ దేశ ప్రజల ముందుంచి, తన నిర్దోషి త్వాన్ని నిరూపించుకున్నారు పి.వి. గ్రంథాన్ని తన సహ చరగణం గురించి, వారి ఆంతర్యం గురించి గ్రంథాంతం లో ఘాటుగా వ్యాఖ్యానించారిలా.
‘‘విషయం విషాదాంతంగా పరిణమిస్తే, ఆ విషాదాని కంతటికీ ఒక వ్యక్తిని చారిత్రకంగా బాధ్యత వహించేలా చేయాలనుకున్నారు. ఒకవేళ విజయం సాధిస్తే దానినంతా తమ ఖాతాలో జమకట్టుకొనేవాళ్ళు. విజయం లేదా అపజయం కోసం ఒక బలిపశువును (పి.వి.) సాకుగా చూపేందుకు తమ ఆటను కొన సాగించారు. అదొక తిరుగులేని వ్యూహం.’’
ఈ పుస్తకం 1996 లోనే వెలువడివుంటే, దేశ రాజకీయాల పరిస్థితి – కొంతలో కొంతైనా మార్పు కనిపించేది. తనకెదురైన పరిస్థితులకే వ్యధ చెందారు కానీ కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై ఒక్క వ్యాఖ్య చేయకపోవడం, పి.వి.పెద్దమనసును, హుందా తనాన్ని సూచిస్తుంది. ఈ రచనలో తన పాత్రను కూడా ఎక్కడా నియంత్రించుకోలేదు. ప్రధానిగా తన స్థానాన్ని గుర్తెరిగి.. ఒక జర్నలిస్టు కోణంలో, సమవర్తిగా చిత్రిం చారు. పీ.వి. ‘ఇన్ సైడర్’లో ‘లోపలి మనిషిని ఆవిష్కరిస్తే,’ ‘అయోధ్య 6 డిసెంబర్ 1992’ పుస్తకం, పి.వి. లోని అసలు మనిషిని చూపించింది. ఈ పుస్తకం మార్కెట్లో విడుదలయ్యాక, ‘ఇన్సైడర్’ కన్న ఎక్కువ ఆకర్షించింది. చాలా ఆంగ్ల పత్రికలలో సమీక్షలు వెలువడ్డాయి. ముందుగా ఈ పుస్తకానికి “Babri Masjid – My part in its downfall” టైటిట్ పెడదామను కున్నారు. మళ్ళీ కల్యాణి శంకర్ ప్రభృతులతో సంప్రదించి ‘అయోధ్య 6 డిసెంబర్ 1992’ టైటిల్‌ను నిర్ణయించారు. (Ref. Rediff.com 16 April 1998) దేశంలో లౌకికవాదం, మత తత్వం, రాజ్యాంగ నియమాలు కాలానుగుణంగా రాజకీయాలను, ప్రజలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోదలచిన ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాల్సిన పుస్తకమిది. దేశ రాజకీయాలపై పి.వి. సంధించిన అక్షరాస్త్రమిది.