|

మద్యం షాపుల్లో కోటా

దళితులకు 10శాతం, గౌడలకు 15 శాతం, ఎస్టీలకు 5 శాతం

రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి మద్యం దుకాణాలలో గౌడకులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం దుకాణాలు కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దళిత బంధు కింద లబ్ధిదారులకు వైన్‌షాపుల్లో కూడా రిజర్వేషన్‌ కల్పిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించినందున మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రాధాన్యత లభించింది.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి, పోడుభూముల సమస్యలపైన, కొత్త జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్లలో సమస్యలపైన మొత్తం మూడు మంత్రివర్గ ఉపసంఘాలను కూడా నియమిస్తూ మంత్రి మండలి నిర్ణయించింది. సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చించి, పలు తీర్మానాలు కూడా చేశారు. తొలుత రాష్ట్రంలో కరోనా పరిస్థితి, నియంత్రణపై మంత్రి వర్గం చర్చించింది.

పూర్తి అదుపులో ‘కరోనా’

ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కేబినెట్‌ ఆరా తీసింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు కేబినెట్‌కు సమాచారం అందించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించి సమాచారాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతర పరిస్థితులను కేబినెట్‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరించారు. స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తరువాత కరోనా కేసులలో పెరుగుదల లేదని, కరోనా పూర్తిగా అదుపులో ఉందని వారు కేబినెట్‌ కు వివరించారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్‌, టెస్ట్‌ కిట్స్‌, వ్యాక్సినేషన్‌ అందుబాటులో ఉన్నాయని వివరించారు.   

2 కోట్ల వ్యాక్సినేషన్‌ పూర్తయిందని, ఇప్పటివరకు 2 కోట్ల, 56 వేల 159 డోసులు అందించారని వారిలో 1 కోటి 45 లక్షల 19 వేల 909 మొదటి డోసు, 55 లక్షల 36వేల 250 మందికి రెండు డోసులు ఇవ్వటం జరిగింది. స్పెషల్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కింద ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లోని పంచాయతి మున్సిపల్‌ అధికారులు, సర్పంచులు, ఎంపిటీసిలు, జడ్పిటీసిలు, ఎంపిపి, జడ్పీ ఛైర్‌పర్సన్‌, ఎంఎల్‌ఏలు, ఎంఎల్సీలు తదితర ప్రజాప్రతినిధులు క్రియాశీలకంగా వ్యవహరించాలని, మంత్రులందరూ ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో విజయం సాధించాలని, ప్రతిరోజు 3 లక్షల వరకు టీకాలు వేసే విధంగా పూర్తి సన్నద్దతతో వ్యవహరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కేబినెట్‌ నిర్ధేశించింది.    

కొత్త మెడికల్‌ కాలేజీలు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్‌ అండ్‌ బి, వైద్యారోగ్య శాఖను కేబినెట్‌ ఆదేశించింది. హైదరాబాద్‌లో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాట్లపై కేబినెట్‌ సమీక్షించింది. ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాట్లపై సత్వరమే చర్యలు చేపట్టాలని, అత్యంత వేగంగా ఆసుపత్రుల నిర్మాణం జరగాలని కేబినెట్‌ ఆదేశించింది. గతంలో 130 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ 

ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే వుండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్‌ టన్నులకు పెంచుకున్నామని, దీనిని మరింత పెంచి 550  మెట్రిక్‌ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను కెేబినెట్‌ ఆదేశించింది. 

ఒకవేళ చిన్నపిల్లలకు కరోనా వస్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు కేబినెట్‌కు వివరించారు. 133 కోట్ల ఖర్చుతో బెడ్స్‌, మందులు, ఇతర సామాగ్రిని, చిన్నపిల్లల వైద్యం కొరకు 5200 బెడ్లు, ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృద్ధి కొరకు సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుని తదుపరి కేబినెట్‌ ముందుకు తీసుకురావాలని మంత్రి మండలి వైద్య శాఖాధికారులను ఆదేశించిది.

వ్యవసాయ అంశాలపై చర్చ

వర్షపాత వివరాలు, వానాకాలంలో రాష్ట్రంలో మొత్తం సాగయిన భూమి వివరాలు, పంటల దిగుబడి అంచనాలు తదితర వ్యవసాయ అంశాలపై కేబినెట్‌ చర్చించింది. వానాకాలంలో పంటల కొనుగోలుపై అందుకు మార్కెటింగ్‌శాఖ సన్నద్ధతపై కేబినెట్‌ చర్చించింది. పోడు భూముల సమస్యలపై పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనలకై కేబినెట్‌ సబ్‌ కమిటీ నియామకం జరిగింది. ఈ సబ్‌ కమిటిలో మంత్రి సత్యవతి రాథోడ్‌ ఛైర్మన్‌గా, మంత్రులు జగదీశ్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, అజయ్‌ కుమార్‌లు సభ్యులుగా వ్యవహరిస్తారు.

కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు ఇతర పోలీస్‌ స్టేషన్లలోని సమస్యలు, అవసరాలను సమీక్షించేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ నియమిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ నేతృత్వంలో మంత్రులు హరీష్‌ రావు, జగదీశ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, వి.శ్రీనివాస్‌ గౌడ్‌, ఇంద్ర కరణ్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌లు సభ్యులుగా ఉంటారు.

సెప్టెంబర్‌ 24వ తేదీ నుండి శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికై మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో కూడిన కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు. సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు, వచ్చే యేడాది నుంచి మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడయిన రోడ్ల మరమ్మతుకు ఈ సంవత్సరం ఇప్పటికే కేటాయించిన రూ. 300 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేబినెట్‌ కేటాయించింది. ఈ మేరకు పంచాయితీ రాజ్‌ శాఖకు ఆదేశాలు జారీ చేసిన కేబినెట్‌. రాజా బహద్దూర్‌ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీ వారి విజ్ఞప్తి మేరకు, నారాయణగూడలో బాలికల వసతి గృహ నిర్మాణం కోసం 1,261 గజాల స్థలాన్ని కేటాయించింది.

ఇరిగేషన్‌ పై కేబినెట్‌ చర్చ, తీర్మానాలు:

సంగారెడ్డి, ఆందోల్‌, జహీరాబాద్‌, నారాయణ్‌ ఖేడ్‌ నియోజకవర్గాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం కుడి వైపు నుంచి 12 టిఎంసీల నీటిని ఎత్తిపోసి జహీరాబాద్‌, ఆందోల్‌, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఈ నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 231 గ్రామాలకు సాగునీరు అందుతుంది.  ప్రాజెక్టుకు రూ.2,653 కోట్ల పరిపాలన అనుమతికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 

బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం ఎడమ వైపు నుంచి 8 టిఎంసీల నీటిని ఎత్తిపోసి నారాయణ్‌ ఖేడ్‌, ఆందోల్‌ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఈ నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో 166 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు రూ.1,774 కోట్ల పరిపాలన అనుమతికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు నాబార్డు ద్వారా రుణాలు పొందడానికి కూడా మంత్రివర్గం సాగునీటి శాఖకు ఆమోదం ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి 15, 16లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మాణమౌతున్న నృసింహసాగర్‌ (బస్వాపూర్‌ జలాశయం)కు నాబార్డు ద్వారా రూ.2051.14 కోట్ల రుణం పొందడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.