కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాత బావుల పునరుద్ధరణ
స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ వారు నగరంలో శిథిలావస్థకు చేరిన బావులను అధునాతనంగా పునరుద్ధరిస్తున్నారు. గతంలో తాగు, సాగునీరు అందించిన విధంగా పూర్వ వైభవం తెస్తున్నారు. ఇందులో భాగంగా గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న మెట్లబావిని రెయిన్వాటర్ ప్రాజెక్టు, సాహి సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో చిరెన్ పబ్లిక్ స్కూల్ సౌజన్యంతో పునరుద్ధరించారు. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, ఐ అండ్ పిఆర్ కమిషనర్ అర్వింద్‌కుమార్, జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాష్‌తో కలిసి ఈ బావిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అర్వింద్‌కుమార్ మాట్లాడుతూ గతంలో సాగు, తాగునీరు అందించిన ప్రాచీన బావులను పునరుద్ధరించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. గతంలో నగరంలో 150 చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పురాతన బావులు ఉండేవన్నారు. అందులో చాలా బావులు ఇప్పుడు అగు పించడం లేదన్నారు. ఇంతవరకు మోండా మార్కెట్, మీరాలంమండీ, లాల్బజార్లలో
వున్న బావులను మరమ్మతులు చేసి బాగుపరిచినట్లు తెలిపారు. ఈ బావుల పునరుద్ధరణ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, కార్పోరేట్ సంస్థలు, సంక్షేమ సంఘాలు ఇది సామాజిక బాధ్యతగా గుర్తించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాష్ మాట్లాడుతూ నగరంలో బౌలి, బాగ్‌లకు కొదువలేదన్నారు. అయితే ఇప్పుడు బౌలిల పేర్లు ఉన్నాయేతప్ప బౌలిలు లేవన్నారు. శిథిలావస్థలో ఉన్న వాటినైనా పునరుద్ధరించి కాపాడు కోవాలన్నారు. ఇందుకు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, సంక్షేమ సంఘాలు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పన రమేష్ మాట్లాడుతూ భూగర్భజలాల పెంపుకై ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వెస్ట్‌జోన్ కమిషనర్ ప్రియాంక ఆల, భూగర్భ జలాల శాఖ డైరెక్టర్ పండిత్, చిరెక్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సంచిత, శేరిలింగంపల్లి ఉపకమిషనర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.