ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిలా నిలవండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయటంలో సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులది కీలకపాత్ర అని సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్‌ అర్వింద్‌ కుమార్‌ అన్నారు. కమీషనరేట్‌ కార్యాలయంలో మల్టీ జోన్ల వారీగా క్షేత్ర స్ధాయి అధికారులకు  రెండు రోజుల పాటు నిర్వహించిన క్షేత్ర స్థాయి  అధికారుల సమీక్ష  సమావేశానికి కమీషనర్‌  ముఖ్య అతిధిగా హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కమీషనర్‌ మాట్లాడుతూ, సమాచారశాఖ అధికారులు  ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలను  మెరుగు పరచుకోవాలని  సూచించారు. సమాచార శాఖ అధికారులు, జిల్లా అధికారులు, మీడియాతో సత్సంబంధాలు కలిగి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేయాలని అన్నారు. ప్రకటనల విషయంలో జి.ఓ నెం.52 లోని మార్గదర్శకాలను పాటించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన విజయ గాధల సేకరణలో ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రతి జిల్లాలో ఫోటో వీడియో లైబ్రరీలను నిర్వహించి, సమాచార శాఖకు  సంబంధించిన వివరాలను భద్రపరచాలని అన్నారు. నైపుణ్యాలను పెంచుకోవడానికి అవసరమైన శిక్షణను సిబ్బందికి ఇప్పించాలని సూచించారు. 

పీఆర్వో, ఇంజనీరింగ్‌ విభాగాలు సమన్వయంతో పనిచేసి సమాచార శాఖకు మంచిపేరును తీసుకురావాలని అన్నారు. సమాచార శాఖ ద్వారా జారీ చేసే ప్రెస్‌ రిలీజులు, ఫోటోలు, వీడియోలు సమాచార శాఖ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు పొందు పరచాలని అన్నారు. జిల్లా స్ధాయి మీడియా అక్రిడిటేషన్‌ కమిటీల ప్రతిపాదనలను త్వరితగతిన పంపాలని అన్నారు. జర్నలిస్టులకు అందించే సంక్షేమ పథకాల గురించి వారికి అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ డైరెక్టర్లు నాగయ్య, కిషోర్‌ బాబు, జాయింట్‌ డైరెక్టర్లు మధు, జగన్‌, శ్రీనివాస్‌, సీనియర్‌ అధికారులు రాధాకిషన్‌, జయరాం మూర్తి, మధుసూదన్‌, వెంకటేశ్వర్లు, పాండురంగారావు, ప్రసాద రావు, హష్మి, వెంకట సురేష్‌, సమాచార శాఖ ఇతర అధికారులు పాల్గొన్నారు.