జాతీయోద్యమంలో హైదరాబాద్‌ సంస్థానం

-సుబ్యా
tsmagazine
బ్రిటిష్‌ వలస పాలన కాలంలో మన దేశంలో రెండు వేర్వేరు తరహా వ్యవస్థలున్న ప్రాంతాలు కనబడతాయి. ఒక ప్రాంతంపై బ్రిటిష్‌ పాలనా ప్రభావం ఉండేది. మరొక ప్రాంతం బ్రిటిష్‌ తూర్పిండియా కంపెనీ, అటు తర్వాత కాలంలో బ్రిటిష్‌ ప్రత్యక్ష పాలనా ప్రభావం ఏ మాత్రం లేనిది. ఇది వివిధ సంస్థానాలతో కూడినది. రెండు ప్రాంతాల్లోని సామాజిక రాజకీయ స్థితిగతులు పూర్తి తారతమ్యాలతో ఉండేవి. బ్రిటిష్‌ ప్రత్యక్షపాలిత ప్రాంతాల్లో జాతీయోద్యమ చైతన్యం ఎక్కువ. ప్రధాన రాజకీయ ఉద్యమాలన్నింటికీ ఈ ప్రత్యక్ష పాలిత ప్రాంతమే మూలకేంద్రమైంది. సంస్థానాలలోనూ బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలు జరిగాయి. అయితే వీటికి జాతీయోద్యమ చరిత్రలో లభించవలసినచోటు దక్కలేదు. బ్రిటిష్‌ ప్రత్యక్ష పాలిత ప్రాంతాలలో కొనసాగిన జాతీయోద్యమానికి అందిన ప్రాధాన్యత సంస్థాన పోరాటాలకు దొరకలేదు.

సంస్థానాలలో 1857 కంటే ముందు కాలంలోని బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమాలు ప్రారంభం కావడం గొప్ప విశేషం. అందుకు హైదరాబాద్‌ సంస్థానం ఒక మంచి ఉదాహరణ. 19వ శతాబ్ది ప్రారంభంలోనే హైదరాబాద్‌ సంస్థానంలో బ్రిటిష్‌ వ్యతిరేక చైతన్యానికి అంకురార్పణ జరిగింది. ఇందుకు సంబంధిం చిన ఆసక్తికరమైన అంశాలు ప్రముఖ రచయిత దేవులపల్లి రామానుజరావు రచించిన ‘తెలంగాణ లో జాతీయోద్యమాలు’ అన్న వ్యాసంలో లభిస్తాయి. ఆయా విశేషాల్ని సంక్షిప్తంగా చెబితే..

19వ శతాబ్ది ప్రారంభంలో ప్రస్తుత విదర్భ ప్రాంతంలోనే బీరార్‌ నిజాం రాజులు ఏలుబడిలో ఉండేది. బీరార్‌కు రాజమహీపతిరాయ్‌ అనే ఆయన గవర్నర్‌. నాడు గవర్నర్‌ పదవి నిజాం ప్రభుత్వం యంత్రాంగంలో కీలకమైంది. అప్పట్లో బ్రిటిష్‌వారికి మహారాష్ట్రులకు మధ్య యుద్ధం జరుగుతోంది. బీరార్‌ గవర్నర్‌గా ఉన్న మహీపతిరాయ్‌ బ్రిటిష్‌ సేనలకు మద్దతు నివ్వాలని నిజాం నవాబు ఆదేశించాడు. అయితే మహీపతిరాయ్‌ తమ రాజు ఇచ్చిన ఆదేశాల్ని పాటించలేదు. బ్రిటిష్‌ వారిని వ్యతిరేకిస్తూ ఉద్యమించాడు. నిజాం నవాబుకు ఆగ్రహం కలిగింది. మహీపతిరాయ్‌ని గవర్నర్‌ పదవినుండి తొలగించారు. ఆయన అష్టకష్టాలు అనుభవించాడు. ప్రవాసిగా మారవలసి వచ్చింది. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఉంటే ఎటువంటి కష్టనష్టాలు ఎదురవుతాయో రాజా మహీపతిరాయ్‌ పరిస్థితి ద్వారా అర్థమైంది. అయినా ప్రజలు కష్టాలకు భయపడలేదు. సంస్థానంలోని ప్రజలు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. వీరిలో ఎంతోమంది సామాన్యులున్నారు. నిర్మల్‌ ప్రాంతానికి చెందిన రామాగౌడ్‌, రాంజీగోండు మహబూబ్‌నగర్‌ జిల్లాలో వనపర్తి ప్రాంతానికి చెందిన లక్ష్మయ్య.. ఇట్లా ఎందరో వీరులు నాటి పోరాటాలలో భాగస్వాములయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో అమితమైన స్ఫూర్తితో ఉద్యమించిన పండుగ శాయన్న వంటి వీరులు మరణశిక్షను అనుభవించవలసి వచ్చింది.

1817లో నిజాం సంస్థానంలో రోహిల్లా వర్గీయులు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ప్రచారాన్ని సాగించారు. 1839లో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో వహాబీ ఉద్య మం కొనసాగింది. మౌల్వీ సలీం అనే వహబీ ఉద్యమ కార్యకర్త అక్కడినుండి హైదరాబాద్‌కు వచ్చి బ్రిటిష్‌ వ్యతిరేక ప్రచారం జరిపాడు. 1857 నాటి తిరుగుబాటు హైదరాబాద్‌ సంస్థానంలో ప్రకంపనలు సృష్టించింది. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ హైదరాబాద్‌ నగరంలో కరపత్రాలు వెల్లువెత్తాయి.

1857 తిరుగుబాటు నేపథ్యంలో నాటి పోరాటయోధులు నానాసాహెబ్‌, తాంతియా తోపేలు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కొంతకాలం నివసించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ ఇద్దరికీ హైదరాబాద్‌లో అత్యంత విశ్వసనీయులైన మిత్రులు ఉండేవారట. విప్లవకారులైన చాపేకర్‌ సోదరులు కూడా కొంతకాలంపాటు హైదరాబాద్‌ సంస్థానంలో అజ్ఞాత జీవితాన్ని గడిపారు.

నాటి యోధుల జీవితాలు త్యాగానికి పర్యాయపదాలు. ఆనాడు బ్రిటిష్‌ వారిని ఎదిరిం చిన త్యాగధనులు ఎన్నో కష్టాలు అనుభవిం చారు. నష్టాల్ని చవిచూశారు. హైదరాబాద్‌ సంస్థానంలో నాటి జాతియోద్యమాల్ని గురించి విశ్లేషిస్తూ దేవులపల్లి రామానుజరావు ‘అన్ని జిల్లాల్లో స్వాతంత్య్రోద్యమము వ్యాప్తి చెందెను. ఇంగ్లీషు ప్రభుత్వమునకు వ్యతిరేకముగా తిరుగుబాటులు చెలరేగినవి. నూర్లమంది చంపబడిరి. వేలకొద్ది జనులు నిర్భంధములో నుంచబడిరి, డజన్ల వీరులు అండమాన్‌ దీవులకు పంపబడిరి. లక్షల రూపాయల ఆస్తి జప్తు చేసుకొనబడెను’ అని రాశారు.

తుర్రెబాజ్‌ఖాన్‌ వీరత్వం
1857 నాటి పోరాట చరిత్రలో తుర్రెబాజ్‌ఖాన్‌ వీరత్వం ఒక ఉజ్వల ఘట్టం. తుర్రెబాజ్‌ఖాన్‌ నాటి సైన్యంలో తిరుగుబాటు చేసి బ్రిటిష్‌ వ్యతిరేక వైఖరిని బాహాటంగా వ్యక్తపరిచిన ధీరుడు. అత్యంత ధైర్యశాలి. హైదరాబాద్‌ నగరం నట్టనడుమ బ్రిటిష్‌ రెసిడెన్సీ (ప్రస్తుతం కోఠీ ప్రాంతం) ఉంది. తుర్రెబాజ్‌ఖాన్‌ తనతోపాటు మౌల్వీ అల్లా ఉద్దీన్‌ను తీసుకొనిపోయి బ్రిటిష్‌ రెసిడెన్సీ మీద దాడి చేశాడు. 1857వ సంవత్సరం 17వ తేదీనాడు పట్టపగలు ఈ మెరుపుదాడి జరిగింది. ఈ దాడిలో కొన్నివందలమంది పాల్గొన్నారు. దాడిని గురించి రెసిడెంట్‌కు ఎటువంటి ముందస్తు సమాచారం అందలేదు! అంత పకడ్బందీగా వ్యూహరచన జరిగింది.

అయితే అంతిమంగా తుర్రెబాజ్‌ఖాన్‌ దాడి విఫలమైంది. బ్రిటిష్‌ సైనిక బలగాలు అధిక సంఖ్యలో ఉండడం, వారు సువ్యవస్థిత రీతిలో ఎదురుదాడికి దిగడం ఇందుకు కారణాలు, తుర్రెబాజ్‌ ఖాన్‌ పరిస్థితిని పసిగట్టాడు. షాద్‌నగర్‌ వైపు వెళ్ళిపోయాడు. నాటి తిరుగుబాటు తీరును వివరిస్తూ ప్రసిద్ధ తెలంగాణ చరిత్రకారుడు జి. వెంకటరామారావు ‘తన వ్యూహం విఫలమైనం దుకు తుర్రెబాజ్‌ఖాన్‌ ఎంతో వ్యధ చెంది షాద్‌నగర్‌వైపు పారిపోతుండగా సాలార్‌జంగ్‌ సైనికులు ఆయనను మొగులుగిద్ద అనే గ్రామంలో పట్టుకున్నారు. తుర్రెబాజ్‌ఖాన్‌కు కుడిభజంగా పనిచేసిన మౌల్వీ అల్లా ఉద్దీన్ను కూడా పట్టుకున్నారు. ఈ ఇద్దరు దేశభక్తులకు ద్వీపాంతరవాస శిక్ష విధించబడినది. అల్లాఉద్దీన్‌ అండమాన్‌ దీవుల్లో ఖైదీగా ఉంటూ 1884లో మరణించాడు. రహస్యంగా పారిపోయిన తుర్రె బాజ్‌ఖాన్‌ పట్టుబడడం ఇష్టంలేక తన కర వాలంతో శత్రువులను చెండాడడానికి సిద్ధమ వుతున్న సమయంలో సాలార్‌జంగ్‌ సైనికులు అతని భయంకర వాలకం చూసి భయపడి క్షణం ఆలస్యం చేయకుండా కాల్చివేశారు. తుర్రెబాజ్‌ ఖాన్‌ శవాన్ని గొలుసులతో బిగించి రెసిడెన్సీ ప్రధాన ద్వారానికి వేలాడదీయించారు’ అని రాశారు. నాటి తుర్రెబాజ్‌ఖాన్‌, మౌల్వీ అల్లా

ఉద్దీన్‌ల ధీరత్వాన్ని, వీరి త్యాగమయ వ్యక్తిత్వాల్ని గురించి నేటితరం సైతం ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది. 1857 తిరుగుబాటులో నిజామాబాద్‌ జిల్లాలోని కౌలాస్‌ జాగీర్దార్‌ రాజాదీప్‌సింగ్‌, నార్ఖేడ్‌ గ్రామ పట్వారీ రంగారావుల పాత్ర గణనీయమైంది. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడినందుకు రాజాదీప్‌సింగ్‌ తన జాగీరును కోల్పోయాడు. రంగారావు కఠోరమైన శిక్షలు అనుభవించాడు.

కాంగ్రెస్‌ సంస్థ
హైదరాబాద్‌ సంస్థానంలో కాంగ్రెస్‌ 1938లో ప్రారంభమైనట్టు అంతలోనే నిషేధా నికి లోనైనట్టు చరిత్ర చెబుతుంది. ఇది వాస్తవమే. అయితే అంతకు ఎన్నో దశాబ్దాల ముందే అంటే 19వ శతాబ్దిలోనే హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ స్థాపన జరిగిన సంగతిని కూడా చరిత్రలో చూడవచ్చు. హైదరాబాద్‌కు ఇతర ప్రాంతాలనుండి వచ్చిన విద్యావేత్తలు, మేధావు లు, ఉన్నతోద్యోగుల ప్రభావం 1880 నాటికే బలపడింది. వీరు స్థానిక ప్రజానీకంలో చైతన్య సాధనకు దోహదం చేశారు. డాక్టర్‌ అఘోరనాథ ఛటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం, రామచంద్ర పిళ్ళైవంటి వారు వీరిలో ప్రము ఖులు. 1885లో కాంగ్రెస్‌ సంస్థ ఏర్పాటును వీరు మనస్ఫూర్తిగా స్వాగతించారు. కొంతమంది తొలినాటి కాంగ్రెస్‌ మహాసభల్లోనూ పాల్గొన్నారు. రామచంద్ర పిళ్ళై సంస్థానంలో మొట్టమొదటి కాంగ్రెస్‌ కార్యకర్త అని కొంత మంది చరిత్ర కారుల అభిప్రాయం. ప్రసిద్ధ రచయిత వెల్దుర్తి మాణిక్యరావు రచించిన ‘హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమ చరిత్ర’ అన్న గ్రంథంలో ఆసక్తికరమైన అంశాలు లభ్యమవుతున్నాయి. ‘1880 అక్టోబర్‌ లో సికింద్రాబాద్‌లోని హెడ్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట పెద్ద షామియానాలు వేసి కాంగ్రెస్‌ పక్షాన బహి రంగసభ జరుపబడింది. ఆ రోజుల్లో రెండు వేలమంది సభకు హాజరైనారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో ఉపన్యాసాలు జరిగినవి’ అని రాశారు మాణిక్యరావు. సంస్థానంలో జాతీయతా స్ఫూర్తికి హైదరాబాద్‌ రికార్డు, పాయంవంటి పత్రికలు ఉల్లేఖనీయమైన భూమికను పోషించినట్టు చరిత్ర చెబుతోంది.

1938 తర్వాత కాంగ్రెస్‌ సంస్థ హైదరాబాద్‌ సంస్థానంలో క్రియాశీలకరీతిలో కార్యక్రమాలు నిర్వహించింది. అదే సంవత్సరం అక్టోబర్‌-నవంబర్‌ మాసాల్లో సత్యాగ్రహాలు జరిగాయి. క్విట్‌ ఇండియా ఉద్యమానికి ప్రతిస్పందనలు లభించాయి. నిజాం వ్యతిరేక పోరాటంలో రామానందతీర్థ నాయకత్వంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టి.హయగ్రీవాచారి, పి.వి. నరసింహారావు వంటివారు చాందా, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో ముఖ్యపాత్ర నిర్వహించారు. 1920లలో ప్రారంభమైన రాజకీయ చైతన్యం మరొక పాతిక సంవత్సరాల కాలంలో సంస్థానం అంతటా విస్తరించింది.

బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటంలో…
హైదరాబాద్‌ ప్రాంతంలో బ్రిటిష్‌ ప్రత్యక్ష పాలనలేదు. అందువల్ల బ్రిటిష్‌ ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రదేశాలలో చోటుచేసుకున్న స్వాతంత్య్ర ఉద్యమాలన్నీ ఇక్కడ కూడా జరిగేందుకు అవకాశం లేదు. అయితే బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడాలనే పట్టుదలలో ఉన్న యువనాయకులు, కార్యకర్తలు కోస్తాంధ్ర ప్రాంతానికి వెళ్లి అక్కడి ఉద్యమాలలో పాల్గొన్నారు. స్వాతంత్య్రానంతర కాలంలో పలు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన జీఎస్‌ మేల్కొటే 1930లలో గోదావరి జిల్లాల్లో జరిగిన జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖపాత్ర నిర్వహించిన బద్దం ఎల్లారెడ్డి కోస్తాంధ్రకు వెళ్లి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. గుంటూరులో విద్యాభ్యాసం చేసిన సంగెం లక్ష్మీబాయి ఆనాటి ఉద్యమాలలో పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, దేశోద్ధారక గ్రంథమాల వ్యవస్థాపకులు వట్టికోట ఆళ్వార్‌ స్వామి క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని కారాగార వాసాన్ని అనుభవించారు. చరిత్ర పుటల్ని వెతికితే ఇటువంటి త్యాగధనులు మరెందరో కనిపిస్తారు. పరాయి పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో హైదరాబాద్‌ సంస్థాన ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొన్నది చారిత్రక సత్యం. ఇది మరింత విస్తృతంగా అందరికీ తెలియవలసిన అవసరం ఉంది. అందుకు మరిన్ని చారిత్ర పరిశోధనలు జరుగవలసిన ఆవశ్యకత కూడా ఉంది.