బీసీ వర్గాల సంక్షేమానికి 6,229 కోట్లు

వృత్తిపనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వృత్తి పనుల వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నదని ఆర్థిక శాఖా మంత్రి టి. హరీష్‌ రావు చెప్పారు.

పశుగణాభివృద్ధిలోనూ, మత్స్య పరిశ్రమ అభివృద్ధిలోనూ ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించింది. జీఎస్డీపీలో పశుసంపద రంగం వాటా 2014-15లో 6.3 శాతంగా ఉండగా, 2021-22 నాటికి 9 శాతానికి పెరిగింది. పశుసంపద రంగం విలువ 2021-22లో 93,599 కోట్లుగా ఉన్నది.

గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల కురుమలకు చేయూత నివ్వడం కోసం.. తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టింది. 11వేల కోట్ల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.

మన రాష్ట్రంలోని గొల్ల కుర్మల వద్ద దేశంలోకెల్లా అత్యధిక సంఖ్యలో గొర్రెలున్నాయి. తెలంగాణలోమాంస ఉత్పత్తి 2014లో 5.05 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, 2022 నాటికి 10.85 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. మాంస ఉత్పత్తిలో దేశంలో 5వ స్థానంలో నిలిచిన తెలంగాణ ‘‘పింక్‌ రెవల్యూషన్‌’’ను సాధించింది.

చేపల పెంపకం

ఒకప్పుడు రాష్ట్ర అవసరాల కోసం చేపలు దిగుమతి చేసుకునే దశ నుంచి నేడు చేపలను ఎగుమతి చేసే దశకు రాష్ట్రం చేరుకున్నది. రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో చేపల పెంపకం జోరుగా సాగుతున్నది. ముఖ్యమంత్రి దూరదృష్టితో చేపట్టిన మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు బాగయ్యాయి, కొత్తగా చెక్‌ డ్యాముల నిర్మాణం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల్లో భాగంగా నూతన రిజర్వాయర్లు నిర్మాణం చేయడంతోపాటు, చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానించడం వల్ల చేపల పెంపకం ఊపందుకున్నది. వీటన్నింటిలోనూ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను వదిలి వాటిని పట్టి అమ్ముకునేందుకు గంగపుత్ర, ముదిరాజ్‌ సోదరులకు అవకాశం కల్పించింది. 2016-17లో రూ. 2,190 కోట్ల విలువైన 1.93 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తికాగా, 2021-22లో 3.9 లక్షల టన్నులకు పెరిగింది. ఈ మత్స్య సంపద విలువ రూ. 5,860 కోట్లు. ఇది తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన ‘‘బ్లూ రెవల్యూషన్‌’’ ద్వారా సమకూరిన సంపద.

నేతన్నకు చేయూత

తెలంగాణ రాష్ట్రం చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి. పోచంపల్లి, నారాయణపేట, గద్వాల, సిరిసిల్ల, సిద్ధిపేట తదితర ప్రాంతాలు చేనేత కళకు కేంద్రాలుగా జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి.

తెలంగాణ ఏర్పడకముందు గత పాలకుల హయాంలో చేనేత కార్మికుల బతుకులు గాలిలో దీపాలుగా ఉండేవి. చేతినిండా పని దొరికేది కాదు.తగిన మార్కెట్‌ వ్యవస్థగానీ, అమ్మకాలుగానీ ఉండేవికావు. ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించకపోవడం తదితర కారణాల వల్ల చేనేతరంగం కృంగిపోయింది. నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దుర్భరమైన పరిస్థితులు దాపురించాయి. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేనేతలకు గొప్ప అండదండలను అందిస్తున్నది.దీంతో చేనేత కార్మికుల బతుకుల్లో మంచి మార్పు వచ్చింది. వారి వృత్తికి భరోసా, భద్రత ఏర్పడింది. రాష్ట్రప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసే చీరల తయారీ ఆర్డర్లను చేనేత, పవర్‌ లూమ్‌ పరిశ్రమలకు అప్పగిస్తున్నది. దీంతో కార్మికులకు సంవత్సరమంతా చేతినిండా పని దొరుకుతున్నది.

రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ సర్వే నిర్వహించి 21,585 మంది చేనేత కార్మికులను, 43,104 మంది పవర్‌ లూమ్‌ కార్మికులను గుర్తించి వారికి జియోట్యాగింగ్‌ నంబర్లను ఇవ్వడం జరిగింది. తద్వారా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ అవుతున్నాయి.

ప్రభుత్వం చేనేతమిత్ర పథకం ద్వారా నూలు, రసాయనాల కొనుగోలుపై 50 శాతం సబ్సిడీని అందిస్తున్నది. చేనేత మిత్ర పథకం ద్వారా ఇప్పటి వరకు 20,501 మంది చేనేత కార్మికులకు రూ. 33.17 కోట్లు సబ్సిడీ లభించింది.

చేనేత కార్మికులకు ఆసరా పింఛన్‌ అందించడమే కాకుండా, నేతన్నకు బీమా పథకం కింద 5 లక్షలబీమాను అందిస్తున్నది. ఈ బీమా కోసం ప్రభుత్వం రూ. 21 కోట్ల ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తున్నది. విధివశాత్తూ మరణించిన కార్మికుడి కుటుంబానికి 10 రోజుల్లోపే 5 లక్షల రూపాయల బీమా మొత్తాన్ని అందజేస్తున్నది.

చేనేత కార్మికులకు చెందిన 1 లక్ష లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఇప్పటి వరకు 29 కోట్ల రూపాయల రుణాలుమాఫీ అయ్యాయి. చేనేత కార్మికులకు, సొసైటీలకు ప్రభుత్వం పావలా వడ్డీ పథకం ద్వారా రుణాలను అందిస్తున్నది. ఇప్పటివరకు 523 సొసైటీలకు 120 కోట్ల రుణాలను అందించడం జరిగింది.

వరంగల్లో కాకతీయ మెగా టెక్స్‌ టైల్‌ పార్క్‌ తోపాటు, సిరిసిల్లలో అపెరల్‌ పార్కును ఏర్పాటు చేసి వస్త్రపరిశ్రమకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సహకాలందించే ఉద్ధేశ్యంతో ‘నేతన్నకు చేయూత’ పొదుపు పథకానికి శ్రీకారం చుట్టింది.

నేతన్నల ఆత్మబంధువు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ప్రభుత్వం జలదృశ్యం ఎదుట ఏర్పాటు చేసింది, వారి జయంతిని ఏటా అధికారికంగా నిర్వహిస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిలబెట్టేందుకు తీవ్రమైన కృషి చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా చేనేతరంగం ఉసురు తీస్తున్నది. అసలే అంతంతమాత్రం అమ్మకాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగాన్ని మరింత దెబ్బతీస్తూ కేంద్రం చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించడం శోచనీయం.

గీత కార్మికుల సంక్షేమం

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌడన్నల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకొన్నది. చెట్ల రఖం బకాయిలు రద్దు చేయడమే కాకుండా, తాటి, ఈత చెట్లపై పన్ను వేసే పద్ధతికి స్వస్తి పలికింది. కొత్త సొసైటీల ఏర్పాటుకు అవకాశం కల్పించింది.

గీత కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరాను సాఫ్ట్‌ డ్రింక్ గా మార్చి అందించే ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం 25 కోట్ల రూపాయలను కేటాయించింది. నీరా ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ యూనిట్‌ తో పాటు,నీరా కేఫ్‌ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.

ప్రమాదవశాత్తూ మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల పరిహారాన్ని అందిస్తున్నది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.

గౌడ సోదరుల ఆత్మగౌరవ ప్రతీక అయిన సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతిని, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. రాష్ట్రంలో రజక సోదరులకు నిర్వహించే లాండ్రీలు, నాయీ బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్లకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నది.

బీసీ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు..

తెలంగాణ ప్రభుత్వం బీసీ గురుకులాల సంఖ్యను గణనీయంగా పెంచింది. 2014 కు ముందు కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవి. అందులో 8 వేలమంది విద్యార్థులు మాత్రమే చదువుకునేవారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రెసిడెన్షియల్‌ విద్యాలయాల సంఖ్యను 310 కి పెంచింది. వీటిలో రెసిడెన్షియల్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు కలిపి 294 కాగా, మరో 2 మహిళా రెసిడెన్షియల్‌ వ్యవసాయ కళాశాలలు, 14 రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్రంలోని బీసీ రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో 1,65,160 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి

బడుగువర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలూ కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే పేరున తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తున్నది. బీసీ వర్గాల విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షల స్కాలర్‌ షిప్‌ను ప్రభుత్వం అందజేస్తున్నది. ఇందుకోసం ఎనిమిదిన్నరేళ్లలో ప్రభుత్వం 264 కోట్ల రూపాయల స్కాలర్‌ షిప్‌లను 2,976 మంది విద్యార్థులకు అందించింది.

బి.సి. వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు

రాష్ట్ర రాజధానిలో 41 బి.సి. కులాల వారి కోసం ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇందుకోసం అత్యంత ఖరీదైన 87 ఎకరాల భూమిని రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాల్లో కేటాయించింది. ఇందుకోసం ప్రభుత్వం95.25 కోట్లు నిధులు కేటాయించింది. వీటిలో కొన్ని భవనాలను త్వరలోనే ప్రారంభించు కోబోతున్నామని మంత్రి తెలిపారు.