|

50వేల కోట్ల మార్కు దాటిన రైతుబంధు సాయం

రైతు లేనిదే రాజ్యం లేదు.. రైతే దేశానికి వెన్నుముక.. ఇలా ఎన్నికల సమయంలో వివిధ రాజకీయపార్టీల నాయకులు నినాదాలు ఇస్తుంటారు. దేశంలో 80శాతం ఉన్న రైతులను ఆకర్షించి తమకు ఓట్లు వేయించుకోవడానికి పార్టీల నాయకులు పడరాని పాట్లు పడుతుంటారు. కానీ వీరంతా ఎన్నికల్లో గెలిచిన తరువాత రైతులను మరచిపోవడం ఆనవాయితీగా మారింది. ఈ ఆనవాయితీని తుడిచేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాను అధికారంలోకి వచ్చాక రైతులను ఎలాగైన రాజులను చేయాలనే తలంపుతో మేథామథనం చేసి రైతుబంధు అనే చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనితో రాష్ట్రంలోని రైతులంతా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పథకం దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని రైతులకు అంకితం చేశారు.

ఈ పథకంలో భాగంగా ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ. 10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ఈ డబ్బులు ఎలాంటి అధికారుల ప్రమేయం, మధ్య దళారుల బెడద లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో రైతులకు రైతుంబంధు డబ్బులు పొందడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు రూ. 50వేల కోట్ల సహాయం అందించి రికార్డు సృష్టించింది.
కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా 2014, జూన్‌లో ప్రమాణస్వీకారం చేశాక రైతులకు ఏదైనా మంచిపథకం ప్రవేశపెట్టాలని అహర్నిశలూ యోచించారు. చివరకు రైతులకు ప్రతి ఎకరాకు ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఈ పథకానికి రైతుబంధు పథకం అని నామకరణం చేశారు. 2018, మే 10న కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని, శాలపల్లి, ఇందిరానగర్‌లో రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. తొలుత 2018-19 సంవత్సరం నుంచి ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటల కోసం రెండు విడతల్లో ప్రతి రైతుకు మొత్తం ఏడాదికి రూ. 8వేలను ప్రభుత్వం అందించడం ప్రారంభింభించింది. పునాస పెట్టుబడిని ఏప్రిల్‌ నుంచి, యాసంగి పెట్టుబడిని నవంబర్‌ నుంచి పంపిణీ చేశారు. అయితే పెరుగుతున్న రైతుల పెట్టుబడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2019-20 నుంచి పంట సాయాన్ని ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచింది. దీంతో రైతుకు ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు అందడం ప్రారంభమైంది. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఏ దేశంలోనూ ఇప్పటివరకు అమలులో లేదు. ఏ ఒక్క పాలకుడి ఆలోచనకూ తట్టలేదు. ఈ పథకాన్ని యావత్‌ దేశమే కాదు ఏకంగా ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసించింది. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ తరహా సాయం చేయడంలో రైతుబంధును మించిన పథకం మరొకటి లేదని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ కొనియాడారు.

రాష్ట్రంలో ఈ పథకం కింద ఇప్పటి వరకు 7 విడతలలో 43వేల కోట్ల రూపాయలు అందచేయగా, డిసెంబరులో రూ. 7,500 కోట్ల రైతుబంధు సాయంతో ఈ నిధులు 50వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దేశంలోనే రికార్డు స్థాయిలో అన్నదాతకు పెట్టుబడి ఇంతస్థాయిలో ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గర్వంగా చెప్పవచ్చు.

రైతుకు పంటలు వేసుకునే సమయంలో పెట్టుబడి అనేది చాలాకీలకం. దాని కోసం రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం చేసేవారు. ప్రైవేటు వ్యాపారులు ఎక్కువ వడ్డీ వేయడంతో అది కాస్తా పంట సమయానికి ఇబ్బడి, ముబ్బడై కూర్చునేది. పండిన పంట పెట్టుబడి కిందకే పోయి రైతు దిక్కుతోచని స్థితిలో పడిపోయేవాడు. అప్పు, దాని మీద పడే మిత్తి పులి మీద పుట్రగా ఒకదానికి ఒకటి తోడై రైతును పూర్తిగా కృంగదీసేది. ఈ క్షోభ నుంచి రైతును కాపాడడం కోసం కేసీఆర్‌ తీవ్రంగా ఆలోచించారు. పంటలకు అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వమే ఇవ్వగలిగితే రైతులను అప్పుల నుండి గట్టెక్కించవచ్చని యోచించారు. ఈ ఆలోచనల్లోంచి పుట్టుకు వచ్చిందే రైతుబంధు.

ఇప్పటి వరకు రైతులకు పంపిణీ చేసిన రైతుబంధు నిధులు సంవత్సరాల వారీగా..

  1. 2018 వానాకాలంలో 50.25 లక్షల మంది రైతులకు 130.91 లక్షల ఎకరాలకు గాను రూ. 5236.30 కోట్లు పంపిణీ చేశారు.
  2. 2018-19 యాసంగిలో 49.13 లక్షల మంది రైతులకు 131.31 లక్షల ఎకరాలకు గాను రూ. 5251.89 కోట్లు పంపిణీ చేశారు.
  3. 2019 వానాకాలంలో 51.61 లక్షల మంది రైతులకు 122.51 లక్షల ఎకరాలకు గాను రూ. 6125.54 కోట్లు పంపిణీ చేశారు.
  4. 2019-20 యాసంగిలో 42.42 లక్షల మంది రైతులకు 88.13 లక్షల ఎకరాలకు గాను రూ.4406.48 కోట్లు పంపిణీ చేశారు.
  5. 2020 వానాకాలం 58.02 లక్షల మంది రైతులకు 145.77 లక్షల ఎకరాలకు గాను రూ. 7288.70 కోట్లు పంపిణీ చేశారు.
  6. 2020-21 యాసంగిలో 59.32 లక్షల మంది రైతులకు 147.35 లక్షల ఎకరాలకు గాను రూ. 7367.32 కోట్లు పంపిణీ చేశారు.
  7. 2021 వానాకాలం 60.84 లక్షల మంది రైతులకు 147.21 లక్షల ఎకరాలకు గాను రూ. 7360.41 కోట్లు పంపిణీ చేశారు.