|

బంగారు తెలంగాణకు బాటలు సబ్బండవర్గాలు అట్టడుగు ప్రజలకు ఆదరణ.. ఆపన్నులకు అమృతహస్తం

-By నూర శ్రీనివాస్‌/ మ్యాకం రవికుమార్‌

ప్రజల పనియే పాలకుని పని. ప్రజల సుఖమే పాలకుని సుఖం. ప్రజల ప్రియమే పాలకుని ప్రియం. ప్రజల హితమే పాలకుని హితం’’ ఇవీ మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పిన రాజనీతి హితవచనాలు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆచరణలో తూచా తప్పకుండా అమలు చేస్తున్నది అవే. మాటల్లోనే కాదు చేతల్లోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే పంథాను చాటుతున్నది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం నుంచి సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనదైన శైలిలో చెరగని ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. పేదల, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఎప్పటికప్పుడూ, ఏ యేటికాయేడు వినూత్న, విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి కొత్త బాటలు వేయడమే గాకుండా దేశానికి కొత్తదారిని చూపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తొలినాలుగున్నరేళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా, గతంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టని విధంగా కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల పక్షపాతిగా నిలిచారు. ప్రతి సారీ సరికొత్త పథకానికి నాంది పలుకుతూ బంగారు తెలంగాణ ఫలాలను అట్టడుగువర్గాలకు పంచుతున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబీమా, రైతుబంధు, దళితబంధు తదితర పథకాలన్నీ ఇప్పుడు దేశానికే దిక్చూచిగా నిలుస్తున్నాయి. ఆ ఆనవాయితీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొనసాగిస్తూనే ఈ ఏడాది సైతం తన మార్క్‌ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. దళితబంధు, ఇంటి నిర్మాణానికి పేదలకు రూ.3లక్షల ఆర్థిక సాయం, గీత కార్మికుల సంక్షేమానికి, నేతన్నలకు బీమా కల్పన, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సైతం రాయితీపై వాహనాలను అందజేసే వినూత్న పథకాలకు నాంది పలికారు సీఎం కేసీఆర్‌. 

ప్రతి పైసాకు ప్రతిఫలం..

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై చేస్తున్న ప్రతి పైసాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతిఫలం దక్కుతున్నది. ఆసరా పింఛన్లతో వయోవృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా దక్కడంతోపాటు, కుటుంబంలోనూ ఆదరణ పెరిగింది. అదేవిధంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడడంతో పాటు, మాతా శిశు మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గిపోయింది. గొర్ల పంపిణీ పథకం ద్వారా రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి గతంతో పోల్చితే 22శాతం పెరిగింది. చేపల ఉత్పత్తిలోనూ దూసుకుపోతున్నది. గురుకుల విద్యాలయాల స్థాపన ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో విద్యాభివృద్ధిలో నవశకం మొదలైంది. డ్రాపౌట్స్‌ తగ్గిపోవడంతో పాటు, ఉన్నత చదువులు చదివే బాలికల సంఖ్య పెరిగిపోయింది. మైనార్టీ బాలికల విద్యలో దేశంలోనే తెలంగాణ నంబర్‌1గా నిలువడం గర్వకారణం. దళితబంధు పథకం నిరుపేద దళితుల్లో కొత్త కాంతులను నింపుతున్నది. కూలీలను ఓనర్లుగా మార్చుతున్నది. ఒకటేమి కాదు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకమూ ఆశించిన స్థాయికి మించి సత్ఫలితాలను ఇస్తున్నది. సంక్షేమ పథకాలను రూపొందించడంతో పాటు వాటి అమలులోనూ దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నది. 

 దళితజాతి సముద్ధరణకు దళితబంధు.. 

ఉద్యోగాలు లేవు. ఉత్పత్తి యంత్రాలూ సొంతం కావు. సాగుభూమి సంగతి అంతే. అత్యధిక శాతం మందికి రెక్కల కష్టమే జీవనాధారం. అభివృద్ధిలో చివరి స్థానం. అలాంటి అట్టడుగు స్థానంలో నిలిచిన దళితులను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేదెట్లా? సిరివంతులుగా తీర్చిదిద్దేదెట్లా? స్వరాష్ట్రం తెలంగాణకు సాధిస్తున్న ప్రగతి ఫలాలను అందించడమెలా? ఇత్యాది ప్రశ్నలన్నింటికీ దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు చూపని విధంగా, వినూత్న తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చూపిన పరిష్కార మార్గం దళితబంధు పథకం. దళితుల సమున్నద్ధరణ, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా గత ఆగస్టులో సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన ఈ పథకం  లక్ష్యం దిశగా పరుగులు తీస్తున్నది. దళితబంధు పథకం వెలివాడ జీవితాల్లో వెలుగులు నింపుతూ నిర్విఘ్నంగా ముందుకుసాగుతున్నది. గత ఆగస్టులో ఈ పథకాన్ని ప్రారంభించింది. గత ప్రభుత్వాలు దళితుల అభ్యున్నతికి అమలు చేసిన పథకాల మాదిరిగా కాకుండా, అందుకు భిన్నంగా షరతులు లేకుండా, బ్యాంకులతో ఎలాంటి సంబంధం లేకుండానే స్వయం ఉపాధి కోసం దళితులకు రూ.10లక్షల ఆర్థికసాయాన్ని అందజేస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి సర్కారు కొత్త బాటలు వేస్తున్నది. హుజురాబాద్‌ నియోజకవర్గంతో పాటు పాలేరు నియోజకవర్గంలో చింతకాని, తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి, సూర్యాపేట నియోకవర్గంలోని చారుగొండ, జుక్కల్‌ నియోజకవర్గంలో నిజాంసాగర్‌ మండలాలతో పాటు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామాలను పైలట్‌ ప్రాజెక్టుగా తొలుత ఎంపిక చేసి అమలు చేస్తున్నారు. సుమారు 4వేల కోట్ల బడ్జెట్‌తో మార్చినాటికి 40వేల మందిని ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. అందులో ఇప్పటికే హుజురాబాద్‌ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వం మొత్తంగా 17,544 మందికి దళితబంధు పథకం కింద రూ.10లక్షల చొప్పున అందజేయగా, మొత్తంగా 34,678 మంది లబ్ధిదారుల అకౌంట్లలో నిధులను జమ చేసింది. 2022-23 బడ్జెట్‌లోనూ దళితబంధు పథకానికి ప్రభుత్వం ఏకంగా 17,700కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 119 నియోజకవర్గాలకు విస్తరించింది. నియోజకవర్గానికి 100మందికి చొప్పున  మొత్తంగా 11,800 మందికి పథకాన్ని వర్తింపచేశారు. వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు దళితబంధు ప్రయోజనాలు అందివ్వాలని ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

సంక్షేమంలో ఆసరా…

అన్నార్తులు.. అన్నార్తులుండని నవయుగమదెంతదూరమో… అని మహాకవి దాశరథి స్వప్నించిన కాలం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో నెరవేరింది. అన్నార్తులకు, అభాగ్యులకు అన్నీ తానై ఆయనే చుక్కాని అయి ఆయనే ఆసరా’ అవుతున్నది.  ఆసరా పింఛన్ల పేరిట మునుపెన్నడూలేని మానవీయ తెలంగాణ సమాజాన్ని తన కలగా సాధించిన మహానేతగా సీఎం కేసీఆర్‌ చెరగని సంతకం చేస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.2016 చొప్పున, వికలాంగులకు రూ. 3016చొప్పున ఆసరా అవుతున్నడు. బీడీ కార్మికులు, బోదకాలు వ్యాధితో బాధపడేవారికే కాకుండా ఒంటరి మహిళకు ఆసరా పించన్లు ఇస్తూ దేశంలో సరికొత్త సంక్షేమ చరిత్రకు నాందిపలికారు.  ప్రతిమనిషికి ఆసరా..ప్రతి గుండెకు అదెరువు ఇస్తూ సర్కార్‌ ముందుకు సాగుతున్నది.  రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 38లక్షల మందికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఆసరా అవుతున్నదంటే అతిశయోక్తి కాదు. 

 ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల ఆర్థికసాయం (కొత్త పథకం)

పేదలకు గౌరవప్రదమైన, సౌకర్యవంతమైన నివాసం ఉండాలని తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వంద శాతం సబ్సిడీతో ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇస్తున్నది. ఇప్పటివరకు దాదాపు 2లక్షల 91వేల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, అందులో 1.70లక్షల ఇండ్ల నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి. మిగిలిన ఇండ్లు నిర్మాణదశలో ఉన్నాయి. తాజాగా ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ ఆ పథకాన్ని సొంత జాగ ఉన్నవారికి వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. సొంత జాగా ఉండి డబుల్‌ బెడ్రూం ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని పలువురు ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ దిశగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సొంత జాగ కలిగిన వారు తమ స్థలంలో డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టుకోవడానికి రూ. 3లక్షలను ఆర్థిక సాయంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా  నియోజకవర్గానికి 3వేల ఇండ్ల చొప్పున కేటాయించాలని నిర్ణయించింది. అందులో 3.57లక్షల ఇండ్లు ఎమ్మెల్యేల పరిధిలో ఉండనుండగా, 43వేల ఇండ్లు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వాసితులకు, వివిధ ప్రమాద బాధితులకు కేటాయించేందుకు గాను సీఎం పరిధిలో ఉండనున్నాయి. మొత్తంగా డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకానికి గాను ప్రభుత్వం బడ్జెట్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో 12,000కోట్లను కేటాయించింది.

 దళిత, గిరిజన సముద్ధరణకు..  

సమైక్య రాష్ట్రంలో అప్పటి నుంచి 2014 దాకా తెలంగాణలో ఒక్కొక్కరికి సగటున 1.21 ఎకరాల చొప్పున 32,800 మందికి 39,798 ఎకరాల భూమిని పంచినట్లు రికార్డుల్లో ఉంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం వెంటనే 15 ఆగస్టు 2014న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వ్యవసాయంపై ఆధారపడిన ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఎనిమిదేండ్లలో తెలంగాణ ఏర్పడిన తర్వాత  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.6,780కోట్ల నిధులతో 16,443 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 6,194 దళిత కుటుంబాలకు పంపిణీ చేసింది.  

ఎస్సీ, ఎస్టీ కార్పరేషన్ల ఆధ్వర్యంలో దళిత, గిరిజన యువతకు నైపుణ్య శిక్షణను అమలు చేస్తూ వారికి బాసటగా నిలుస్తున్నది తెలంగాణ సర్కారు. జాతీయస్థాయి సంస్థల ఆధ్వర్యంలో ఇప్పటివరకు 11,380 మంది దళిత  అభ్యర్థులకు శిక్షణ ఇప్పించింది. శిక్షణ పొందిన అభ్యర్థులు లక్షల్లో ప్యాకేజీలతో కార్పొరేట్‌ కంపెనీల్లో మెరుగైన ఉద్యోగావకాశాలను పొందుతుండడం విశేషం.

ఎస్సీలు, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారికి అవసరమైన ప్రొత్సాహాన్ని అందిస్తూ, రాయితీలు కల్పిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్‌ పార్కుల్లో ఎస్సీలకు 15.44 శాతం, ఎస్టీలకు 9.34 శాతం స్థలాలను రిజర్వ్‌ చేసి దేశంలో రికార్డు సృష్టించింది. ఎకరం స్థలంలో రూ. 5 కోట్లతో ప్రత్యేక ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వమే రూ.5 కోట్ల వరకు మార్జిన్‌ మనీ కింద అందిస్తున్నది. 

 ఎస్సీ, ఎస్టీ వర్గాల ఔత్సాహికులకు  స్టేట్‌ ప్రోగ్రామ్ ఫర్‌ రాపిడ్‌  ఇంక్యుబేషన్‌ ఆఫ్‌ ఎస్సీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టీఎస్‌ ప్రైడ్‌) అనే వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  దీనిద్వారా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు స్థాపించే పరిశ్రమలకు ఒక్కో యూనిట్‌ కు ఇచ్చే విద్యుత్‌ సబ్సిడీని రూపాయి నుంచి రూపాయిన్నరకు పెంచారు. ఇన్వెస్ట్‌ మెంట్‌ సబ్సిడీ ద్వారా పరిశ్రమల స్థాపనకయ్యే ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 35 శాతం సబ్సిడీని గరిష్టంగా రూ.75 లక్షల వరకు అందజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామిక వేత్తలకిచ్చే సబ్సిడీని 10 శాతం పెంచి 45శాతం ఇస్తున్నారు. సేల్స్‌ టాక్స్‌ మినహాయింపును 50 నుంచి 100 శాతానికి పెంచారు. టీఎస్‌ ప్రైడ్‌ ద్వారా 2,467 మంది ఎస్సీలకు రూ.112.79 కోట్లు, 1,929 మంది ఎస్టీలకు రూ.87.21 కోట్లు మంజూరు చేశారు. వీరికి ప్రభుత్వం రూ.338 కోట్ల ఇండస్ట్రియల్‌ ఇన్సెంటివ్‌లను అందించింది.  

 ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీలకు శిక్షణనిచ్చి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కాంట్రాక్టు పనులు అప్పగించాలని ప్రభుత్వం చేసే అభివృద్ధి పనుల కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రిజర్వేషన్‌ కల్పించి దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ నిలిచింది. అదేవిధంగా మెడికల్‌ షాపులు, వైద్యశాలలకు భోజనం సరఫరా చేసే ఏజెన్సీల్లో, వైన్‌షాపుల్లో, ఫర్టిలైజర్స్‌ తదితర అన్ని రంగాల్లో రిజర్వేషన్‌ కల్పిస్తున్నది. 

 రాష్ట్ర వ్యాప్తంగా 33 స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి గ్రూప్‌1, 2, 3, 4 తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన వాటిపై ఎస్సీ యువతకు 45-60 రోజుల స్వల్పకాలిక ఫౌండేషన్‌ శిక్షణ అందిస్తున్నది. పోలీసుశాఖ సహకారంతో 19 సెంటర్లలో ప్రత్యేకంగా పోలీస్‌ కానిస్టేబుల్‌ పోటీ పరీక్షలకు తర్ఫీదునిస్తున్నది. 

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అనేది ఉమ్మడి రాష్ట్రంలో నామమాత్రంగా ఉండేది. అయితే ఈ వర్గాలు అభ్యున్నతి చెందనంత కాలం సమాజం పురోగమించదు అన్న దూరదృష్టితో సీఎం కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని సవరించి దేశానికే ఆదర్శంగా నిలిచారు.ది. దేశనలుమూలల నుంచి పార్లమెంటేరియన్లు, శాసనకర్తలు రాష్ట్రం అమలు చేస్తున్న నమూనాను తమతమ రాష్ట్రాల్లోనూ అనుసరించాలని డిమాండ్‌ చేసిన నేపథ్యంలో ఇటీవలే రాజస్థాన్‌, ఒడిశా వంటి రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీల్లో చట్టాలు సవరించుకోవడం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దూరదృష్టికి నిదర్శనం.

గిరిజన ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ (సీఎం ఎస్టీఈఐ) పథకం ప్రవేశపెట్టి వందలాది మంది గిరిపుత్రులను యువపారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నది. సంవత్సరానికి వంద మంది చొప్పున ఎంపిక చేసి వారికి వ్యాపార, పారిశ్రామిక మెళకువలు నేర్పించి ఇప్పటికే వందలాది మందిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దగా వారు ఉపాధిని పొందడమే కాకుండా ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నారు.  

బీసీల సంక్షేమానికి పెద్దపీట..

 గొల్లకురుమల కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రూ.11 వేలకోట్లతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే అందులో 7.5లక్షలకు పైగా యూనిట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. 

 బీసీ గురుకుల పాఠశాలల సంఖ్యను 281కి పెంచగా సుమారు 1 లక్షా 32 వేల 440 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే విద్యానిధి పథకం కింద విద్యార్థులకు రూ.20లక్షల చొప్పున స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నది. 

44 బీసీ కులాలకు ఎకరం చొప్పున స్థలాన్ని కేటాయించడంతోపాటు రూ.కోటి నిధులతో ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నది. 

రాష్ట్రంలోని మత్స్యకారులను ఆదుకోవాలని, మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో 5 సెప్టెంబర్‌, 2018 న రూ.1,000 కోట్లతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. రాష్ట్రంలోని దాదాపు రెండు లక్షలమందికి 75 శాతం నుంచి 100 శాతం వరకు సబ్సిడీతో  విలువైన ఉపకరణాలను రూ.535 కోట్ల సబ్సిడీతో పంపిణీ చేసింది. చెరువుల్లో చేపలను పెంచే బెస్తలు (గంగపుత్రులు), ముదిరాజులతో పాటు ఇతర కులాల్లోని చేపల పెంపకందారులకు ఉచితంగా 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలను దేశంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.  

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన 17 కులాలను గుర్తించిన ప్రభుత్వం వారిని బీసీ జాబితాలో చేర్చింది. గుర్తింపుకు నోచుకోని 17 కులాల్లో 13 కులాలను బీసీ ఏ జాబితాలో, 4 కులాలను బీసీ డీ జాబితాలో చేర్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను 09 సెప్టెంబర్‌, 2020న జారీ చేసింది.

ఆర్థిక సహకార పథకాల అమలులో భాగంగా రాష్ట్రంలోని బీసీలకు వందశాతం సబ్సిడీతో రూ.50 వేల రుణాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ బీసీ కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ, ఎంబీసీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, 11 బీసీ ఫెడరేషన్ల ఎండీలకు విధివిధానాలను సూచించారు. 

విశ్వబ్రాహ్మణులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇప్పిస్తున్నది. కరీంనగర్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌, వరంగల్‌లో శిబిరాలను ఏర్పాటు చేసి ఆధునిక క్యాడ్‌ మిషన్‌పై ఉంగరాలు, ఆభరణాలు, విగ్రహాలను ఎలా తయారు చేయాలి, ఏవిధంగా నూతన డిజైన్లను రూపొందించాలి? స్వల్పకాలంలో రాళ్లను ఎలా పొదగాలి? తదితర అంశాలతో పాటు హల్‌ మార్కింగ్‌ చేసే పద్ధతులపై కూడా అవగాహన కల్పించింది. ఇప్పటికే శిక్షణ పొందిన పలువురు స్వర్ణకారులు యంత్రపరికరాలను కొనుగోలు చేసి వృత్తిలో రాణిస్తుండడం విశేషం.

ఎంబీసీలకు భరోసా.. చేయూత

అత్యంత వెనకబడిన తరగతుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 36బీసీ కులాలను అత్యంత వెనకబడిన కులాలుగా ప్రభుత్వం గుర్తించింది. వారి కోసం ప్రత్యేకంగా పలు కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నది. అదేవిధంగా ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. 

 • రజకులు, నాయీబ్రాహ్మణుల జీవనస్థితిగతులు మార్చేందుకు ఆయా ఫెడరేషన్ల ద్వారా వందల కోట్లను ఖర్చుచేస్తూ వారి జీవనోపాధికి భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా  250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. 
 • రజక వృత్తి ఆధునికీకరణపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక నజర్‌ వేశారు. పైలట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా 8చోట్ల, రెండు మున్సిపాల్టీలు కలుపుకుని మోడ్రన్‌ ల్యాండ్రీల నిర్మాణం చేపట్టారు. ఒక్కో యూనిట్‌కు రూ.57 లక్షలు వెచ్చించగా ఇప్పటికే సిద్ధిపేట, ఆదిలాబాద్‌లో అందుబాటులోకి రాగా, మొత్తంగా 4వేల మంది లబ్ధి పొందుతున్నారు.
 • నాయీబ్రాహ్మణ యువతకు తొలిదఫాలో 1000 మందికి అధునాత హెయిర్‌ ౖస్టెల్స్‌, ఫేషియల్‌, స్పా తదితర వాటిపై బ్యుటీషియన్‌ తదితర అధునాత పద్ధతులపై శిక్షణ ఇప్పించి  మెరుగైన ఉపాధి మార్గాన్ని చూపింది.  
 • ఎంబీసీ కులాలకు చెందిన వారికి సబ్సిడీ ఈ-ఆటోలను, ట్రాలీలను సబ్సిడీపై అందజేస్తూ ఉపాధి కల్పిస్తున్నది.
 • బీసీ గురుకులాల్లో రాత పరీక్షతో సంబంధం లేకుండా నేరుగా ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. 3శాతం సీట్లను ఎంబీసీలకే ఈ ఏడాది నుంచి కేటాయించాలని ఇటీవలనే నిర్ణయించింది.

ప్రభుత్వం కుమ్మరి కులస్తుల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకుసాగుతున్నది. అందులో భాగంగా గుజరాత్‌, రాజస్థాన్‌,  పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో మట్టితో తయారు చేస్తున్న వస్తువులపై అధ్యాయం చేయించడంతో పాటు, వృత్తిదారులను స్వయంగా అక్కడికి తీసుకెళ్లి అవగాహన కల్పించింది. అనంతరం ఆధునిక యంత్ర పరికరాలను తెప్పించి వాటిపై తొలివిడతగా 350 మంది వృత్తిదారులకు చిన్నపాటి మట్టిగణపతులు, టీ కప్‌లు, వాటర్‌ బాటిల్స్‌, గ్లాస్‌లు, మగ్గులు, దీపంతలు తదితర మట్టిపాత్రల తయారీపై శిక్షణ ఇప్పించింది. ప్రస్తుతం 5 అడుగుల ఎత్తుతో ఉండే మట్టిగణపతి విగ్రహాల తయారీపై తర్ఫీదునిప్పిస్తున్నది. అదీగాక మట్టిపాత్రలు, గృహోపకరణ వస్తువుల తయారీని పారిశ్రామిక స్థాయిలో చేపట్టేందుకు సైతం ప్రణాళికలను రూపొందించింది. అందులో భాగంగా సిద్ధిపేటలో స్ఫూర్తి ప్రాజెక్టు కోసం ఇప్పటికే 2 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. మొత్తంగా 400 మంది కుటుంబాలను ఉపాధి కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అదేవిధంగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఆధునిక బట్టీలను నిర్మించాలని  యోచిస్తున్నది. 

మేదరి కులవృత్తికి తెలంగాణ ప్రభుత్వం కొత్తబాటలను  చూపుతున్నది. తొలుత ఇతర రాష్ట్రాల్లో వెదురుతో చేస్తున్న ఉత్పత్తులు, తద్వారా ఆ కళాకారులు పొందుతున్న ఆదాయంపై అధికారులతో  అధ్యయనం చేయించింది. మేదర కులస్తులను స్వయంగా ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ వెదురుతో ఉత్పత్తి చేస్తున్న వస్తువులు, తయారీ పద్ధతులపై అవగాహన కల్పించారు.

మైనార్టీల అభ్యున్నతికి బాటలు.. 

తెలంగాణ ప్రభుత్వం  దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీల అభ్యున్నతికి పాటుపడుతున్నది. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో ఉన్న మైనార్టీ గురుకులాల సంఖ్య 12 ఉండగా, వాటికి అదనంగా 192 గురుకులాలను ఏర్పాటు చేసింది. అందులో 50 శాతం గురుకులాలను మైనార్టీ బాలికల కోసమే ప్రత్యేకంగా కేటాయించి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నది.  గురుకులాల ద్వారా మొత్తం లక్షా 14 వేలమంది మైనార్టీ  విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. 

 • మైనార్టీల కోసం ప్రత్యేకంగా షాదీముబారక్‌ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ పేదింటి యువతుల వివాహానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నది.
 • నాంపల్లిలోని అనాథ శరణాలయం అనీస్‌-ఉల్‌-గుర్బాను రూ.40 కోట్లతో పునర్నిర్మించింది.
 • మసీదుల్లో ప్రార్థనాదికాలు నిర్వహించే పదివేలమంది ఇమాం, మౌజంలకు నెలకు 5 వేలచొప్పున గౌరవవేతనం అందిస్తున్నది. రంజాన్‌కు4లక్షల65వేల మందికి, క్రిస్మస్‌ పండుగలకు ఏటా సుమారు 5లక్షల మందికి కొత్తబట్టలను కానుకగా అందిస్తున్నది.
 • మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధికి రుణాలను అందించడంతో పాటు, యువతకు ఉచిత నైపుణ్య శిక్షణను అందిస్తున్నది.
 • డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం కింద సబ్సిడీపై వాహనాలను అందిస్తున్నది.
 • గూప్‌ 1,2,3 పోస్టుల కోసం ఉమ్మడి జిల్లాలలోని మైనార్టీ స్టడీ సెంటర్లలో, గ్రూప్‌ 4 పోస్టులకు గాను 33 జిల్లా కేంద్రాలలో కోచింగ్‌ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది.

దివ్యాంగుల పింఛన్లలో దేశంలోనే టాప్‌

దివ్యాంగులకు అత్యధిక పింఛన్లను అందిస్తున్న రాష్ట్రాల్లో  దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మొదటిస్థానంలో నిలచింది. ప్రతినెలా 5లక్షల మంది దివ్యాంగులకు రూ.3016 చొప్పున ఆసరా పింఛన్‌ను అందజేస్తున్నది. అందుకు మొత్తంగా కేవలం పింఛన్‌ రూపంలోనే సంవత్సరానికి రూ.1800.96 కోట్లను వెచ్చిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణనే.   

దివ్యాంగుల భద్రత, సంక్షేమం, సముద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశేష కృషి వేస్తున్నారు. 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆర్థిక, అభివృద్ధి సంక్షేమ పథకాలలో ఉన్న రిజర్వేషన్‌ను 3 నుంచి 5శాతానికి పెంచారు. వికలాంగులకు సంబంధించి చట్టం, విధానాలు, కార్యక్రమాలు, పథకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి, వారి సంక్షేమానికి కృషి చేస్తున్న వివిధ శాఖల సమీక్ష, సమన్వయం కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధ్యక్షతన రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాల పరిధిలోకి రానటువంటి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించడానికి రూ.3.50కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయడంతో పాటు, వికలాంగుల హక్కుల చట్టం, నిబంధనల అమలు పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ప్రత్యేక కమిటీలను నియమించారు. 

తాజాగా 2016 చట్టాన్ని అనుసరించి వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతూ ఉన్నత విద్యనభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్థులకు  చెల్లించాల్సిన మెస్‌ చార్జీలను, కాస్మోటిక్‌ చార్జీలను భారీ మొత్తంలో పెంచారు. సాధారణ విద్యార్థులకు చెల్లించే దానికన్న 25శాతం అదనంగా అందజేయాలని నిర్ణయించడంతో ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు.  

మహిళా,శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కోసం 18 వసతి గృహాలను ఏర్పాటు చేశారు. అంధుల కోసం 6, శారీరక దివ్యాంగుల కోసం 12 వసతి గృహాలను నిర్వహిస్తున్నారు. వాటితో పాటు అదనంగా అంధుల కోసం 2, బధిరుల కోసం 3 మొత్తంగా దివ్యాంగుల కోసం 5 ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఆయా ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల ద్వారా సుమారు 2300 మందికిపైగా దివ్యాంగ విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. పాఠశాలల్లో 1నుంచి పదో తరగతి, వసతి గృహాల్లో ఉంటూ ఇంటర్‌, డిగ్రీ, పీజీ తదితర ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. 25శాతం అదనంగా మెస్‌చార్జీలు పెంచారు. 

పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న 500 మంది దివ్యాంగ అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందించి ఉచిత శిక్షణకు ఏర్పాట్లు చేసింది. 

మోడ్రన్‌ అవసరాలకు అనుగుణంగా ట్రైనింగ్‌ కమ్ ప్రొడక్షన్‌ సెంటర్లను తీర్చిదిద్దుతున్నది. సహాయ ఉపకరణాల తయారీపైనే కాదు టీసీపీసీ సెంటర్ల ద్వారా దివ్యాంగులకు స్వయం ఉపాధి శిక్షణపైనా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. గతంలో టీసీపీసీల ద్వారా దివ్యాంగులకు ఏవో చిన్నపాటి ఆగర్‌బత్తిలు, కొవ్వొత్తుల తయారీ తదితర వాటిల్లో శిక్షణ ఇచ్చేవారు. అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చర్యలు చేపట్టింది. ఆధునిక కాలానికి అనుగుణంగా కంప్యూటర్‌ ఆధారిత ఉపాధి, ఇతర రంగాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఇటీవలే ప్రత్యేక కమిటీని సైతం నియమించింది. ఇప్పటికే రూ.కోటి ఖర్చుతో వందల మంది దివ్యాంగులకు ఉపాధి శిక్షణ ఇప్పించింది.

 మహిళాభ్యున్నతికి అగ్రతాంబులం..

తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం అంగన్‌ వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని ప్రతి రోజూ అందించేందుకు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని జనవరి 1, 2015 నుంచి అమలు చేస్తున్నది. 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని 35,700 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నది.  మరోవైపు  రాష్ట్రంలోని 0-5 ఏండ్ల చిన్నారుల కోసం బాలామృతాన్ని అందిస్తున్నది. ఎంపిక చేసిన జిల్లాల్లో బాలామృతం ప్లస్‌ను అందిస్తున్నది. 

2022-23 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా కేసీఆర్‌ న్యూట్రిషియన్‌ కిట్‌ అనే పథకాన్ని అమలు చేస్తున్నది. మారుమూల ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లోని అడవిబిడ్డలకు ఈ పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందించి రక్తహీనతను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, కొమ్రంభీం-ఆసిఫాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం, జయశంకర్‌-భూపాలపల్లి, కామారెడ్డి, వికారాబాద్‌, ములుగు, జోగులాంబ-గద్వాల, నాగర్‌ కర్నూల్‌  ఈ 9 జిల్లాలతో ప్రారంభించి దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేయాలని సర్కార్‌ సంకల్పించింది.  

మహిళల ప్రసూతి కోసం కేసీఆర్‌ కిట్‌ పథకం కింద నగదు ప్రోత్సాహకం. మగపిల్లాడికి 12000, ఆడబిడ్డకు 13000

దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా ప్రభుత్వం  ముఖ్యమంత్రి గిరిజన ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ (సీఎంఎస్టీఈఐ) పథకం ప్రవేశపెట్టింది. మూడేళ్లు గా సంవత్సరానికి వంద మంది చొప్పున గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా ప్రభుత్వం తీర్చిదిద్దింది.  

గిరిజన సంక్షేమం

తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని  ప్రభుత్వం మార్చింది. రాష్ట్ర వ్యాప్తంగా  1,177 తండాలు, గూడాలను కొత్తగా గ్రామ పంచాయ తీలుగా ఏర్పాటయ్యాయి. ఇందులో 1,281 ఆవాస ప్రాంతాలు షెడ్యూల్డు ఏరియాలో ఉండడంతో వాటిని  ఎస్టీలకే రిజర్వు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు దక్కింది.  మరోవైపు ఎస్టీల జనాభాను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో 688 గ్రామాలను ఎస్టీలకు రిజర్వు చేసింది. దీంతో 3,146 మంది ఎస్టీలు సర్పంచులై దర్జాగా తమతమ గ్రామాలను తామే తీర్చిదిద్దుకుంటున్నారు. 

 • కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల భవనాలు ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో గ్రామ పంచాయతీకి రూ. 25 లక్షల చొప్పున  రూ. 600 కోట్లను కేటాయించింది. 
 • రాష్ట్రంలో అన్ని తండాలు, గోండు గూడెలకు త్రీఫేజ్‌ కరెంట్‌ ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.  నెలా రెండు నెలల కాలంలో ఆ లక్ష్యం పూర్తి చేయాలని నిర్దేశించుకున్నది. 
 • గిరిజన ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల కోసం 2022-23  బడ్జెట్‌లో రూ. 1000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 
 • జీసీసీ (గిరిజన సహకార సంస్థ)ను బలోపేతం చేయటం ద్వారా గిరిజన ఉత్పత్తులకు మంచి ఆదరణ వచ్చేలా ఏర్పాటు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. 

ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవం సమున్నతంగా తలెత్తుకొని నిలబడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. హైదరాబాద్‌ నట్టనడి బొడ్డున వందల కోట్లు విలువ చేసే స్థలంలో ఆదివాసీ భవన్‌, బంజార భవన్‌లను నిర్మించింది. ఒక్కో భవన్‌ నిర్మాణానికి రూ. 50 కోట్లు వెచ్చించింది. అంతేకాకుండా మేడారం, కెస్లాపూర్‌, సలేశ్వరం వంటి జాతరలను ప్రభుత్వం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నది. ఆదివాసీ, గిరిజన జనాభా ఉన్న ప్రతీ జిల్లాలో గిరిజన ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. 

గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపంతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని భావించిన ప్రభుత్వం ఇక్రిశాట్‌తో కలిసి అదనపు పోషక విలువలున్న ఆహారాన్ని అందిస్తున్నది. గిరిపోషణ్‌పేరుతో అందిస్తున్న ఈ ఆహారంతో గిరిజన బిడ్డల ఆరోగ్యంలో మార్పులు వస్తున్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 

నిర్విఘ్నంగా కల్యాణలక్ష్మీ 

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్‌ పథకం ఇంతై.. ఇంతితై అన్నట్లుగా విజయవంతంగా కొనసాగుతున్నది. మరో కీలక మైలురాయిని దాటింది. ఇప్పటివరకు 10లక్షల మందికిపైగా లబ్ధి పొందగా పథకం సరికొత్త రికార్డును సృష్టించింది. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ పభుత్వం, సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైనది కల్యాణలక్ష్మి పథకం. పేదింటి ఆడపిల్ల పెండ్లి తల్లిదండ్రులకు గుండెలమీద కుంపటి కావద్దని భావించిన సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అనే విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. 2014 అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభమైన ఆ పథకాన్ని ప్రభుత్వ ఆశయాన్ని సాకారం చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నది. తొలుత పథకం కింద ఎస్సీ, ఎస్టీల యువతుల వివాహానికి రూ.51వేల ఆర్థిక సాయాన్ని అందజేయగా, అటు తరువాత దానిని బీసీలకు సైతం విస్తరింపజేశారు. మూడేళ్ల తరువాత 2017లో పథకం కింద అందిస్తున్న ఆర్థికసాయాన్ని రూ.51000 నుంచి 75,116కు పెంచారు. ఆ తరువాత మార్చి19, 2018 నుంచి ఆ మొత్తాన్ని సైతం మరోసారి రూ.1,00116లకు పెంచి దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 10లక్షల 56వేల 239 మంది ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌ మేనమామగా ఆర్థిక సహాయం అందించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు నిరుపేద తల్లిదండ్రులకు ఎంతో అండగా నిలుస్తున్నాయి. పథకం కింద ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి లబ్ధి పొందిన వారుండడం విశేషం. అదేవిధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా లబ్ధి పొందిన ఆడబిడ్డల్లో అత్యధికశాతం మంది అటు తరువాత కేసీఆర్‌ కిట్లను అందుకుంటుండడం మరో విశేషం. 

 గీతకార్మికుల కోసం ప్రత్యేక పథకం 

రాష్ట్రంలో కల్లు గీత ప్రధానవృత్తి, ఆ వృత్తిని ఎంచుకున్న గౌడన్న నుదిటి రాతను మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది.  ప్రజలకు ప్రాణహాని కలగని మద్యం, స్వచ్ఛమైన కల్లు అందుబాటులో ఉంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను పునరుద్దరించింది. కల్లు కాంపౌండ్లను పునరుద్ధరించింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చెరువు కట్టలపై ఈత చెట్లను నాటించింది. ప్రమాదవశాత్తు మరణించిన గీతకార్మికుల ఎక్స్‌గ్రేషియాను 2 నుంచి 5లక్షలకు పెంచింది. గౌడ కులస్తులకు మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్లను కల్పించింది. రాష్ట్రంలో  గౌడకులస్థులు ఆత్మగౌరవంతో బతికేలా  సీఎం కేసీఆర్‌  నీరా పాలసీని తెచ్చారు.  తాటిచెట్టు నుంచి ఉత్పత్తి అయ్యే నీరాను సాఫ్ట్‌ డ్రింక్ గా ప్రవేశపెట్టడం కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమలు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం అందుకు సంబంధించి పలు విధానాలను ప్రకటించింది. తాజాగా ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం నీరా ఉత్పత్తి, సేకరణ కోసం రూ.20కోట్లను ప్రతిపాదించింది. భువనగిరి దగ్గరలోని నందనంలో నీరా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నెక్లెస్‌ రోడ్‌లో నిర్మిస్తున్న నీరా కేఫ్‌ పనులు ఇప్పటికే తుదిదశకు చేరుకోగా, ప్రభుత్వం త్వరలో దానిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. అదేవిధంగా గీత కార్మికుల సంక్షేమం కోసం మరో నూతన పథకాన్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అందు కోసం 2022-23 బడ్జెట్‌లో రూ. 100కోట్లను కేటాయించింది. 

 నేతన్నకు బీమా 

తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వం నేతకార్మికులతోపాటు, మరమగ్గాల కార్మికులకు చేతినిండా పనికల్పించే దిశగా తొలుత ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా బతుకమ్మ చీరల తయారీని వారికే అప్పగించింది. నిరంతరం ఉపాధి లభించేవిధంగా చేసింది. నూలు రసాయనాల మీద 50శాతం సబ్సిడీ సదుపాయాన్ని కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం  నేతన్నకు చేయూత’  అనే పొదుపు పథకాన్ని ప్రారంభించి తద్వారా రాష్ట్రంలో లక్షలాది నేత కార్మికుల కుటుంబాల్లో వెలుగు నింపింది.  థ్రిఫ్ట్‌ పథకంలో మరమగ్గాల ఆధునీకకరణకు చర్యలు చేపట్టింది. మరోవైపు చేనేత కళాకారులకు 50శాతం కూలీని పెంచింది. ఫాం టు ఫ్యాషన్‌ నినాదంతో  దేశంలోనే అతిపెద్ద వస్త్రనగరిగా వరంగల్‌ను ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల రుణ మాఫీ పథకాన్ని తెచ్చి లక్షలాది నేతన్నలను రుణవిముక్తి చేసింది. తాజాగా నేత కార్మికులకు రైతు బీమా తరహాలోనే రూ.5లక్షల బీమా సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు బీమా పథకం కింద గుంట భూమి ఉన్న రైతుకు కూడా ఎలాంటి కారణంతోనైనా సరే మరణించిన సందర్భంలో బాధిత కుటుంబానికి వారం రోజుల్లోనే రూ.5లక్షల బీమాను అందిస్తున్నది. బీమా పథకం కోసం రైతుల తరపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తున్నది. అదే తరహాలో నేత కార్మికులకు సైతం బీమా పథకాన్ని అందజేయాలని ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించింది. సుమారు 50వేల మందికిపైగా పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.