|

కృష్ణవేణి తీరంలో పవిత్ర క్షేత్రాలు

jogulambaగత సంవత్సరం గోదావరి పుష్కరాలు జరుపుకున్నాం. జూలై నెల 30 తేదీ నుంచి గోదావరి అంత్య పుష్కరాలు కూడా జరుపుకున్నాం. గోదావరి అంత్య పుష్కరాలు పూర్తయిన నాటి నుంచి ప్రారంభమయ్యే మరో పుష్కరాలు కృష్ణా పుష్కరాలు. దేవగురువు బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కో సంవత్సరం చొప్పున సంచరిస్తూ ఉంటాడు. ఆయన ఏ రాశిలో సంచరిస్తాడో, అప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి. అంటే బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరీ పుష్కరాలు, కన్యారాశిలోకి అడుగుపెట్టినప్పుడు కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి. కృష్ణా నదికి 2016 ఆగస్టు 12 నుంచి పుష్కరాలు ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగుతాయి. కృష్ణా నది శ్రీమహావిష్ణువు శరీరం. శివుని అష్టమూర్తులలో ఒకటైన జలస్వరూపం. శివకేశవ స్వరూపం. ఇది అత్యంత మహిమాన్వితమైనదని, దీనిలో స్నానాల వల్ల మహాపాపాలను పోగొడుతుందని పురాణ వచనం. పుష్కరాల సమయంలో కృష్ణలో స్నానాదులు, పూజలు, దానధర్మాలు, పితృ దేవతలకు పిండప్రదానాలు, జపాలు చేస్తే పుణ్య ఫలాలు సంప్రాప్తిసాయని పురాణాలు చెబుతున్నాయి. పుష్కరాలలో నదీ స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాలపాటు ఆ నదులలో నిత్యం స్నానం చేసినంత పుణ్య ఫలం లభిస్తుందంటారు. అలాగే జన్మజన్మల పాపాలూ నశించి, మోక్షప్రాప్తి కలుగుతుంది. ఏ నదికి పుష్కరాలు వస్తాయో ఆ నదిపేరును మనం స్నానం చేసేటప్పుడు ముమ్మారు మనస్సులో తలచుకున్నా కొంతమేర పుష్కర స్నానఫలితం పొందచ్చునని శాస్త్రవచనం.

పుష్కర కాలంలో చేసే ఆయా కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి. బంగారం, వెండి, భూమి, ధనం, గోవులు, ధాన్యం, లవణం, రత్నాలు, అశ్వం, పండ్లు, బెల్లం, వస్త్రాలు, తైలం, కూరగాయలు, తేనె, పీట, అన్నం, పుస్తకం … ఇలా ఎవరి శక్తిని బట్టి వారు ఈ పుష్కర సమయంలో దానం చేస్తే పుణ్య ఫలాలు సిద్ధిస్తాయంటారు.

మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతశ్రేణిలో మహాబలేశ్వరం వద్ద ఉద్భవించిన కృష్ణా నది మహాబలేశ్వర లింగం పైనుంచి ప్రవహించి నదిగా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లోని హంసలదీవి మీదుగా ఏటిమొగ, ఎదురుమొండి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. తుంగభద్ర, వేణి, మూసీ, దిండి, పాలేరు, మున్నేరు దీనికి ఉప నదులు. వీటిలో తుంగభద్ర, మూసీ నదులు ఇతర జీవ నదులకు మల్లే ప్రఖ్యాతి చెందాయి. కృష్ణానది పుష్కర కాలంలో ఆయా నదిలో స్నానాదికాలు, జప, తపాలతో పాటు ఆయా నదికి సమీపంలో ఉన్న ఆలయాల సందర్శనం ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేయడంతో పాటు, మానసికానందన్నిచ్చి, పుణ్య ఫలాలు సొంతమవుతాయని పెద్దలు చెబుతారు. ఆకారణంగా నదికి సమీపంలోనూ, నది ఒడ్డున ఉన్న ఆలయాల సందర్శనం సర్వ విధాల మేలు చేస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటక లోకి ప్రవేశించిన కృష్ణా నది మహబూబ్‌ నగర్‌ జిల్లాకు సమీపంలో మక్తల్‌ మండలంలో తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.

దత్తాత్రేయ స్వామి దేవాలయం – వల్లభాపురం(మక్తల్‌ )

మహబూబ్‌ నగర్‌ జిల్లా మక్తల్‌ మండల కేంద్రంలో గల వల్లభాపురం గ్రామంలో వెలసిన మహిమాన్వితమైన దత్తాత్రేయ క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేవాలయం . దత్తాత్రేయ స్వామి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వెలసిన క్షేత్రమిది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మ స్థలం పిఠాపురం అయితే తన తపస్సు, ధ్యానం అన్ని కురవాపురం లోనే జరిగాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. వల్లభాపురం తెలంగాణా, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మహిమాన్విత దత్త క్షేత్రం. కృష్ణా నదికి ఇవతలి వైపు వల్లభాపురం ఉండగా, అవతలి వైపు కురువాపురం ఉంటుంది.

కృష్ణా నది సమీపంలో వెలసిన మహిమాన్విత దత్త పీఠమిది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేశమంతా తిరుగుతూ, ఈ క్షేత్రానికి వచ్చి కొన్ని రోజులు ఇక్కడ నివాసముండి భక్తుల కష్టాలు తీర్చాడట.

కష్టాలు, కలతలతో బాధపడేవారు, దుష్ట శక్తుల బారి నించి విముక్తి కోరుకునేవారు ఇక్కడ స్వామిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని స్థల పురాణం చెబుతోంది.

కురుపురం, కురువాపురం, కురుంగడ్డ తదితర పేర్లతో పిలుచుకునే శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ఉంది. మక్తల్‌ నుంచి అనుగొండ వెళ్ళే బస్సులో పంచదేవ్‌ పహాడ్‌ గ్రామాన్ని చేరుకుని అక్కడ నుంచి సమీపంలోనే ఉన్న కురుపురం చేరుకోవచ్చు. కురుపురం ఒక ద్వీపంలో ఉంది. చుట్టూ కృష్ణా నది. ఈ నది దాటితే స్వామి వారి ఆలయం ఉంది. శ్రీపాద శ్రీవల్లభులు చాలా సంవత్సరాలు కురుపురంలో తపస్సు చేశారు. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి తపస్సు చేసిన ఈ ప్రాంతంలో ఒక చిన్న ఆలయం ఉంది. సమీపంలోనే వాసుదేవానంద సరస్వతి స్వామి వారు తపస్సు చేసిన గుహ, శివాలయం దర్శించుకోవచ్చు. కురు మహారాజుకు జ్ఞాన సిద్ది కలిగిన ప్రదేశం కాబట్టి కురుపురమనే పేరు వచ్చింది. దీనికి సమీపంలోనే పంచదేవ పహాడ్‌ ఉంది. మక్తల్‌ మండలంలో ఉన్న ఈ క్షేత్రంలో పాండురంగ స్వామి, శ్రీలక్ష్మీనరసింహ స్వామి, ఆంజనేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, వినాయకునితో పాటు అనఘ దత్త దేవాలయాలు ఒకే చోట దర్శనమిస్తాయి.

ఆంజనేయ స్వామి ఆలయం, బీచుపల్లి

మహబూబ్‌ నగర్‌ జిల్లా ఇటిక్యాల మండలం కృష్ణా నది ఒడ్డున బీచుపల్లి గ్రామంలో వెలసిన మహిమాన్విత ఆలయమిది. పదహారవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం, తొమ్మిదవ శతాబ్దానికి చెందిన చోళ రాజ్యంలో ప్రాచుర్యం పొందిందని ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ఇక్కడ స్వామిని బీచుపల్లిరాయుడని భక్తులు భక్తితో పిలుచుకుంటారు. ఇక్కడ ఈ ఆలయంలో స్వామివారి మొదటి పూజను బోయవారు చేయడం ఈ ఆలయం విశేషంగా చెబుతారు. స్వామి వారి ఆదేశం మేరకు ఈ సంప్రదాయం ఇలా కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇక్కడ స్వామివారిని వ్యాస రాయల వారు ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. అలాగే రెండు శతాబ్దాల క్రితం గద్వాల రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలో స్వామివారి మూర్తితోపాటు ఎడమ వైపున మహేశ్వర లింగం, కుడివైపున సీతా లక్ష్మణ సహిత శ్రీరాముడు కొలువుదీరి ఉన్నారు.

సోమేశ్వర స్వామి ఆలయం, సోమశిల

మహబూబ్‌ నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమశిలలో సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నేపధ్యంగా అలరారుతున్న ఈ దివ్యాలయం ప్రాంగణంలోని కృష్ణా నదిలో పుష్కర స్నానాదికాలు చేస్తే విశేష పుణ్యఫలాలు సొంతమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. సోమశిలలోని శ్రీలలితా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని ఏడవ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల ఈ ఆలయం నదిలో మునిగిపోకుండా గట్టున ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించారు. ఈ ఆలయం పదిహేను ఆలయాల సముదాయంగా విరాజిల్లుతోంది. జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధమైన ద్వాదశ లింగాల ప్రతిరూపాలను ఒకే చోట ఆలయంలో ప్రతిష్టించారు. ఈ ఆలయాలలోని అన్ని గర్భగుడుల లలాట బింబంగా గజలక్ష్మి ఉండడం ఈ ఆలయ విశేషంగా చెబుతారు. ఆలయం ముందు భాగంలో రెండు శాసనాలున్నాయి. కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రైలోక్య మల్ల ఒకటవ సోమేశ్వరుని పాలన కాలంలో, కాకతీయ మహారాజు రెండో ప్రతాప రుద్రుని కాలంలోనూ ఈ శాసనాలు వేసినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది.

అలంపురం ఆలయాలు

అలంపురం సమీపంలో కృష్ణా, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశిగా అభివర్ణిస్తూ ఉంటారు. మహబూబ్‌నగర్‌కి 90 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాద్‌కి 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్న అలంపురం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో బాదామీ చాళుక్యులు ఈ ఆలయాలను నిర్మించారు. అలంపురం చుట్టూ నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. తుంగభద్ర నది ఎడమ గట్టున అలంపురం ఆలయం ఉంది. శాతవాహన, బాదామీ చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధిపతులు, గోల్కొండకి చెందిన కుతుబ్‌ షాహీ ల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. జోగులాంబ, బ్రహ్మేశ్వరస్వామి వార్ల ఆలయాలు చారిత్రక ప్రసిద్ధి చెందినవి. అలంపురాన్ని పూర్వం హలంపురంగానూ, హటాంపురంగానూ వ్యవహరించేవారని క్రీస్తు శకం 1101 సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది. ఈ శాసనం పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్య-4 కాలం నాటిది.

జోగుళాంబ ఆలయం అలంపురంలో ఆగ్నేయ దిశగా నెలకొని ఉంది. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ధ్వంసం చేయగా, జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. కొద్ది సంవత్సరాల క్రితం జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. సతీదేవికి చెందిన పై దవడ పంటితో సహా ఇక్కడ పడినట్టు పురాణకథనం. అమ్మవారు ఉగ్రరూపంతో దర్శనమిస్తారు. మొదట అమ్మవారి విగ్రహం ఇక్కడున్న బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008లో అమ్మవారికి ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి, తిరిగి ప్రతిష్టించారు.

అలంపూర్‌కు ఈశాన్యంలో కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో కూడవెల్లి అనే గ్రామంలో సంగమేశ్వరాలయం ఉండేది. ఈ గ్రామం, ఆలయం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురికావడంతో ఇక్కడి సంగమేశ్వరాలయాన్ని తరలించి అలంపూర్‌లో పునర్నిర్మించారు. ఈ ఆలయ శిల్పసంపద ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయం కూడా చాళుక్యుల నిర్మాణ శైలిలోనిదే.

అలాగే, అలంపురం సమీపంలోని పాపనాశంలో ఇరవై దేవాలయాలు ఒకేచోట ఉండటం వల్ల అలంపురం ఆలయాల పట్టణంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఏడవ శతాబ్ది నుంచి 17వ శతాబ్ది వరకూ దక్షిణాపథాన్ని పరిపాలించిన రాజవంశీయుల శాసనాలు ఇక్కడ ఉన్నాయి. ప్రాచీన శిల్పకళకు కాణాచి అయిన ఈ ఆలయం అడుగడుగునా విజ్ఞాన విశేషాలకు ఆలవాలంగా ఉంది. వైదిక మతానికి చెందిన ఆలయాలు, జైన, బౌద్ధుల కాలం నాటి శిల్పనిర్మాణాలు ఇక్కడ ఎన్నో దర్శనమిస్తాయి.

ఈ ఆలయం మహాద్వారాన్ని రాష్ట్ర కూటుల హయాంలో నిర్మించినట్టు చారిత్రక కథనం. కాకతీయుల కాలంలో ఇక్కడ మండపాలను నిర్మించారు. శ్రీకృష్ణ దేవరాయలు రాయచూర్‌ నుంచి ఈ ఆలయానికి వచ్చి అనేక మాన్యాలిచ్చినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, మట్టంపల్ల్లి, నల్గొండ జిల్లా

నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌ సమీపంలోని మట్టంపల్ల్లి గ్రామంలో కృష్ణా నదీ తీరాన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. తెలుగునాట పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన పుణ్య క్షేత్రమే మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. ఈ ఆలయానికి దాదాపు వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. మట్టపల్లిలో వెలసిన స్వామి కొన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా గుహలో దాగి ఉండేవాడట. ఇదే గుహలో భరద్వాజ మహర్షి తపస్సు చేయడంతో ప్రత్యక్షమైన స్వామి ఇక్కడే వెలిశాడని, ఒక్క భరద్వాజ మహర్షి మాత్రమే అప్పట్లో స్వామివారిని ఆరాధించుకునేవారని ప్రతీతి. ఈ ఆలయంలో దేవనాగరి లిపిలో ఉన్న శిలాశాసనం ఆధారంగా ఈ ఆలయం 1100 సంవత్సరాల కిందటిదని తెలుస్తోంది. కొండ మీద స్వామి స్వయంభువుగా వెలిశాడు. ఇక్కడ స్వామితో పాటే ఒక దక్షిణావృత శంఖం కూడా ఆవిర్భవించింది.

గుంటూరు జిల్లాలోని తంగెడ గ్రామానికి చెందిన మాచిరెడ్డి అనే భక్తుడికి స్వామి కలలో కనిపించి, తాను ఇక్కడ కొండగుహలో వెలిశానని, తనను వెలికితీసి, పునఃప్రతిష్టించమని ఆదేశించాడట. ఆ భక్తుడు గుహలోనున్న స్వామి విగ్రహాన్ని వెలికితీసి, ఆలయం నిర్మించినట్లు ఇక్కడి స్థలపురాణాలు చెబుతున్నాయి. నాటి నుంచి ఈ ఆలయంలో రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తులు పూజించడం మొదలైంది. ఈ ఆలయంలో స్వామివారికి ప్రీతిపాత్రమైన ఆరె ఆకులను దండలుగా చేసి అలంకరిస్తారు. పశ్చిమాభిముఖంగా ఉన్న స్వామివారి గుహాలయానికి ఆనుకుని గోదాదేవి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, నాగేశ్వర ఆలయం తదితర ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి యమమోహిత క్షేత్రమని కూడా పేరుంది. యమధర్మరాజు స్వయంగా ఈ ఆలయంలో స్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల దీనికాపేరు వచ్చిందంటారు. హైద్రాబాద్‌ నుంచి వచ్చే భక్తులు రోడ్డు మార్గంలో కోదాడ వరకు వచ్చి అక్కడ నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే మిర్యాలగూడ మీదుగా కూడా ఇక్కడకు చేరుకోవచ్చు.

శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం, దామెరచర్ల

నల్గొండ జిల్లా దామెరచర్ల మండలంలో విష్ణుపురానికి సమీపంలో కృష్ణా, మూసీ నదుల సంగమ క్షేత్రంలో వెలసిన పుణ్య క్షేత్రమిది. ఇదో ప్రాచీన మహానగరం. 11,12 శతాబ్దాల కాలంలో ఈ క్షేత్రం గొప్ప ఓడరేవుగా ఉండేదని, వోడపల్లి కాలక్రమంలో వాడపల్లిగా, వజీరాబాద్‌ గా మారిందని చెబుతారు. అలాగే ఈ ప్రాంతాన్ని పూర్వం బదరికారణ్యం అని పిలిచేవారు. ఆరు వేల సంవత్సరాలకు పూర్వం అగస్త్య మహాముని, తన ధర్మపత్ని లోపాముద్రతో శివకేశవులను తన పూజా కావిడిలో ఉంచుకుని, వారిని ప్రతిష్టించే పవిత్ర ప్రదేశం కొరకు ముల్లోకాలు తిరుగుతూ భూలోకం చేరారట. ఉత్తరకాశీకి వెళ్ళే క్రమంలో ఈ బదరికారణ్యాన్ని చేరుకున్నారట. ఈ పవిత్ర క్షేత్రంలోకి రాగానే నరసింహ స్వామి తానా ప్రదేశంలోనే ఉండ దలచినట్లు ఆకాశవాణి వినిపించిందట. అంతట ఆ ముని దంపతులు శ్రీ లక్ష్మీసమేతునిగా నరసింహుని ప్రతిష్ఠించి ఈ క్షేత్ర పవిత్రతను ఇనుమడింప చేశాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. మరో కధనం మేరకు వ్యాస భగవానుడి కోరిక మేరకు లక్ష్మీనరసింహ స్వామి ఈ క్షేత్రంలో కొలువుదీరినట్లు చెబుతారు. ఈ ఆలయం దక్షిణ ముఖంగా ఉంటుంది. విష్ణుకుండినులు, చాళుక్యులు, కుందూరు చోళులు, రేచర్ల పద్మ నాయకులు, రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు తెలుస్తోంది. శిధిలమైన ఆలయాన్ని 13వ శతాబ్దంలో అనవేమారెడ్డి పునర్నిర్మాణం చేసి వసతులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎరయ తొండయ చోళుడు క్రీ.శ. 1050, 1065 మధ్య అద్భుతమైన వాడపల్లి దుర్గాన్ని అభివ్రుద్ది చేసినట్లు తెలుస్తోంది. 12వ శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ ప్రదేశంలో పట్టణ నిర్మాణానికై తవ్వకాలు జరుపుతుండగా స్వామి వారి విగ్రహం బయట పడిందని, వారు అక్కడే ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి క్రీ.శ. 1377లో ఆలయ నిర్మాణం చేసినట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది.

పుష్కరాల సమయంలో దర్శించుకోదగ్గ ఇతర ఆలయాలు

వీటితో పాటు మాగనూరు మండలం తంగిడి పుష్కర ఘాట్‌ సమీపంలోని వల్లభేశ్వరస్వామి ఆలయం, దత్తాత్రేయస్వామి ఆలయం, రామలింగేశ్వరస్వామి, గుడెబల్లూరు ఘాట్‌ స్వయంభూ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి, మక్తల్‌ మండలం పస్పుల ఘాట్‌ సమీపంలోని శ్రీదత్తాత్రేయస్వామి . పరెవుల ఘాట్‌ సమీపంలోని శంకర లింగేశ్వర స్వామి ఆలయాలు దర్శించుకోవచ్చు. అలాగే ఆత్మకూరు మండలం నందిమళ్ల ఘాట్‌ సమీపంలోని శివాలయం, మూలమళ్ల ఘాట్‌ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం, జూరాల ఘాట్‌ దగ్గర శివాలయాలు. పెబ్బేరు మండలం రంగాపూర్‌ ఘాట్‌ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకునే వీలుంది. ధరూర్‌ మండలం పెద్దచింతరేవుల ఘాట్‌ ఆంజనేయస్వామి ఆలయం, వీపనగండ్ల మండలం పెద్దమరూర్‌ ఘాట్‌ ఈశ్వర ఆలయం, జటప్రోలు మదనగోపాల స్వామి, కొల్లాపూర్‌ మండలం సింగోటం శ్రీలక్ష్మీనర్సింహ్మస్వామి ఆలయం, శ్రీ అగస్తేశ్వర ఆలయాలు కూడా పుష్కరాల సమయంలో దర్శించుకోవచ్చు. అలాగే, అమరగిరి ఘాట్‌ అమరేశ్వర ఆలయం, పెబ్బేరు మండలం గుమ్మడం ఘాట్‌ సమీపంలోని చెన్నకేశవస్వామి ఆలయం, రామ్‌పూర్‌ ఘాట్‌ శ్రీరామాలయం, ముంగమందిన్నె ఘాట్‌ శ్రీ ఆంజనేయస్వామి, రామాలయాలు. వీపనగండ్ల మండలం చెల్లపాడు ఘాట్‌ శివాలయం, కొల్లాపూర్‌ మండలం మంచాలకట్ట, మల్లేశ్వరం ఘాట్‌ సమీపంలోని శ్రీ రామతీర్థస్వామి ఆలయం, శివాలయం. అచ్చంపేట మండలం పాతాళగంగ పుష్కరఘాట్‌ దగ్గర్లోని దత్తాత్రేయ స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. వీటితో పాటు ధరూర్‌ మండలం నెట్టెంపాడు శివాలయం, ఉప్పేరు, రేవులపల్లి ఘాట్‌ సమీపంలోని శివాంజనేయస్వామి ఆలయాలు, గద్వాల మండలం రేకులపల్లి ఘాట్‌ ఆంజనేయస్వామి ఆలయం, నదీ అగ్రహారం రామావధూత మఠం, బీరెల్లి చెన్నకేశవస్వామి ఆలయాలు, అలంపూర్‌ మండలం క్యాతూరు వెంకటేశ్వరస్వామి ఆలయం, గొందిమళ్ల ఘాట్‌ సమీపంలోని జూంకారేశ్వరీదేవి ఆలయాలు కూడా పుష్కర సమయంలో దర్శించుకునే మహాద్భాగ్యం కలుగుతుంది.

– దాసరి దుర్గాప్రసాద్‌