|

సహజ సుందర చిత్రాల ఏలే లక్ష్మణ్‌

chatra-kala-karulu– టి.ఉడయవర్లు

తనదైన ఆకర్షణీయమైన బాణీతో చిత్రాలు వేయడంలో చిత్తశుద్ధి, నిబద్ధత గల చిత్రకారుడు లక్ష్మణ్‌ ఏలే.

అది కాన్వాస్‌ అయినా, కాగితం అయినా, కాగితం గుజ్జు అయినా, ఆ మూర్తి చిత్రణ అయినా, నలుపు- తెలుపులో గీసినా, సప్త వర్ణాలు వాడినా – ఒళ్ళంతా కళ్ళున్న భావుకుడు చేసిన రూపకల్పనలా రసరసమ్యంగా లక్ష్మణ్‌ చిత్రాలు ఉంటాయి.

సుప్రసిద్ధ చిత్రకారులు కాపు రాజయ్య, లక్ష్మాగౌడ్‌, వైకుంఠం తర్వాత దాదాపు ఆ స్థాయిలో తన ప్రత్యేక ముద్రను వ్యక్తం చేస్తున్న సృజనాత్మక చిత్రాకారుడీయన. లక్ష్మణ్‌ చిత్రాలలో వేలం గ్రామీణులే కాకుండా, వారి చుట్టు ప్రక్కల పరిసరాలు పాలు పంచుకుంటాయి.

ఇటీవల కాలంలో ఆయన తోటి యాత్రికులు శీర్షికన గీసిన చిత్రాలు, వాటి నేపథ్యం, లక్ష్మణ్‌ పనితనానికి, అందులో ఆయన నైపుణ్యానికి మచ్చు తునకలు. లక్ష్మణ్‌ చిత్రాల్లో మట్టి వాసన గుభాళిస్తుంది. నేపథ్యం వల్ల చిత్రకారుడిగా ఆయన ముద్ర దోహదమవుతుంది. రంగుల మేళవింపు హరివిల్లును స్పూరింపజేస్తుంది.

లోగడ ఆయన 1999లో వేసిన కదిరేని గూడెం ప్రతిబింబాలు, 2004లో గీసిన డ్రాయింగ్స్‌ 2009లో చిత్రించిన గ్రామ గీతం చిత్రపరంపర, 2006లో రూపాలు – వర్ణాలు, 2008లోని రంగుల తరంగిణి, 2012 నాటి గ్రామ గీతం శీర్షికలతో గీసిన చిత్రాలన్నింటిని వేసి చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. ఈ చిత్రాలన్నింటిలోను ఆయన తాలూకు గ్రామీణ స్మృతులే ప్రత్యక్షమవుతాయి. వాటన్నింటినీ వాస్తవికంగా, కళాత్మకంగా తీర్చిదిద్దడాని ఆయన ఎంతో కృషిచేశాడు.

చిత్రకళలలో పనికట్టుకొని పట్టభద్రుడై, ఆ తర్వాత స్నాతకోత్తర విద్య కూడా పూర్తి చేసి, ఇవ్వాళ పిహెచ్‌డీ కోసం నకాసి చిత్రాలు, దళిత బహుజనుల ప్రదర్శన కళల చేయూత తీసుకున్నా, నిజానికి ఆయన స్వయం కృషితో పైకి వచ్చిన చిత్రకారుడు. నల్గొండ జిల్లా కదిరేని గూడెంలో నిరుపేద కటుంబానికి చెందిన వీరమ్మ – చంద్రయ్య దంపతులకు జన్మించిన లక్ష్మణ్‌కు బాల్యం నుంచీ బొమ్మలు చూడడం, బొమ్మలు గీయడం అలవాటు. ఆయన నాయనమ్మ దగ్గర దేవుని పటాలు చూసి, ఆ బొమ్మల నకళ్ళు తయారు చేసేవాడు. ఆ తర్వాత భువనగిరిలో పదవతరగతి చదువుతున్న రోజులలో ఆ ప్రక్కనే సైన్‌బోర్డులు వ్రాసే షాపు ఉండేదట, బోర్డులు ఎలా వ్రాస్తున్నారో గమనించే కాంక్షతో వెళ్ళి అందులోనూ ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఈ దశలో ఒకనాడు చిత్రకారుడు కావాలని ఒక దినపత్రికలో ప్రకటన చూసి దరఖాస్తు చేస్తే, ఉద్యోగం వచ్చింది. అక్కడ కొన్ని సంవత్సరాల పాటు చిత్రకారుడిగా ఉద్యోగం చేసి ఎన్ని చిత్రాలు వేసినా, ఎందరో చిత్రకారుల బొమ్మలను, చిత్రకళపై వచ్చిన అనేక గ్రంథాలను అధ్యయనం చేసినా, చిత్రకళలో పట్టా సాధించాలనే కోరిక బలపడి పోయింది.

చిత్ర కళలో ఎంతో నేర్చుకోవలసింది ఉందని, చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి జవహర్‌లాల్‌ నెహ్రూ సాంతిేక విశ్వవిద్యాలయానికి చెందిన లలితకళల కళాశాలలో, ఎందరో మిత్రులు వారించిన కూడా వినకుండా చేరిపోయాడు. కళాశాలలో చేరిన తర్వాత పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకున్నాడు. తర్వాత స్వంత స్టూడియో ఏర్పాటు చేసుకున్నాడు. ఒక వంక కష్టపడి పని చేస్తూ, మరో వంక చదువు కొనసాగించాడు. బి.ఎఫ్‌.ఏ, ఆ తర్వాత ఎం.ఎఫ్‌.ఎ. పెయింటింగ్‌లో పూర్తి చేశాడు. ఈ మధ్య చలన చిత్రాలకు సైతం పని చేశాడు. ముఖ్యంగా రాంగోపాల్‌వర్మ చిత్రాలు నిన్నే పెళ్లాడతా, రంగీలా, సత్య, దౌడ్‌లకు, కుటుంబరావు తీసిన పాత నగరంలో పసివాడు, తాడు చిత్రాలకు కళాదర్శకత్వం నిర్వహించాడు.

ఈ అనుభవంతో హొల్‌ అనే మూడు నిమిషాలచిత్రం, జాతర అనే తొమ్మిది నిమిషాల చిత్రం, బతుకమ్మ అనే పదకొండు నిమిషాల చిత్రం, మందగెచ్చుల కథ అనే గంటా ఇరవై నిమిషాల చిత్రం, కూనపులి పటంకథ ఎనభై రెండు నిమిషాల చిత్రం సృజనాత్మకంగానేకాదు, కళాత్మంగా లక్ష్మణ్‌ తీశాడు.

ఈయన వేసిన చిత్రాలకు అమలాపురం కోనసీమ చిత్రకళాపరిషత్‌ వారి బంగారు పతకం 1993లో వచ్చింది. 1987లోనే నల్లగొండ ఔత్సాహిక కళాకారుల సంఘం నిర్వహించిన చిత్రకళా పోటీలో కాంస్య పతకం గెలుచుకున్నాడు. 1995లో హైదరాబాద్‌ ఆర్ట్స్‌ సొసైటీవారు ఈయన చిత్రానికి ప్రశంసాపత్రం లభించింది.

1995నుంచి లక్ష్మణ్‌ చికాగో, జర్మనీ, కొఫెన్‌గన్‌, హాంకాంగ్‌, ఇటలీ, న్యూయార్క్‌, వాషింగ్‌టన్‌, లండన్‌, హొస్టన్‌, ఢాకా తదితర విదేశీ నగరాల్లో జరిగిన పన్నెండు సమష్టి చిత్రకళా ప్రదర్శనల్లో, హైదరాబాద్‌తోపాటు దేశంలోని వివిధ నగరాల్లో జరిగిన నూరు పాతికదాకా సమష్ఠి చిత్రకళాప్రదర్శనల్లో పాల్గొని తన ప్రత్యేకతను చాటాడు. ఇటీవల న్యూజెర్సీలో ఈయన గ్రామగీతం శీర్షికన వ్యష్టి చిత్రకళా ప్రదర్శన జరిగింది.

ఇంతేకాదు హైదరాబాద్‌, న్యూఢిల్లీ, ముంబై, విజయవాడ, లక్షదీవులు, డెహ్రాడూన్‌, గోవా, కంబోడియా, బాంకాక్‌, ఈజిప్టు, జపాన్‌, ఇటలీ, స్విట్జర్లాండ్‌, చైనా ఇత్యాది దేశవిదేశాల్లో నిర్వహించిన సుమారు పాతిక చిత్రకళా శిబిరాల్లోనూ లక్ష్మణ్‌ పాల్గొన్నాడు.

ఇది ఇలా ఉండగా కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాజముద్రను లక్ష్మణ్‌ రూపొందించాడు. వృత్తాకారంలో తీర్చిదిద్దిన ఈ అధికారిక రాజముద్ర – ఐక్యత, రక్షణ, సంపూర్ణత, అనంతానికి సంబంధించిన భావనను వ్యక్తీకరిస్తుంది. ఈ చిహ్నం బంగారు, హరితవర్ణాలతో కూడి ఉంది. ఈ చిహ్నాలలోని పైభాగంలో నాలుగు నిలబడిన సింహాలు, సత్యమేవ జయతే నినాదం ఉంది.

తెలంగాణలో చారిత్రక కట్టడాలు కాకతీయ కళాతోరణం, చార్మినార్  ఈ రాజముద్రలో విభిన్న సంస్కృతులకు ప్రతిబింబంగా ఉన్నాయి.ఇవేకాకుండా లక్ష్మణ్‌, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పోలీసు లోగోను, తెలంగాణ రాష్ట్ర జెన్‌కో లోగోను, తెలంగాణ రాష్ట్ర విద్యామండలి లోగోను కూడా రూపొందించాడు.

షీల్డ్‌లాగా ధైర్యసాహసాలకు, రక్షణకు, శాంతికి చిహ్నంగా పోలీసు లోగోను తీర్చిదిద్దాడు. మూడు పొరలలో బంగారు, హరిత వర్ణాలు ఉపయోగించి విజ్ఞానానికి, వాసికి, సంపన్నతకు, విజయానికి సంతేంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి లోగోను తయారు చేశారు. రెండు ఆకుపచ్చని కైవారాలతో సామరస్యం, సంపూర్ణత్వం, శాశ్వతత్వాన్ని, ప్రగతిని, సంవృద్ధిని, మంచితనాన్ని, ప్రకృతి సమతుల్యతను వెల్లడించేలాగా జెన్‌కో లోగోను ఈయన రూపకల్పన చేసి డిజైన్‌ చేయడంలో ఆయన పాటవాన్ని ప్రదర్శించాడు.

ఏదేమైనా ఇవ్వాళ ఆయన తెలంగాణ జానపద మహిళలు, వారు పనిచేసే పరిసరాలను సహజ సుందరంగా కళ్ళకు కడుతూ, ఈ నేపథ్యంలో నకాషీ, కలంకారీ చిత్రకళల ప్రభావంతో, దళిత బహుజన కళల ప్రేరణతో అలంకరిస్తున్న తీరు – ఏలే లక్ష్మణ్‌ ముద్రను ప్రస్ఫుటం చేస్తున్నది.