సహస్రఫణ్ అనుసృజన స్వర్ణోత్సవం
కాలం అఖండము. అఖండమైన కాలము భగవత్ స్వరూపము. భగవంతుని సృష్టి స్థితి లయలు, కాలంలోని భూత భవిష్యత్ వర్తమానాలు. త్రికాల స్థితిని ప్రతిబింబించే రచనలే చిరంతనమైనవి. చిరంతన విలువలు ప్రతి పాదించే రామాయణ, భారతాలు విశ్వజనీనమైనవి. ఆధునిక యుగమున అలాంటి విశ్వజనీన రచనే విశ్వనాథ వారి ‘వేయి పడగలు’. ఆ నవల హిందీ రూపాంతరమే పి.వి. అనుసృజించిన సహస్రఫణ్ ! హిందీ అనువాదితమైనప్పటికీ, స్వతంత్ర ప్రతిపత్తిని, ప్రత్యేకతను కలిగి సార్వజనీన రచనగా, సకల జనామోదము పొంది స్వర్ణోత్సవంలో అడుగిడింది సహస్రఫణ్!

‘సహస్రఫణ్ తెలుగువారికే పరిమితమైన విశ్వనాథ సత్యనారాయణ భావధారను యావత్ భారతదేశానికి ఎరుకపరచి మూల రచన ప్రామాణికతను పెంపొందించింది. ‘‘స్వదేశీ విదేశీ సంసృతీ, సంఘర్షణను ప్రత్యక్షంగా చూసిన విశ్వనాథ, భారతీయ జీవన విధానానికి అవసరమైన మౌలిక విలువల గురించి వివరించడానికే వేయిపడగలు నవలను రచించాడని, మన సమాజ నిర్మాణము మన చిరంతన పునాది మీదే జరగాలన్నదే వారి ఆశయమని’’. సహస్రఫణ్‌కు రాసిన ముందు మాటలో పి.వి. ఉటంకించారు. విశ్వనాథే, నవలలో ధర్మారావుగా అవతరించి తన సిద్ధాంతాలను నిరూపించాడని పి.వి. పేరొన్నారు.
‘‘అంగ్రేజి పడాయికి సత్తా కె కారణ్ ఏవం తత్కాలీన్ బ్రిటిష్ సర్కార్ క ఆసరా లేకర్ భారతీయ్ సంస్కృతి పర్ నిరంతర్ దురాక్రమణ్ కర్ నీ వాలె అన్య్ ప్రభావోంకె కారణ్ సత్యనారాయణ జీ కె వ్యక్తిత్వ్ మేఁ ఏక్ ప్రతిక్రియ కీ ప్రవృత్తి – సీ ఉత్పన్న్ హుయీ’’ ‘‘సహస్రఫణ్ కా నిష్కర్డ్ యహ్ హై కి భారత్ వర్ష్ మేఁ సమాజ్- రచనా కి నీఁవ్ హమారె చింతన్ – ఆదర్శోంకె ఆధార్ పర్ హీ హోనీ అచిత్ హై । కిసీ జార్ ఆధార్ పర్ వహ్ నీఁవ్ ఖోఖలీహీ రహేగి (సహస్రఫణ్- పీఠిక) పలు వ్యవస్థలను నడిపేది, నియంత్రించేది ధర్మం. ఈ ధర్మానికి హాని కలిగితే వ్యవస్థలు చెడిపోతాయి. కాబట్టి ధర్మాన్ని రక్షించుకొనగలిగితే వ్యవస్థ సురక్షితంగా వుంటుందనే సందేశాన్ని యీ నవల అందిస్తుంది.
‘సహస్రఫణ్’ నామౌచిత్యం పరిశీలిస్తే ‘సహస్ర’ శబ్దం అనంతత్వాన్ని సూచిస్తుంది. వేయిని సంఖ్యా వాచకంగా భావించరాదు. వేయి అనగా అనేకమని వేదం చెబుతుంది. ‘‘సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్ర పాద్’’ అని పురుష సూక్తం యీ అనంత తత్త్వాన్నే ప్రతిపాదించింది. ‘సహస్రఫణ్’ అనేక ధర్మాలకు, వ్యవస్థలకు ప్రతీక. ‘వేయి’ శబ్దాన్ని కేవలం సంఖ్యాపరంగా ఆలోచిస్తే, యీ అనువాదానికి ‘హజార్ సిర్’ అని పేరు పెట్టొచ్చు. అయితే విశ్వనాథ రచనలోని మౌలిక తత్త్వాన్ని ఎరిగిన పి.వి. ‘వేయిపడగలు’ రచనకు సహస్రఫణ్ అని, పేరిడి సనాతన ధర్మము యొక్క అనంత తత్త్వాన్ని ధ్వనింపజేశారు. అంతేకాదు ‘‘స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః’’. యహీ ఉన్ కీ వైచారిక్ పృష్ఠ భూమి కా సారాంశ్ హై’’ అని సహస్రఫణ్ ముందుమాటలో సూచన ప్రాయంగా చెప్పారు కూడ !
సహస్రఫణ్ ప్రధానంగా రాజ్య, కుటుంబ, సమాజ, వివాహ, గ్రామ, ఆర్థిక, వ్యవస్థలు భూమికగా రచింపబడింది. నవలలో ఆద్యంతం కనిపించే సర్పము కాలానికి, ధర్మ స్వరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి సంకేతంగా చెప్పబడింది. నవల ప్రారంభమే సర్ప ప్రస్తావనతో కనిపిస్తుంది.
‘‘ఫణ్ హజార్ పసార్ నృప్ కొ
స్వప్న్ మేఁ ఫణినే లియా ఇస్ ’’ (సహస్రఫణ్ పుట 15)
‘వేయి పడగల పాము, కలలోన రాజును కాటేసిందని గణాచారి వీధుల్లో హెచ్చరికగా, పాడుతూ వెళుతుంది. ఇక్కడ పి.వి. అనుసృజనా ప్రతిభకు మరొక ఉదాహరణగా, గణాచారి నోట వెలువడే పాట గురించి చెప్పుకోవాలి. మూలంలో విశ్వనాథ ‘‘వేయిపడగల పాము విప్పారు కొనివచ్చి’’ అని ఖండగతిలో (తక/తకిట తక తకిట) రాయగా పివి. ‘‘ఫణ్ హజార్ పసార్ న్నప్ కొ’’ అని ‘ముత్యాల సరము’ వంటి ఛందస్సులో మిశ్రచాపులో, అనగా తకిట తకధిమి గతిలో రాసి, స్వీయ శిల్పానికే ప్రాధాన్యం యిచ్చారు. కథాగమనం, పాత్రోన్మీలనం, వర్ణనలు, మొదలైన అనేకాంశాలలో పి.వి. మూలానికి భంగం కలిగించకుండానే స్వతంత్రానువాదం చేశారు. (ఈ అంశాలన్ని ‘‘వేయిపడగలు సహస్రఫణ్ తులనాత్మక అధ్యయనం’’ శీర్షికన చర్చించుకొనే అవకాశమున్నది.) ‘‘వేయిపడగలు’’ వంటి వేయిపుటల బృహన్నవలను, అంతే ప్రామాణికంగా పి.వి. అనుసృజించారని చెప్పడానికి ఇదొక మ(మె)చ్చుతునక. ‘‘రాజును కాటేయడమంటే, రాజు భ్రష్టుడయ్యాడని, రాజ్యవ్యవస్థ చెడిందని సూచన.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక రాజ ధర్మానికే కాదు, ఇతర ధర్మాలకు ప్రతీకయని, ధర్మారావు ఓ సందర్భంలో చెబుతాడు. సమాజంలో, పాలనలో, వ్యవస్థలో మార్పులు వచ్చినపుడు, శుభాశుభ సందర్భాలలో సైతము సర్పము ఏదో ఒక పాత్రకు ప్రత్యక్షమవుతుంది. ధర్మారావు భార్య అరుంధతి, ఓ రాత్రి ద్వారం పైన పడగెత్తిన సర్పాన్ని చూసి భయంతో వణకిపోతుంది. అపుడు ధర్మారావు చేతులు జోడించి, సర్పాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా భావించి ప్రార్థిస్తాడు.
‘‘స్వామీ, హజార్ ఫణోం పర్ పృథ్వీకో ఉఠానే వాలె దో ఫణోం సె పతి, పత్ని కా పాలన్ కర్నే వాలె, ఏక్ ఫణ్ పసార్ కర్ సస్యోంకి రక్షా కర్ నే వాలె… ముర్aపర్ సదా ప్రసన్న్ రహే!’’ (సహస్రఫణ్ పుట 98) (వేయిపడగలతో భూభారాన్ని, రెండు పడగలతో దాంపత్యాన్ని, ఒక పడగతో వ్యవసాయాన్ని రక్షించే స్వామి ఎల్లపుడు తనపై ప్రసన్నుడై వుండాలని ప్రార్థిస్తూ, సుబ్రహ్మణ్యేశ్వరుని పడగల అంతరార్థాన్ని వెల్లడిస్తాడు.
ఈ ప్రార్థన మహాభారతంలోని ఉదంకోపాఖ్యాన్ని గుర్తుకు తెస్తుంది. నాగలోకం చేరిన ఉదంకుడు ఆదిశేషుని ‘‘బహువన పాదపాబ్ధి కుల పర్వత పూర్ణ సరస్సరస్వతీ సహిత, మహా మహీ భర మజస్ర సహస్రఫణాళి దాల్చి దుస్సహ తర మూర్తి కిన్’’ అని భూభారాన్ని వేయిపడగలతో ధరించిన ఆదిశేషుడు ‘‘మాకు ప్రసన్నుడగు గాక!’’ అని చేసిన స్తుతి స్ఫురిస్తుంది. (ఈ స్ఫురణ ఆంతర్యమేమిటనగా, ‘సహస్ర ఫణ్’, భారతము వంటి సార్వజనీన రచనయని తెలియజేయడం కోసమే) ధర్మారావు ఉదంకుని వలె, గతి తప్పిన ధర్మాన్ని సరిచేయాలనుకొనే వ్యక్తి. ఇక్కడ ఆదిశేషుడే అనంతుడు. ఇతడే శ్రీమన్నారాయణుడు. ‘‘నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే’’ అను శ్లోకంలో ‘‘సహస్ర కోటీ యుగ ధారిణే నమః’’ అన్న చివరి పంక్తి సంఖ్యాతీతమైన యుగాలను, ధర్మాలను భరించేవాడినే సూచిస్తుంది.
ఈ విధంగా ‘సహస్రఫణ్’ పలు వ్యవస్థలకు, ధర్మాలకు ప్రతీకగా భావించి అర్థవంతమైన శీర్షికగా, రూపొందించారు పి.వి. స స స సహస్రఫణ్ కథ సుబ్బన్నపేట గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని సాగుతుంది. మూడు వందల సంవత్సరాల క్రితం, సుబ్బన్నపేట ఒక మహారణ్య ప్రాంతం. ఆ అడవి దగ్గర్లో ఓ పెదకాపుండేవాడు. ఓ రోజు ఆతని ఆవు పాలను, వేయి పడగల పాము వచ్చి త్రాగటం చూసి సృహ కోల్పోతాడు. ఆ రాత్రి ఆయన కలలో సుబ్రహ్మణ్యేశ్వరుడు కనిపించి, పాలు త్రాగిన స్థలంలో గుడి కట్టించమని చెబుతాడు. స్వామి మహిమ వలన సుబ్బన్న పేట ప్రజల సమస్యలు పరిష్కార మవుతుంటాయి.
సుబ్బన్నపేటలో వీరన్ననాయుడనే జమీం దారు, కోట నిర్మిస్తాడు. ఆయన వంశం నుంచి కృష్ణమనాయుడు 19 శతాబ్దం ఉత్తరార్ధం, రామేశ్వర శాస్త్రిని దివానుగా చేసుకొని సక్రమంగా పాలిస్తుంటాడు. రామేశ్వరశాస్త్రి, విద్వాంసుడు. దాత. చాతుర్వర్ణాలకు చెందిన స్త్రీలను వివాహమాడుతాడు. అతని కొడుకు ధర్మారావు.
కృష్ణమనాయుడు చనిపోయాక ఆయన కొడుకు రంగారావు, ఆంగ్లేయుల పాలన అమలు చేస్తు నియంతగా వ్యవహరిస్తాడు. ధర్మరాజును దూరం పెడతాడు. రామేశ్వరం అనే కాముకుడిని దివాన్‌గా నియమిస్తాడు. ఇంగ్లీషు, ఫ్రెంచి వనితలను పెళ్ళాడి భోగలాలసుడై వ్యవహరిస్తుంటాడు.
ధర్మారావు, అరుంధతిని కాపురానికి తీసు కొస్తాడు. అతను విద్యాధికుడు. స్వాభిమాని. రంగారావు పాలనలోని వికృతవ్యవస్థలను విమర్శిస్తు దారిద్య్రాన్ని అనుభవిస్తుం టాడు. కాపు వంశానికి చెందిన అవివాహిత గణాచారి, పూనకం వచ్చినపుడల్లా ధర్మము గతి తప్పుతుందని హెచ్చ రిస్తుంటుంది. ధర్మరావు మిత్రులు కిరీటి, కుమారస్వామి, సూర్యపతి, ఆతడిని ఆదుకుంటారు.
సుబ్బన్నపేట మున్సిపాలిటిగా మారాక, పన్నులు హెచ్చింపవుతాయి. వ్యవసాయంలో మార్పులు వస్తాయి. జీవన విధానంలో మార్పులు రావడంతో వూరంతా సంఘర్షణకు గురి అవుతుంది. దేశీకళలు, చితికి పోతాయి. రామేశ్వరం సినిమా వ్యాపారం మొదలుపెట్టి డబ్బులు సంపాదిస్తాడు. జోస్సులు భార్యను లోబరుకొంటాడు. చివరికి దొంగనోట్ల కేసులో అరెస్టవుతాడు. రంగారావు వ్యాధిగ్రస్తుడవుతాడు. అతని కొడుకు హరప్ప ధర్మారావు సాయంతో అన్ని వ్యవహారాలు చక్కబెడతాడు. రంగారావులో మార్పువస్తుంది . హరప్ప, గణాచారి, గిరిక ఒకొక్కరే మరణిస్తారు. ధర్మారావు భార్య అరుంధతి కూడా మరణిస్తుంది. కొన్నాళ్ళకు మిత్రుల బలవంతంతో ధర్మారావు పశుపతి కూతురు చిన్న అరుంధతిని వివాహమాడుతాడు. సుబ్బన్నపేట తుఫాను వలన జలమయమై కొత్తగా నిర్మించిన పట్టణం శిథిలవువుతుంది.
కాలం తెచ్చిన మార్పులను చూసిన ధర్మారావు చకితుడవుతాడు. తన కళ్ళెదుటె తన వారందరు పోయాక, తనకు మిగిలిందేమిటి అని తర్కించుకొంటాడు. చిన్న అరుంధతిలో తన మొదటి భార్యను చూసుకొని, ‘‘చివరికి నీవు మిగిలితివి’’ అని అంటాడు. ఆమెను తన జాతి శక్తిగా సంభావించడంతో కథ ముగుస్తుంది.
సహస్రఫణ్ సమకాలినతకు సంబంధించినంత వరకు మూల రచన కథాకాలం 1914-34 మధ్య కాలం నాటిది. సుబ్బన్నపేట గ్రామం బ్రిటిష్ పాలనలో మున్సిపాలిటిగా పరివర్తన చెందిన దశలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలో మార్పులు చోటు చేసుకొని భారతీయులకు దుర్భర జీవితాన్ని అందించాయని సహేతుకంగా చర్చించారు. నవలలో ఆనంద నామ సంవత్సర శ్రావణ శుద్ధ దశమి నాడు ధర్మారావు అరుంధతిలకు శోభన ముహూర్తంగా చెప్పబడింది. అది సరిగ్గా 1914 సంవత్సరానికి సరి పోతుంది. ఆషాఢ శుద్ధ పంచమి నాడు సంవత్సరం క్రితం రంగారావుకు పట్టాభిషేకం జరిగింది. అంటే అది 1913 సంవత్సరంగా రూఢ అయినది. కథ మొదలయ్యే నాటికి ధర్మారావు వయస్సు 19-20 మధ్య ఉండవచ్చునని రచయిత పేర్కొన్నాడు. ‘‘ఉస్ మహా పురుష్ కే శరీర్‌కా రంగ్ పకీ హుయీ నారంగీ కా సాథ. చెహరా న తొ లంబాథ… ఉస్‌కి ఆయు బీస్ బరస్ కీ రహీ హోగీ. నామ్ థ ధర్మారావు (సహస్రఫణ్ పుట 22) అనగా ధర్మారావు పుట్టినది 1895 అని తెలుస్తుంది. ఇది సరిగ్గా విశ్వనాథవారు జన్మించిన సంవత్సరమే! ధర్మారావు విశ్వనాథకు ప్రతీకగా చెప్పబడింది. నవలలో సుబ్బన్నపేట మున్సిపాలిటిగా మారడాన్ని రచయిత వ్యతిరేకించిన వైనం, 1921లో దుగ్గిరాల గోపాల కృష్ణయ్య నిర్వహించిన ‘రామదండు’ ఉద్యమాన్ని సూచిస్తుంది. దుగ్గిరాల మున్సిపాలిటీలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమ ఛాయలు నవలలో కనిపిస్తాయి. నవలలో ప్రస్తావించిన కృష్ణా పుష్కరాలు (1920) తుఫాను, మద్యపాన వ్యతిరేక ఉద్యమం, స్వదేశీ మొదలైనవి సమకాలీనతను తెలియజేసేవే! నవలలో గాంధీజీ ప్రస్తావన కనిపిస్తుంది. గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించి రెండేళ్లయినదని ఒక చోట చెప్పబడింది. మహాత్మాగాంధీ కొ అప్‌నా అసహాయోగ్ ఆందోళన్ ప్రారంభ్ కియే దో వర్ష్ హా చుకేథే । (సహస్ర ఫణ్ పుట 163) అంటే 1922 సంవత్సరం అవుతుంది. 1922 లో సుబ్బన్నపేటలో జాతీయ కళాశాల స్థాపించబడింది. ఇందులో ధర్మారావు లెక్చరర్‌గా చేరుతాడు. విశ్వనాథ కూడా బందరు జాతీయ కళాశాలలో చదివి ఉపన్యాసకునిగా పనిచేశారు. నవలలో పాత్రలన్నీ దాదాపుగా విశ్వనాథ వారి జీవితంతో ముడిపడి ఉన్నవే. కథలో జమీందారు కృష్ణమనాయుడు, గూడవల్లి బ్రహ్మన, విశ్వనాథ స్నేహితులు. కొడాలి ఆంజనేయులు, నాయని సుబ్బారావు, కొల్లిపర సూరయ్య, వరుసగా రాఘవరావు, కిరీటీ, సూర్యపతి, పేర్లతో నవలలో ధర్మారావు మిత్రులుగా కనిపిస్తారు. విశ్వనాథ మొదటిభార్య వరలక్ష్మియే ధర్మారావు అర్థాంగి అరుంధతి. కథలో అరుంధతి మరణిస్తుంది. విశ్వనాథ భార్య వరలక్ష్మి కూడా 1932లో మరణించింది. ఈ విధంగా నవలలో చిత్రించబడిన సంఘటనలు, పాత్రలు విశ్వనాథవారి ఆత్మకథాత్మకముగా, వాస్తవికతను సంతరించుకుని సమకాలీనతను ప్రతిబింబిస్తుంది. సహస్రఫణ్‌లో వ్యవస్థల పరిణామం విస్తృతంగా చర్చించబడింది. రాజకీయ వ్యవస్థ చెడిపోయిందన్న గణాచారి హెచ్చరికతో నవల మొదలవుతుంది. మొట్టమొదట ధర్మారావు చూసినప్పుడు ‘‘ఐసే క్యౌం దేఖ్ రహేహో రాజా మేఁ బిగఢ్ పైదా హోగయాహై । హజార్ ఫణ్ వాలె నాగ్ నె ఉసే స్వప్న్‌మేఁ ఇస్‌లియా హై ॥ (సహస్రఫణ్ పుట 42) (ఏమట్లు చూసెదవు? రాజుచెడిపోయినాడు. వేయి శిరసుల నాగు రాజును కలలో స్పృశించినది) అని చెబుతుంది. ఇక్కడ పాము కాలానికి ప్రతీక. కాటు వేయడం అంటే కాలంలో వస్తున్న మార్పు సూచన! రాజు చెడిపోయాడంటే రాజ్య వ్యవస్తే చెడిపోతుందని అర్థం. సహస్రఫణ్‌లో రాజులు మూడు తరాలకు ప్రాతినిథ్యం వహించారు. తొలితరం రాజు కృష్ణమనాయుడు. అతను ధర్మ స్వరూపుడు. ప్రజలను కన్నబిడ్డలవలె పాలించాడు. అతని కొడుకు రంగారావు ప్రభావంతో చెడిపోయిన రాజకీయ వ్యవస్థకు ప్రతినిధి. ఇక మూడవ తరం రాజు హరప్ప. ఇతను రంగారావు కొడుకు. లోపించిన వ్యవస్థను హరప్ప సరిదిద్దినట్లు విశ్వనాథ చూపించారు. రంగారావు బ్రిటిష్‌వారి ప్రతినిధి. ఆయనలో మానవత్వం లేదు. ప్రజలను హింసించి, పీడించి, వసూలు చేసిన డబ్బును ప్రజల క్షేమం కోసం కాకుండా జల్సాలకు ఖర్చు చేశాడు. భారతీయ సంప్రదాయాలను అవహేళన చేశాడు. ఆయన పట్టాభిషేక సమయంలో ‘లక్ష్మణ స్వామి’ అనే ఏనుగును అవమానపరిచాడు. ఇక్కడ ఏనుగు జాతీయతా భవానికి ప్రతీక. ఈ అంశాన్ని నవలలో హరప్పతో రంగన్న అను సేవకుడు వెల్లడి చేస్తాడు. ‘‘హా సర్కార్ లక్ష్మణ స్వామి గాంధీ జై సాథ । తబ్‌సే బడే సర్కార్ కభీ హాథి య ఘోఢె పర్ సవార్ నహీఁ హోతే। మోటార్ గాఢ మేఁ బైఠ్ తే హైఁ ॥ (సహస్రఫణ్ పుట 196) రంగారావు పట్టాభిషేకం సమయంలో ఏనుగును కాదని మోటారును అధిరోహించాడనగా ఆయన పాలనలో, ప్రవర్తనలో విదేశీ నాగరికతను తీసుకొస్తున్నాడని, గాంధీజీ భావాలకు వ్యతిరేకమని అర్థం. ఈ చర్యను నిర్వహించినందుకు గుర్తుగా సర్పము పట్టాభిషేకం నాడు సింహాసనం వీడిపోతుంది.
‘‘రంగారావు హాథీ దాంత్ కె సింహాసన్ పర్ ఆసీన్ హుయె । ఠీక్ ఉసీసమయ్ సభామేఁ ‘సాంప్! సాంప్! కీ ఆవాజేఁ ఉఠీ! కుఛ్‌లోగ్ కహనే లగే సింహాసన్ కే పాస్ నె నికలాథా ॥ (సహస్రఫణ్ పుట. 59) రంగారావు పాలన ప్రభావంతో ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చాయి. సుబ్బన్నపేట మున్సిపాలిటిగా మారింది. సమష్టిగా ఉన్న ప్రజలు రాజకీయ కక్షలతో పలు వర్గాలుగా విడిపోయారు. వృత్తి పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను మొదలగు పలు రకాల పన్నుల మూలాన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పేదలు చితికిపోయారు. కరెంటు స్తంభాలు వేసే పనిలో వృక్షాలను విచక్షణరహితంగా నరికి, పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ విధ్వంసాన్ని హృదయ విదారకంగా వర్ణించారు. బిజిలికె కంబె ఖడేగయే । సుబ్బన్నపేట్ మేఁ పగ్ పగ్ పర్ వృక్ష్ ఖడే థే । ఏక్ వృక్ష్ కో జఠ్ సే ఉఖ్‌డా దియా గయా । దూస్ రె వృక్ష్ కి బాహోఁ కట్ గయా ॥ పంఛియోఁ కె కంఠ్ రవ్ ద్వారా కరాహ్ ఉఠే ॥ (సహస్రఫణ్ 259). ముఖ్యంగా వృషన్నిధి అనే మేఘం, చెట్లు కానరాక పర్వతాగ్రానికి ఢీకొని అసలు ఆ ప్రాంతానికి అవసరం లేవనే భావంతో కరిగిపోతుంది. ఇలా వృక్షాలు, మేఘాలు సైతం జీవకోటిలో ఒక భాగమనే భారతీయ భావనను, వేదనను ఎంతో కరుణరసాత్మకంగా చిత్రించారు. సహస్రఫణ్‌లో వర్ణవ్యవస్థ ప్రధా నంగా ఏర్పడిన సమాజం బ్రిటిష్ వారి వల్ల విచ్ఛిన్నమై నట్లు చిత్రించబడింది. ప్రాచీన భారత సమాజంలోని అన్ని వర్ణవ్యవస్థ, ‘‘ఆధునిక కాలంలో కులవ్యవస్థ కాదని’’ రచయిత ఉద్దేశం. వృత్తులను బట్టి వర్ణం (cast) ఏర్పడింది కానీ కులం (class) కాదు. వృత్తుల వలన గ్రామాలు స్వయం పోషక శక్తిని సాధించాయి. సుబ్బన్నపేట అనగా భారతదేశానికే ప్రతీక. ఈ ఊరు సామాజికంగా చీలిపోవడాన్ని చెప్పారు. రైతు భూమికి మధ్య రాజు ప్రవేశించి దళారీ వలె వ్యవహరించాడు. ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. సహస్ర ఫణ్‌లో కృత్రిమ భూస్వామ్య దోపిడీ వ్యవస్థ వలన వ్యవసాయం దెబ్బతినడాన్ని చూపారు. శిస్తులు చెల్లించలేక రైతులు భూములను అమ్ముకుని కూలీలుగా మారిపోయారు. పరిశ్రమల వలన చేతివృత్తులు దెబ్బతిన్నాయి. వ్యవసాయిక వ్యవస్థలో మార్పులు రావడంతో ఆర్థిక వ్యవస్థలో కూడా మార్పులు వచ్చాయి. సహస్రఫణ్‌లో హరియా (పసరిక) పాత్రను వ్యవసాయానికి ప్రతీకగా చూపించారు. రైతులో ధనాశ పెరిగి, పొగాకు ప్రత్తి మొదలగు పంటలు పండించి వరి, పెసలు, కందుల పంటలను విస్మరించడంతో దళారులు బాగుపడ్డారు. రైతు చితికి పోయాడు. ఈ అంశాలనే ధర్మారావు ముసలి రైతు సంభాషణలో స్పష్టం చేయబడినాయి. కిసాన్ ఘమండి బన్ గయా హైఁ । సారీ జమీన్ మేఁ ధాన్ హీ ధాన్ ఉపజాకర్ పైసే కె గులామ్ బన్ గయేహైఁ । అకేలా హమారా గావ్ నహీఁ । దేశ్‌భర్ మేఁ ఐసా హి హువా హై । కపాస్ ఉప్‌జాకర్ ఉస్‌సె కపడా బునా జాసక్‌తా హై । అర్‌హర్, మూంగ్, ఉడద్, చనా, భాజి, తర్‌కారీ, మిర్చీ, దనియా, జమీన్ మేఁ కౌన్ సి ఉపజ్ నహీఁ హోతీ? మనుష్య్ చాహతాహై కేవల్ ఖానే కొ అన్న్ జార్ పెహన్ నే కొ, కపడా! (సహస్రఫణ్ పుట 441). అని ధర్మారావు ఆవేదనగా పేర్కొనడాన్ని బట్టి వ్యవసాయంలో వచ్చిన మార్పులు జీవన విలువలనెలా మార్చాయో తెలుస్తుంది. దేశంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థలలో వచ్చిన మార్పులు విద్యా ఉద్యోగాలలో ప్రభావం చూపించాయి. దేశీయ విద్యల పట్ల న్యూనతా భావంతో ‘మెకాలే’ ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యా బోధన, పాశ్చాత్య సంస్కృతిని క్రైస్తవమత ప్రచార వ్యాప్తికి ఉపకరించింది. కేవలం రాయడం, చదవడమే విద్య కాదని, కళలు, సంస్కృతి, తాత్త్విక చింతన కూడా ఉండాలని రచయిత ధర్మారావుతో ఒక చోట చంద్రారెడ్డితో అనిపిస్తాడు (సహస్రఫణ్ పుట 222) మాతృ భాషలో విద్యా బోధన చేస్తే బుద్ధి వికసిస్తుందని మరొక చోట అంటాడు. బ్రిటీష్ పాలనలో పన్నులు ఎక్కువవుతాయి. నిరుద్యోగికి ఉపాధి కల్పించలేని ప్రభుత్వం, ఉద్యోగంలో చేరిన కుమారస్వామిని ‘వృత్తిపన్ను’ కట్టాల్సిందిగా నిర్బంధిస్తుంది. ‘జబ్ మైఁ బేకార్ భటక్ రహాథా, తబ్ మురేa కిసీనే పాలా పోశా న హీఁ కియా । తో అబ్ అప్‌నీ కమాయి సే కర్ క్యౌం దూ? (సహస్రఫణ్ పుట 389) ఉద్యోగం లేని రోజుల్లో నన్ను ఎవరూ పోషించలేదు. తిండిలేని వారికి తిండినివ్వరు. తినేవాని వద్ద కూడు లాక్కుంటున్నారని బ్రిటిష్ వారి అమానుషత్వాన్ని ప్రశ్నించాడు.
సహస్రఫణ్‌లో సామాజిక వ్యవస్థకు సంబంధించి వివాహ వ్యవస్థను సవివరంగా చర్చించారు. అరుంధతి ధర్మారావు కిరీటి శశిరేఖ, కుమార స్వామి, శ్యామలÑ మొదలగు వారి దాంపత్య జీవనాన్ని ఉదహరిస్తు భారతీయ జీవనవిధానంలో, దాంపత్యం కేంద్రంగానే ధర్మము సహస్రముఖాలుగా విస్తరింపబడిందని చెబుతూ, సుబ్రహ్మణ్య స్వామి రెండు పడగలు దాంపత్యానికి సంకేతమని సూచించాడు. సమాజాన్ని నిలబెడుతున్న ఎన్ని వ్యవస్థలైనా నశించి పోవచ్చు, కానీ స్త్రీ పురుష సంబంధానికి వివాహ బంధమే బలమైనదని చెప్పారు. రాధాపతి, మంగమ్మ, రామేశ్వరం, యీ వ్యవస్థకు విరుద్ధంగా ప్రవర్తించి సమాజంలో సంక్షోభం సృష్టించారు. ‘‘ఒక జాతి సర్వత్రా ఉన్మీలితమైన కావచ్చు, కాని శక్తి చావరాదు’’ అన్నది సహస్రఫణ్‌కు కేంద్రమైన వాక్యం. ఈ జాతి శక్తి వివాహవ్యవస్థది. అందుకే నవల చివరలో ధర్మారావు అరుంధతితో ‘‘ఇక ఏమి మిగిలినది.. నీవు మిగిలితివి. ఇది నా జాతి శక్తి’ నా సమాజ ధర్మం రూపంలో మిగిలిందని అంటాడు.
‘‘సబ్ కుఛ్ భలే హీ నష్ట్ హువా హో ॥ పర్ తుమ్ బచే ।
రాష్ట్ర్ కీ శక్తి కే రూప్ మేఁ । సమాజ్ కే ధర్మ్ కే రూప్ మేఁ ॥ (సహస్రఫణ్ పుట. 435)
బ్రిటీష్ వారి పాలన మూలంగా రాజ్య వ్యవస్థ, విద్యా వ్యవస్థలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, దెబ్బతిన్నప్పటికి వివాహ వ్యవస్థ చెక్కుచెదరలేదు. అయితే సమాంతరంగా సాంస్కృతిక వ్యవస్థ సైతం దెబ్బతిన్నది. వీధి నాటకాలు, తోలు బొమ్మలాటలు, కూచిపూడి, పగటి వేషాల స్థానంలో సర్కస్ కంపెనీలు, సినిమాలు రావడంతో, కళ వ్యాపారమై పోయింది. దేశీయకళలు నిరాదరణకు గురయ్యాయి. ‘ఇసీ ప్రకార్ ముంబైకి ఫిల్మ్ కంపెనియోంకా దౌర్ దౌరా షురూ హువాతొ దేశ్‌మేఁ సచ్ఛీనాటక్ కళా ఏక్‌దమ్ మర్ గయీ (సమస్ర ఫణ్ పుట 208) అని రచయిత ఆవేదన చెందారు. తోలుబొమ్మలాటలు మొదలైన కళా ప్రదర్శన వల్ల కొన్ని వందల కుటుంబాలు బ్రతికేవి. సినిమాహాలు వల్ల, గ్రామంలోని సొమ్మంతా ఒక్కడే దోచుకున్నాడు. దేశీయ కళాకారుల కుటుంబాల బ్రతుకులు బజారుపాలయ్యాయి. ఇలా అన్ని వ్యవస్థలు పతనమయ్యాయని ఆయా పాత్రల ద్వారా చెప్పడంతో బాటు, వ్యవస్థల పునర్నిర్మాణాన్ని కూడా చర్చించారు రచయిత. పాలక వ్యవస్థ ముందుగా మార్పువచ్చినట్లు మూడవ తరం రాజు ‘హరప్ప నాయుని’ ద్వారా సూచించారు. దీనికి ప్రేరణ ధర్మారావు నుంచే రావడం శుభపరిణామం. ధర్మారావు, హరప్పకు గురువై స్వదేశీ విద్య, సంస్కృతీ సంప్రదాయాలు, ధర్మాధర్మాలు బోధించడం వలన, ఆయన ఆంగ్ల విద్యను నేర్చుకున్నప్పటికి, భారతీయ తాత్త్విక చింతనలోనే సాగిపోతుంటాడు. చెడిపోయిన వ్యవస్థను బాగు చేయాలనుకొంటాడు. చెడిపోయిన తన తండ్రిని ముందుగా మారుస్తాడు. బాగుపడిన రంగారావు పాశ్చాత్య సంస్కృతిని వీడి, తిరస్కరించిన అంశాలన్నింటిని అంగీకరిస్తాడు. స స స సహస్రఫణ్‌లో బ్రిటీష్ వారి పాలన వలన, ప్రాచీన కాలం నుంచి నిర్మించుకొన్న వ్యవస్థలెలా పరిణామ క్రమంలో చెడిపోయాయో మాత్రమే చిత్రితమవలేదు. వాటి పునర్నిర్మాణం కూడా సూచితమయింది. రాజ్య, సామాజిక, సాంస్కృతిక రంగాలలో విభిన్న సిద్ధాంతాలు సంఘర్షణలను అనేక పాత్రల ద్వారా చూపారు. నవల ముగింపులో గణాచారి మరణిస్తుంది. పసరిక, హరప్ప, గిరిక, అరుంధతి, ఇలా ఒక్కొక్కరు మరణిస్తారు. ఒక పెద్ద ప్రళయం వచ్చి గుండేరు ఉప్పొంగి, కొత్తగా నిర్మించిన పట్టణమంతా, నీట మునిగి నశిస్తుంది. పాత పల్లె మాత్రం మిగిలిపోతుంది. అనగా గ్రామ వ్యవస్థ సజీవంగానే ఉన్నదని అర్థం. ‘‘భారతదేశం యొక్క ఆత్మ గ్రామము. అది చెడిపోకూడదు’’ అను గాంధీజి భావాలనే రచయిత సూచించారు. సహస్రఫణ్‌లో సకల వ్యవస్థలకు ఆధారం సనాతన ధర్మమనే అంశం వాచ్యం చేయబడనప్పటికీ, సూచింపబడింది. నవల నాయకుని పేరే ధర్మారావు. మహాభాతంలో ధర్మరాజు వంటి వాడు. స్థిత ప్రజ్ఞుడు. కథలో జరిగే అనేక సంఘటనలకు, ధర్మారావు తో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలున్నాయి. రాజు మొదలు సేవకుని వరకు అందరితో మమేకమైన మహాపురుషుడు. మహా ప్రస్థానంలో తన కళ్ళముందే ఒక్కొక్కరు మరణిస్తుంటే నిశ్చలంగా, ధర్మరాజు వలె నిలిచాడు. ధర్మారావు పాత్ర ద్వారా ధార్మిక జీవన విలువలను రచయిత చెప్పించాడు. జీవన మూల్యాలకు మూలం వేదం. మానవ జాతి సుఖంగా బ్రతకడానికి కావలసిన మౌలిక సూత్రాలను వేదాలను అందిస్తున్నాయి. అవి మారవు. దేశకాల పరిస్థితులను బట్టి వ్యవస్థలలో మార్పులు వస్తుంటాయి. కాని ధర్మం మారదు. ధర్మం ప్రబోధించే జీవన మూల్యాలు మారవు. అవి సార్వకాలికములు, సార్వజనీనములు. ఈ ధర్మసూత్రాన్ని కాలానుగుణంగా అన్వయిస్తూ అందించబడినవే పురాణేతిహాసాలు.
ఆధునిక కాలంలో తొలుత తెలుగులో విశ్వనాథ అందించిన ‘వేయిపడగలు’ కథా రూపానికి జాతీయ స్థాయిలో హిందీలో పి.వి. నిర్మించిన సహస్రఫణ్, మౌలిక సూత్రాలను జీవన మూల్యాలను అందిస్తూ సమకాలీనతను సార్వకాలీనతను కలిగివున్నది. స స స సహస్రఫణ్‌లో సర్పము కాల స్వరూపుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతిరూపం. నవల మొత్తం కాలతత్త్వాన్ని, వ్యాఖ్యానించిన విధానాన్ని గమనించవచ్చు. ప్రతి అధ్యాయం రుతువుల మార్పు, నెలల మార్పును సూచిస్తూ మొదలవుతుంది. ‘‘గర్మియోంకి తేజ్ చల్ రహి థీ’’ అని నవల గ్రీష్మరుతువు ప్రభావాన్ని వర్ణిస్తూ మొదలవుతుంది. తదుపరి వర్షాకాలాన్ని సూచిస్తు ‘‘ఆషాఢ శుక్ల సప్తమి థీ । వర్షోకా ప్రారంభ్ హువా ॥ (సహస్రఫణ్ పుట 66) అని వర్ణించబడింది. అలా నవల ముగింపు వరకు కాలంలోని మార్పులు చెబుతూ కాలానికే నాయకత్వం ఆపాదించబడింది. సహస్రఫణ్‌లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సర్పరూపంలో తొలుత కాపుకు కనబడినాడు. స్వామి అనేక పడగలు దాల్చి దర్శనమిచ్చాడు. కాపుకే కాదు, రంగారావుకు కలలో, అరుంధతికి, ధర్మారావులకు శోభనంనాడు, పలు ఆకృతుల్లో కనిపిస్తాడు. కాలంలో వస్తున్న మార్పులను సూచించినట్లుగా వ్యవస్థల పతనాన్ని, రాలిపోయే పడగలకు ప్రతీకగా వర్ణించారు. సుబ్రహ్మణ్య స్వామియే శ్రీమహావిష్ణువని నవలలో ధర్మారావు ఒక చోట హరప్పతో చెబుతాడు. ఆదిశేషునికి అనంత పద్మనాభునికి భేదం లేదు కాబట్టి ఆయన కాలస్వరూపుడు. ‘కాలోస్మిలోక క్షయ కృత్ ప్రవృద్ధే’ (గీత 11-32 శ్లో) అని భగవంతుడు తనను కాలస్వరూపునిగా అభివర్ణించుకొన్నాడు. నవల చివర ధర్మారావు ‘‘ఆహా ఏమి కాలము ఏమి మార్పు’’ అని వచ్చిన మార్పులన్నిటికీ కాలమే కారణంగా భావించాడు.
ధర్మారావు సోచ్ రహా థ ‘‘ఓహో కైసా సమయ్ హై । కైసా పరివర్తన్ హై । పురానె కిత్‌నె నష్ట్ హో గయే । నయే కిత్‌నె పైదా గయే । స్వామి కె హజార్ ఫణ్ నష్ట్ హోగయే। అని చింతిస్తాడు. సహస్రఫణ్ సర్వకాలాలకు సంబంధించింది. ‘సర్పం భూమిని మోయడమనేది ఖగోళ విషయంగా కాకుండా ధర్మం చేత భూమి రక్షించబడుతున్నదన్న భావనలో అర్థం చేసుకోవాలని విశ్వనాథ వారే వివరించారు. ఆ విధంగా ‘సహస్రఫణ్’ కల్పితగాథగా భావించకుండా, సహస్రముఖీనంగా వ్యాపించే ధర్మానికి, సార్వకాలీన విలువలను వివరించే చిరంతన రచనగా అర్థం చేసుకొని చదవాలి. ఆ కోణంలో, విశ్వనాథ ఆంతర్యాన్ని ఎరిగి హిందీలో అనుసృజించిన పి.వి. మరో విశ్వనాథుడయ్యాడన్నది అక్షర సత్యం!