వరంగల్‌ జిల్లా వరదాయిని సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టు

కొత్తగా ఏర్పాటు అయిన ములుగు జిల్లా తుపాకులగూడెం గ్రామం సమీపాన గోదావరి నది పైన  నిర్మించిన సమ్మక్క బ్యారేజి నిర్మాణం పూర్తి అయి ప్రారంభానికి తయారుగా ఉన్నది. మేడారం వద్ద కొలువై ఉన్న వన దేవత సమ్మక్క పేరు ఈ బ్యారేజీకి పెట్టడం జరిగింది. గోదావరిలో ఇంద్రావతి కలిసే సంగమానికి 21 కిమీ, దేవాదుల ప్రాజెక్టు ఇన్‌టేక్‌ కు 5 కి.మీ. దిగువన ఈ బ్యారేజి నిర్మాణం జరిగింది.

సమ్మక్క బ్యారేజి నిర్మాణం 2018 లో ప్రారంభం అయి 2021 మే నెల నాటికి పూర్తి అయ్యింది. 1,242 మీటర్ల పొడవు, 59 స్పిల్‌ వే గేట్లు కలిగిన సమ్మక్క బ్యారేజీలో 83 మీటర్ల ఎఫ్‌ ఆర్‌ ఎల్‌ వద్ద 7 టిఎంసిల నీరు నిల్వ ఉంటుంది. బ్యారేజి నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలం వద్ద ఇరువైపులా తెలంగాణ రాష్ట్రం ఉండడం వలన బ్యారేజి నిర్మాణానికి మహారాష్ట్రా నుంచి గాని, ఛత్తీస్‌ ఘర్‌ నుంచి గాని ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఈ స్థలంలో బ్యారేజి నిర్మాణానికి అనుకూలమైన పునాది నేల, బ్యారేజి పొడవునా ఒక్క తీరుగా లేకపోవడం వలన ఇంజనీర్లు ప్రత్యేకమైన డిజైన్లను రూపొందించి బ్యారేజి నిర్మాణాన్ని మూడు సంవత్సరాలలో పూర్తి చేయడం విశేషం. బ్యారేజి డిజైన్లు అన్నీ కూడా రాష్ట్ర సాగునీటి శాఖలో భాగంగా ఉన్న సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ ఇంజనీర్లు అందజేసినారు. గతంలో ఈ సంస్థ ఇంజనీర్లే కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ తదితర ప్రాజెక్టులకు కూడా డిజైన్లు అందజేసినారు.

సమ్మక్క బ్యారేజి లక్ష్యం :

దేవాదుల ప్రాజెక్టుకు ఒక స్థిరమైన నీటి తావును ఏర్పాటు చేయడమే సమ్మక్క సాగర్‌ బ్యారేజి ఉద్దేశ్యం. నీటి తావు లేకుండా కేవలం గోదావరిలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడే నీటిని ఎత్తిపోసే విధంగా దేవాదుల ప్రాజెక్టును రూపకల్పన చేయడం గత ఉమ్మడి పాలకులు చేసిన అతిపెద్ద తప్పిదం. ఒక చిన్న వాగుపై ఎత్తిపోతల పథకం రూపొందించేటప్పుడు కూడా అక్కడ ఒక మడుగు ఉందో లేదో చూసుకోవడం ఒక ఆనవాయితీ. కానీ 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దేవాదులకు మాత్రం ఈ సౌలతు  లేకపోవడం ఒక విచిత్రం. ఉమ్మడి రాష్ట్ర పాలకులకు, గోదావరిపై ఎటువంటి అడ్డుకట్ట నిర్మించడానికి సుముఖంగా లేకపోవడమే అసలు కారణం. గోదావరి జలాలు నేరుగా రాజమండ్రికి దిగువన ధవళేశ్వరం  వద్ద నిర్మించిన ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీకి ప్రవహించాలి. అక్కడ నుంచి రెండు వైపులా కాలువల ద్వారా గోదావరి డెల్టా ఆయకట్టుకు సమృద్దిగా నీటి సరఫరా చేయాలి. అందు కోసమే తెలంగాణ ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రమే కేటాయించిన 967.94 టిఎంసిల నీటిని సంపూర్ణంగా వినియోగించుకోవడానికి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టలేదు. సమ్మక్క బ్యారేజి నిర్మాణంతో దేవాదుల ప్రాజెక్టుకు శాపంగా మారిన ఆ లోపాన్ని సవరించినట్టు అయ్యింది.

ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరాంసాగర్‌ తర్వాత గోదావరిపై మరే ప్రాజెక్టు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీరాంసాగర్‌ దిగువన సదర్‌ మాట్‌ బ్యారేజి (1.50 టిఎంసిలు), ఎల్లంపల్లి బ్యారేజి (20 టిఎంసిలు), పార్వతి బ్యారేజి (8.83 టిఎంసిలు), సరస్వతి బ్యారేజి (10.87 టిఎంసిలు), లక్ష్మీ బ్యారేజి (16.17 టిఎంసిలు), సమ్మక్క బ్యారేజి (7 టిఎంసిలు), సీతమ్మ సాగర్‌ (35 టిఎంసిలు)  బ్యారేజిలను రూపకల్పన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో సదర్‌ మాట్‌, సీతమ్మ సాగర్‌ బ్యారేజీలు నిర్మాణంలో ఉన్నాయి. మిగతావి పూర్తి అయి 73 టిఎంసిల నీటిని గోదావరి గర్భంలో నిల్వ చేస్తున్నాయి. వీటి వలన సుమారు 200 కిలోమీటర్ల గోదావరి నది పునరుజ్జీవనం చెందింది.  

కాంతనపల్లి ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్‌:

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, దారి పొడుగునా వందలాది గ్రామాలకు తాగునీరు అందించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు ఉమ్మడి పాలకులు కేవలం 38 టిఎంసిల నీటిని కేటాయించారు. దేవాదుల ప్రాజెక్టు ఇన్‌టేక్‌ సిల్‌ లెవెల్‌ 71 మీటర్లు. అంటే గోదావరిలో 71 మీటర్లకు పైన నీటి ప్రవాహాలు ఉన్నప్పుడే దేవాదుల ఇన్‌ టేక్‌ లోకి నీరు ప్రవహిస్తుంది. ఆ నీటిని ఎత్తిపోయడం సాధ్యం అవుతుంది. 71 మీటర్ల కంటే తక్కువ మట్టంలో ప్రవాహాలు ఉన్నప్పుడు దేవాదుల పంపులు పని చెయ్యవు. గోదావరిలో 71 మీటర్ల పైన నీటి ప్రవాహాలు ఏటా 170 రోజులు ఉంటాయన్న అంచనాతో ప్రాజెక్టు రూపకల్పన చేసినారు. వాస్తవంగా 71 మీటర్ల మట్టానికి ఎగువన గోదావరిలో నీటి ప్రవాహాలు ఏటా సుమారు 90-100 రోజుల కంటే మించి ఉండవని 15 ఏండ్ల అనుభవం తెలుపుతున్నది.

గోదావరి ప్రవాహాలు ఊహించినన్ని రోజులు అందుబాటులో ఉండని కారణంగా దేవాదుల ప్రాజెక్టు లక్ష్యం నెరవేరలేదు. ఈ లోపాన్ని సవరించమని ఉద్యమ సమయంలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదించారు. తెలంగాణ రాజకీయ నాయకులను కలిసి చర్చించారు. సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి 20 కి.మీ దిగువన కాంతనపల్లి వద్ద బ్యారేజి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. చివరికి రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం అయిష్టంగానే కాంతనపల్లి ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేసింది. జలయజ్ఞంలో ప్రాజెక్టుకు టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఇక్కడ కూడా ప్రాజెక్టు అంతర్రాష్ట్ర సమస్యలు, రక్షిత అటవీ ప్రాంతం, వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం, ఆదివాసీ గ్రామాల ముంపు, పునరావాసం, నిధుల లేమి తదితర సమస్యల వలయంలో చిక్కుకున్నది. కాంతనపల్లి బ్యారేజీలో 12 ఆదివాసీ గ్రామాలు, 11 వేల ఎకరాల ఆదివాసీ భూములు ముంపు ప్రమాదంలో పడినాయి. ఆదివాసీ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రాజెక్టును వ్యతిరేకించినాయి. చివరకు పురోగతి లేకుండా ప్రాజెక్టు పెండింగ్‌ ప్రాజెక్టుగా మారిపోయింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్‌ గోదావరి, కృష్ణా నదులపై ఉమ్మడి ప్రభుత్వం ప్రతిపాదనను సమీక్షించినప్పుడు కాంతనపల్లి ప్రాజెక్టును కూడా  కూలంకషంగా సమీక్షించారు. కాంతనపల్లి ప్రాజెక్టును  ప్రయోజనకారిగా మార్చడానికి ప్రాజెక్టుకు రీ ఇంజనీరింగ్‌ అవసరమని సమీక్షలో తేలింది. గూగుల్‌ ఎర్త్‌ సాఫ్ట్‌ వేర్‌, సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాపులు, లిడార్‌ సర్వే నివేదికల సహాయంతో విస్తృత అధ్యయనం తర్వాత కాంతనపల్లి బ్యారేజి స్థలాన్ని 20 కి.మీ ఎగువన తుపాకులగూడెం వద్దకు మార్చాలని నిర్ణయించారు. దీనివలన ఆదివాసీ గ్రామాలు, భూములు మొత్తంగా ముంపు నుంచి బయటపడినాయి. సమ్మక్క సాగర్‌ బ్యారేజి నిల్వ సామర్థ్యం 16 టిఎంసిల నుండి 7 టిఎంసిలకు తగ్గిపోయినా దేవాదుల ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో పంపింగ్‌ సాధ్యపడే విధంగా బ్యారేజి ఎఫ్‌ ఆర్‌ ఎల్‌ ను 83 మీటర్లుగా నిర్ధారించడం జరిగింది. కాంతనపల్లి వద్ద ముంపు బారిన పడే గ్రామాలన్నీ ఇప్పుడు ఆయకట్టుగా మారినాయి.

లక్ష్యం దిశగా దేవాదుల ప్రయాణం:

ఇప్పుడు దేవాదుల పంపులు ఏటా నికరంగా 200 రోజులకు పైగా గోదావరి నీటిని ఎత్తిపోసే అవకాశం ఏర్పడిరది. దేవాదుల ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు, ప్రాజెక్టు పరిధిలో ఉన్న వందలాది చెరువులను నింపడం, వందలాది గ్రామాలకు, వరంగల్‌, హన్మకొండ నగరాలకు తాగునీరు అందించడానికి ఇక ఏ ఆటంకాలు లేవు. సమ్మక్క సాగర్‌ బ్యారేజి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ఒక వరదాయినిగా అవతరించింది. ప్రస్తుతం దేవాదుల రెండు దశలు పూర్తి అయి 12 టిఎంసిల నీటిని ఎత్తిపోస్తున్నాయి. మూడో దశ పనులు 2022 జూన్‌ నాటికి పూర్తి అవుతాయి. మూడో దశ ద్వారా ప్రాజెక్టులో 25 టిఎంసిల అదనపు ఎత్తిపోతల సామర్థ్యం ఏర్పడుతుంది.   ఏటా కనీసంగా 60 – 70 టిఎంసిల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ప్రాజెక్టులో ఏర్పాటు అవుతుంది. అప్పుడు దేవాదుల పూర్తి స్థాయిలో గోదావరి జలాలను ప్రతిపాదిత లక్ష్యాలను పరిపూర్ణం చేస్తుంది. గతంలో రీ ఇంజనీరింగ్‌ కు ముందు ధర్మసాగర్‌ జలాశయం వరకు దేవాదుల ప్రాజెక్టులో ఆయకట్టు లేదు. రీ ఇంజనీరింగ్‌ తర్వాత కాకతీయులు నిర్మించిన రామప్ప, పాఖాల, లక్నవరం చెరువులను దేవాదుల ప్రాజెక్టుతో అనుసంధానించడం జరిగింది. దీనితో ములుగు, భూపాలపల్లి, నర్సంపేట నియోజకవర్గాలలో  గోదావరి ఒడ్డునే ఉన్నప్పటికీ  కరువుతో అల్లాడుతున్న గ్రామాలు దేవాదుల ఆయకట్టు పరిధిలోకి వచ్చాయి. దేవాదుల ప్రాజెక్టును మొత్తంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకే పరిమితం చేయాలని ముఖ్యమంత్రి సాగునీటి శాఖను ఆదేశించినారు. సిద్ధిపేట జిల్లాలో ఉన్న ఆయకట్టును కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించినారు. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ తీరు :

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్‌ ఎత్తిపోతల పథకం అయిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడు సంవత్సరాలలో పూర్తి చేయడం విశేషం. ఈ స్థితి ఉమ్మడి రాష్ట్రంలో మనం ఎన్నడూ చూడలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కొక్క కాంపోనెంట్‌ దానికదే ఒక ప్రాజెక్టుగా పరిగణించాలి. లింకు-1 లో గోదావరిపై మూడు బ్యారేజీలు, బ్యారేజీలకు అనుబంధంగా మూడు పంప్‌ హౌజ్‌ లు, 33 వేల ప్రవాహ సామర్థ్యం కలిగిన 13 కిమీ లైనింగ్‌ కాలువ, లింకు-2 లో 10 మీ వ్యాసం కలిగిన రెండు సొరంగాలు, రెండు భూగర్భ పంప్‌ హౌజ్‌లు, సర్జ్‌ పూల్స్‌, 400 కెవి విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు 6.. ఇవన్నీ మూడు సంవత్సరాలలో పూర్తి కావడం ఒక అద్భుత అనుభవం. లింకు-4 లో 4 పెద్ద జలాశయాలు, 5 పంప్‌ హౌజ్‌లు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, సొరంగాలు కూడా పూర్తి అయినాయి. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం, ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకం 10 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందివ్వడం జరుగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణం అంటే 15-20 ఏండ్లు పట్టేది. ఇప్పుడు ప్రాజెక్టు అంటే మూడేండ్లు మాత్రమే. దేశంలో గతంలో  పూర్తి అయిన ప్రాజెక్టుల నిర్మాణాలకు కారణాలు ఏవైనా పట్టిన కాలం 15-20 ఏండ్లు. ప్రధానంగా పాలకుల రాజకీయ సంకల్ప లోపం వల్లనే ప్రాజెక్టుల నిర్మాణాలు విపరీత కాలాయాపనకు లోనైనాయి. దాని వలన ప్రాజెక్టుల అంచనా వ్యయాలు అనూహ్యంగా పెరిగిపోయిన అనుభవం మనకు ఉన్నది. స్వాతంత్య్రానంతరం దేశంలో నిర్మాణం అయిన కొన్ని భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి పట్టిన కాలం ఈ విధంగా ఉన్నది.

తెలంగాణ ప్రభుత్వ సంకల్ప బలం:

తెలంగాణ ప్రభుత్వం  ఈ కాలయాపన స్థితిని పూర్తిగా చెరిపివేసింది. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో కొత్త దారిని దేశానికి చూపించింది. ప్రాజెక్టు అంటే 3 ఏండ్లలో పూర్తి కావలసిన ప్రక్రియగా మార్చి వేసింది. ఇది కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వ రాజకీయ సంకల్ప బలం వల్లనే సాధ్యం అయ్యిందని చెప్పడానికి సందేహాలు అక్కర లేదు. ప్రభుత్వ సంకల్ప బలానికి తోడు రాష్ట ఇంజనీర్ల సాంకేతిక ప్రతిభ, నిర్మాణ కౌశలం తోడయింది. రాబోయే రెండేండ్లలో సమ్మక్క సాగర్‌ లాంటి మరిన్ని నిర్మాణాలు ఉనికిలోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి సేవలు అందించనున్నాయి.