సంగమేశ్వర క్షేత్రం… ఝరాసంగం

By: దాసరి దుర్గాప్రసాద్‌

అనేక మహిమాన్వితాలకు నెలవుగా, శివుని లీలా విశేషాలకు  అచ్చమైన నిదర్శనంగా నిలిచిన మరో అపురూప శివ సన్నిధానమే ఝరాసంగం. మెదక్‌ జిల్లా జహీరాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతోనూ, శివుని లీలా విశేషాలతోనూ అలరారుతోంది.

దక్షిణ కాశీగా ప్రసిద్ధి

కేతకీ అంటే మొగలి పువ్వు. దీనికే గేదకీ అని కూడా పేరు. భగవంతుడ్ని అనేక పువ్వులతో పూజించడం చేస్తారు. అయితే మొగలి పువ్వుని పూజకు అనర్హమైనదిగా పరమ శివుడు శపించాడట. అందుకే మొగలి పువ్వు పూజకు అనర్హమైనదిగా చెబుతారు. అయితే మొగలిపువ్వు శాపగ్రస్తం కావడానికి కారణం బ్రహ్మదేవుడేనట. అందువల్ల సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడికి కూడా పూజలు, అర్చనలు ఉండకూడదని శివుడే నిర్దేశించాడు. అయితే భక్తసులభుడైన శివుడు శాప విమోచనకు మార్గం కూడా సూచించాడు. ఎక్కడైతే మొగలి వువ్వుల వనం ఉంటుందో అక్కడ బ్రహ్మ అనుష్టానం చేయవచ్చని, ఎక్కడైతే కేతకీ వనంలో శివలింగం ఉంటుందో అక్కడ పూజకు అర్హత ఉంటుందని శివుడు అనుగ్రహిం చాడట. అలా కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయమున్న మహా పుణ్యక్షేత్రమే ఝరాసంగం. దక్షిణ కాశీగా కూడా ఖ్యాతి గాంచిన ఈ పుణ్య క్షేత్రం ప్రశాంత మైన వాతావరణం, ప్రకృతి అందాల నడుమ అలరారుతోంది. నిత్యం శివ నామస్మరణంతో మారుమ్రోగిపోయే ఈ దివ్య క్షేత్రం అనేక పౌరాణిక గాధలకు నిలయంగా ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. స్కంద పురాణం 11వ అధ్యాయంలో ఈ క్షేత్ర పురాణాన్ని ప్రముఖంగా ఉదహరించారు.

పురాణ గాధ

ఈ క్షేత్రానికి సంబంధించి పురాణగాధ ఒకటి ప్రచారంలో ఉంది. బ్రహ్మ, విష్ణువులు ఒకసారి తామే గొప్పని వాదులాడుకుంటుండగా, పరమేశ్వరుడు అక్కడకు వచ్చి లింగం యొక్క శిఖర దర్శనం చేసి రమ్మని బ్రహ్మకు, పాద దర్శ నం చేసి రమ్మని విష్ణువుకు చెప్పేడట. విష్ణువు వరాహ రూపంలో పాతాళంలోకి పోతుండగా గణపతి కనిపించి శివలింగ పాద దర్శనం అసాధ్యమని మందలించాడట. దాంతో విషయం తెలుసుకున్న విష్ణువు శివుని దగ్గరకు వచ్చి తనకి పాద దర్శనం కలుగలేదని సత్యం చెప్పేడట. అయితే బ్రహ్మకి మాత్రం ఎంతకీ శివుని శిఖర దర్శనం కలుగక పోయేసరికి, తనకు శిఖర దర్శనం అయ్యిందని, దీనికి సాక్ష్యం చెప్పమని మార్గ మధ్యంలో ఎదురైన కామధేనువు, కేతకీలను కోరాడట. సృష్టికర్త మాటలు జవదాటలేని కేతకీ, కామధేనువులు కూడా బ్రహ్మకు శిఖర దర్శనమయ్యిందని అబద్ధం చెప్పేరట. వాస్తవం గ్రహించిన పరమ శివుడు ఆగ్రహించి బ్రహ్మకు, కేతకీలను పూజకు అనర్హమైనవిగా శపించాడట. కామధేనువు తలతో నిజం చెప్పి, తోకతో నిజాన్ని సూచన చేయడం వల్ల తోక వైపు భాగం మాత్రమే పూజకు అర్హత ప్రసాదించాడట. 

అయితే తన తప్పుని మన్నించమని బ్రహ్మదేవుడు, కేతకీ కోరగా శివుడు అనుగ్రహించి, శాప విమోచనం సూచించాడట. ఒకప్పుడు ఈ ఝరాసంగం క్షేత్రం కేతకీ వనాలు కలిగినదై ఉండేదట. బ్రహ్మ శాప విమోచనం కోసం ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ బాణ లింగాకారుడై వెలసిన శివుడ్ని అనుష్టించాడట. ఆనందంగా ఇక్కడున్న శివలింగానికి తన కమండలంలో ఉన్న నీటితో భక్తితో అభిషేకించాడట. ఆ జల ధారే ఇక్కడ పుష్కరిణిగా మారిందంటారు. అందుకే దీనిని  అమృత గుండమని పిల్వడం జరుగుతోంది. 

మరో పురాణ గాధ

ఈ క్షేత్ర ప్రాశస్త్యానికి సంబంధించి మరో పురాణ గాధ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. కృతయుగంలో స్నానం చేసి నగ్నంగా వెళుతున్న మహర్షులను చూసి కుబేరుడు పరిహాసంగా నవ్వాడట. దాంతో ఆగ్రహించిన ఆ మహ ర్షులు కుష్టు వ్యాధితో మానవునిగా జన్మించమని కుబేరుణ్ణి  శపించారట. అంతట కుబేరుడు ఒక రాజుగా జన్మించి, కుష్టు వ్యాధితో బాధ పడుతూ, వ్యాధి నిర్మూలనకు మార్గం తెలియక తీవ్రంగా విచారించాడట. ఇలా ఉండగా, అతడు ఒకసారి వేటకి వనానికి వచ్చి దప్పికతో ఈ సంగమేశ్వర క్షేత్ర ప్రాంతానికి వచ్చాడట. అక్కడ ఎంతకీ నీరు కనిపించక పోయేసరికి అక్కడున్న పశువుల కాపరిని నీటి కోసం అడుగగా, అతడు గుండంలో నీరుందని, దానిని సేవించమని సూచించాడట. అంతట రాజు రూపంలో ఉన్న కుబేరుడు ఈ గుండంలోని నీటిని సేవించి, తన  శరీరాన్ని శుభ్రం చేసుకుని తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడట. ఇంటికి వెళ్లి చూడగానే అతనికున్న కుష్టు వ్యాధి మటుమాయమైపోయి ఆరోగ్యం చేకూరిందట. దాంతో ఆ గుండం మహత్తు తెలుసుకున్న ఆ రాజు తిరిగి ఆ గుండానికి తన కుటుంబంతో వచ్చి స్నానాదికాలు చేస్తుండగా, శివలింగం కనిపించిందని, అలా నిర్మింపబడిన ఆలయమే ఈ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయమని చెబుతారు.

కాశీబాబా మఠం

ఆలయ ప్రాంగణంలో అమృతగుండం సమీపంలో కాశీ బాబా మఠం ఉంది. తపోస్సంపన్నుడైన కాశీబాబాకు, తాను కాశీలో గంగానదిలో పోగొట్టుకున్న కమండలం ఈ అమృత గుండంలోనే దొరికిందని, భగవాన్‌ శంకరుడి అభీష్టం మేరకు కాశీబాబా ఈ క్షేత్రంలోనే జీవ సమాధి పొందారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అమృత గుండంలో నారాయణ, ధర్ణ, రుషి, వరుణ, సోమ, రుద్ర, ఇందిర, దాత అనే తీర్థాలున్నాయని తెలుస్తోంది.

సంగమేశ్వర స్వామి దర్శనం సర్వ పాపహరణం

కాశీలో వెయ్యి రోజులు చేసిన  పుణ్యం ఇక్కడ 41 రోజులు సంగమేశ్వర స్వామిని అర్చిస్తే వస్తుందని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ క్షేత్రంలో ఒకరికి అన్నదానం చేస్తే,  వెయ్యిమందికి అన్నదానం చేసిన ఫలితం ఉంటుందంటారు. నిత్యం వేలాది మంది భక్తులతో విశేషంగా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఈ క్షేత్రానికి భక్తులు విరివిగా వచ్చి సంగమేశ్వర స్వామి వారి సేవలో మునిగి తేలుతారు.

ఎలా చేరుకోవాలి

ఝరాసంగం క్షేత్రం మెదక్‌ జిల్లాలో ఉంది. ఇది హైదరాబాద్‌ నగరానికి సుమారు 135 కిలోమీటర్లు దూరంలో ఉంది. హైద్రాబాద్‌ నుంచి నేరుగా ఝరాసంగానికి సులు వుగా చేరుకోవచ్చు.

భోజన, వసతి సదుపాయాలు

ఝరాసంగంలో భోజన, వసతి సదుపాయాలు అంతంత మాత్రం. అందువల్ల ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరి సదుపాయాలు వారే చేసుకోవడం ఉత్తమం. లేదా ఇక్కడకు సమీ పంలో జహీరాబాద్‌లో ఉండి, ఈ క్షేత్రాన్ని సందర్శించవచ్చు.

ఉత్సవాలు

ఏటా కార్తీక మాసంలో, మాఘ మాసంలో స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనాది అభిషేకాలు నిర్వ హిస్తారు. మహా శివరాత్రికి ఈ ఆలయం భక్తులతో పోటెత్తు తుంది. ఆయా రోజుల్లో స్వామివారికి అత్యంత ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఓ అపూర్వమైన ఆధ్యాత్మికానురక్తిని పెంచే మహత్తర క్షేత్రం ఝరాసంగం శ్రీకేతకీ సంగమేశ్వర స్వామి ఆలయం.  ఆ ఆలయంలోని కేతకీ సంగమేశ్వర స్వామివారి లింగ దర్శనం పూర్వ కర్మల పుణ్య ఫలం.

సర్వేజనాసుఖినో భవంతు…

సర్వ బాధా నివారణం అమృత గుండ స్నానం

నిశ్చలమైన భక్తితో ఎవరైతే ఈ అమృతగుండంలో స్నానాదికాలు చేస్తారో, వారికి సర్వరోగాలు, బాధలు నివారింపబడి ఆనందసిద్ధి కలుగుతుంది. బ్రహ్మ, విష్ణువులు ఈ క్షేత్రంలో శివుని అర్చించా రని, ఈ కేతకీ వనంలో బ్రహ్మ దేవుడు శివుని గురించి తపస్సు చేయగా, పార్వతి పరమేశ్వరులు తపఫలాన్ని అనుగ్రహించారని, వీరందరి కలయిక వల్లనే సంగమేశ్వర క్షేత్రమైందని కథనం. గర్భాలయంలో సంగమేశ్వర స్వామి వారి లింగ దర్శనం బహు జన్మల పుణ్యఫలం. స్వామివారికి సమీపంలోనే పార్వతి మాత మందిరం ఉంది. ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం.