సమ్యక్‌ క్రాంత దర్శనం… సంక్రాంతి

By: డా. సాగి కమలాకర శర్మ

‘‘తత్ర మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరితః
సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తర రాశౌ
సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః’’
(జయసింహ కల్పద్రుమం)

సూర్యుడు మేషాది రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది. క్రాంతి, క్రమణము అనే శబ్దాలకు తిరుగుట, మార్పు అని అర్థం. మంచి మార్పు, సరిjైున విధంగా తిరగడం అనే అర్థాలలో సంక్రాంతి, సంక్రమణం అనే శబ్దాలు కనిపిస్తున్నాయి. సూర్యుడు ప్రతి మాసం ఒక్కో రాశిలోకి మారడాన్ని సంక్రమణం అంటాం. నిరయన పద్ధతి ప్రకారం సూర్యుడు ధనుస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశించడం మకర సంక్రమణం అవుతుంది. ఈ సమయం ఖగోళ పరమైన ఒక ప్రత్యేకతను పొంది ఉన్నందున ఈ ప్రత్యేక దినాన్ని పండుగగా ఆచరించడం జరుగుతుంది. మన పండుగలకు అన్నింటికీ ఖగోళం మూలాధారం. ఆ ఖగోళాన్ని అనుసరించిన ప్రకృతి మనకు సంతోషాన్నిస్తే అది పండుగ. మానసిక, భౌతిక ఒత్తిడులకు గురి చేసే ఆ రోజున వ్రతాదులు నియమబద్ధంగా నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఉత్తమ కాలం ` ఉత్తరాయణం : సౌర కుటుంబంలో సూర్యుడు ఒక నక్షత్రం. భూమి ఒక గ్రహం. భూమి ఆత్మభ్రమణం చేస్తూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. సూర్యుడు స్థిరంగా ఉంటాడు. కాని మనమంతా భూగ్రహంపై ఉన్న కారణంగా మనం స్థిరంగా ఉన్నట్లు, మిగిలిన ఖగోళ పదార్థాలన్నీ తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఆవిధంగా సూర్యుడు వేరు వేరు రాశులలో సంచరిస్తున్నట్లు మనకు కనిపి స్తుంటాడు. ద్వాదశ రాశుల్లో ప్రతి సంవత్సరం ఒకసారి సంచరించి నప్పటికీ నాలుగు రాశుల్లో సంచారం మాత్రం మరింత విశిష్టమైనదిగా గుర్తింప బడిరది. అవి మేష, కర్కాటక, తుల, మకర సంక్రమణాలు. మేష, తులా సంక్రమణాలు మనకు విషువత్తులు (రాత్రి పగళ్ళు సమానమైన రోజులు) కాగా, కర్కాటక సంక్రమణం సూర్యుని దక్షిణ అయనం (గమనం), మకర సంక్రమణం సూర్యుని ఉత్తర అయనం (గమనం) అవుతాయి. సూర్యుని దక్షిణ గమన సమయంలో భూ వాతావరణమంతా చల్లబడిపోయి, వర్షాలు కురిసి, పంటలకు అనువైన కాలమైనప్పటికీ సూక్ష్మజీవులు పెరిగి ప్రకృతి కొంత అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆ సమయంలో వ్యక్తులు తమను తాము ప్రకృతి ప్రభావాల నుండి బాగా రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకే అనేకరకాల పూజలు, హోమాలు, వ్రతాలు నిర్వహించే సమయంగా ఈ కాలం మనకు కనిపిస్తుంది. కాని మకర సంక్రమణ కాలం నుండి క్రమంగా సూర్యుడు భూమి మీద ఉండే వారికి దక్షిణం నుండి ఉత్తరం వైపు ప్రయాణం చేస్తున్నట్లు కనిపిస్తాడు. ఈ సమయంలో భూమి పైన సానుకూల వాతావరణం ఏర్పడటం, భూమి ఎండిపోవడం వల్ల సూక్ష్మజీవుల వృద్ధి తగ్గిపోవడం జరుగుతుంది. ఈ సమయంలో అనేక రకాల శుభకార్యాలు, పండుగలు నిర్వహించుకోవడానికి అత్యంత అనువైన సమయం. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ సూర్యుడు మకర రాశిలోకి సంక్రమించిన నాడే నిర్వహించుకునే సూర్య సంబంధమైన ఉత్సవం ‘‘సంక్రాంతి’’.

తెలుగువారి పెద్ద పండుగ: సంక్రాంతి తెలుగువారు ఆనందంగా నిర్వహించుకునే పండుగ. ఇతర ప్రాంతాల్లో వేరు వేరు రూపాల్లో ఈ సమయాన్ని పండుగగా నిర్వహించుకునే సంప్రదాయం ఉంది. ఇది తెలుగువారు మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. భోగి, సంక్రాంతి, కనుము అనే పండుగలు ఇవి. ఇప్పుడు మనం చూడగలిగినా, చూడలేకపోతున్నా…. ఇండ్లలో బంధుమిత్రాదులతో ఆనందోత్సాహాలు, చలి మంటల నెగళ్ళు, తీర్చిదిద్దిన రంగవల్లులు, సూర్యుని ఆరాధనలు, బొమ్మల కొలువులు, ఎగురుతున్న పతంగులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల మేళాలు, ఇళ్ళకు చేరే పాడిపంటలతో పల్లె తల్లి సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతుంది.

భోగ భాగ్యాల భోగి: తెలుగువారి పండుగల నియమాల ప్రకారం కొన్ని పండుగల ముందు రోజులకు ‘భోగి’ అని పేరు. అంటే తరువాత రోజున నిర్వహించాల్సిన విధి విధానాలను తయారు చేసుకునే పండుగ. పండుగ తొలి రోజు అని అర్థం. ఒక రకంగా చేయబోతున్న ఉత్సవానికి ప్రిపరేషన్‌. ఇతర పండుగల ముందురోజుల కన్నా మకర సంక్రాంతి ముందురోజైన భోగికి విశేషంగా గుర్తింపు వచ్చింది. ధనుర్మాసంలో తన పాశురాలతో ప్రార్థన చేసిన గోదాదేవిని శ్రీరంగనాథుడు స్వీకరించి తనలో ఐక్యం చేసుకున్న కళ్యాణకరమైన రోజు భోగి. ఈ విధంగా గోదాదేవికి భోగభాగ్యాలు సమకూడిన రోజు. ఇంద్రపూజకు, వామన బలి చక్రవర్తుల స్మరణకు, గోదాదేవి కళ్యాణానికి ఈ రోజు ప్రత్యేకించబడిరది.

ఉదయమే భోగి మంటలు వేయడం, అభ్యంగన స్నానం చేయడం, ఇంటిని అలంకరించుకోవడం, సాయంకాలాల్లో పిల్లలకు దృష్టి దోష నివారకంగా స్త్రీలందరూ కలిసి ‘భోగిపళ్ళు’ (బోడలు) పోయడం వంటి కృత్యాలు ఈ రోజున నిర్వహిస్తుంటారు. కాలానుగుణంగా నిర్దేశితమైన కర్మలివి.

మకర సంక్రాంతి: మూడు రోజుల ఈ పండుగలో ముఖ్యమైన రోజు ఇది. మకర సంక్రమణం నాడు రాముని పూజ చేసి ఉపవాసం చేయాలని చతుర్వర్గ చింతామణి చెపుతుంది. ఈ రోజునుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరం వైపుకు ప్రయాణిస్తున్నట్లు భూమిపైన ఉన్న మనకు కనిపిస్తుంటాడు. ఇది దేవకర్మలకు అనువైన కాలం కాబట్టి ఈ ప్రారంభపు రోజుకు విశిష్టత ఉంది. భూమిపై సూర్యుని ఉత్తమ కిరణాలు పడే సమయం. జీవజాతుల్ని ఉత్తేజితం చేసే సమయమిది. ఇది పుణ్యకాలంగా భావన ఉండడం వల్ల భీష్ముడు ఉత్తరాయణం వరకు ఆగి మరణించినట్లు భారతం తెలియజేస్తుంది. ఈ రోజున సూర్యుని ప్రార్థన చేసి తిలలు, గుమ్మడికాయలు, ధాన్యం, లోహాలు, వస్త్రాలు, దీపదానాలు ఎన్నో రూపాల్లో చేయాలని అన్ని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ధ్రువ ప్రాంతాల్లో ఇప్పుడు సూర్యుని ప్రారంభ కిరణాలు కనిపిస్తుంటాయి.

కనుమ పండుగ: సంక్రాంతి పండుగలో మూడవరోజున నిర్వహించే ఉత్సవం ఇది. ఈ పర్వంనాడు గో, పశుపూజలకు ప్రాధాన్యం ఉంది. అధర్వణ వేదంలో ఇది ‘అవడోత్సవం’ అనే పేరుతో కనిపిస్తుంది. ఎడ్లబండ్లను అందంగా ముస్తాబు చేయడం, మేళతాళాలతో ఊరేగించడం, కోడెదూడెలతో పందేలు నిర్వహించడం వంటివి చేస్తారు. తమకు ఇంతకాలం సహకరించిన పశు సంపదకు చేసే సత్కారమే కనుమ పండుగ. తమకు పండిన వరిధాన్యానికి సంబంధించిన వరి వెన్నులను గుత్తిగా తయారుచేసి ఇంటిచూరులకు వేలాడదీయడం కూడా ఇందులో భాగమే. పక్షులకు ఆహారాన్ని అందించే సంప్రదాయమిది. పశుపక్ష్యాదులకు చెందిన పండుగ ఇది. పశువులకు పొంగలి వండిపెట్టే ఆచారం తెలుగు తమిళ ప్రాంతాలలో ఉంది.

సూర్యుని ఆరాధన విశేషం:
మకర సంక్రాంతి సంద ర్భంగా సూర్యుని ఉత్తరాయణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయడం, గాయత్రీజపాన్ని అధికంగా చేయడం ఆచారంగా ఉంది. అంతే కాకుండా సూర్య దేవాలయాల్లో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించడం, అరుణ పారాయణం, అరుణ హోమాలను నిర్వహిస్తారు. సూర్య నమస్కారాల ద్వారా అందరికీ ఆరోగ్యం సిద్ధించాలని కోరుకునే విధానం ఈ ప్రత్యేక ఆరాధనలో మనకు కనిపిస్తుంది.

ముగ్గుల పండుగ: సంక్రాంతి సమయంలో మనకు ఇండ్ల ముందు రంగురంగుల పిండితో ముగ్గులు పెట్టే సంప్రదాయం కనిపిస్తుంది. ముగ్గుల మధ్యలో గోమయంతో కూడుకున్న గొబ్బిళ్ళు పెట్టడం, వాటిలో రంగురంగుల పూలు, కొత్తబియ్యం, రేగు పండ్లను పెడతారు. సంక్రాంతి నాటి నుండి సప్తాశ్వ రథారూఢుడైన సూర్యుని సంక్రమణాన్ని దృష్టిలో పెట్టుకొని రథం ముగ్గు వేసే సంప్రదాయం ఉంది. ఇది మాఘమాసంలో రథ సప్తమి వరకు కొనసాగిస్తూ ఉంటారు. ఈ ముగ్గుల అలంకరణల వల్ల వీథులు, గృహ ప్రాంగణాలన్నీ అందంగా తయారవుతాయి. ఈ ముగ్గులన్నీ ఖగోళ స్థితికి ప్రతీకలుగా భావిస్తుంటారు.

తిలస్నానం: హేమంత ఋతువులో రెండోమాసం పుష్యమాసం. ఈ మాసంలో రాత్రి సమయాలు ఎక్కువ, పగటి సమయాలు తక్కువ. ఎండ తీక్షణత కూడా తక్కువే. అందువల్ల శరీరంలోని స్వేదగ్రంథులు సరియైన విధంగా వాటి పనులను చేయలేక మందగిస్తాయి. చర్మం పొడిబారుతుంది. పగుళ్ళు ఏర్పడి చర్మ వ్యాధులకు అవకాశం కలుగుతుంది. దీనికి నివారణ తైలాభ్యంగన స్నానం. నువ్వుల నూనెను శరీరానికి మర్దన చేసి పిండితో స్నానం చేయడం ద్వారా స్వేద గ్రంథులు తెరచు కుంటాయి. ఈ మాసమంతా తైలస్నానం చేసినా చాలా మంచిది.

పితృ తర్పణాలు: ద్వాదశ రాశులలోకి సూర్యుడు ప్రవేశించడం సంక్రమణం అంటాం. ఇటువంటి సంక్రమణ కాలాల్లో పితృ తర్పణాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. వీనిలో ఉత్తరాయణ ప్రారంభం అయిన మకర సంక్రమణ కాలంలో చేసే తర్పణాలు ఇంకా విశేష ఫలితాలను ఇస్తాయి. ఈ సందర్భంలో తొమ్మిది రకాల కూరగాయలను కలిపి కూరలు వండడం, బ్రాహ్మణులకు కూరగాయలనూ, ధాన్యాన్నీ, దక్షిణనూ ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్నాయి. కేవలం తర్పణాలు విడవడమే కాకుండా పెద్దల పేరుతో ఎన్నో రూపాల్లో దానధర్మాలను చేయడం, శరీరానికి వేడిని అందించే నువ్వులు, నెయ్యి, కంబళ్ళు పేదలకు దానం చేయడం పుణ్యప్రదం అవుతుంది.

పెరుగుదానం – సంతాన అభివృద్ధి: సంక్రాంతి నాడు పెరుగును దానం చేయడం వల్ల సంతానం లేని వారికి ప్రాప్తిస్తుందనీ, ఉన్నవారికి అభివృద్ధి ప్రదమవుతుందని పురాణాలు మనకు చెబుతున్నాయి. యశోద చేసిన పెరుగు దానం వల్ల కృష్ణుడు వారికి కుమారుడుగా లభించాడనీ, కృపాచార్యుని భార్య కృపి, దూర్వాసుని సలహామేరకు పెరుగుదానం చేయడం వల్ల అశ్వత్థామ వంటి కుమారుణ్ణి పొందగలిగిందనీ పూర్వ కథనాలు మనకు తెలుపుతున్నాయి. కాబట్టి సంక్రాంతి నాడు పెరుగుదానం మనకు సంప్రదాయంగా మారిపోయింది.

గొబ్బి గౌరీవ్రతం: సంక్రాంతి సందర్భంలో నిర్వహించే వ్రతాలలో గొబ్బి గౌరీవ్రతం ఒకటి. ఇది భోగినాడు ప్రారంభం అవుతుంది. భోగినాడు సాయంకాలం ఇంటి మధ్యలో ఒకవైపున మంటపాలను ఏర్పర్చి, దొరికే కూరగాయలు, చెరుకు గడలను అక్కడ పెడతారు. మంటపం మధ్యలో బియ్యం పోసి, దానిపై బంకమట్టితో చేసిన గౌరీ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. పూజానంతరం రాత్రివేళ గౌరీదేవిని నిద్రపుచ్చుతారు. మళ్ళీ ఉదయం మేల్కొల్పుతారు. మూడు రోజుల్లోనూ సాయం కాలాల్లో ముత్తయిదువులను పేరంటానికి పిలుస్తారు. వారు మంటపంలో పాటలు పాడి గొబ్బిళ్ళు పెడతారు. నాలుగోరోజు ఉద్వాసన చెప్పి, అక్కడి కూరగాయలతో వంటలు చేస్తారు. దీనిని గొబ్బికూర అని అంటారు. ఆ సాయంకాలం గౌరీదేవిని చెరువులో లేదా నదుల్లో ఓలలాడిస్తారు. గోపికలు చేసిన కాత్యాయనీ వ్రతాన్ని కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడనే నమ్మకంతో గొబ్బెమ్మలు చేయడం ఒక సంప్రదాయం.

బొమ్మల కొలువు: వేరు వేరు దైవస్వరూపాలను కొలువు తీర్చినట్లుగా ఇంట్లో అలంకరించడం, ప్రతి సంవత్సరం మరో కొత్త బొమ్మను దానిలో చేర్చడం, వానిలోని దైవత్వ భావనకు పూజలు చేసి నైవేద్యాలు పెట్టడం ఆచారంగా వస్తుంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో బొమ్మల కొలువును సంక్రాంతి సమయంలో తీర్చిదిద్దుతారు. ఎన్నో సృజనాత్మక ప్రయోగాలు కూడా ఈ కొలువుల్లో మనకు దర్శనమిస్తాయి. ఈ కొలువులను దర్శించడానికి పేరంటాళ్ళను పిలుస్తారు. వారికి పండు తాంబూలాలను ఇచ్చుకుంటారు.

భోగిమంటలు: సంక్రాంతి ఉత్సవంలో మొదటి రోజున తెల్లవారుజామున, నాలుగు మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంటలు భోగి మంటలు. ఇంటిలో చెక్కలతో కూడుకున్న పాత సామాను పేరుకు పోకుండా, అది దారిద్య్ర చిహ్నంగా భావించి వాటిని ఈ మంటలలో వేసే సంప్రదాయం ఉంది. దక్షిణాయనంలోని బద్ధకం తొలగించడం దీని లక్ష్యం. ఇంకా హరిదాసులు, గంగిరెద్దులు, పతంగుల ఆటలు, కోడిపందేలు అన్నీ జీవిత తత్వాన్ని, ఆనందాన్ని పెంచుకునే, పంచుకొనే గొప్ప విశేషాలుగా ఈ ఉత్సవం దర్శనమిస్తుంది.

తెలంగాణ ప్రాంతంలో ఈ సందర్భంలో ప్రత్యేకమైన నోములు నోచుకునే సంప్రదాయం ఉంది. ఆరోగ్య సిద్ధి, అందరి సౌఖ్యం ఈ నోములో ప్రత్యేకంగా కనిపిస్తుంది. యమధర్మరాజు భార్య ప్రతి సంవత్సరం వేయి పుర్రెలతో నోము నోచుకుంటుందట. ఆమె ఈ నోము చేసుకునే సమయంలో ప్రతిసారీ ఒక పుర్రె తక్కువ అవుతూ ఉన్నదట. ఆ పుర్రె తమ ఇంటి నుండి వెళ్ళకూడదనే భావంతో పుర్రెలకు ప్రతీకగా కుండలు, గురుగులను పెట్టుకొని ఈ నోము నోచుకుంటారు. ఈ కుండలను పెళ్లి అయిన మొదటి సంవత్సరం 5 కుండలు, క్రమంగా పెంచుకుంటూ 5 సంవత్సరాలకు 25 కుండలతో చేసుకుంటారు. తర్వాత సంవత్సరం నుండి 5 కుండలు పెట్టుకుంటారు. వీనిలో ఒకటి ఇంటిలో పెట్టుకొని నాలుగింటిని వాయనం ఇస్తారు. ఈ కుండల్లో బియ్యం, నువ్వులు, రేగుపండ్లు ఉంటాయి. ఈ చలికాలం సందర్భంలోనూ, దక్షిణాయన ప్రభావం వల్ల మరణాలు అధికంగా ఉంటుంటాయి కాబట్టి ఇది ఒక రకంగా పీడ పండుగగా భావించి, ఈ వ్రత నిర్వహణ వల్ల తమకు శ్రేయస్సును కోరుకునే సంప్రదాయం తెలంగాణలో కనిపిస్తుంది. నువ్వులు బెల్లం ఇచ్చి పుచ్చుకొని ‘తియ్యగా తిని తియ్యగా మాట్లాడు’ అని అనుకుంటారు.

ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో ఈ పండుగను సోదరీ సోదరుల అనుబంధాన్ని పెంచే పండుగగా, గుజరాత్‌లో ‘వాసీ ఉత్తరాయణ్‌’ గా పతంగుల ఉత్సవంగా, హిమాచల్‌ ప్రదేశంలో ‘మఘసజ్జి’ గా, కర్ణాటక ప్రాంతంలో కర్షకుల పండుగగా నిర్వహిస్తారు. నువ్వులు, బెల్లంతో కూడుకున్న పళ్ళేలను (ఎల్లబెల్ల) కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, ఒరిస్సా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌ వంటి ప్రాంతాల్లోనూ వారి ప్రాంతీయాచారాలను బట్టి ఈ పండుగను నిర్వహిస్తున్నారు.

ఉత్తరాయణ పుణ్యకాలంలో కోట్లాది ప్రజలు నదీస్నానాలు చేస్తారు. దేశం మొత్తం మీద సంక్రాంతిని కాలసంబంధమైన, సూర్య సంబంధమైన పండుగగా నిర్వహిస్తారు. ఆబాల గోపాలం అంతా పాల్గొనే అతి పెద్ద ప్రకృతి ఉత్సవం ఇది.