పల్లెసీమల్లో సంక్రాంతి శోభ!

pandugha

పండుగలప్పుడు పరమాత్మను పూజించడం, ఆచారాలను పాటించడం చక్కని సంప్రదాయం. పండుగల వెనుక పరమాత్ముడి సందేశాన్ని గ్రహించి అందుకు అనుగుణంగా మన జీవితాన్ని మలచుకోవడం అభిలషణీయం.

హిందువుల పండుగలలో కేవలం సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. కాబట్టి ఒక్క సంక్రాంతి మాత్రమే ప్రతి సంవత్సరం ఒకే తేదీన (జనవరి14 లేదా 15) వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి.

ప్రతి యింట తమ సంసారం, పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని కోరుకునే శుభ కామనకు ఈ పండుగసంకేతమ వుతుంది. హైందవ సంస్కృతిలో పారమార్థికతత్వాన్ని, తాత్త్విక దృష్టిని ప్రతిబింబింపజేసేదీ సంక్రాంతి పర్వం. హేమంత ఋతువులో పౌష్యలక్ష్మీ అరుదెంచి మానవతా ధర్మాన్ని ప్రబోధింపజేస్తుంది.

మన తెలంగాణ సంప్రదాయ పండుగలలో జానపదులు పల్లెసీమల్లో జరుపుకొనే విశేషమైన పండుగ మకర సంక్రాంతి. రైతన్నలు తాము పండిరచిన పంటలన్నింటిని ఇంటికి తరలించి, తాము శ్రమించిన కష్టానికి దక్కిన ప్రతిఫలాన్ని చూసి ఆనందిస్తూ, జరుపుకొనే ముచ్చటైన మూడు రోజుల పండుగ ఇది. పల్లెసీమలు పట్టుకొమ్మలుగా, రాష్ట్రంలో ధాన్యపు రాశుల సిరులను ప్రసాదించే మకర సంక్రాంతి రైతులకు విశిష్టమైనది.

హరిదాసులు, జంగమదేవరలు, బుడబుక్కలవాళ్ళు, గొబ్బెమ్మలు, చేమంతిపూలు, రంగురంగుల ముత్యాల ముగ్గులు, నూతన ధాన్యపు రాశులు, నాగళ్లకు, కొడవల్లకు, పశువులకు పూజలు-ఇవి సంక్రాంతి ప్రత్యేకతలు. ఈనాటి నగర ప్రజలు మన సంస్కృతికి దూరమైపోతున్నారని అనుకుంటున్నా, పల్లె ప్రాంతాల్లో మాత్రం నేటికీ నిజమైన జానపదుల పండుగగా, పల్లెల్లో మహిళలు ఎక్కువగా ఇష్టపడే పండుగ సంక్రాంతి. సూర్యుడు ధనూరాశి నుండి మకర రాశిలోకి సంక్రమణంచెందే పవిత్రమైన రోజును మకర సంక్రాంతిగా ఆనందంగా జరుపుకోవటం అనాదిగా వస్తోన్న సంప్రదాయం. ముచ్చటైన ఈ మూడు రోజుల పండుగలో తొలిరోజు భోగినాడు తెల్లవారు జామునే భోగి మంటలను వేస్తారు. ఈ భోగి మంటలలో ధనుర్మాసం నెలంతా ఆడపిల్లలు ఆవుపేడతో తయారుచేసిన గొబ్బి పిడకలు వేసి చలి కాచుకోవడం ఆరోగ్యకరం. కానీ ఈనాడు అరిష్ట నివారణకోసం పనికిరాని, విరిగిపోయిన వస్తువులను, చెత్తా చెదారాలను వేసి భోగి మంటలపేర చలి కాచుకోవడంవలన వాతావరణం కాలుష్యమై అనారోగ్యకరమైన రోగాలు ప్రబలుతున్నాయి. వాతావరణం చల్లగా ఉండే ఈ సమయంలో క్రిమికీటకాదుల వలన వ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. ఈ భోగి మంటలవల్ల బ్యాక్టీరియా నశిస్తుందనే విశ్వాసంతో, పిల్లలు పెద్దలు అనే తారతమ్యం లేకుండా తెల్లవారు జాముననే నిద్రలేచి భోగి మంటలు వేసికొని కేరింతలతో ఆనందిస్తారు.

సంక్రాంతి రోజు ప్రాత:కాలంలోనే అభ్యంగస్నానమాచరించాలి. ఈ రోజు స్నానాదులను చేయనివారు ఏడుజన్మలపాటు రోగి అవుతాడని చెప్పడంవలన ఈ రోజు స్నానానికి విశేష ప్రాముఖ్యత ఉన్నది. నూతన వస్త్రాలు ధరించి, భగవత్‌ ఆరాధనంచేసి పెద్దల ఆశీర్వాదాలు పొందాలి. కొత్తగా వచ్చిన ధాన్యంతో ఆవుపాలను బెల్లంతో కలిపి పొంగలి తయారుచేసి ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానునికి నైవేద్యముగా సమర్పించి కుటుంబంలోని అందరూ స్వీకరిస్తారు.

వరిపంట ఎక్కువగా పండే పల్లెల్లో బియ్యప్పిండితో సకినాలు, సజ్జలు పండే ప్రాంతంలో నువ్వులు అద్దిన సజ్జ రొట్టెలతో పాటు అరిసెలు కూడా తప్పకుండా చేసుకుంటారు.

గంగిరెద్దులను చక్కగా అలంకరించి ఇంటింటికి తిప్పుతూ ‘‘అయ్యవారికి దండం పెట్టు… అమ్మగారికి దండం పెట్టు…’’ అంటూ వివిధ భంగిమల్లో నృత్యాలు చేయిస్తూ దానం స్వీకరిస్తారు. గంగిరెద్దులవారు హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో పల్లెలన్నీ కన్నుల పండువగా ఉంటాయి. బుడబుక్కలవారు ‘అంబపలుకు జగదంబా పలుకు కంచిలోని కామాక్షి పలుకు’ అంటూ ఢమరుక మోగిస్తూ వస్తారు. అందుకే సంక్రాంతి పెద్దపండుగ అన్నారు.

కనుమ :

ఇది రైతులకు ముఖ్యమైన పండుగ. సూర్యుడు ప్రొద్దు పొడవకముందే నిద్రలేచి తమ పాడి ఆవులకు, ఎద్దులకు శుభ్రంగా స్నానాలు చేయించి పసుపు, కుంకుమలుపెట్టి, మెడలో గంటలు, కాళ్ళకు గజ్జెలలతో, పశువులను ముస్తాబు చేస్తారు. పాడిని ప్రసాదించే గోమాతను, పంటకు సాయమై నిలిచిన బసవన్నను పూజించి గోప్రదక్షిణలుచేసి, ఆకులో అన్నం వడ్డించి తినిపిస్తారు. పచ్చగడ్డి, శనగపిండిని కూడా గ్రాసంగా పెడతారు. తమ కృషికి బాసటగా నిలిచిన పశువులకు నమస్కరించి కనుమ పండుగ గొప్పగా చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఎద్దుల పందాలు జరుపుతారు.ఈ రోజు గుమ్మడికాయల్ని పొలాలదగ్గర పగులగొట్టి ‘పొలి’ వేస్తారు. పొలి అంటే బలి అని అర్థం. భూత ప్రేతాదులనుండి తమ పంటలకు రక్షణకోసం ఈ పొలిచేసే ఆచారం ఉన్నది. పొలి పొలి చల్లని పొలి అంటూ పండిరచే చేలల్లో చల్లుతారు. ఊరి గ్రామ దేవతలకు గారెల్ని నివేదనచేసి, కోళ్ళను కూడా కోసుకొని వండుకుంటారు. కనుమరోజు ఎవ్వరూ ప్రయాణాలు చేయరు. అందుకే కాకి కూడా కనుమనాడు కదలదనే సామెత ఉంది.

పతంగుల పండుగ:

సంక్రాంతి పండుగొచ్చిందంటే పిల్లల దృష్టి పతంగులపై ఉంటుంది. ఒక కాగితాన్ని చతురస్రాకారంగా కత్తిరించి పతంగులపేర రకరకాల రంగు కాగితాలతో తయారుచేసి, పతంగులకు దారంకట్టి ఆకాశంలో ఎగరవేస్తారు. ఈ పతంగులు పిల్లలను బాగా ఆకట్టుకుంటాయి.

చారిత్రక కాలంలో మొగలులు పతంగులపై ఆసక్తి కనబరిచారని, వారి రాజకుమార్తెలకు, వివాహితులకు గాలిపటాలు ఎగరవేసే అభిరుచి ఉండేదట. ఆ రోజుల్లో యువతీయువకులు వారి ప్రేమ సందేశాలను పంపే సాధనాలుగా పతంగులను ఉపయోగించారని, చివరి మొగలు చక్రవర్తిjైున ‘బహదూర్‌ షా జఫర్‌’కు గాలిపటాలు మీద ఆసక్తి ఉండేదని తెలుస్తోంది.

రంగవల్లికలు:

సంక్రాంతి పండుగంటేనే మగువలకు ముగ్గుల పండుగని చెప్పాలి. ఈ పండుగకు నెల రోజుల ముందునుండే ధనుర్మాసారంభంనుండే వాకిళ్ళలో రంగుల హంగుల్ని చేర్చి వరంగవల్లులు తీర్చి దిద్దుతారు. ముగ్గున్న ఇల్లు లక్ష్మీదేవికి ఇష్టమని, రంగవల్లులు దరదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెస్తాయని మగువల నమ్మకం. సుందరమైన ముగ్గులో భగవంతుడు కనిపిస్తాడని ప్రజల విశ్వాసం. ఈ ముగ్గులు మహిళల సృజనాత్మకత, కళాతృష్ణకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నింగిపైని ఇంద్రధనస్సును నేలపై నిలిపినట్టు రంగురంగు ముగ్గులతో ధరిత్రి కొత్త శోభను సింగారించుకుంటుంది.

చివరి రోజున రథం ముగ్గునువేసి దానికి తాడును కట్టి  సంక్రాంతి పురుషుడని సాగనంపుతారు.