మూడు రోజుల పండుగ సంక్రాంతి

By: శ్రీ డా॥ భిన్నూరి మనోహరి

నిరుపమ లీల బాలికలు నిశ్చలభక్తిని యుక్తి సంకురా
తిరి నెలబేడ గొబ్బిలులు దీర్తురు వాకిళులందు మ్రుగ్గులన్‌
బొరిపరి బొమ్మలన్నిలిపి పూజలు సేతురు బొమ్మరిండ్లలలో
బరువడి నారగించెదరు పచ్చడి బెల్లము పుల్గమిచ్చలన్‌

అంటూ తెలుగువారికి ఇష్టమైన రంగవల్లుల
సంక్రాంతి పండుగ యొక్క ప్రాశస్త్యాన్ని తెలిపే పద్యం.

సంక్రాంతి అంటే భోగి మంటలు
సంక్రాంతి అంటే పసిపిల్లల కేరింతల భోగిపండ్లు
సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళ ముచ్చట్లు, అత్తింటివారి ఆరాటాలు
సంక్రాంతి అంటే పసిడి పంటల ధాన్యపు గలగలలు
సంక్రాంతి అంటే ముత్తయిదువుల పేరంటపు సవ్వడులు
సంక్రాంతి అంటే సత్‌ క్రాంతి, సమ్యక్‌ క్రాంతి.

సాధారణంగా మనం చాంద్రమానాన్ని అనుసరించి పండుగలను, వివాహాది శుభకార్యాలను జరుపుకుంటాం. కానీ సంక్రాంతి పండుగను మాత్రం ప్రత్యక్ష దైవమైన సూర్య సంబంధమైన సౌరమానం ప్రకారం చేసుకుంటాం. ఇది తిథి ప్రధానమైన పండుగ కాదు. ఆ కారణంగానే ప్రతీ సంవత్సరం జనవరి 13, 14, 15 తేదీలలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు నిర్ణయించబడతాయి. సంక్రాంతి పండుగకు ముందు నెలరోజులు ధనుర్మాసం. ఈ ధనుర్మాసం విష్ణుమూర్తి గోదాదేవికి సంబంధించిన విశేష మాసం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం మకర సంక్రమణం. అదే మకర సంక్రాంతిగా ప్రసిద్ధి చెందింది. సూర్యుడు ప్రతి మాసం ఏదో ఒక రాశిలో ప్రవేశిస్తాడు. కానీ ఈ మకర సంక్రమణానికే చాలా ప్రాధాన్యత ఉంది. దానికి కారణం అప్పటిదాకా దక్షిణాయనం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. ఈ ఉత్తరాయణంలో జరిపే పూజలు, వ్రతాలు, దానాదులు అన్నీ ఉత్తమ ఫలితాలను ఇస్తాయని శాస్త్రవిదితం. మకర సంక్రాంతి నుండి సూర్యుడు తన సహస్ర కిరణాలతో సమస్త ప్రకృతిని, జీవజాతుల్ని ఉత్తేజితుల్ని చేస్తాడు. ఈరోజు సముద్రసాన్నాలు, నదీస్నానాలు చేసి సూర్యనారాయణునికి అర్ఘ్యం ఇవ్వడం చాలా విశేషంగా చెప్పబడింది.

మకర సంక్రాంతి సాధారణంగా మూడురోజులు జరుపుకుంటారు. మొదటిరోజు భోగి, రెండవరోజు మకర సంక్రాంతి, మూడవరోజు కనుమ. భోగి అంటే భోగభాగ్యాలను కలిగించేది అని చెప్తారు. గోదాదేవికి విష్ణుమూర్తికి వివాహం జరిగిన రోజుగా ఈ భోగి పండుగను వర్ణిస్తారు. అంతేకాక దక్షిణాయనానికి, ధనుర్మాసానికి చివరిరోజు ఈ భోగి. చలి ఎక్కువసమయం ఉండే కాలం కాబట్టి ఈ రోజు సాధారణంగా తెల్లవారుజామున భోగిమంటలు వేస్తారు. ఇందులో ఇంట్లో ఉండే పాత సామగ్రి, చెక్క వస్తువులు వేసి చెడుకు ప్రతీరూపంగా భావిస్తారు. తెల్లవారినుండి ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి నూతన కిరణాలను ఆహ్వానించడానికి పాతవాటిని తొలగించడం అనే భావం వ్యక్తమవుతుంది. ఇంకా ఈరోజు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి భోగిపండ్లు పోస్తారు. దీనికి కూడా శాస్త్రీయమైన కారణమేమీ కనబడటం లేదు. చిన్నపిల్లలు పండుగ సమయాల్లో చాలా అందంగా ఉంటారు. బియ్యం, చెఱకు, రేగిపండ్లు, నువ్వులు, చిల్లరపైసలు, పూలరెక్కలు కలిపి ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలకు దిష్టి తగలకుండా, భోగిపండ్లు పోసి, ఆయురా రోగ్యాలు కలగాలని దీవిస్తూ పాటలు పాడతారు. మంగళహారతి ఇస్తారు.

భోగిపండుగనాడు తప్పనిసరిగా బియ్యం, నువ్వులతో పులగం చేస్తారు. శీతల వాతావరణం ఉండే ఈ సమయంలో వేడిని కలిగించే నువ్వులు, శరీరానికి అవసరమైన ఐరన్‌, అరుగుదలకు నెయ్యి ఆరోగ్య రీత్యా ఇవన్నీ వ్యక్తికి ఎంతో మేలు చేస్తాయి. మన భారతీయ పండుగల సందర్భంగా చేసుకునే పదార్థాల విశేషం ఇదే. ఆయా కాలానికి తగ్గట్టుగా వివిధ వస్తువులతో పదార్థాలు వండడం అనేది శాస్త్రీయ దృక్పథంతో ఏర్పాటు చేసినదే.

భోగిపండుగ తరువాతిరోజు చాలా విశేషమైనది. అదే మకర సంక్రాంతి. ఈరోజు ప్రకృతిపరంగా కాలగమనంలో చాలా ముఖ్యమైన రోజు. సూర్యుడు తన గతిని మార్చుకొని ఉత్తరాయణంలో ప్రవేశించేరోజు. ఈరోజు నుంచి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అందుకే సంక్రాంతి రోజు అనేకరకాల దానధర్మాలు నిర్వర్తించాలని పెద్దలు చెప్తారు. పుష్యమాసం ప్రారంభమై పౌష్యలక్ష్మిరూపంలో పాడిపంటలు ఇంటికి చేరుతాయి. ఆ ధాన్యరాశులకు స్వాగతం పలుకుతూ ఇంటిముందు పెండ చల్లి, జాజుతో అలికి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ఇంకా ముగ్గుల్లో అనేక రకాలు ఉంటాయి. ఆయా దేవతలకు ప్రతిరూపంగా ముగ్గులు వేస్తారు. ఈ మూడురోజుల పండుగకు ప్రతిరూపంగా హరిదాసు, చెరకు, భోగిపండ్లు, భోగిమంటలు, పాలపొంగులు, సూర్యుడు, పతంగులు అన్నీ చిత్రిస్తూ ముగ్గులు వేస్తారు. ప్రకృతి సర్వం ఈ ముగ్గుల్లోనే ప్రతిబింబిస్తుంది. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల కోలాహలాలు, కోడిపందాల హుషారులు చెప్పవలసిన పనే లేదు.

ఆంధ్రప్రాంతంలో సంక్రాంతికి పెళ్ళయిన కొత్తజంటను, అల్లుడిని తీసుకొని వెళ్తారు. అల్లుళ్ళకు సకల మర్యాదలు చేసి కానుకలు ఇస్తారు. సంక్రాంతి అల్లుళ్ళమీద అనేక హాస్యకథలు, కార్టూన్లను మనం చూడవచ్చు. ఈరోజు సూర్యుని ఆరాధన, నదీస్నానాలు విశేషం. అదేవిధంగా పితృదేవతలకు తర్పణాలు సమర్పించడం తమ భవిష్యత్తు తరాల అభ్యున్నతికి దోహద పడుతుందని విశ్వసిస్తారు. తెలంగాణ ప్రాంతంలో దసరా, దీపావళులకు బొమ్మల కొలువులను నిలిపినట్లే ఆంధ్రప్రాంతంలో సంక్రాంతికి బొమ్మల కొలువును తీర్చిదిద్దుతారు. ఆ సమయంలో ముత్తయిదు వలను పిలిచి తాంబూలాదులు సమర్పిస్తారు. తెలంగాణాలోని చాలా ప్రాంతాల్లో పెళ్లయిన 5 సంవత్సరాల వరకు చిన్న కుండలను పెట్టుకొని నోము చేసుకుంటారు. ఇది ఇంట్లో ఎటువంటి అశుభం జరగకూడదనే ఉద్దేశంతో చేసుకునే నోము.

సంక్రాంతి పండుగకు గాలిపటాలు (పతంగులు) ఎగరవేయటం అనాదిగా సంప్రదాయంగా వస్తోంది. సంక్రాంతి పండుగలకు, పతంగులు ఎగరవేయటానికి శాస్త్రీయమైన అంశమేది కనిపించటం లేదు కానీ, సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే సమయంలో ఆ దినకరుని సహస్ర కిరణాలకు స్వాగతం పలుకుతూ ఎంతో ఆత్మవిశ్వాసంతో నింగికి ఎగిసే గాలిపటాలు పిల్లల్లో, పెద్దల్లో ఒక ఉత్సాహాన్ని, పోటీతత్త్వాన్ని నిలుపుతాయి.

మూడురోజుల పండుగలో కనుము పండుగ పూర్తిగా వ్యవసాయాధారితమైంది. ఈరోజు తమ పంటపొలాలు చక్కగా పండటానికి కారణమైన గోమాతలను చాలా శ్రద్ధగా పూజిస్తారు. ఆరోజు గోశాలను, గోవులను చాలా అందంగా అలంకరిస్తారు గోమాతకు పూజ చేయడం భారతీయ సంప్రదాయంలో ఎక్కువగా కనిపిస్తుంది. వ్యవసాయ దారులకు పశువులు ప్రధాన ఆధారం. వాటివల్లనే ప్రతి సంవత్సరం పంట చేతికి వస్తుంది. అందుకు కృతజ్ఞతగా కనుమునాడు గోపూజ, వాటికి పొంగలి వండి నైవేద్యం పెట్టడం అనేది సంప్రదాయంగా మారి నేటికీ కొనసాగుతుంది.

సంక్రాంతి పండుగ అనేక అంశాల సమాహారంగా మనం గుర్తుచేసు కోవచ్చు. మానవ సంబంధాలను బలీయం చేసుకునే క్రమంలో అల్లుళ్లను ఇంటికి పిలవడం, పసిపిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి భోగిపండ్లు పోయడం, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార నియమాలు, కొత్త పంటను ఇంటికి తెచ్చుకొని అందరూ కలిసి పంచుకోవడం, పౌష్యలక్ష్మికి ఆహ్వానం పలుకుతూ ఇంటిముందు రంగురంగుల ముగ్గులు వేయడం, ప్రకృతితో మమేకమై, ప్రకృతికి, మనకు జీవన మిచ్చే పశుజాతికి కృతజ్ఞతగా వాటిని పూజించడం…. ఇట్లా ఎన్నో విశేష అంశాల కలగలుపుగా సంక్రాంతి పండుగను మనం చెప్పుకోవచ్చు.

ఏ పండుగైనా, ఏ ఉత్సవమైనా అందరితో కలిసి జరుపుకోవడం, ఉన్నదాంట్లో ఇతరులకు ఇవ్వడం, ప్రకృతికి, దేవుడికి, సమస్త జీవజాలానికి కృతజ్ఞత చెప్పడం భారతీయ పండుగల్లోని పరమార్థం ఇదే.