సైన్స్‌ రహస్యాలు

-By దోర్బల బాలశేఖరశర్మ 

మానవ శరీర వింతలు

సైన్సు చరిత్ర ఎంత పాతదంటే కాలం పుట్టక ముందు నుంచీ అది వున్నది. సైన్సు లేని చోటు లేదు. కంటికి కనిపించని అతిసూక్ష్మ జీవకణం నుంచి విశ్వాంతరాళంలోని అంచుల వరకు విజ్ఞాన శాస్త్రం వ్యాపించి ఉంది. పరిశోధనలు, ఆవిష్కరణలు ఎప్పటికప్పుడు సరికొత్త రహస్యాలను వెల్లడిస్తూనే వున్నాయి. మనలను ఆశ్చర్యచకితులను చేసే మానవ శరీర వింతలు కొన్ని తెలుసుకొందాం:

అత్యధిక నీటితో ప్రాణగండం

అత్యధికంగా నీళ్లు సేవించడం వల్ల మనిషి ప్రాణం పోగొట్టుకొనే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. మన శరీరాలు సరిగా పని చేయడానికి దేహాన్ని నిరంతరం చల్లబరచుకోవడం తప్పనిసరి. అయితే, మరీ అత్యధికంగా నీళ్లు తాగడం అన్నది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కాగలదు. ముఖ్యంగా నిర్జలీకరణ (dehydrated) కు లోనైన వ్యక్తి అతిగా నీళ్లు తాగరాదు. విద్యుద్విశ్లేష పదార్థాలు (electrolytes) లేకుండా కేవలం నీటినే అపరిమితంగా తీసుకొన్న మనిషి ‘ఇంటాక్సికేషన్‌’ (water intoxication – కిడ్నీలకు అధికంగా నీరు చేరడం), హైపోనేట్రిమియా’ (hyponetremia – సోడియం గాఢత తగ్గడం)ల బారిన పడతాడు. ఫలితంగా అతను చనిపోయే ప్రమాదం ఉంటుంది. నిజానికి కడుపు నిండిన తర్వాత కూడా బలవంతంగా నీరు తాగడం అన్నది శరీర హింస కిందికే వస్తుంది.

80 లక్షల ఉత్పరివర్తనలు 

మానవజాతి పరిణామ క్రమం ఇంకా ఆగకుండా కొనసాగుతూనే ఉన్నది. తోక లేని కోతి వంటి ‘హోమో ఎరెక్టస్‌’ (Homo erectus)గా పిలిచే ప్రాచీన మానవుల నుంచే ప్రస్తుత మానవాళి అవతరించినట్టు మనకు తెలుసు. అయితే, ఇదే తుది దశ కాదు. వ్యాధి ప్రభావితాలైన లోపభూయిష్ట జన్యువులవల్ల ఇప్పటికి సుమారు 80 లక్షల ఉత్పరివర్తనలు (mutations) సంభవించినట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మేరకు మన ‘డిఎన్‌ఎ’ (డియోక్కిరిబోన్యూక్లిక్‌ యాసిడ్‌: deoxyribonucleic acid)  వడపోతకు గురైంది.

నీళ్లలోనూ చెమటలు 

ఈతగాళ్లకు నీళ్ల లోపల కూడా చెమటలు పడుతుంటాయి. ‘ఒంటికి చెమట పట్టడం’ అన్నది మానవ దేహాన్ని చల్లబరిచే సర్వసాధారణ జీవ చర్య. శరీరం తీవ్రస్థాయి శ్రమకు లోనైనప్పుడు లేదా వ్యాయామాలు చేసినప్పుడు, ఇంకా అలాంటి వ్యక్తి నీళ్లలో వున్నప్పటికీ కూడా దేహం స్వేదభరితమవుతుంది. అయితే, ఈతగాళ్లు (స్విమ్మర్స్‌) నీళ్లలోనే ఉంటారు కనుక ఈ విషయం చాలా సందర్భాలలో మన గుర్తింపుకు రాదు.

ఉదజని ప్రాణాంతకమే

స్వచ్చమైన ఉదజని వాయువు (Pure hydrogen) మనిషిని చంపేస్తుంది. ఇదొక ప్రాణాంతక రసాయనం (chemical asphyxiant) గానూ పని చేస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఒకవేళ ప్రాణవాయువు (ఆక్సిజన్‌) లేని గదిలోకి మనిషి వెళితే ఏమవుతుంది? ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ఇలా గది ఉష్ణోగ్రత పూర్తిగా స్వచ్ఛమైన ఉదజని వాయువుతో నిండినప్పుడు మనిషికి మరణం తప్పదన్న మాట.

తొలి జన్యు పరివర్తన 

శాస్త్రవేత్తలు 2017లోనే మొట్టమొదటిసారిగా ఒక మానవ జన్యు ‘పరివర్తన’ (alteration)ను విజయవంతంగా అమలు జరిపారు. ఆ ఏడాది జులై 27న ఆరెగాన్‌ (అమెరికా రాష్ట్రం)కు చెందిన అతిపెద్ద నగరంలోని పోర్ట్‌ లాండ్‌ పరిశోధకులు ‘క్రిఆర్‌’ (CRISPR)గా పిలిచే ఒక సాంకేతికత ద్వారా ఒక మానవ పిండంలోంచి ఓ జన్యువును తొలగించారు. అదే ‘జన్యు ఎడిటింగ్‌ సాంకేతికత’ (CRISPR: Clustered Regularly Interspaced Shot Palindromic Repeats)ను ఉపయోగించి, పిండంలో గుండె సమస్యతో సంబంధం గల ఒక జన్యువును కూడా తొలగించగలిగారు.

సగానికి పైగా సూక్ష్మజీవులే! 

మానవ శరీరంలో సగానికి పైగా సూక్ష్మజీవులే (బ్యాక్టీరియా) నివాసం వుంటున్నాయి. మన దేహంలో సుమారు 43 శాతానికి పైగా జీవకణాలు వుండగా మిగిలినవన్నీ సూక్ష్మ, అతిసూక్ష్మ జీవులు (వైరలు), శిలీంధ్రాలే (ఫంగీన్లు).

రేడియేషను విరుగుడు 

మనిషి ధార్మిక శక్తి (radiation) బారిన పడినప్పుడు వెంటనే అతణ్ణి వివస్త్రను చేయడం వల్ల చాలావరకు ప్రాణాపాయం తప్పుతుందని పరిశోధకులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల సుమారు 80 శాతం అణు ధార్మికత ప్రభావం నుంచి గట్టెక్క వచ్చునని వారంటున్నారు.

మరిన్ని నిజాలు : 

సగటు మనిషి దేహంలో సుమారు 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఎవరికైనా శరీరంలోంచి సుమారు 40 శాతం రక్తం పోయిందంటే, వెంటనే రక్తమార్పిడి (transfusion) చేయాల్సిందే. లేకపోతే, అతని ప్రాణానికే ప్రమాదం. 

  • మొత్తం 206 ఎముకలతో మానవ దేహం నిర్మితమై వుంటుంది. ఆశ్చర్యకరంగా అప్పుడే పుట్టిన (నవజాత) శిశువులకు మాత్రం 300 ఎముకలు పుంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ వీరిలోని కొన్ని ఎముకలు కలిసిపోయి, బాగా దృఢతరం కావడం జరుగుతుంది.
  • మన నోటి పండ్లమీది పైపూత (ఎనామిల్‌) ఎముకలకంటే కూడా దృఢమైంది. మొత్తం మానవ శరీరంలోనే అత్యంత శక్తి (సత్తువ) గల పదార్థం ఇదే మరి.
  • మనిషి కళ్లు మెదడుకు పంపే దృశ్యచిత్రాల సంకేతాల సామర్థ్యం సుమారు 576 మెగా పిక్సెల్‌ (1 పిక్సెల్‌ సాంద్రత 300 డిపిఐ : dots per inch). అయినా, మనం కేవలం 150 డిపిఐ సామర్థ్యం గల వస్తువులనే చూడగలం. కారణం, దృశ్యచిత్ర సంకేతాలకు ఈ మాత్రం శక్తి సరిపోతుందని నిపుణులు అంటున్నారు.