|

సైన్స్‌ రహస్యాలు-6

  • దోర్బల బాలశేఖరశర్మ

అతి పెద్ద తోకచుక్క 

పదేళ్ల కిందట గుర్తించిన భారీ తోకచుక్క మరో తొమ్మిదేళ్లకు (2031 నాటికి) భూమి సమీపానికి రానున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడిరచారు. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన తోకచుక్కలన్నింటిలోకీ ఇదే అతి పెద్దదని కూడా వారు తెలిపారు. ప్రస్తుతం మన సూర్యుని నుండి సుమారు 200 కోట్ల మైళ్ల దూరంలోని ‘సి/2014 యుఎన్‌ 271’ తోకచుక్క భారీ ఎత్తున సుమారు 85 మైళ్ల వెడల్పును కలిగి వున్నట్టు వారు ప్రకటించారు.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ (నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌)కు చెందిన ‘హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌’ అందించిన సమాచారం మేరకు ‘ఇప్పటివరకూ కనుగొన్న అన్ని తోకచుక్కల్లోకి ఇదే అతి పెద్దది’గా శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. ఈ టెలిస్కోప్‌ అందించిన చిత్రాలలో ఆ తోకచుక్క కేంద్రకం (న్యూక్లియస్‌) చాలా స్పష్టంగా దర్శనమివ్వడం విశేషం. ఖగోళ శాస్త్రవేత్తలైన పెట్రో బెర్నార్డినెల్లీ, గ్యారీ బెర్న్‌స్టెను కనుగొన్న కారణంగా ఈ తోకచుక్కను వారి పేర్లతో ‘బెర్నార్డినెల్లీ-బెర్నెస్టెన్‌’ గానూ పిలుస్తున్నారు. సుమారు 500 ట్రిలియన్‌ (1 ట్రిలియన్‌ – 1 లక్ష కోట్లు) టన్నుల బరువైన ఈ తోకచుక్కను ‘మహోన్నత మంచు వస్తువు’ గా వారు అభివర్ణించారు. ఒక సగటు తోకచుక్క అంతర్భాగం (CORE) కన్నా ఇది సుమారు 50 రెట్లు పెద్దది. ఊర్ట్‌ మేఘం (Oort Cloud)లో ఉద్భవించి, ఆ వైపునుంచే వస్తున్నట్టుగా భావిస్తున్న ఈ ‘కామెట్‌’ (తోకచుక్క) వచ్చే దశాబ్దం కల్లా మన సౌర కుటుంబం సమీపం గుండా ప్రయాణిస్తుందని వారు తెలిపారు. గంటకు సుమారు 22,000 మైళ్ల వేగంతో ఇది 2031 నాటికి మన సూర్యునికి కేవలం ఒక లక్ష కోట్ల (1 బిలియన్‌) మైళ్ల దగ్గరకు వస్తుందని వారు పేర్కొన్నారు.

చీలీకి చెందిన ‘టోలోలో ఇంటర్‌ అమెరికన్‌ అబ్జర్వేటరీ’లోని ‘డార్క్‌ ఎనర్జీ సర్వే’ తాలూకు ప్రాచీన భాండాగార చిత్రాల ఆధారంగా పై శాస్త్రవేత్తలు (పెడ్రో బెర్నార్డినెల్లీ, గ్యారీ బెర్న్‌ స్టెన్‌) 2010లో మన సూర్యునికి 300 కోట్ల మైళ్ల దూరంలో పై తోకచుక్కను గుర్తించారు. అంత దూరంలోనూ అత్యంత ప్రకాశవంతంగా వెలుగు లీనుతున్న ఈ తోకచుక్కపై మైనస్‌ 384 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ ఉష్ణోగ్రత వుండటం గమనార్హం. అంతటి చలి వాతావరణం లోనూ ఉపరితలం నుండి కార్బన్‌ మోనాక్సైడ్‌ ను వెదజల్లేంతటి వేడిమిని అది కలిగి ఉందని, తత్ఫలితంగా దాని చుట్టూ దట్టమైన ధూళి-వాయు మేఘాలు అలుముకుంటున్నాయని శాస్త్రవేత్తల బృందం వెల్లడిరచింది. ‘కొన్ని వేల తోకచుక్కల శిఖరాగ్రం వలె మిరుమిట్లు గొలుపుతున్న ఈ భారీ కామెట్‌ను మేం మొదట్నుంచీ చాలా పెద్దదిగానే అనుమానిస్తున్నాం. ఇప్పుడు ఇదే అతిపెద్దదిగా నిర్ధారణైంది’ అని పరిశోధనా పత్రం రచయిత, ‘యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియా’కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త డేవిడ్‌ జెవిట్‌ (David Jevitt) తెలిపారు.

అతి పొడవైన చిన్నజీవి

‘లైనియస్‌ లాంగిస్సిమస్‌’ (Lineus‌ Longissimus‌) గా పిలిచే ఒక రకమైన చిన్న పురుగు (బూట్‌ లేస్‌వార్మ్‌) భూమిమీద ‘అతి పొడవైన జీవి’గా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ పురుగుల్లో కొన్ని  పెద్ద ‘నీలి తిమింగలం’ కన్నా కూడా పొడవైనవి. ఓ సముద్ర తీరంలో లభ్యమైన ఈ జాతికి చెందిన ఒకానొక పురుగు పొడవు ఏకంగా 55 మీటర్లుగా నమోదై రికార్డు సృష్టించింది. ఇంతగా అతి పొడవైన ఈ చిన్న క్రిమి బాగా సన్న తోలును కలిగి ఉంది.

‘ఈ రకమైన చిన్న జీవులు సాధారణంగా 30 మీటర్ల (98.4 అడుగులు) పొడవు మేర పెరుగుతాయని’ 2008లోనే ‘జువాలజిచ్‌ మెడెడెలింజెన్‌’ (Zoologiche Meddelingen‌) జర్నల్‌లో ప్రచురితమైన ఒక పరిశోధనా వ్యాసంలో జీవశాస్త్రవేత్తలు అడ్రియన్‌ గిటెన్‌ బెర్గర్‌, కార్‌ స్కిప్పలు వివరించారు. క్రీ.శ. 1864లో స్కాటిష్‌ సముద్ర తీరంలోకి ఒక భారీ బూట్‌ లేస్‌ వార్మ్‌ మృతదేహం కొట్టుకు రాగా, దాని పొడవు 55 మీటర్లుగా వున్నట్టు తేలింది. అయితే, ఈ రకం చిన్న జీవులు ఇంత భారీ స్థాయి పొడవుకు పెరుగుతాయంటే నమ్మని శాస్త్రవేత్తలు కూడా కొందరు లేకపోలేదు. చనిపోయిన తర్వాత ఈ జీవుల వికృత దేహాలు అంతగా తీవ్రస్థాయికి సాగుతాయని, అందువల్లే భారీ పొడవు నమోదై ఉంటుందని వారు భావిస్తున్నారు. ‘రిబ్బన్‌ వార్మ్స్‌’ లేదా ‘ట్యాప్‌ వార్మ్స్‌’గా పిలిచే ‘నెమె’’ (Nemertea) జంతు కుటుంబ విభాగంలోని సుమారు 1,200 జాతులలో ‘లైనియస్‌ లాంగిస్సిమస్‌’ ఒకటి. వానపాముల కుటుంబానికి భిన్నమైన ఈ జాతి పురుగులకు శరీర భాగాలేమీ ఉండవు. అంతేకాదు, వీటికి గుండె, వెన్నెముక (అకశేరుకాలు) కూడా ఉండవు. ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్ర పరిసరాలలోని బురద, ఇసుక నేలల్లో, ఇంకా రాళ్ల పగుళ్లలో చాలా తరచుగా ఇవి దాగి ఉంటాయి. ‘ప్రొబోసిస్‌’ (Proboscis‌)గా పిలిచే ట్యూబు వంటి నోరుతో కూడిన దేహ నిర్మాణం దీనిది. చిన్న ఎండ్రికాయలు (పీతలు), నత్తలతోపాటు సముద్రగర్భంలోని జంతు మృతదేహాలను తిని ఇవి బతుకుతాయి.