స్వరాష్ట్రంలో…స్వయం సమృద్ధంగా తెలంగాణ పల్లెలు

By: మార్గం లక్ష్మీనారాయణ

అవమానాల నుంచి అభిమానం తన్నుకొచ్చినట్లు.. ఆత్మ బలిదానాల నుంచి ఆత్మాభిమానం పొంగుకొచ్చినట్లు.. విధ్వంసాల నుంచి విప్లవాలు విస్ఫోటనం చెందినట్లు.. అణచివేతల నుంచి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసినట్లు….. స్వపరిపాలన కాంక్ష ప్రజల నిత్య ఆరాటమై, తెలంగాణ పోరాటమై, కెసిఆర్‌ నేతృత్వంలో స్వరాష్ట్రం దేశంలో 29వ రాష్ట్రంగా  సాకారమైంది. ఉద్యమ నేత కెసిఆర్‌ సిఎం అయ్యారు. ఆతర్వాత కుట్రలు, కుతంత్రాలను అదిగమిస్తూ, తెచ్చుకున్న తెలంగాణ తెర్లు కాకుండా, తెలివిడితో బంగారు తెలంగాణ బాటలో పరిపాలన సాగుతున్నది. 

కానీ అప్పటికే విధ్వంసమైన వ్యవస్థలను తిరిగి నిర్మించడమనేది చాలా కష్టమైన పని. అంతకంటే కొత్త వ్యవస్థను నిర్మించడమే సులువు. 60 ఏండ్ల వలస పాలన సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. విభజన సమస్యలు, అధికారుల కొరత, విభజన ఆలస్యం మొదలు… అనేకానేక ఉమ్మడి రాష్ట్ర పాలన కష్టాలను అధిగమించి దేశం గర్వించే స్థాయిలో, ఆరున్నరేండ్ల తెలంగాణను తలెత్తుకుని నిలబెట్టిన ఘనత మన సిఎం కెసిఆర్‌ కే దక్కుతుంది.

మనది గ్రామీణ భారతం

2011 జనాభా లెక్కల ప్రకారం, 69% భారతీయులు 6,40,867 గ్రామాలలో నివసిస్తున్నారు. తెలంగాణ జనాభాలో 61.12% ప్రజలు గ్రామాల్లో, 38.88% ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మారుతున్న కాలానుగతంగా పట్టణ ప్రాంతాలు పెరుగుతున్నందున, గ్రామీణ జనాభా తగ్గుతున్నది. మొత్తంగా ఇప్పటికీ మనది గ్రామీణ భారతమే.

అందుకే మహాత్మాగాంధీ, ‘‘భారతదేశం ఆత్మ దాని గ్రామాలలో నివసిస్తుంది’’  అన్నారు. గ్రామాల అభివృద్ధితోనే దేశ పురోగతి ఉంటుందన్నారు. దేశ ప్రణాళికలు కూడా గ్రామాలు లక్ష్యంగా సాగాలని కోరుకున్నారు. స్వాతంత్య్రానంతరం పాలకులు ఈ విషయాన్ని విస్మరించారు. స్వాతంత్య్రం తెచ్చిన వారసులమని చెప్పుకున్న పార్టీలు, ప్రభుత్వాలు కానీ, మత తత్వ పార్టీలు ప్రభుత్వాలు కానీ, గ్రామాలను గాలికి వదిలేశారు. రాష్ట్రానికి స్వాతంత్య్రం తెచ్చిన తెలంగాణ గాంధీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మాత్రం దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిన గాంధీజీ కలలను నిజం చేశారు. గ్రామాల బాగు కోసం నిరంతరం పరిశ్రమించారు. గ్రామాల రూపురేఖలను సమగ్రంగా మార్చేశారు. ఇవ్వాళ గ్రామాలు పూర్వ వైభవాన్ని, ఆధునిక వైభోగాన్ని సంతరించుకుంటున్నాయంటే నూటిని నూరు శాతం అది కెసిఆర్‌ కృషే.

గ్రామ పంచాయతీలు చిన్నసైజు ప్రభుత్వాలే. ఒక్కో గ్రామ పంచాయతీ దేశం, రాష్ట్రంలాగే ఒక స్వపరిపాలన భూభాగం. ఒకప్పుడు మన గ్రామాలు స్వయం సమృద్ధంగా ఉండేవి. అన్ని వృత్తుల, పనుల వాళ్ళుండటంతో గ్రామాల అవసరాలన్నీ ఆ గ్రామంలోనే తీరేవి. మన పూర్వ పాలకుల అపరిపక్వ ఆలోచనలు, విజన్‌ లేకపోవడం వల్ల గ్రామీణ వ్యవస్థ అవస్థల పాలైంది. కనిపించని కుట్రల, పల్లె కన్నీరు పెట్టింది. వృత్తులు కూలి, ఉపాధి పోయి, ఉసూరుమంది. నీళ్లు లేక, నిధులు లేక గ్రామాలు ఎన్నో అవస్థలు పడ్డాయి. ఒక గ్రామ సర్పంచ్‌ పదవీ కాలం మొత్తం ఆ గ్రామానికి నీటిని అందించడానికి కూడా సరిపోయేది కాదు. పారిశుద్ధ్యం అనేది ఓ కలల ఉండేది.

సరిగ్గా ఈ సమయంలోనే తెలంగాణ రావడం, కెసిఆర్‌ సిఎం కావడం, కెసిఆర్‌ తన మేధోమథనంతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రపంచమే అబ్బుర పడే లాగా వాల్డ్‌ మల్టీ స్టేజ్‌ ప్రాజెక్టు కాలేశ్వరంని అతి తక్కువ రికార్డు సమయంలో పూర్తి చేశారు. వృత్తులకు ఊతంగా చేనేతకు చేయూత, చెరువుల్లో చేపలు, బర్లు, గొర్లు, నాయీ బ్రాహ్మణులు, చాకలి వాళ్ళకు ప్రోత్సాహకాలు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, రైతులకు సబ్సిడీలు, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తూ, గ్రామాల చెరువులను కూడా నీటితో నింపుతూ గ్రామాల కన్నీటిని కడిగేశారు.

ఇప్పుడు మన గ్రామాలు దేశానికే పట్టుగొమ్మలుగా మారాయి. గ్రామీణ పేదరిక నిర్మూలనతో, గ్రామాల అభివృద్ధి ఒక అసిధారా వ్రతంలా సాగుతున్నది. గ్రామాల ప్రగతి వేదికగా పల్లె ప్రగతి నిలిచింది. ఒకప్పుడు వరంగల్‌ జిల్లా గంగదేవి పల్లె దేశానికి ఆదర్శంగా ఉండేది. దేశ, విదేశాల నుండి సందర్శకులు వచ్చి ఆ గ్రామాన్ని చూసి పోయేవారు. ఇప్పుడు పల్లె ప్రగతితో ప్రతి పల్లె ఆదర్శంగా మారింది.

సమగ్ర గ్రామీణ విధానం

తెలంగాణ గ్రామాలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే సమగ్ర గ్రామీణ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. పల్లెల్లో పచ్చదనం – పరిశుభ్రత వెల్లివిరిసేలా, ప్రణాళికా బద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నది. దీంతో తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రమే మారిపోయింది.

 గ్రామాల వికాసానికి ప్రభుత్వం, మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జీవన భద్రత కల్పించడానికి చర్యలు తీసుకున్నది. నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించడం, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, చేతి వృత్తులు- కుల వృత్తులకు చేయూతనివ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసింది. రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌, రుణమాఫీ లాంటి రైతు సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్ల లాంటి ప్రజా సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు భవిష్యత్‌ పై ఆశావహ దృక్పథాన్ని కల్పించింది. మిషన్‌ భగీరథ, 24 గంటల కరెంటు సరఫరా, రహదారుల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లాంటి మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రభుత్వం గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేసింది.

 పంచాయతీ రాజ్‌ వ్యవస్థ బలోపేతం

తెలంగాణ గ్రామీణ వికాసానికి ప్రభుత్వం సంస్కరణలు అమలు చేసింది. పంచాయతీ రాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఆ శాఖ స్వరూపాన్నే సమగ్రంగా మార్చేసింది. తెలంగాణకు ముందు 8 వేల 690 గ్రామ పంచాయతీలుంటే, వాటి సంఖ్యను 12 వేల 769 కు పెంచింది. మా తండాలు, మా గూడాల్లో మా రాజ్యం నినాదాన్ని నిజం చేస్తూ, 3,146 ఆదివాసీలు, గిరిజనుల గూడాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. దీంతో ఆదివాసీ గిరిజనుల్లో రాజకీయ చైతన్యం పెరిగి, పదవులు, స్వయం పరిపాలనా అవకాశం కలిగింది. గతంలో కేవలం 9 మంది మాత్రమే జిల్లా పంచాయతీ అధికారులు(డిపిఓలు) ఉంటే,  ఆ సంఖ్యను 32కు, డి.ఎల్‌.పి.వో.ల సంఖ్యను 28 నుంచి 68 కి, మండల పంచాయతీ అధికారుల సంఖ్యను 438 నుంచి 539 కి ప్రభుత్వం పెంచింది. గతంలో కేవలం 3,396 మంది గ్రామ కార్యదర్శులు మాత్రమే ఉంటే, ప్రతీ గ్రామానికి ఖచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి ఉండే విధంగా ఒకేసారి 9,355 మందిని నియమించింది.  గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాన్ని 8 వేల 500 రూపాయలకు పెంచింది. రెగ్యులర్‌ పంచాయతీ కార్యదర్శుల జీతాలకు సమానంగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల వేతనాలను 15 వేల నుండి 28 వేల 710 రూపాయలకు పెంచింది. పీఆర్సీ కి అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచింది.

కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం

గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్రను ప్రభుత్వం క్రియాశీలం చేసింది. అధికారులు, ప్రజా ప్రతినిధుల బాధ్యతలు, కర్తవ్యాలను పేర్కొంటూ కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం తెచ్చింది. ప్రజా భాగస్వామ్యాన్ని పెంచుతూ, గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరియాలని, ప్రతీ పల్లె పరిశుభ్రంగా ఉండాలని నిర్దేశించింది. గ్రామాల అభివృద్ధికి వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించుకునే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలకు చట్టంలో కఠిన నిబంధనలు  పెట్టి, పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచింది.

పల్లెల ప్రగతికి ప్రజా సైన్యం

ప్రభుత్వం సమగ్ర గ్రామీణాభివృద్ధి విధానం అమలు కోసం పల్లెల ప్రగతికి ప్రజా సైన్యాన్ని ఏర్పాటు చేసింది. పల్లె ప్రగతి కింద దేశంలోనే తొలిసారిగా 12 వేల 751 గ్రామాలలో స్టాండింగ్‌ కమిటీలలో ప్రజలను భాగస్వాములను చేసింది. వర్స్క్‌ కమిటీ, శానిటేషన్‌ కమిటీ, స్ట్రీట్‌ లైట్‌ కమిటీ, గ్రీన్‌ కవర్‌ కమిటీ ఇలా ఒక్కో గ్రామంలో 4 కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ కమిటీల్లో 8 లక్షల 20 వేల 727 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు.  వీరిలో 4 లక్షల 3 వేల 758 మంది మహిళలు కూడా సభ్యులుగా ఉన్నారు.

నిధులు

దేశంలో ఎక్కడలేని విధంగా కేంద్ర 15 వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర నిధులను జమచేసి పంచాయతీలకు విడుదల చేస్తున్నది. గ్రామ పంచాయతీలకు 85%, మండల పరిషత్‌ లకు 10%, జిల్లా పరిషత్‌ లకు 5% నిధులను ప్రభుత్వం అందచేస్తున్నది. 100, 200 జనాభా కలిగిన చిన్న గ్రామపంచాయతీలకు కూడా కనీసం రూ.5 లక్షలు నిధులు అందుతున్నాయి. ఈ విధంగా కొత్తగూడెం జిల్లాలోని ఆల్లపల్లి గ్రామ జనాభా 106, అడవిరామారం జనాభా 10, జగిత్యాల జిల్లా కైరి గూడెం గ్రామ జనాభా 145 ఈ గ్రామాలకు కూడా నిధులు అందే విధంగా సీఎం కెసిఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు

గ్రామ పంచాయతీలకు కనీస మౌలిక సదుపాయల కల్పన ప్రభుత్వం బాధత్యగా తీసుకుంది. తెలంగాణ వచ్చేనాటికి కేవలం 87 ట్రాక్టర్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు 12,769 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు సమకూర్చింది.

ఆదాయ వనరుగా ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు

పైగా ఆదాయ వనరుగా ఈ ట్రాక్టర్లు గ్రామ పంచాయతీలకు ఉపయోగపడుతున్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లారెడ్డిపేటలో గ్రామపంచాయతీ ట్రాక్టర్‌, హరితహారం చెట్లకు నీళ్లు పోసి రూ.6 లక్షలు సంపాదిస్తున్నది. ఈ విధంగా కొన్ని గ్రామపంచాయతీలు రూ. 464 కోట్లు సంపాదించుకున్నాయి.

స్మశానవాటికలు

గతంలో ఎవరైనా మరణిస్తే… ఆ కుటుంబంలో బతికున్నోళ్లకు చచ్చేంత చావయ్యేది. పేదవాడికి అంత్యక్రియలు ఎక్కడ చేయాలో తెలియని అయోమయం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ప్రతి గ్రామానికి ఒక స్మశాన వాటిక ఏర్పడింది.

డంపింగ్‌ యార్డులు

గతంలో గ్రామాలు చెత్త చెత్తగా, వానలు పడితే చిత్తడి చిత్తడిగా ఉండేవి. చెత్తను తొలగించడమే కాదు, ఎక్కడ వేయాలనేది కూడా ఓ పెద్ద సమస్య. చెత్త తొలగింపు, విసర్జనకు ఓ పద్ధతి అంటూ ఉండేది కాదు. ఇప్పుడు ప్రతిగ్రామంలో డంపింగ్‌ యార్డులు, శాస్త్రీయంగా చెత్తను వేరు చేసే షెడ్లు ఏర్పాటయ్యాయి. పైగా ఈ చెత్తతో 12 వేల 678 డంపింగ్‌ యార్డులలో కంపోస్టు ఎరువు తయారవుతున్నది. తద్వారా గ్రామంలో పచ్చదనం పెంచడానికి నాటిన మొక్కలకు ఆ ఎరువుని ఉపయోగిస్తున్నారు. మిగిలిన ఎరువులను అమ్మి.. గ్రామ పంచాయతీలు ఆదాయం పొందుతున్నాయి.

 నర్సరీలు

ఉమ్మడి రాష్ట్రంలో నర్సరీ ఎక్కడో జిల్లాకు ఒకటి, రెండో ఫారెస్టు డిపార్టుమెంట్‌ పరిధిలో ఉండేవి. మొక్కల కోసం పక్క రాష్ట్రాలపై ఆధారపడే దుస్థితి ఉండేది. తెలంగాణ వచ్చాక చరిత్రలో నిలిచిపోయే విధంగా సిఎం కెసిఆర్‌ గారు హరిత హారం కార్యక్రమం తెచ్చారు. పచ్చదనాన్ని పెంచడం కోసం ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేశారు.

గ్రీన్‌ బడ్జెట్‌

గ్రామ బడ్జెట్లో 10% గ్రీన్‌ బడ్జెట్‌ నిధులు పచ్చదనానికి కేటాయించారు. 2020-21 సంవత్సరంలో 369 కోట్ల రూపాయలు గ్రీన్‌ బడ్జెట్‌  ఏర్పడిరది. దీంతో తెలంగాణలో 7.7 శాతం ‘‘గ్రీన్‌ కవరేజ్‌’’ పెరిగిందనీ కేంద్ర ప్రభుత్వ అటవీశాఖ ప్రకటించడం ఈ పథక విజయానికి నిదర్శనం.

హరిత హారం

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రయత్నంగా మన హరితహారం గుర్తింపు పొందింది. ఇప్పటికే ఎవరూ సాహసించని.. ఊహించని విధంగా 230 కోట్ల మొక్కలు నాటి, 95 శాతం మొక్కలను బ్రతికించుకున్నచరిత తెలంగాణది. రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్నపుడు పచ్చదనం మొదలయితే.. తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్‌ అయినట్లు, పచ్చదనం లేదంటే… తెలంగాణ సరిహద్దు దాటినట్టు.

పల్లె ప్రకృతి వనాలు

గ్రామాల్లో ఆహ్లదకరమైన వాతావరణం, పిల్లలకు ఆటస్థలం, పెద్దలకు నడక స్థలం సమకూర్చిన ఘతన తెలంగాణ ప్రభుత్వానిదే. ప్రతి గ్రామంలో ఎకరాకు తగ్గకుండా అంతకుమించి స్థలాలలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. పల్లె ప్రకృతి వనాలలో ఒపెన్‌ జిమ్ములు, వాకింగ్‌ ట్రాకులు, పిల్లల కొరకు ఆటస్థలాలు, పెద్దలు సేద తీరడానికి వీలుగా ఏర్పాట్లు జరిగాయి.

బృహత్‌ ప్రకృతి వనాలు

రాష్ట్రంలోని 545 మండలాల్లో 10 ఎకరాలకు తగ్గకుండ… 2 వేల 725 బృహత్‌ ప్రకృతి వనాలు నిర్మిస్తున్నారు. మల్టీ లేయర్‌ అవెన్యు ప్లాంటేషన్‌ ప్రతి జిల్లాలో 250 కిలో మీటర్లు అవెన్యు ప్లాంటేషన్‌ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదింది.

రైతు వేదికలు

రైతుల సమగ్ర అభివృద్ధికి వేదికలుగా 2,601 రైతు వేదికలు నిర్మించారు. రైతులు ఏ సీజన్‌ లో, ఏయే భూముల్లో ఏ పంటలు వేయాలి? విత్తనాలు, ఎరువులు, సస్య రక్షణ చర్యలు ఏంటి? రైతులు పండించిన పంటలకు డిమాండ్‌ ఎక్కడ? ఎలా ఉంది? వంటి విషయాలను రైతులే ఒకచోట కూర్చుని చర్చించుకునే విధంగా ఏర్పాటైన రైతు వేదికలు ఇప్పుడు రైతుల శిక్షణా కేంద్రాలుగా మారుతున్నాయి.

రైతు కల్లాలు

తెలంగాణ భూ కమతాలు చాలా చిన్నవి. తక్కువ భూముల్లో పంటలు వేయడం, పండటమే గగనం. అలాంటిది పండిన పంటను ఆరబెట్టుకోవడం ఓ సవాల్‌. రోడ్డుమీదే ధాన్యం ఆరోబయటం, మహిళలు, పిల్లలు రోజంతా రోడ్లమీదే ఉండటం జరిగేది. అలాంటి రైతుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. రైతులు తమ సొంత వ్యవసాయ భూముల్లో రైతు కల్లాలు కట్టుకునే విధంగా నిధులు ఇచ్చింది.

అవార్డులు – ప్రశంసలు

దేశంలో 20 ఉత్తమ గ్రామాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, అందులో 19 గ్రామాలు తెలంగాణవే. మరో పది ఆదర్శ గ్రామాలను ఎంపిక చేయగా, 10కి పది తెలంగాన గ్రామాలే. పార్లమెంటు సభ్యులు దత్తత తీసుకున్న గ్రామాల్లోనూ మనమే నెంబర్‌ వన్‌. పారిశుద్ధ్యంలో, ఓడిఎఫ్‌లో, ఈ పంచాయతీలో, ఆడిటింగ్‌ లో నెంబర్‌ వన్‌. మొత్తంగా దేశంలో గ్రామీణాభివృద్ధిలో నెంబర్‌ వన్‌ గా తెలంగాణ ఉంది.

కేంద్రం వివక్ష చూపుతున్నా…

15 వ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చే గ్రాంటును కేంద్ర ప్రభుత్వం 25 శాతం (482 కోట్లు) తగ్గించింది. రాష్ట్ర ప్రగతిని చూసి ప్రోత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులను తగ్గిస్తూ అన్యాయం చేస్తున్నది. గ్రామీణాభివృద్ధిలో నెంబర్‌ వన్‌ గా ఉన్న తెలంగాణ రాష్ట్ర గ్రామాలకు ఇది ఆశనిపాతం. అయినా సీఎం కెసిఆర్‌, వీటన్నింటికి భిన్నంగా… దీటుగా తెలంగాణ పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారు.

నిరంతర కార్యక్రమం-పెరిగిన ప్రజల జీవన ప్రమాణం

2019 సెప్టెంబర్‌ 6న మొదలైన సమగ్ర గ్రామీణాభివృద్ధి ప్రణాళికా కార్యక్రమం పల్లె ప్రగతి ఇప్పటి వరకు 4 విడతలుగా జరిగింది. 5వ విడత నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, తమ గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచుకుంటున్నారు. ఊర్లను అద్దంలా తీర్చిదిద్దుకునేందుకు పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. వీధులు, డ్రైనేజీలు శుభ్రం చేసుకుంటున్నారు. పాడుబడిన ఇండ్ల శిథిలాలు తొలగించుకుంటున్నారు. పిచ్చిమొక్కలు, పొదలు, సర్కారు తుమ్మలను తొలగించుకుంటున్నారు. మెరుగైన జీవన పరిస్థితులు, పరిశుభ్రమైన మంచినీరు, పారిశుద్ధ్యం.. ప్రజల ఆయువు, ఆరోగ్యం, జీవన ప్రమాణ పెరుగుదలకు సూచీలు. ఇవ్వాళ తెలంగాణలో ఇవన్నీ అత్యున్నత స్థాయిల్లో ఉన్నాయి. ఈ విజయాలతో ప్రకృతిని సైతం శాసించి, ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాని ధైర్యంగా ఎదిరించే శక్తిని ప్రజలు పొందారు. కరోనా కష్టాల తర్వాత, పల్లెల్లో ప్రగతిని చసి, ప్రజలు గ్రామాలకు వాపస్‌ పోతున్నారు. ఇది తెలంగాణ గ్రామాల గణనీయ, గుణాత్మక సమగ్ర అభివృద్ధి. సిఎం కెసిఆర్‌ సారథ్యంలో తెలంగాణ సాధించిన ప్రగతి.

-మార్గం లక్ష్మీనారాయణ