ప్రత్యేక తెలంగాణ వల్లనే సమస్యల పరిష్కారం సాధ్యం

తెలంగాణ రాష్ట్రం కోరుతున్న ప్రజల ఆకాంక్షలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ సంఘాన్ని బలోపేతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ తెలంగాణ ఎన్‌.జీ.ఓల సంఘం పత్రికలకు ఒక ప్రకటనను జారీ చేసింది.

తెలంగాణ ఎన్‌.జి.ఓ.ల సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి సెప్టెంబర్‌ 7న ప్రకటన చేస్తూ ”తెలంగాణ ఉద్యోగుల కోర్కెలను తీర్చడం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఇస్తున్న హామీలను నెరవేర్చడానికి ఎలాంటి నిర్ధిష్టమైన, సమర్ధవంతమైన చర్యలు వేటినీ తీసుకోవడం జరగలేద”ని అన్నారు.

కొంత మంది పార్లమెంట్‌ సభ్యులు ఇటీవల ప్రధానికి అందజేసిన వినతి పత్రం గురించి ఆయన ప్రస్తావిస్తూ ”రాజకీయ బేరసారాల సందర్భంలో విద్యారంగం సహా తెలంగాణా ప్రాంతాలలో అన్నిరకాల అభివృద్ధి సాధనకు కొన్ని చర్యలు సూచించడానికి వారు ప్రత్నించార”ని ప్రకటనలో పేర్కొన్నారు. ”అయితే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు మూలంగా ఉత్పన్నమైన తెలంగాణ ఉద్యోగుల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంద”ని అన్నారు.

“తెలంగాణ ఉద్యోగులలో నిరాశా నిస్పృహలు అలాగే ఉండిపోయాయి. ప్రత్యేక తెలంగాణలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాగలవన్న నమ్మకంతో ఉన్నామ”ని రామకృష్ణా రెడ్డి స్పష్టం చేసారు.

ప్రత్యేక రాష్ట్రం తప్ప మరే పరిష్కారం సంతృప్తి నివ్వదు : చెన్నారెడ్డి

తెలంగాణ ప్రజాసమితి సభ్యత్వాన్ని పెంచే కార్యక్రమాల్లో భాగంగా డా|| చెన్నారెడ్డి బేగంబజార్‌లో 7వ తేదీ రాత్రి జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యామ్నాయంగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను విమర్శిస్తూ ”దాదాపు 20మంది ఆంధ్ర ఎంపిలు ప్రాంతీయ కమిటీకి చట్టబద్దమైన అధికారాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించార”న్నారు.

“ప్రత్యేక తెలంగాణ తప్పించి మరే పరిష్కారం తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచలేద”ని అన్నారు.

సెప్టెంబర్‌ 23న విద్యార్థుల సమ్మె : మల్లికార్జున్‌

రాష్ట్రంలో దాదాపు సంవత్సరం నుండి సాధారణ పరిస్థితులు ఏర్పడి ఉన్నప్పటికీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ సమ్మతించనందుకు నిరసనగా సెప్టెంబర్‌ 23న సమ్మె చేయాలని విద్యార్థి సంఘ నేతలు నిర్ణయించారు. మల్లికార్జున్‌తో సహా ముఖ్యనాయకులు హాజరైన సమావేశంలో ”తెలంగాణ విద్యార్థుల కేంద్ర కార్యాచరణ సంఘం” పేరును ”తెలంగాణ విద్యార్థి ఫ్రంట్‌”గా మార్చాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఫ్రంట్‌ నియమావళిని కూడా అమోదించారు. కొత్తగా ఏర్పడిన ఫ్రంట్‌కు మల్లికార్జున్‌ను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 20 మంది కార్యవర్గ సభ్యులను అధ్యక్షుడే నామినేట్‌ చేస్తారు.

విద్యార్థుల ‘నిరవధిక’ సమ్మె ఉండదు : చెన్నారెడ్డి

తెలంగాణ ఉద్యమ భవిష్యత్‌ స్వరూపంపై డా. చెన్నారెడ్డి స్పష్టతనిస్తూ విలేకర్ల సమావేశం 13న నిర్వహించారు.

‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికై తెలంగాణా ప్రజా సమితి ప్రారంభించే ఈ సారి ఆందోళన ఘట్టంలో విద్యార్థులు నిరవధికంగా సమ్మే చేసే కార్యక్రమం ఏదీ తలపెట్టలేద’ని అన్నారు.

”1972 జనరల్‌ ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించడం, రాష్ట్ర అసెంబ్లీలో ‘ప్రతిష్టంభన’ తేవడానికి వీలుగా వీలయినన్ని ఎక్కువ స్థానాలను తెలంగాణ ప్రజాసమితి సంపాదించడం… ఇవే ఈ సారి ఉద్యమ ఘట్టంలో తెలంగాణ ప్రజాసమితి లక్ష్యాల”ని డా|| చెన్నారెడ్డి వివరించారు. ”సందర్భాను సారంగా లాంఛన ప్రాయమగు సమ్మెలు మొదలయినవి తప్పక ఉండగలవ”ని అన్నారు.

23న తెలంగాణ బంద్‌కు ప్రజా పరిషత్తు పిలుపు

‘తెలంగాణ విద్యార్థి ఫ్రంట్‌’ 23న ఒక్కరోజు విద్యార్థుల సమ్మెకు పిలుపునివ్వగా ఇటీవలే టిపిఎస్‌ నుండి విడిపోయిన కొందరు ఏర్పాటు చేసిన ప్రజా పరిషత్తు ఏకంగా ‘తెలంగాణ బంద్‌’కే పిలుపు నిచ్చింది.

తెలంగాణ ప్రజా పరిషత్తు సుప్రీం కౌన్సిల్‌ సభ్యులు సక్సేనా, జగన్మోహన రెడ్డి, రఘువీర్‌ రావులు విలేకర్లతో మాట్లాడుతూ… ”ప్రజా సమితిలోని కాంగ్రెస్‌ సభ్యులు అధికార కాంగ్రెస్‌ బడిలో చేరారు. సమితి నాయకత్వం ప్రత్యేక తెలంగాణా ఆందోళనను రాను రాను మందగింపచేస్తూ ప్రజలకు ద్రోహం చేసింద”ని అన్నారు.

“ప్రత్యేక తెలంగాణా లక్ష్యానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉండే వారందరికీ ప్రజా పరిషత్తు ఒక ఫ్రంట్‌గా ఉండగలద”ని అన్నారు. “తెలంగాణలో పరిపాలనను స్తంభింపజేసి ప్రత్యేక తెలంగాణ కోసం ఆంధ్ర జనాభా కూడా పోరాడేటట్లు చేయడం పరిషత్తు లక్ష్యం” అని వివరించారు.

ఈ’బంద్‌’ పిలుపును మల్లికార్జున్‌తో సహా ఉద్యమకారులెవ్వరూ సమర్ధించలేదు.

ఆందోళన పునరుద్ధరణను వ్యతిరేకించిన శ్రీధర్‌ రెడ్డి :

సెప్టెంబర్‌ 23 నుండి తిరిగి తెలంగాణా పోరాటాన్ని ప్రారంభించాలని మల్లికార్జున్‌ చేసిన ప్రతిపాదనను చీలిపోయిన తెలంగాణ ప్రజాసమితి మాజీ అధ్యక్షుడు, విద్యార్ధి నాయకుడు శ్రీధర్‌ రెడ్డి సెప్టెంబర్‌ 20న వ్యతిరేకించారు. ”తెలంగాణా ఆందోళనను తిరిగి సాగించాలన్న ప్రతిపాదన బాధాకరమగు దిగ్భ్రాంతిని, విస్మయాన్ని కలిగించినద”ని ఆయన అన్నారు. ”వీధుల్లో ఆందోళన చేసే రోజులు గతించినవి కనుక ఈ ఆందోళనలకు సిద్ధం కావద్ద”ని విద్యార్థులకు శ్రీధర్‌ రెడ్డి సలహా ఇచ్చారు.

“అమాయకులగు విద్యార్థులను బలిచేసే దానికి బదులు ఈ ఉద్యమానికి రాజకీయమైన ఒక మలుపు ఇవ్వవలసిన అవసరం ఉన్నద”ని ఆయన అన్నారు.

“ఇలాంటి పిలుపు వల్ల విద్యార్థులు వక్రమార్గం పట్టి ప్రాణాలు కోల్పోయారు. ఏడాది చదువు పాడు చేసుకున్నారు. అది ఇప్పటికీ వారి మనస్సుల్లో జ్ఞాపకం వున్నద”ని, లక్ష్యసాధనకు 1972 వరకు వేచి ఉండాలని శ్రీధర్‌రెడ్డి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల సమ్మెకు ప్రజాసమితి ఆమోదం

సెప్టెంబర్‌ 23న ఒక్కరోజు విద్యార్థుల సమ్మెకు విద్యార్థి ఫ్రంట్‌ ఇచ్చిన పిలుపునకు ప్రజాసమితి ఆమోదం తెలిపింది. బంద్‌కు పిలుపునివ్వనందుకు తెలంగాణా ప్రజాసమితి ప్రధాన కార్యదర్శి విద్యార్థి ఫ్రంట్‌ నేతలను అభినందించారు. ”విద్యార్థులు వాణిజ్య వర్గానికి అసౌకర్యం కలిగించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించార”ని అన్నారు.

23న సమ్మె సక్సెస్‌ – బంద్‌ పాక్షికం

తెలంగాణ విద్యార్థి ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మెలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలోని పలు పట్టణాలలో, జంటనగరాలల్లో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్రం కోర్కెను కేంద్రం అంగీకరించనందుకు, తెలంగాణా ఆందోళన వల్ల నష్టపోయిన విద్యా సంవత్సరాన్ని ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ కాపాడలేకపోయినందుకు, ఎస్‌.ఎస్‌.సి. పరీక్షా ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం 16 శాతానికి తగ్గించినందుకు, మున్సిపల్‌ ఎన్నికలు జరపనందుకు నిరసనగా సెప్టెంబర్‌ 23న విద్యార్థులు నిరసన దినాన్ని పాటించారు. ఎస్‌. గోపాల్‌ తదితరులు వివిధ నిరసన సభల్లో ప్రసంగించారు.

ప్రజాపరిషత్తు ‘సుప్రీం కౌన్సిల్‌’ విద్యార్థులకు నైతిక మద్దతునివ్వడానికి తలపెట్టిన ‘బంద్‌’ ఒక్క నిజామాబాద్‌లో మాత్రమే అమలైంది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసారు.

ప్రభుత్వ అలక్ష్యం ఫలితంగా వీధిన పడ్డ విద్యార్థులు

మెట్రిక్‌, హెచ్‌ఎస్‌.సి, పియుసి పరీక్షలలో ఉత్తీర్ణుల యిన వేలాది విద్యార్థుల విద్యాభ్యాసం విషయంలో ఉస్మా నియా యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా అలక్ష్య వైఖరిని అవలభిస్తున్నాయని వివిధ కళాశాలల విద్యార్థి సంఘాల కార్యవర్గ సభ్యులు విమర్శించారు. వీరు సెప్టెం బర్‌ 25న హైదరాబాద్‌లో సమావేశమైనారు. ఈ సమా వేశానికి న్యూసైన్స్‌ కళాశాల అధ్యక్షుడు, యూనివర్సిటీ సాయంకళాశాలల ప్రెసిడెంట్‌ అయిన యాదవరెడ్డి అధ్యక్షత వహించారు.

సమావేశం ఆమోదించిన తీర్మానం :

“క్రిందటి నెలలో వివిధ పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వేలాది విద్యార్థులు సమీప భవిష్యత్తులో ఏ కళాశాల లోనూ చేరే ఆశలేక వీధుల్లో తిరుగుతున్నారు. ఏ కాలేజీలో చేరడానికి తగు ఏర్పాట్లు యూనివర్సిటీ చేయనందున సుమారు 20వేల మంది హెచ్‌.ఎస్‌.సి. విద్యార్థులు తమ దురదృష్టాన్ని తలచుకుని దుఃఖిస్తున్నారు. పి.యు.సి. విద్యార్థుల గతి కూడా అలాగే ఉన్నద”ని తీర్మానంలో పేర్కొన్నారు.

ఆందోళన కారణంగా తెలంగాణా విద్యార్థులు ఇప్పటికే ఒక సంవత్సరం చదువు పోగొట్టుకున్నారని, ఇప్పుడు రెండో సంవత్సరం చదువు కూడా పాడైపోతున్నదని’ ఏ పరిణామాలు సంభవించినా ప్రభుత్వం, యూనివర్సిటీలదే బాధ్యత అని యాదవరెడ్డి అన్నారు.

మిర్యాలగూడెం విద్యార్థి ఫ్రంట్‌ రద్దు :

ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన విద్యార్థుల్లో నైరాశ్యం ఆవరించిందని తెలిపే నిర్ణయాన్ని మిర్యాలగూడ విద్యార్థి నేతలు తీసుకున్నారు. ఆంధ్ర పోలీసుల వత్తిడి కూడా వారిపై ఉండవచ్చు.

మిర్యాలగూడెం తెలంగాణ విద్యార్థి ఫ్రంట్‌ కన్వీనర్‌ కె. జనార్ధన్‌, అధ్యక్షుడు ఇ. చంద్రయ్య సంయుక్తంగా ఒక ప్రకటన చేస్తూ తాము నాయకత్వం వహిస్తున్న మిర్యాలగూడ విద్యార్థి ఫ్రంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు (అక్టోబర్‌ 3).

“15 మాసాల నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినాము. రాజకీయ కుతంత్రం వల్ల మా చదువులు నాశనమైనాయి. ఇక నుండి తెలంగాణ ఉద్యమంతో గానీ మాకు ఏ విధమైన సంబంధాలు లేవని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామ”ని తమ ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణా ప్రజా సమితికి మెదక్‌ నేతల రాజీనామా :

ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్చాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మెదక్‌ జిల్లా ప్రజాసమితి అధ్యక్షులు రామచంద్రారెడ్డి, కార్యదర్శి నరసింహాచారి తదితర నాయకులు తమ పదవులకు రాజీనామా చేశారు.

“తెలంగాణా ప్రజా సమితి అధ్యక్షుడు డా|| చెన్నారెడ్డి అనుసరిస్తున్న నియంతృత్వ వైఖరిని, సమితి వ్యవహారాలను నిర్వహించడంలో ఆయన అనుసరిస్తున్న ప్రజా స్వామ్య వ్యతిరేక పద్ధతులను నిరసిస్తున్నామ”ని వారు ప్రకటనలో తెలిపారు.

“కేవలం జాతీయ పార్టీలు మాత్రమే తెలంగాణా సమస్యను పరిష్కరించ గలవని మేము భావిస్తున్నాం. మెదక్‌ జిల్లాలో తెలంగాణా ఉద్యమాన్ని బలపరుస్తున్న వారందరూ ప్రజాసమితి అధ్యక్షుడు డా|| చెన్నారెడ్డి అనుసరిస్తున్న పక్షపాతవైఖరితో విసుగు చెందినందువల్ల రాజీనామా చేయక తప్పలేదు” అని వారు ప్రకటనలో పేర్కొన్నారు. వీరి రాజీనామాలకు కారణాలు వేరని, ప్రజా సమితిని రాజకీయ పార్టీగా మార్చినారని తనపై చేసిన ఆరోపణ ‘సాకు’ మాత్రమేనని డా|| చెన్నారెడ్డి వ్యాఖ్యానించారు.

జలీల్‌ పాషా ఆమరణ దీక్ష :

ఎస్‌.ఎస్‌.సి. పరీక్షలో 30 మార్కులు పొందిన విద్యార్థులను పాస్‌ చేయాలని కోరుతూ విద్యార్థి నాయకుడు జలీల్‌ పాషా సెప్టెంబర్‌ చివర్లో ప్రారంభించిన ఆమరణ దీక్ష అక్టోబర్‌ 8 నాటికి 11 రోజులకు చేరింది. ఆయన 12 పౌనుల బరువు కోల్పోయాడని విద్యార్థి నాయకులు విష్ణువర్ధన్‌ రెడ్డి, జి. నిరంజన్‌ తెలిపారు. నిరాహార దీక్ష పూని 10 రోజులు గడిచినా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల వారు విచారం వ్యక్తపర్చారు.

(వచ్చే సంచికలో… సిద్ధిపేట ఉప ఎన్నిక, చెన్నారెడ్డిపై కొండాలక్ష్మణ్‌ విమర్శలు)