| |

పానుగల్లులో ఆలయ సముదాయం!!

By:- డా. సంగనభట్ల నరసయ్య

నల్గొండ జిల్లాలోని నేటి జిల్లా కేంద్రమైన నల్గొండ పట్టణానికి 2కి.మీ. దూరంలో జిల్లా కేంద్రంలో కలిసిపోయిన ప్రాచీన నగరం పానుగల్లు. ఇది కందూరు చోళులకు రాజధాని నగరం. ఇక్కడ అత్యంత అద్భుతమైన ఆలయ సంపద నేటికీ సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తుంది. తెలంగాణలోని చిన్న రాజ్యాలలో పానుగల్లు రాజ్యం ఒకటి. ఇది క్రీశ 1040-1290లలో వరుసగా 3శ. ఉచ్ఛ స్థితిలో ఉన్నది. ఈ రాజులు కాకతీయులకు సమకాలికులు పూర్వరాజులు. పశ్చిమ చాళుక్యులకు కాకతీయులకు సామంతులు. వీరిలో ఉదయన చోళుడు (క్రీ.శ. 1136-1176) మహామండలేశ్వరుడు. అతి ప్రసిద్ధుడు. కృష్ణా నదీతీరము, దక్షిణ తెలంగాణ ప్రాంతాలు ఈ వంశరాజుల ఏలుబడిలో ఉండేవి.

ఈ రాజు వంశపు ప్రధాన నగరాల్లో కొలనుపాక, పానుగల్లు (నల్గొండ జిల్లా), కందూరు, కోడూరు, వర్థమానపురం (మహబూబ్‌నగర్‌ జిల్లా) పేర్కోదగ్గవి. పానుగల్లు వీరి అంతిమ పరిపాలనా కాలంలోనిది. కాకతీయ ప్రతాప రుద్రుని కాలంలో వీరి ప్రభ తగ్గిపోయింది. వీరివి సుమారు 40 శాసనములు లభించాయి. కన్నడ, సంస్కృత, తెలుగు భాషలలో ఉన్నాయి. చాలా శాసనములు పరిష్కరించి, ఈ సామంత రాజ్య చరిత్రను భిన్నూరు నరసింహ శాస్త్రి గ్రంథంగా వెలువరించినాడు.

గోకర్ణ దేవుని శాసనము (1), మైలాంబిక శాసనములు (రెండు) క్రీ.శ. 1124 నాటివి పానుగల్లులో లభించినవి. (చోళ వంశీయులలో తెలుగు చోళులు, రేనాటి చోళులు, పొత్తడి చోళులు, కొణిదెస చోళులు, నెల్లూరు చోళులు, వెలనాటి చోళులు, ఏఱువ చోడులు, కందూరి చోళులు అనే శాఖలున్నాయి. ఈ కందూరు చోళులది తెలంగాణ శాఖ వీరు మహబూ బ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రాంతాలనేలినారు.

ఉదయన చోడుని శాసనము గుర్రం పోడు మండలంలో మొసంగి గ్రామంలో ఇటీవల లభించింది. ఈ శాసన కాలం క్రీ.శ. 1137 ఫిబ్రవరి నాల్గోతేది. ఈతడీ శాసనంలో మహామండలేశ్వరుడుగా పేర్కొనబడినాడు. తన తండ్రి గోకర్ణ చోడమహారాజు పుణ్యముగా నారాయణ భట్టుకు దానం చేసిన దీశాసనం. ఉదయన చోళుడు వర్ధమాన పురమును కూడా తన ఉపరాజధానిగా ఏలినాడు. ఏఱువ భీమ చోడ దేవుడు క్రీ.శ. 1040-1050 ఈ వంశపు తొలినాళ్ల పానుగల్లు రాజధానిగా నేలిన రాజు. ఈ విషయం ఒల్లాల శాసనంలో ఉంది. ఈతనికుమారుడు మెదటి తొండయరాజు సమీప దుర్గాలు గెలిచిన విజేత. రెండవ భీమచోడ దేవుడు పానుగల్లు కోటను అభివృద్ధి చేశాడు.

పానుగల్లు నేలిన రాజులలో గోకర్ణ దేవచోడ మహారాజు సమర్థుడైన ప్రభువు క్రీ.శ. 1109-1136 ఇతనికాలం. పానుగల్లు శాసనంలో (క్రీ.శ. 1121) ఇతని వివరాలున్నాయి. ఇతడు తన తొలి రాజధాని పానుగల్లు నుండి మలిరాజధాని వర్ధమాన పురానికి మారినాడని బిఎన్‌. శాస్త్రి చెప్పినారు. ఇతని కుమారుడు ఉదయన చోళుడు ఈ వంశంలో అతి ప్రసిద్ధుడైన రాజు. ఇతడు కాకతిప్రోలని సఖుడు ఈతని కూతురు పద్మావతి దేవి కాకతి రుద్రుని భార్య.

ఈ ఉదయన చోడ మహారాజు పానుగల్లు వద్ద ఉదయన సముద్రమును తవ్వించాడు. ఈ చెరువు నేటికీ ఉంది. సముద్రమన్నది చాళుక్య చక్రవర్తుల పరిభాషలో విశాల తటాకం. ఇది కాకతీయ ప్రభువులకు ప్రేరణ కల్గించిన, స్ఫూర్తినిచ్చిన నిర్మాణం. ఈ పానుగల్లులోని తటాకం క్రీశ 1510లో శిథిలమైన తూము కాలువలను గోలుకొండ ఇబ్రహీం కుతుబ్‌షాహీ అధికారి రహమతుల్లా బాగు చేయించి శాసనం వేయించాడు.

పానుగల్లులోని ప్రసిద్ధ దేవాలయాలు రెండు ఉన్నాయి. పరమాద్భుత శిల్ప సంపదతో ఉన్న త్రికూటాలయము పచ్చల సోమేశ్వరాలయము. వరుసగా కట్టిన తూర్పునకు ముఖం చేసిన ఆలయాల సముదాయమిది. అట్లే ఉదయ సముద్రమునకు దగ్గరలోని ఛాయా సోమేశ్వరాలయము మరొక దేవాలయం. దీని ప్రాంగణము చూసినపుడు ఒకప్పుడిది మహోన్నత దశలో ఉండేదని తెలుస్తుంది. ఛాయా సోమేశ్వరాలయంలో గర్భాలయంలో స్తంభపునీడ ఉదయాస్తమయాల్లో వింతైన ఐకస్తంభ ఛాయను ప్రదర్శిస్తుంది. ఈ ఆలయాల నిర్మాణంలో కందూరు చోడరాజుల కాలపు వాస్తు చాతుర్యం అద్భుతంగా ఉంది.

పశ్చిమ చాళుక్యుల కాలము నుండి ఆఖరు కందూరు చోడవంశరాజు రామనాథ దేవ చోడుని (క్రీ.శ. 1282) వరకు వీరు చేపట్టిన ఆలయ నిర్మాణములు, వాటిలో శైథిల్యము వలన లభించిన విగ్రహములతో ఒక పురావస్తుశాల పచ్చల సోమేశ్వరాలయ ప్రాంగణంలో నిర్మించారు.

పానుగంటింటి రాణిని ఒక మాయల ఫకీర్‌ ఒకడు ఎత్తుకొని పోయిన జానపదగాథ ‘బాలనాగమ్మ’ పేరిట చలామణి ఉంది. దీనిలో చారిత్రక ఛాయలున్నాయి. ఈ గాథ పూర్తి కల్పింతం కాదు.

ఇక్కడ మరొక సామంతరాజు శాసనం లభించింది. ఈ రోజు పేరు సారంగపాణి. ఇతడు రాణి రుద్రమదేవి కాలంవాడు. ఈతని శాసనకాలం. శ.సం. 1189 అనగా క్రీ.శ. 1267. ఈ శాసనం ఛాయా సోమేశ్వరాలయంలో ఉంది. ఇది కాకతీయ సామంతుల ఏలుబడిలోని రాజ్యమనేందుకు ఈ శాసనం సాక్ష్యం. ఈ శాసనంలో కాకతీయ రాజవంశ క్రమం కూడా వివరించబడింది.

సుప్రసిద్ధ చోళరాజు కరికాల చోళుని వంశీకులైన వీరు తెలుగు ప్రాంతాల ఏలికలుగా తెలుగు చోడువైనారు. రేనాడు, పొత్తపి, కొణిదెన, నెల్లూరు, వెలనాడు, కందూరు చోళులుగా ప్రసిద్ధులైన ఈ శాఖలలో కందూరు చోళులే ఈ పానుగల్లు రాజధానిగా ఏలిన ప్రభువులు. ఏరువ మొదటి భీముని నుండి రామనాథ దేవ చోడ మహరాజు వరకు 17 మంది రాజులు సుమారు 250 ఏండ్లు పాలించారు. వీరి రాజధానులు కొలనుపాక, పానుగల్లులు.

ప్రజా సంక్షేమ విధానాల్లో భాగంగా చేసిన వీరి నిర్మాణాల్లో పానుగల్లు, పెర్కూరు, వర్ధమానపురం, కొలనుపాక, గంగాపురం, రాచూరు, వల్లాల, ఆకారం వంటి చోట్ల ఆలయాలు, ఉదయ సముద్రం, భీమ సముద్రం, చోడ సముద్రం, నమిలెకాలువ వంటివి నేటికి సాక్ష్యంగా నిలిచి ఉన్నాయి.

ఈ పానుగల్లు నేలిన కందూరు చోళ ప్రభువులలో తొలి తరం ప్రభువు తొండయచోళుడు. ఈతడు ఈ వంశపు తొలి రాజధాని కొలనుపాక నుండి ఈ ప్రాంతాల నేలినాడు. ఈతడు రెండవ భీమదేవ చోడుని కుమారుడు. కొలనుపాకలో రెండు, పానుగల్లులో రెండు శాసనములు వేయించినాడు. అప్పటికి పానుగల్లు ఇతనికి ఉపరాజధాని కావచ్చు. లేదా ఇతని రాజ్యములో ప్రధాన నగరము. పశ్చిమ చాళుక్యుల కాలమున రెండవ రాజధాని లేదా సైనిక కేంద్రములను అభివృద్ధి చేయడం అనేది నాటి చక్రవర్తి ప్రయోజనాలలో ఒకటి.

కందూరు చోళులలో ప్రసిద్ధుడైన ఈ (రెండవ) తొండయ చోళ ప్రభువు ‘అనుముల’లో శాసనం వేయించినాడు. ఇది చక్కని తెలుగు పద్యములతో ఉన్న శాసనం. ఈ అనుముల అహల్యా నదీ తీర్థ నగరం. ఇది నల్గొండలోని ఒక ఉపోపనది. ‘‘కం. ఆది చోడ కులంబున రాజాధి రాజైన తొండ రాజులచే’’ అని ఈ కందూరు చోళ రాజ ప్రస్తావన ఉంది.

రెండవ ఏరువ భీమునికి పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువన మల్ల ఆరవ విక్రమాదిత్యునికి వల్ల లభించిన కొలనుపాక 7,000, కందూరు 1100 ఈయబడిన ప్రాంతాలు. దీనిని బట్టి ఈరాజ్య విస్తీర్ణము 1100 గ్రామములుగా భావించాలి. కందూరు చోళుల వంశవృక్షం, మల్లికార్జున చోడుని ఒల్లాల శాసనంలో లభిస్తుంది. ఈ భీముడే కందూరు చోళ వంశమూల పురుషుడు.

ఇక్కడి ఉదయసముద్రము ఉదయాన చోళ మహారాజు నిర్మించినది. ఈతని కాలములో క్రీ.శ. 1176లో ఈ చెరువు నిర్మాణం జరిగింది. దీనికాలువను 4 శతాబ్దాల తరువాత క్రీ.శ. 1560లో ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో బాగుచేసినారు.

సోమనాథ దేవచోడుడు, బబీమయ చోళుడు, ఉదయాదిత్య చోళుడు. రామనాథదేవుడు మొదలగువారు పానుగల్లు నేలిన ప్రఖ్యాత కందూరు చోళ రాజులు.

నల్గొండ పక్కనగల కొండపై శత్రుదుర్బేద్యమైన కోట ఉంది. నేటికి రాజ నివాసమైన శిథిలాలు పానుగల్లు ప్రభువులవి కనబడతాయి. ఈ దుర్గానికి ఏరువ పీఠం, ఏరువ సింహసనమని శాసనస్థంగా ప్రసిద్ధి
ఉంది. బహుశ పానుగల్లును ఏలిన ఏరువ బీముని కాలంలోనే ఈ దుర్గం నిర్మాణం జరిగి ఉంటుంది. కాకతీయ రుద్రమదేవి కాలానికి సామంత రాజ్యమైన బహమనీ రాజుల కాలంలో వారికి వశమైంది. పానవట్టం (శివలింగం పెట్టే పీఠం) వల్ల ఈ పానుగల్లు అనే నామం ఏర్పడి ఉండవచ్చు. వీరశైవానికి పీఠమైన ఈ రాజధాని నగరంలో ఉదయన రాజు కాలంలో జైనం కూడా అభివృద్ధి చెందింది. పండితారాధ్యుని కాలంలో అతని శాపం చేత నశింపబడ్డట్టు చెప్పబడే ఈ నగరం, మందిరాలు క్రీ.శ. 1180 ప్రాంతంలో విధ్వంసానికి గురిఐ, వృద్ధిపొంది, బహుమనీల కాలంలలో తిరిగి తన ప్రాభవాన్ని కోల్పోయాయి.

ఇక్కడి ఛాయా సోమేశ్వరాలయం ఉదయాన సముద్రానికి దగ్గరే. గర్భగుడిలోకి నిరంతరం నీళ్లు ప్రవహిస్తాయి. సూర్యరశ్మి సూటిగా లేకున్నా గర్భగుడిలో ముందటి స్థంబానికి నీడ ఏకత్రితంఐ, వింత శోభతో నేటికీ దర్శనమిస్తుంది. పచ్చల సోమేశ్వరాలయం, వరుస ఆలయాలు, ప్రాంగణాలతో విలలిసిల్లింది. వాటి ముందర ఒకే మంటపం కనిపిస్తుంది. ఇక్కడే స్తంబాలపై భారత, రామాయణ గాథలు శిల్పీకరించబడి, ఆలయ శిల్ప శోభ మురిపిస్తుంది.రుద్రదేవ మహారాజు పుణ్యానికై తంత్రీపాలుడైన మల్లి నాయకుడు ఛాయా సోమేశ్వరునికి దానాదికం ఇచ్చినట్లు శాసనం ఉంది.

పచ్చల సోమేశ్వరాలయం, చెన్నకేశవాలయం శిల్పంతో శోభాయమానంగా ఉంటుంది. ఇది వరుస ఆలయాలతో ఒకే మంటపంతో ఉంటుంది. ఇది పరమతాల దుశ్చర్యల వల్ల శిధిలమైంది. 1923లో నిజాం ప్రధాని మహారాజా సర్‌ కిషన్‌ ప్రసాద్‌ బహద్దుర్‌గారు ఈ ఆలయాన్ని కొంత బాగుచేయించినారు. దీని పక్కనే శిల్ప ప్రదర్శనశాల (మ్యూజియం) ఉంది. పచ్చల సోమేశ్వరాలయంలో లింగం మరకతంతో చేసినందువల్ల ఈ పేరు రావచ్చు. ఇపుడా మరకత రత్నలింగంలేదు. పానుగల్లుకు జంటరాజధాని కొలనుపాకలో కూడా పచ్చల జినదేవుని మాణిక్య ప్రభువంటారు. ఇది ఇప్పటికీ మరకతమణితోనే చేయబడిన విగ్రహంగా ఉంది. సోమేశ్వరునిగుడి దాడికి గురిఐనందువల్ల ఎత్తుకొని పోయి ఉంటారు. పేరులో మాత్రం ఇంకా పచ్చల (మరకత) సోమేశ్వరుడే ఉన్నాడు.

తొండరసు పట్టమహీషి మైలాంబిక క్రీ.శ. 1124లో పానుగంటిలో శాసనం వేయించింది. ఈమె కోడలు పానుగల్లు మహారాణి చోడ భీముని భార్య ధెన్నమహాదేవి కూడా గట్టుతెమ్మెలో శాసనం వేయించింది. పానుగల్లు రాజకుమార్తె పద్మావతి దేవి కాకతీయ రుద్రుని (గణపతి దేవుని పెదనాన్న) పట్ట మహిషి ఈమె భీమదేవుని సోదరి ఈతడు పశ్చిమ చాళుక్య సామంతుడై ఉండి స్వతంత్రుడైన తరువాత రుద్రుని చేతిలో ఓడి, సామంతునిగా అంగీకరించి, చెల్లిలిని కాకతీయ వంశపు కోడలిని చేసినాడు.

కాకతి రుద్రదేవ మహారాజు ఛాయా సోమేశ్వరాలయ పూజలకై ఆజ్ఞాపించగా, ఆయన పుణ్య లబ్ధికై తంత్రపాలుడు మల్లినాయకుడు ఉదయాదిత్య సముద్రం వెనుక వేయించిన దాన శాసన మొకటి పానుగంటి ప్రతిష్ఠను తెలిపే శాసనం లభిస్తోంది. రెండవ ప్రతాపరుద్రుని సోమేశ్వరాలయం శాసనం కూడా ఇక్కడ లభిస్తోంది.

కందూరు భీముని కుమారుడు ముత్తయ్య గంగేశ్వర మహదేవాలయ శాసనం క్రీ.శ. 117, ఆరవ విక్రమాదిత్యుని పానగల్లు శాసనము, చోడ భీమనారాయణుని శాసనం, కందూరు బీమరుసు శాసనం, కందూరు గోకర్ణ చోడ మహారాజ శాసనం ఇక్కడ పానగల్లులో లభించిన మరికొన్ని శాసనములు ఈ నగర చరిత్రకు ఉదపయుక్త మౌతాయి.

కందూరు చోళుల తరువాత ఈ పానుగల్లు రాజ్యము కొంతకాలము రాచకొండ దేవరకొండ సోదరరాజ్యముల ఏలుబడిలో ఉండేది. ఇక్కడ దేవరకొండ ప్రభువు తొలి సింగమ నాయకుని కుమారుడు రాచకొండ అనపోత సోదరుడి మాదానాయుడు వేయించిన శాసనము పానుగల్లు రాజధానిలో లభించినది. దీనిని బట్టి క్రీ.శ 1400 వరకు ఇది వైభవోపేతంగా ఉండి, బహమనీల దండయాత్రలతో శిథిలమైపోయి ఉండవచ్చును. అయితే గోలుకొండ ఇబ్రహీం కుతుబ్‌షాహీ సైన్యాధిపతి రహమతుల్లా ఉదయసముద్రపు తూము బాగుచేసినప్పటి శాసనమునుబట్టి, రాజరికము అంతమైనా ఆ ప్రభువుల ప్రజా సంక్షేమ పాలనలో చెరువుల జలాల, తరంగాల ఘోషలు వారి కీర్తిని నేటికీ మనకు వినిపిస్తున్నాయి. పానుగల్లు సర్వులు చూడతగిన సుందర పర్యాటక క్షేత్రంగా నేటికీ వెలుగులీనుతోంది.