ప్రజాసమితి రద్దు పట్ల తీవ్ర నిరసనలు
By: వి. ప్రకాశ్
అధికార కాంగ్రెస్‌లో తెలంగాణ ప్రజాసమితి విలీనం అవుతున్నందుకు కోపోద్రిక్తులైన విద్యార్థులు, యువకులు సెప్టెంబర్ 18 ఉదయం ప్రజాసమితి కేంద్ర కార్యాలయాన్ని చుట్టు ముట్టి సమితి నాయకులను అవహేళన చేస్తూ చాలాసేపు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.
‘‘కాంగ్రెస్‌తో విలీనం వద్దు వద్దు – ప్రత్యేక రాష్ట్రం కావాలి-జై తెలంగాణ’’ నంటూ నినదించారు.
కాంగ్రెస్‌లో విలీనానికి నిర్ణయిస్తూ ప్రజా సమితి కేంద్ర కార్యవర్గం సెప్టెంబర్ 17న ఆమోదించిన తీర్మానం పై స్టేట్ కౌన్సిల్ సభ్యులు కార్యాలయంలో సమవేశమై చర్చించారు. వెలుపల విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపారు. ఈ ప్రదర్శకులతో ప్రజాసమితికి ఎలాంటి సంబంధం లేదని డా॥ చెన్నారెడ్డి ప్రకటించారు.
ప్రజాసమితి కార్యాలయం బయట సాయుధ పోలీసు దళాలు కాపలా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి ముందు జాగ్రత్తగా సాయుధ పోలీసుల కాపలాను ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. బయట మండే ఎండలో చెమటలు పోస్తున్నా ప్రదర్శకులు గంటలగొద్దీ ‘కాంగ్రెస్‌లో విలీనం వద్దం’టూ నినాదాలిచ్చారు.
ఇతరులెవ్వరూ లోనికి ప్రవేశించకుండా నిరోధించడానికై ప్రజాసమితి కార్యాలయం చుట్టూ బారికేడ్లను ముందుకు తోసుకుంటూ ప్రదర్శకులు సమావేశం జరుగుతున్న హాలు దిశగా ముందుకు సాగగా ప్రజాసమితి వలంటీర్లు అడ్డు నిలిచి ప్రదర్శకులను లోనికి వెళ్ళకుండా నిరోధించారు. ప్రజాసమితి వలంటీర్లలో ఎక్కువ మంది ఉద్యమం సందర్భంగా విద్యార్థులకు నాయకత్వం వహించిన వారే!. ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
ప్రజాసమితి నాయకులు తెలంగాణా ప్రజలకు ద్రోహం చేశారని, ఈ నాయకులు ద్రోహులని ప్రదర్శకులు వాదించారు. ఈ విషయాన్ని స్వయంగా డా॥ చెన్నారెడ్డితోనే తేల్చుకోదల్చుకున్నాము. కాబట్టి లోనికి పోనివ్వాలని విద్యార్థులు పట్టుబట్టారు. విద్యార్థుల కోపాన్ని చల్లార్చడానికై ప్రజాసమితి నాయకులు ఎన్ని మాటలు చెప్పినా, ఎంతగా బతిమాలినా లాభం లేకపోయింది. విలీనం వల్లనే లాభాలు ఉన్నాయని ఈ నాయకులు ఏమేమో వివరించబోయారు. విద్యార్థులు వినిపించుకునే స్థితిలో లేరు. ప్రజాసమితి ఏర్పడింది, తెలంగాణ కోసమేనని విద్యార్థులు వాదించారు. ‘‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఉద్యమం ప్రారంభించాము. లాఠీ దెబ్బలు తిన్నాము. తుపాకీ గుళ్ళను ఎదుర్కొన్నాము. మా చదువులు పాడు చేసుకున్నాము. ఎందరో విద్యార్థులు, యువకులు ప్రాణాలు ధారపోసింది కాంగ్రెస్ ప్రయోజనాల కోసమా?’’ అంటూ విద్యార్థులు ప్రజాసమితి వలంటీర్లతో వాదనకు దిగారు. సహనం కోల్పోయిన వలంటీర్లు వాదనకు దిగిన విద్యార్థులను ‘‘మీరెవరో మాకు తెలియదు- వెళ్ళిపొండి’’ అంటూ త్రోసివేశారు.
‘‘డా. చెన్నారెడ్డి ముర్దాబాద్’’ ‘‘ప్రత్యేక రాష్ట్రమే కావాలి’’ ‘‘మల్లికార్జున్ ముర్దాబాద్’’ ‘‘మదన్‌మోహన్ ముర్దాబాద్’’ ‘‘కాంగ్రెస్‌తో కలిసేవారు నశించాలి’’ అంటూ విద్యార్థులు బిగ్గరగా నినాదాలు చేశారు.
సమావేశపు గదిలో ద్వారం వద్ద కూర్చొని ఉన్న పార్లమెంటు సభ్యుడు రాజా రామేశ్వర రావు ప్రదర్శకుల కంటబడ్డారు. కొందరు ప్రదర్శకులు వాలంటీర్లను నెట్టుకుని ఆయన వద్దకు పోయి ‘‘తెలంగాణకు జరుగుతున్న వన్ని నిరోధించడానికి మీరయినా జోక్యం చేసుకోవాలని ప్రాధేయపడ్డారు. ‘‘ఎంపీలుగా ఎన్నిక కాగానే చార్మినార్ వద్ద మీరు చేసిన ప్రతిజ్ఞలు ఏమైనాయ’’ని ఆయన్ని ప్రశ్నించారు. మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు మీరు రుణం తీర్చుకునే పద్ధతి ఇదేనా?’’ అని ప్రాదేయ పూర్వకంగానే రాజా రామేశ్వర రావును అడిగారు విద్యార్థులు.
అంతలో హాలు మెట్లపై నిల్చున్న ఎస్. వెంకట్రాం రెడ్డి, నాగం కృష్ణ ప్రదర్శకుల కంటబడ్డారు. కొందరు విద్యార్థులు వారి వద్దకు వెళ్ళి నిలదీస్తుండగానే మరో వైపు నుండి వారి పైకి కొందరు చెప్పులు విసిరారు. సమితి వలంటీర్లకు విద్యార్థులకు మధ్య ముష్టి యుద్ధం మొదలయ్యింది. కుర్చీలు, బల్లలు విసురుకున్నారు. షామియానా ఒక ప్రక్కకు ఒరిగి పోయింది. సమావేశంలో పాల్గొంటున్న నాయకులు తలో దిక్కుకు పరుగు తీశారు.
పావు గంట సేపు అంతా గందర గోళం.. ఎక్కడ ఏమి జరుగుతున్నదో ఎవ్వరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో సాయుధ పోలీసులు జోక్యం చేసుకున్నారు. బయటికి వచ్చిన మల్లికార్జున్ విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వెంకటస్వామి పోలీసులను వెళ్ళిపోమని కోరినారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అచ్యుతరెడ్డి ఉద్రేకం పనికి రాదని విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మీటింగ్‌లో నుండి వెలుపలికి వచ్చిన ఎం.ఎం. హాషీంను విద్యార్థులు ఘెరావ్ చేశారు. రోడ్డుపై నిలిచి వున్న వెంటకస్వామిని విద్యార్థులు ఘెరావ్ చేస్తుండగా వారిపై పోలీసులు లాఠీ ఛార్జీ చేసి చెదరగొట్టారు.
ప్రజాసమితి వ్యవస్థాపకులలో మిగిలిన సభ్యుడు
1969 ఫిబ్రవరి మూడో వారంలో ప్రజాసమితిని ప్రారంభించిన 13 మందిలో విలీన నిర్ణయం తీసుకున్న సమావేశంలో పాల్గొన్నది ఒక్క మదన్ మోహన్ మాత్రమే. మిగిలిన 12 మందిలో కొందరు చెన్నారెడ్డి నాయకత్వాన్ని ప్రారంభంలోనే వ్యతిరేకించి దూరం కాగా మిగిలిన వారు ఈ సమావేశాలలో పాల్గొనలేదు. 13 మందిలో ప్రజాసమితి కార్యవర్గంలో వున్నది, శాసన సభకు ఎన్నికైంది కూడా కేవలం మదన్ మోహన్ మాత్రమే. మిగిలిన 12 మందిలో 9 మంది జర్నలిస్టులు, ఇద్దరు అడ్వకేట్లు, ఒక డాక్టరు, ఒక వతన్‌దారు వున్నారు.
ప్రజాసమితి స్టేట్ కౌన్సిల్ ఆమోదించిన తీర్మానం:
కాంగ్రెస్‌లో ప్రజాసమితిని విలీనం చేస్తూ రాష్ట్ర కార్యవర్గం ముందు రోజు ఆమోదించిన తీర్మానాన్ని స్టేట్ కౌన్సిల్ సెప్టెంబర్ 18న విద్యార్థుల నిరసనల మధ్య ధృవీకరించింది.
సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు ఎస్.బి. గిరి తీర్మానాన్ని ప్రతిపాదించగా కరీంనగర్ ఎం.పి. ఎమ్. సత్యనారాయణరావు దాన్ని బలపరిచారు.
స్టేట్ కౌన్సిల్ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందని డా॥ చెన్నారెడ్డి తెలిపారు. తీర్మానాన్ని ఆమోదించడానికి ముందు డా॥ నరేంద్రదత్ మూడు సవరణలను ప్రతిపాదించగా సభ వాటిని స్వీకరించింది.
తీర్మానం పై స్టేట్ కౌన్సిల్‌లో చర్చ సాఫీగా సాగిందని, ప్రజాసమితి ప్రధానికి సూచించిన ఆరు ప్రతిపాదనలలోని మిగిలిన ఐదు అంశాలను (బ్రహ్మానందరెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు) కూడా వెంటనే అమలు జరపాలనే అభిప్రాయం సభ్యులు వ్యక్తం చేశారని డా॥ చెన్నారెడ్డి పత్రికల వారికి వివరించారు. ‘‘మొత్తం 6 ప్రతిపాదనలను ఏకంగా ఆమోదించి వుంటే మేము హర్షించి ఉండేవారం’’ అని డా॥ చెన్నారెడ్డి అన్నారు.

ప్రత్యేక రాష్ట్ర వాంఛ విడనాడలేదు – డా॥ చెన్నారెడ్డి
ప్రత్యేక తెలంగాణా కోర్కెను విడనాడలేదని డా॥ చెన్నారెడ్డి స్పష్టం చేశారు. ఒకే వాక్యంతో కూడిన ప్రజాసమితి మేనిఫెస్టో తరహాలోనే తీర్మానం కూడా క్లుప్తంగా వున్నది. ‘‘ఆరు అంశాల ప్రాతిపదికపై తుది నిర్ణయం గైకొంటామని ప్రధాని హామీ ఇచ్చారు. ఆ అంశాలను ఆమె వ్యతిరేకించలేద’’ని డా॥ చెన్నారెడ్డి అన్నారు.
‘‘అధికార కాంగ్రెస్‌లో విలీనానికి నిర్ణయం హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు. అది వ్యూహంలో భాగమనీ మొదటి నుండి నేను నా సహచరులకు చెబుతూనే వచ్చాను’’ అని డా॥ చెన్నారెడ్డి పత్రికలకు తెలిపారు.
ప్రజాసమితి స్టేట్ కౌన్సిల్ సమావేశం నాలుగు గంటలసేపు జరిగింది. ప్రజాసమితి సూచించిన ఆరు అంశాలనైనా అంగీకరించనిదే, అధికార కాంగ్రెస్‌లో విలీనం సమస్య గురించి ప్రసావించి ఉండవలసింది కాదని, కేవలం బ్రహ్మానందరెడ్డి రాజీనామా వలన సమస్య పరిష్కారానికి చేరువ కాలేదని పలువురు స్టేట్ కౌన్సిల్ సభ్యులు సమావేశంలో వాదించినట్లు పత్రికలు తెలిపాయి.
ఇ.వి. పద్మనాభన్ నిరసన లేఖ
కరడు గట్టిన తెలంగాణ వాది ఇ.వి. పద్మనాభన్ కూడా స్టేట్ కౌన్సిల్‌లో సభ్యుడే. ఆయన గంటన్నర ఆలస్యంగా సమావేశానికి వచ్చారు. నాలుగు పేజీల టైపు చేసిన లేఖను పద్మానాభన్ ప్రజాసమితి అధ్యక్షునికి, నాయకులకు పంచి పెట్టారు.
‘‘తెలంగాణ ప్రజాసమితి తీర్మానం పుణ్యమా అని తెలంగాణ స్థితి 1956 అక్టోబర్ 31 వ తేదీ నాటికి, పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలకు పూర్వం నాటి స్థితిలో ఉన్నది’’ అని ఆ లేఖలో ఇ.వి. పద్మనాభన్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ మహాసభలో, ఆ తర్వాత ప్రజాసమితిలో సభ్యునిగా ఉంటూ వస్తాను, ఈ మహత్తర ఆశయం కోసం మీతో కలిసి పని చేసే భాగ్యం చేకూరింది. దాని కోసం మీరు సాహసోపేతంగా పోరాడారు. ఇప్పుడు మీరు ప్రజలను నట్టేట ముంచారు. ఇక నేను మరేమి చెప్పగలను. తెలంగాణకు మంచి రోజులు వచ్చే వరకు సెలవు’’ అని ఆ లేఖలో ఇ.వి. పద్మనాభన్ పేర్కొన్నారు.

తెలంగాణ నేతల నిరసనలు
బాకర్ అలీ మీర్జా :
‘‘డా. చెన్నారెడ్డి చేసిన ద్రోహం చరిత్రలో కనీవినీ ఎరుగనిద’’ని మాజీ ఎం.పి. బాకర్ అలీ మీర్జా వ్యాఖ్యానించారు. ప్రధాని తన నిర్ణయాన్ని (6 అంశాలపై) ప్రకటించక ముందే తెలంగాణ, ప్రజల విశ్వాసాలను చెన్నారెడ్డి కుదువ బెట్టారని ఆయన పేర్కొన్నారు. అయితే తెలంగాణా ప్రజల అభిప్రాయాలలో ఎలాంటి మార్పూ లేదని తాను భావిస్తున్నానని, యువకులు, విద్యార్థులు రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయాలకు గురికాకుండా ఉద్యమానికి పునరుజ్జీవం కలిగిస్తారనే ఆశాభావాన్ని బాకర్ అలీ మీర్జా వ్యక్త పరిచారు.
ఈశ్వరీబాయి: రెండవ దఫా కాంగ్రెస్ నాయకులు తెలంగాణా ఉద్యమాన్ని దెబ్బ తీశారని రిపబ్లికన్ పార్టీ శాసన సభ్యురాలు ఈశ్వరీబాయి ఒక ప్రకటనలో తెలిపారు. బ్రహ్మానందరెడ్డి పై వ్యక్తిగత విజయాన్ని సాధించుకు నేందుకు చెన్నారెడ్డి ప్రజా సమితిని గాక కాంగ్రెస్ పార్టీనే వినియోగించుకోవలసి ఉండె’’ నని ఆమె అభిప్రాయ పడినారు.
బి.ఎస్. మహదేవ్ సింగ్:
ప్రజాసమితి విలీన చర్చ రాజకీయంగా పెద్ద దగా. బ్రహ్మానందరెడ్డి పదవి నుండి నిష్క్రమణకు ప్రజాసమితిదే బాధ్యత అనడం పొరబాటు. ప్రధాని రాజకీయ ఎత్తుగడలలో ఇదొకటి’’ అని ప్రముఖ కార్మిక నాయకుడు బి.ఎస్. మహదేవ్ సింగ్ అన్నారు.
విద్యార్థి నాయకులు కె. రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి:
‘‘తెలంగాణ ప్రజల అభీష్టాన్ని ఫణంగా పెట్టి ప్రజాసమితి కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు తెలంగాణ ప్రజాసమితి నాయకులు ప్రజలకు జవాబుదారీ వహించాలి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన 300 మంది త్యాగఫలం, విద్యార్థుల నష్టం వృధా పోరాదు’’ అని విద్యార్థి నాయకులు కె. రంగారెడ్డి, కె. సుదర్శన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇతర నేతల, సంఘాల నిరసనలు
ప్రజాసమితి నాయకుల నిర్ణయాన్ని గౌరీ శంకర్ అధ్యక్షతన జరిగిన సికింద్రాబాద్ విద్యార్థుల సమావేశం తీవ్రంగా ఖండించింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, విద్యార్థి సంఘాల ప్రతినిధులు నలుగురు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రజాసమితి నాయకులు ద్రోహం చేశారని వీరు ఆరోపించారు.
జి.ఎం. అంజయ్య: ‘‘తెలంగాణా ప్రజాభీష్టానికి కేంద్ర, రాష్ట్రాల నాయకత్వం తల ఒగ్గే వరకు విశ్రమించరాద’’ని తెలంగాణ ప్రజలకు జి.ఎం. అంజయ్య విజ్ఞప్తి చేశారు.’’ ప్రజాసమితిని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా సమితిలోని కాంగ్రెస్ నాయకులు ప్రజలను వంచించార’’ని ఆయన అన్నారు.
ఆదిరాజు వెంకటేశ్వరరావు: ‘‘ప్రజాసమితిని కాంగ్రెస్‌లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం ద్వారా చెన్నారెడ్డి అతని అనుయాయులు తెలంగాణ ప్రజాసమితి వ్యవస్థాపకుల్లో ఒకరైన మాజీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, ప్రముఖ జర్నలిస్టు ఆదిరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
‘‘1969 సంవత్సరంలో ప్రజాసమితి నాయకత్వానికి చెన్నారెడ్డిని తీసుకురావడానికి కృషి చేయడం పెద్ద పొరబాటే అయింది. ఈ ఘోర తప్పిదానికి ప్రజలు నన్ను క్షమించాలి’’అని మొట్టమొదట పి.డి. చట్టం క్రింద అరెస్టయిన ఆదిరాజు వెంకటేశ్వర రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
టి.పి.ఎస్. కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న విద్యార్థులు: సికింద్రాబాద్‌లోని అనేక మంది విద్యార్థులు, యువకులు ప్రజాసమితి విలీన నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్రపతి రోడ్డులోని ప్రజాసమితి కార్యాలయాన్ని స్వాధీనపర్చుకున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించకుండా టి.పి.ఎస్.ను ఎవరూ రద్దుపర్చలేరని వారు ప్రకటించారు.
నాగంకృష్ణ ఖండన: సికింద్రాబాద్ కార్యాలయాన్ని ఎవరూ స్వాధీన పర్చుకోలేదని, తమ ఆధీనంలోనే ఉందని నాగం కృష్ణ (ఎమ్మెల్యే) తెలిపారు.