రాష్ట్ర ఐటీ రంగం ఏడేండ్ల ప్రస్థానం

By: ముడుంబై మాధవ్‌

తెలంగాణ ఐటీ రంగ పురోగతి రాష్ట్రం ఏర్పడ్డనాటినుండి అప్రతిహతంగా కొనసాగుతూ వస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఐటీ రంగ అభివృద్ధిపై లేవనెత్తిన అనేక అనుమానాలను నివృత్తిచేస్తూ, అవమానకరమైన అంచనాలకు, విశ్లేషణలకు చెంపపెట్టులా ఈ ఏడేండ్ల ప్రస్థానం సాగింది. రాజకీయ సుస్థిరత, సమర్థ నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు ‘బ్రాండ్‌ హైదరాబాద్‌’ను కాపాడటమే కాకుండా మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో పరిపుష్టం చేశాయి. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌19 మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని  కూడా తట్టుకుని తెలంగాణ ఐటీ రంగం పురోగమించింది.   

ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఐటీ ఎగుమతులలో గత ఏడేండ్లకుగాను 14.25 శాతం వార్షిక సగటు వృద్ధిరేటును (CAGR) నమోదు చేసింది. 2013-14లో రూ. 57,528 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతుల విలువ 2020-21 సంవత్సరానికి రూ. 1,45,522 కోట్లకు చేరింది. 2019-20 సంవత్సరంతో పోల్చి చూస్తే వృద్ధిరేటు 12.98 శాతంగా నమోదయ్యింది. భారత దేశపు ఐటీ రంగం స్థూల అభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధిరేటు ప్రతీ యేడూ అధికంగానే ఉంది. ముఖ్యంగా గత మూడేళ్లుగా తెలంగాణ ఐటీ ఎగుమతుల వృద్ధిరేటు, జాతీయ వృద్ధిరేటు కంటే రెట్టింపు ఉండటం గమనార్హం. 

ఉద్యోగ కల్పన విషయంలో కూడా రాష్ట్రం విశేష ప్రగతిని సాధించింది. 2013-14 నాటి ఉద్యోగుల సంఖ్యతో (3,23,396) పోల్చితే సుమారు రెట్టింపు ఉద్యోగాలను నేడు ఐటీ/ ఐటీ ఆధారిత సేవల రంగం (IT/ITeS) కల్పిస్తున్నది. ఐటీ రంగం 6,28,615 మంది నిపుణులకు నేడు కొలువులు కల్పిస్తున్నది. దీనికి మూడు రెట్లు – సుమారు 19 లక్షల మంది – ఐటీ రంగంపై ఆధారపడి పరోక్షంగా ఉపాధిని పొందుతున్నారు. ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్‌ (NASSCOM) అంచనా ప్రకారం 2020-21 సంవత్సరానికి దేశీయంగా ఐటీరంగంలో కొత్తగా 1,65,000 ఉద్యోగాలు వస్తే, ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండే 46,489 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు వచ్చాయి. గత ఏడాది భారత ఐటీ పరిశ్రమలో కొత్తగా వచ్చిన ప్రతీ పది ఉద్యోగాలలో మూడు తెలంగాణ ఐటీ రంగం కల్పించినవే!

ఈ విజయాల వెనక ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు దార్శనికత, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగుల అవిరామ కృషి దాగి ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి ఐటీ పరిశ్రమకు చెందిన ముఖ్య సంస్థలు, నాయకులతో అనేక సమావేశాలు నిర్వహించి ఐటీ రంగ అభివృద్ధికి ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చి వారిలో విశ్వాసం పాదుల్పారు. దానికి కొనసాగింపుగా ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో లబ్ధ ప్రతిష్టులైన వారితో సంప్రదింపులు జరిపి అనేక విధానాలను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు 4 ఏప్రిల్‌, 2016న ప్రముఖ పారిశ్రామిక వేత్తల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ఐసీటీ విధానాన్ని (Telangana State ICT Policy, 2016) ఆవిష్కరించారు. దీనికి అనుబంధంగా రూరల్‌ టెక్‌ సెంటర్స్‌ పాలసీ (Rural Tech Centres Policy), ఇన్నొవేషన్‌ పాలసీ (Innovation Policy), ఎలక్ట్రానిక్స్‌ పాలసీ (Electronics Policy), యానిమేషన్‌ & గేమింగ్‌ పాలసీ (Animation and Gaming Policy)లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత సైబర్‌ సెక్యూరిటీ (Cyber Security), డాటా సెంటర్స్‌ (Data Centers), డాటా ఎనలిటిక్స్‌ (Data Analytics), ఓపెన్‌ డాటా (Open Data), ఐఓటీ (Internet of Things, IoT), ఈ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ (e-Waste Management), ప్రొక్యూర్మెంట్‌ (Procurement)లకు సంబంధించిన నిర్ధిష్ట విధానాలను ప్రభుత్వం తయారుచేసింది.

సాంకేతిక రంగంలో పెట్టుబడుల కోసం భారత దేశ రాష్ట్రాల మధ్య మాత్రమే పోటీ ఉండదని, తెలంగాణ, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలతో, మహా నగరాలతో పోటీ పడవలసి ఉంటుందన్న ఐటీ శాఖ మంత్రి విశాల దృక్పథం రాష్ట్ర ప్రభుత్వ ఐటీ రంగ విధానానికి తారకమంత్రం. యేడేండ్లలో తెలంగాణ రాష్ట్ర ఐటీ రంగం అపూర్వ ప్రగతి సాధించడంలో ఈ అవగాహన, ఆచరణ కీలక భూమిక పోషించాయి. పయనించవలసిన మార్గం, చేరుకోవాల్సిన గమ్యాన్ని నిర్ధేశించాయి. భారతదేశంలో ఐటీ రంగం వేళ్లూనుకుంటున్న దశలో కర్ణాటక రాష్ట్రం అప్రమత్తంగా ఉండడం ద్వారా పెద్ద సంఖ్యలో సాంకేతిక సంస్థలని, పెద్ద మొత్తంలో పెట్టుబడులని ఆకర్షించగలిగిందన్న విషయం ఒక చారిత్రక సత్యం. తద్వారా first mover advantage బెంగళూరు నగరానికి దక్కింది. అయితే సాంకేతిక రంగంలో కొత్తగా వస్తున్న మార్పులు, అవి తీసుకువచ్చే అవకాశాల విషయంలో రాష్ట్ర ఏర్పాటు నుండి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాత్మకంగా అడుగులు వేసింది. పైన పేర్కొన్న అనేక విధానాల రూపకల్పన ఈ సాంకేతికపరమైన పొద్దు పొడుపు రంగాలకు (Sunrise Sectors) తెలంగాణను గమ్యస్థానంగా మార్చేందుకు దోహదపడ్డాయి.

ఐటీ రంగ అభివృద్ధి స్థూలంగా ఐదు కోణాలలో…

1. ఐటీ రంగ సంస్థల స్థాపన, విస్తరణ, పెట్టుబడులకు గమ్య స్థానంగా రాష్ట్రాన్ని రూపుదిద్దటం. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగం విస్తరణ. ఉద్యోగ, ఉపాధి కల్పన

2. అధునాతన సమాచార సాంకేతికత వినియోగంతో పౌర సేవల కల్పన. సరళమైన, వేగవంతమైన, పారదర్శక పాలనకై సమాచార సాంకేతికత అనువర్తనాల వినియోగం. భౌతిక, సైబర్‌ అవస్థాపన సౌకర్యాల (Infrastructure) కల్పన. ప్రభుత్వ పాలనలో, ప్రజా ప్రయోజనాలకై అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల (Emerging Technologies) వినియోగం

3. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించే, అంకుర పరిశ్ర మలకు ఊతమిచ్చే సమూహాల, వ్యవస్థల నిర్మాణం 

4. ఐటీ రంగంలో ఉద్యోగ సంసిద్ధతకై శిక్షణ, నైపుణ్యాభివృద్ధి. సాటిలైట్‌ టీవీ/ డిజిటల్‌ మీడియా మాధ్యమంగా ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ, విద్యార్థులకు, ఉద్యోగార్థులకు విద్యా, పోటీ పరీక్షలకై బోధన

5. ‘డిజిటల్‌ తెలంగాణ’ కార్యక్రమం ద్వారా ప్రతీ ఇంటికి కనీసం ఒకరిని డిజిటల్‌ అక్షరాస్యులుగా తయారు చేయడం.     

ఐటీ శాఖ పరిధిలోని వివిధ విభాగాలు – ఒక శాఖాధిపతి కార్యాలయం (HoD, ESD/ Meeseva), ఒక ప్రభుత్వ రంగ సంస్థ (PSU, TSTS Ltd.), మూడు సొసైటీలు (SoFTNET, TASK, Electronics), ఆరు కంపనీలు (T-Hub, WE Hub, TSIC, T-Works, T-Fiber, PVC) – నిర్ధిష్టమైన లక్ష్యాలతో ఏర్పడ్డా రాష్ట్రాన్ని డిజిటల్‌ తెలంగాణగా తీర్చిదిద్దడంలో ఏకోన్ముఖంగా పనిచేస్తున్నాయి. యేడేండ్లలో తెలంగాణను భారత ఐటీ రంగానికి కేంద్రంగా నిలపడంలో తమదైన పాత్రను పోషించాయి.

(మిగతా వచ్చే సంచికలో…)