|

ఏడేళ్ళలో ఎల్లలు దాటిన టి-సాట్‌ నెట్వర్క్‌

By: ముడుంబై మాధవ్‌

  • అభినందించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంధ్రశేఖర్‌ రావు
  • దిశా నిర్దేశం చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్య, విజ్ఞానం, నైపుణ్య శిక్షణ అందరికీ చేరవేయాలన్న లక్ష్యంతో రూపొందించబడ్డ ప్రభుత్వ రంగ బహుళ మాధ్యమ టెలివిజన్‌ నెట్వర్క్‌ టి-సాట్‌. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచనలకు అనుగుణంగా, ఐటీశాఖ మంత్రి కె.టి. రామారావు ఆచరణకు ప్రతిఫలంగా నేడు టి-సాట్‌ సేవలు మునుపెన్నడూ లేని విధంగా ప్రజలకు చేరువ అవుతున్నాయి. ప్రజల మన్ననలు పొందిన టి-సాట్‌ ఛానళ్ల ప్రసారాలను విధిగా వినియోగించుకోవాలని ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి తమ మంత్రివర్గ సహచరులతో సూచించడం టి-సాట్‌ నెట్వర్క్‌కు పెరిగిన ప్రాధాన్యతను సూచిస్తున్నది. నవంబర్‌ మూడవ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన సాఫ్ట్‌ నెట్‌ (టి-సాట్‌) జనరల్‌ కౌన్సిల్‌ ప్రభుత్వ శాఖలు టి-సాట్‌ ద్వారా ప్రసారం చేసేందుకుగాను మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు రూపొందించాలని సూచించడం సంస్థ పనితీరుకు అద్దం పడుతూనే, సంస్థ అక్కరను విశదపరుస్తున్నది. 

విద్యతో ప్రారంభమై…విభిన్న రంగాలకు విస్తరించి….

2001 సంవత్సరంలో అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొత్తానికి గాను 7,500 రిసీవ్‌ ఓన్లీ టెర్మినల్‌ (ROT)ల ద్వారా ప్రసారాలు ప్రారంభించిన టి-సాట్‌ (మన టీవి) ప్రస్తుతం పది కోట్ల మందికి సేవలను అందిస్తున్నది. దేశంలోని ఇతర రాష్ట్రాల విజ్ఞాన ప్రియులతోపాటు విదేశాల్లో ఉన్నవారు సైతం టి-సాట్‌ యూట్యూబ్‌ చానెల్‌ ను, యాప్‌ ను ఉపయోగించుకుంటున్నారు. 

టి-సాట్‌ నెట్వర్క్‌ విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు అందించే లక్ష్యంతో ప్రారంభమై పోటీ పరీక్షల అవగాహన కార్యక్రమాలు, విద్య, ఉద్యోగం, వైద్యం, మహిళలు, వ్యవసాయం తదితర ప్రాధాన్యత కలిగిన సామాజిక అంశాలపైన, స్ఫూర్తిదాయక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రారంభంలో పరిమిత సంఖ్యలో ప్రభుత్వ విద్యాసంస్థలకు మాత్రమే అందుబాటులో ఉండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత టి-సాట్‌గా రూపాంతరం చెంది దేశంలోని విద్యా సంబంధిత ఛానళ్లలో అగ్ర స్థానంలో నిలిచింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అనుమతించిన నాలుగు ఛానళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చెరో రెండు ఛానెళ్ల ద్వారా ప్రసారాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణాకు కేటాయించబడ్డ  రెండు ఛానళ్ళు విద్య, నిపుణ ఛానళ్లుగా నామకరణం చేసుకుని నిరంతరాయ సేవలందిస్తున్నాయి. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కేవలం ఏడు గంటల ప్రసారాలకే పరిమితమైన స్థితి నుండి 24 గంటలూ విద్యకు సంబంధించిన వివిధ ప్రసారాలు అందిస్తూ దేశానికే మార్గదర్శిగా నిలిచింది టి-సాట్‌. 

మొదటి స్థానంలో టి-సాట్‌..

అత్యధిక అక్షరాస్యత కలిగిన కేరళ రాష్ట్ర విద్యా సంబంధ ఛానల్‌ ‘విక్టర్స్‌ కేరళ’ను మించి టి-సాట్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. పదహారు టీవి ఛానళ్లను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న గుజరాత్‌ కంటే మెరుగ్గా టి-సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్ళ పనితీరు ఉండడం గమనార్హం. మొబైల్‌ యాప్‌, యూట్యూబ్‌ చానెళ్ళతో కలిపి 13 కోట్ల 9 లక్షల పైచిలుకు views, 30 లక్షల subscriptionsతో టి-సాట్‌ మొదటి స్థానంలో ఉండగా, 7.87 కోట్ల views, 33 లక్షల subscriptionsతో విక్టర్స్‌ కేరళ యూట్యూబ్‌ ఛానల్‌ రెండవ స్థానంలో నిలిచింది. మార్చ్‌, 2019 నుండి ప్రబలిన కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖకు, విద్యార్థులకు టి-సాట్‌ బాసటగా నిలిచి నిరంతరాయ సేవలు అందించింది. సుమారు 17,50,000 మంది విద్యార్థులకు ప్రసారాలు అందాలనే లక్ష్యంతో 2019 సెప్టెంబర్‌ ఒకటవ తేదీన విద్యాశాఖ ప్రారంభించిన ఆన్‌ లైన్‌ తరగతులు మొదటిరోజే రికార్డుస్థాయిలో 14,09,112 మందికి చేరినాయి. 

ఇస్రోతో ఒప్పందాలు

కె.టి. రామారావు ఐటిశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పేదలకు, పేద విద్యార్థులకు, మారు మూల ప్రాంత ప్రజలకు టి-సాట్‌ ప్రసారాలు అందించడానికి అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. అనుభవం కలిగిన బోధకులను నియమించి పోటీ పరీక్షల అవగాహన కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయాలని సీఈవో ఆర్‌. శైలేష్‌రెడ్డిని ఆదేశించారు. దీనికి అనుగుణంగా 2016 అక్టోబర్‌ నెలలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2009 వరకే ఉన్న శాటిలైట్‌ అనుమతులను మరో మూడేళ్లపాటు ఇస్రో పొడిగించింది. తదనంతరం మరో మూడు సంవత్సరాలు శాటిలైట్‌ అనుమతుల పొడిగింపుకై తెలంగాణ ప్రభుత్వ ఐటి శాఖ మరియు ఇస్రో నవంబర్‌ 22, 2019న ఒప్పందం చేసుకున్నాయి. 

డి.టి.హెచ్‌ లోనూ…

దేశ వ్యాప్తంగా డి.టి.హెచ్‌ (డైరెక్ట్‌ టు హోం) నెట్వర్క్‌ ప్రాతినిథ్యం పెరగడంతో కేంద్ర ప్రభుత్వం నుండి సంబంధిత అనుమతులు పొందే ప్రయత్నం చేసింది టి-సాట్‌. కేంద్రం అనుమతులు వచ్చేలోగానే టి-సాట్‌ ప్రసారాల ప్రాధానత్యను గుర్తించిన టాటా స్కై, ఏయిర్‌ టెల్‌, డిష్‌ టీవి, సన్‌ డైరెక్ట్‌ వంటి డి.టి.హెచ్‌ సంస్థలు టి-సాట్‌ విద్య, నిపుణ ఛానళ్లను ఉచితంగా ప్రసారం చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇస్రోతో  2016లో జరిగిన ఒప్పందంలోనే టి-సాట్‌ (అప్పటి మనటీవి) కార్యక్రమాలు కేవలం ఆర్వోటీల ద్వారానే కాకుండ కేబుల్‌ నెట్వర్క్‌ సంస్థల ద్వారా ప్రసారం చేసుకునే విధంగా సవరణలు చేస్తూ అనుమతులు పొందడం జరిగింది. రాష్ట్రంలోని సుమారు 43 మంది ఎం.ఎస్‌.ఒ ఆపరేటర్లను ఒప్పించి టి-సాట్‌ ప్రసారాలకు మార్గం సుగమం చేసింది టి-సాట్‌. దీంతో టి-సాట్‌ నెట్వర్క్‌ ప్రసారాలు ప్రతి పల్లె, ప్రతి మారుమూల ప్రాంత ప్రజలందరికీ అందుతున్నాయి. 

ప్రభుత్వ శాఖల కార్యక్రమాల వాహికగా…

రాష్ర విద్యాశాఖ పరిధిలోని 28,600 పాఠశాలల్లో 27 లక్షల మంది విద్యార్థులకు టి-సాట్‌ ప్రసారాల ద్వార ప్రయోజనం కలుగుతున్నది. కేవలం విద్యా శాఖకు సంబంధించి 2,470 ఎపిసోడ్స్‌ టి-సాట్‌ ద్వారా ప్రసారమయ్యాయి. డా. బీ. ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ సైతం తమ కార్యక్రమాల ప్రసారానికి టి-సాట్‌ సేవలు పొందుతున్నది. తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులూ టి-సాట్‌ ప్రసారాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా వారికి ఉపాధి అవకాశాలను చేరువచేసేందుకు సాంకేతిక విద్య కార్యక్రమాల ప్రసారాలపైనా ప్రత్యేక కసరత్తు చేసిన టి-సాట్‌ వేద ఐఐటి సంస్థ ఆధ్వర్యంలో VLSI(Very Large-Scale Integration) కోర్స్‌ పై ప్రత్యేక ప్రసారాలను అందించింది. మహిళా శిశు సంక్షేమం, వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యానవన, వైద్య ఆరోగ్య శాఖలు టి-సాట్‌ సేవలను విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. ఐటి శాఖ పరిధిలోని టాస్క్‌, వి హబ్‌ (We-Hub), పొటానిక్స్‌ వ్యాలీ శాఖలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. బధిరులు, మూగ దివ్యాంగుల కోసం సంకేత భాషలో (Sign Language) ప్రసారాలు చేస్తున్నది టి-సాట్‌.

  • అత్యంత ఆదరణ  పొందిన 
  • పోటీ పరీక్షల పాఠ్యాంశాలు 

విద్యా సంబంధ ప్రసారాలతో పాటు పోటీ పరీక్షల అవగాహన కార్యక్రమాలను ప్రసారం చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు మరింత చేరువయ్యింది టి-సాట్‌. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షలకు అవసరమైన పాఠ్యాంశాలను ప్రసారం చేసింది. పోలీస్‌, ఫారెస్టు, గురుకుల, మున్సిపల్‌, ఎలక్ట్రిసిటీ బోర్డు నిర్వహించే ఉద్యోగ పరీక్షల అవగాహన కార్యక్రమాల ప్రసారాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఆర్‌.ఆర్‌.బి., బి.ఎస్‌.ఆర్‌.బి., యూపీఎస్సీ, ఎస్‌.ఎస్‌.సి వంటి కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల నియామక పరీక్షలపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలను ప్రసారం చేసింది టి-సాట్‌. తద్వారా తెలంగాణతో పాటు, ఇతర రాష్ట్రాల ఉద్యోగార్థులను ఆకట్టుకుంది టి-సాట్‌. పోటీ పరీక్షలు, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించి సుమారు 3,757 ఎపిసోడ్స్‌ ప్రసారం చేయడం జరిగింది. గత ఏడు సంవత్సరాల కాలంలో ఈ కార్యక్రమాలపై ఉద్యోగార్థులు వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేసిన స్పందన టి-సాట్‌ సమర్థతకు, అక్కరకు దర్పణం పడతున్నాయి.     

వివాదాలు లేకుండా విభజన

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో భాగంగా టి-సాట్‌ (మునుపటి మన టీవి – SAPNET) పదవ షెడ్యూలులో చేర్చబడింది. నిబంధనలకు అనుగుణంగా అప్పటికే నిర్వహణలో ఉన్న ఎర్త్‌ స్టేషన్‌ హబ్‌ నాలుగు అకడమిక్‌ ఛానళ్లను అప్‌ లోడ్‌ చేసి ప్రసారాలు అందిస్తుండగా వాటిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ చెరో రెండు ఛానెళ్లను వినియోగించుకుంటున్నాయి. విభజన సమయంలో తెలంగాణకు చెందిన నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించడంతో ఉద్యోగుల విభజన ఎటువంటి సమస్య లేకుండా పరిష్కారమయ్యింది. 58:42 నిష్పత్తిలో ప్రసారాల, నిర్వహణ ఖర్చులు భరించాలన్న నిబంధనకు అనుగుణంగా సాఫ్ట్‌ నెట్‌ (టి-సాట్‌) మరియు సాప్‌ నెట్‌  (SAPNET) కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నాయి.

మరిన్ని ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు వాహిక కావాలి:  సీఎస్‌

టి-సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్లు మరిన్ని ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు వాహికగా నిలవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ సూచించారు. ప్రజలతో నేరుగా సంపర్కం ఉండే శాఖలను గుర్తించి, ప్రభుత్వ సేవలను ప్రజలకు సులువుగా చేరవేసే ప్రక్రియను రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిర్ణయాలు, కార్యాచరణ ప్రతి ఒక్కరికీ చేరే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. మొదటి విడతలో విద్య, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం, యువజన సర్వీసులు, మత్స్య శాఖలకు సంబంధించి ప్రసారాల ప్రాజెక్టు రూపకల్పనకు దిశానిర్ధేశం చేశారు. తమ కార్యాలయంలో నవంబర్‌ మూడవ తేదీన జరిగిన టి-సాట్‌ నెట్వర్క్‌ (సాఫ్ట్‌ నెట్‌) జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా కౌన్సిల్‌ ఛైర్మన్‌ గా ప్రసారాల విషయంలో పలు సూచనలు చేసి సంబంధిత ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు టి-సాట్‌ చేస్తున్న కృషిని అభినందిస్తూ భవిష్యత్తులోనూ నిరుద్యోగ యువత టి-సాట్‌ను మరింత మెరుగ్గా ఎలా ఉపయోగించు కోవచ్చో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.