అసెంబ్లీలో పలు బిల్లులు ఆమోదం
అసెంబ్లీ, కౌన్సిల్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో మొదటి రోజు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభను ప్రారంభించగానే ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా స్పీకర్ పలువురు కీర్తిశేషులైన శాసనసభ్యుల పేర్లను చదివి వినిపించారు. వారి రాజకీయ జీవితం గురించి, వారు చేసిన సేవల గురించి తెలియచేశారు. మాజీ శాసనసభ్యులు కుంజాబుజ్జి, అజ్మీరా చందులాల్, కేతిరి సాయిరెడ్డి, కుంజా భిక్షం, ఎం. సత్యనారాయణరావు, మాచర్ల జగన్నాథం, ఆర్.ముత్యంరెడ్డి, బుగ్గారపు సీతారామయ్య, చేకూరి కాశయ్యలకు సభ సంతాపాన్ని తెలియచేసింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. అనంతరం సభను స్పీకర్ వాయిదావేశారు.

రెండవ రోజు సభలో మొదట ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. అనంతరం జీరో అవర్ నడిచింది. జీరో అవర్ పూర్తి కాగానే మంత్రులు ప్రవేశపెట్టిన బిల్లులను సభ ఆమోదించింది. టీ బ్రేక్ తరువాత ‘‘తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ రంగాల ప్రగతి’’ అనే అంశంపై లఘు చర్చ జరిగింది. ఈ చర్చలో రాష్ట్రంలో జరిగిన పారిశ్రామిక, ఐటీ రంగాల ప్రగతిని పలువురు సభ్యులు కొనియాడారు.
2021, తెలంగాణ గృహనిర్మాణ మండలి (సవరణ) బిల్లును రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, 2021, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ (సవరణ) బిల్లును వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, 2021, జాతీయ న్యాయశాస్త్ర అధ్యయనముల మరియు పరిశోధనల అకాడమీ విశ్వవిద్యాలయ (సవరణ) బిల్లును, 2021 జాతీj న్యాయశాస్త్ర అధ్యయనముల మరియు అకాడమీ విశ్వవిద్యాలయ (సవరణ) బిల్లును అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, 2021, తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లును పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పక్షాన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిలు సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.

ప్రశ్నోత్తరాల సమయంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. పలు రద్దీ ప్రాంతాలలో అండర్ బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మద్యం దుకాణాల్లో ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు రిజర్వేషన్లు కల్పించడం విషయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమాధానమిస్తు త్వరలో బార్‌ల కేటాయింపులోను రిజర్వేషన్లు కలుగజేస్తామన్నారు. ఉద్యోగ, విద్యా విషయాల్లోనే కాకుండా ఆర్థిక వనరుల్లో కూడా రిజర్వేషన్లు కల్పించడం ఒక్క కేసీఆర్‌కే సాధ్యమైందని ప్రశంసించారు. నీరాను త్వరలో మార్కెట్‌లోకి ప్రవేశపెడతామన్నారు.
గొర్రెల యూనిట్ల పంపిణీపై మంత్రి శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి గొల్ల, కుర్మ యువకులకు గొర్రెల యూనిట్లు మంజూరీ చేస్తామన్నారు. ఇప్పటికి ఈ స్కీం కింద 11వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. తక్కువ రేటుకు నాణ్యమైన మాంసాన్ని అందించడమే తమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మూడు జూట్ మిల్లులు ఏర్పాటుకు ఒప్పంద సంతకాలు జరిగాయ న్నారు. ఇక్కడ గన్నీ బ్యాగుల కొరత తీర్చడానికి జూట్ మిల్లులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి గన్నీ బ్యాగుల కొనుగోలు బాధలు తప్పాలని కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. వారు తయారుచేసిన బ్యాగులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తు 14 జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు పూర్తయ్యాయని, మిగతావి కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. అన్ని కార్యాలయాలు ఒకచోట ఉంటే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని సీఎం కేసీఆర్ ఇవి నిర్మించారన్నారు. ఇక్కడ స్టేట్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జీరో అవర్ ప్రారంభ మయ్యింది.
గులాబ్ తుపాను కారణంగా అక్టోబరు 1వరకు సభ వాయిదా వేశారు.