ఆహుతులను తన్మయులను చేసిన శతావధానం

యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి భారతీయ సాంప్రదాయాలను మంటగలుపుతున్న ప్రస్థుత పరిస్థితుల్లో అమెరికాలో పుట్టి, అమెరికా పౌరుడై ఉండి, ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ చదువుతూ కూడా మన భారతీయ సంస్కృతిని నిలబెట్టడంకోసం ఎంతో కృషి చేస్తు, అవధాన ప్రక్రియను దశదిశలా చాటుతున్న శతావధాని లలితాదిత్య భరతజాతి గర్వించదగిన వ్యక్తుల్లో ఒకరని చెప్పవచ్చు. శృంగేరీ జగద్గురువులు పరమపూజ్య భారతీతీర్థ స్వామివారి వద్ద శిష్యరికం చేస్తూ శారదాంబ అనుగ్రహంతో నేను సైతం అంటూ సంస్కృతాంధ్ర భాషలలో శతావధానం చేయడం స్ఫూర్తిదాయకం. విద్యావంతులు ఎందరున్నా అందులో పండితులు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వెయ్యిమంది పండితులలో ఒక్కరు కవీశ్వరుడు ఉంటాడని, అలాంటి కవీశ్వరులలో నూటికి ఒకరు అవధానిగా ఉంటారన్న తిరుపతి వేంకట కవుల పద్యాన్ని నిజం చేస్తూ లలితాదిత్య కోటి కొక్కడుగా వెలుగొందుతున్నాడనడంలో అతిశయోక్తి లేదు. 

ఇలాంటి శతావధాని గన్నవరం లలితాదిత్య నిర్వహించిన శతావధానం పండిత, పామరులను అబ్బురపరచింది. ఈ సందర్భంగా నగరంలోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో మూడురోజుల పాటు జరిగిన గన్నవరం లలితాదిత్య శతావధానం దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా పరిషత్‌లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి.రమణాచారి మాట్లాడుతూ శతావధాని లలితాదిత్య పద్యాలను శ్లోకాలను అప్పచెప్తుంటే ఎంతో అబ్బురపడ్డానని, 32 నిముషాలలో ధారణ చేయడం చూస్తున్నప్పుడు ఒక్కొక్క పదాన్ని అవధాని పలుకుతున్న తీరు చూసి తనకు కళ్లల్లో నీళ్ళు వచ్చాయని  ప్రశంసించారు.  ఆయనను ’’శతావధాని శతధృతి’’ బిరుదుతో  సత్కరించారు. దుశ్శాలువా, గజమాల, ముత్యాలహారం, జ్ఞాపిక, తలపాగా, సన్మానపత్రాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రమణాచారి మాట్లాడుతూ ఈ అవధానంలో పాల్గొన్నంతసేపు తన మనసు పులకించి పోయిందన్నారు. 

తెలంగాణ శాసనమండలి సభ్యురాలు సురభి వాణీదేవి మాట్లాడుతూ… ఇంతమంది అవధానులమధ్య మాట్లాడడమంటే తాను సాహసం చేస్తున్నట్టేనని అంటూ … అవధానానికి తెలుగుభాషలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని, బి.ఎ.లో తెలుగు చదివిన తనకు అవధానం అంటే చాలా ఇష్టమని అన్నారు. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం మొదలైన ప్రక్రియలను నిర్వహించడమంటే అద్భుతమని అన్నారు. తన కుమారుని వయసు ఉన్న అవధాని సరస్వతీ పుత్రుడని, అమెరికాలో ఉంటూ,  అంతరిక్ష జ్ఞానాన్ని అభ్యసిస్తూ కూడా ఇలాంటి శతావధానాన్ని చేయడమంటే అత్యద్భుతమని, ఈ యువ అవధానికి ఆకాశమే హద్దని ప్రశంసించారు. యూ ట్యూబ్‌లోనూ, సాంకేతిక తెరలలోనూ మునిగి ఉండే ఈ తరం పిల్లలకు స్ఫూర్తినిచ్చేలా ఈ శతావధానం సాగిందని అన్నారు. ఈ శతావధానం వల్ల సారస్వత పరిషత్‌ పేరు సార్థకమైందని అనేకమంది పూర్వ అవధానులను స్మరిస్తూ వారి పేర్లను పలు వేదికలకు ఉంచడం ఎంతో స్ఫూర్తిదాయకమని అంటూ భవిష్యతులో ఇటువంటి కార్యక్రమాలకు జనం తండోపతండాలుగా రావాలని అన్నారు. ఈ సందర్భంగా నభూతో న భవిష్యతి అన్న రీతిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దర్శనమ్‌ పత్రిక అధినేతలు మరుమాముల సోదరులు వెంకటరమణ శర్మ, దత్తాత్రేయ శర్మలను అభినందించారు.

మరో తెలంగాణ శాసనమండలి సభ్యులు కూర రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ.. లలితాదిత్య ధారణాప్రతిభను చూసి తనను తాను మరిచిపోయానని, తన్మయత్వం చెందానని, ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు. చిన్నవయసులోనే ఇంతటి ప్రతిభను ప్రదర్శించిన లలితాదిత్య అష్టావధానం అంటే ఏమిటో తెలియని నేటి పిల్లలకు ఆదర్శమని, తల్లిభాషను ఏవిధంగా కాపాడుకోవాలో ఆచరించి చూపించారని అన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాసంబంధాల అధికారి వనం జ్వాలానారసింహారావు మాట్లాడుతూ 22 ఏళ్లకే అమెరికాలో ఉంటూ కూడా శతావధానం చేయడం అంటే చాలా శ్రమించి ఉంటారని, అలాంటి లలితాదిత్య వందల వేల మంది లలితాదిత్యలను తయారు చేయాలని అభిలషించారు. 

శతావధాన సంచాలకులు శ్రీరంగాచార్య మాట్లాడుతూ.. ఈ అవధానం తెలుగువారి పురాకృత పుణ్యవిశేషంగా భావిస్తున్నానని, అంతరించిపోతున్న తెలుగు భాషా గౌరవాన్ని పునరుద్దీపితం చేసే విధంగా అవధానం సాగిందని అన్నారు.   గన్నవరం లలితాదిత్య అవధాన గురువులు ధూళిపాళ మహదేవమణి మాట్లాడుతూ శతావధానం చేయడమంటే మాటలు కాదని, అలాగే నిర్వహించడమంటే మరింత కష్టమని అందుకు దర్శనమ్‌ సోదరులు ఎం.వి.ఆర్‌. శర్మ, మరుమాముల దత్తాత్రేయశర్మలను అభినందిస్తున్నానని అదే విధంగా రమణాచారి ధారణసభకు ముందే విచ్చేసి అవధానం పట్ల తమ మక్కువను ప్రదర్శించడం గొప్ప విషయమని కొనియాడారు.

ఈ విజయోత్సవ సభలో వేలేటి మృత్యుంజయశర్మ, బగళాముఖీ పీఠాధిపతులు శాస్త్రుల వేంకటేశ్వర శర్మ, వేదపండితులు జనమంచి సీతారామశర్మ, పి.వి. మనోహరరావు, డీ.టీ.వో హైదరాబాద్‌, పసర్ల శ్రీవల్లి సుబ్బలక్ష్మి,  శంకరమఠం ధర్మాధికారి కృష్ణారావు, అవధాని సురభి శంకరశర్మ, రంగి సత్యనారాయణ, దర్శనమ్‌ ప్రధాన సంపాదకులు మరుమాముల వెంకటరమణ శర్మ, తెలంగాణ గురుకుల పాఠశాలల విశ్రాంత ప్రధానాచార్యులు మరుమాముల దత్తాత్రేయశర్మ, 8 మంది శతావధానులు డా. దోర్బల ప్రభాకరశాస్త్రి, డా. జి.యం. రామశర్మ, ధూళిపాళ మహదేవమణి, డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌,  గండ్లూరి దత్తాత్రేయశర్మ, ఆముదాల మురళి, రాంభట్ల పార్వతీశ్వర శర్మ, ఐతగోని వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు సి.వి.సుబ్బన్న వేదికగా జరిగిన శతావధాన ధారణ సభలో అవధాని గన్నవరం లలితాదిత్య… 3 నిషిద్ధాక్షరి పూరణలు, 24 సమస్యా పూరణలు, 24 దత్తపది పూరణలు, 24 వర్ణన పద్యాలను మొత్తం 75 పద్యాలను 32 నిముషాల 15 సెకెన్లలో ఏ మాత్రం తడుముకోకుండా పూర్తి సాధికారికతతో అత్యంత వేగవంతంగా అవధాని శతావధాన పద్యాలను ధారణ చేశారు.