|

శ్రీ సారంగ శైల మహాత్మ్యము

దేవాలయంవున్నప్పుడు ఆదేవుని పేర స్తోత్రం, శతకం. లేదా ప్రబంధం, ఇంకా ఇతర ప్రక్రియల సాహిత్యం వెలువడటం సర్వసామాన్యమైనా – ఆయా కవుల రచనా సామర్థ్యం, కథా వస్తువు కారణంగా అవి వ్యాప్తి చెందుతాయి. ఈ పద్ధతిలో వచ్చిన క్షేత్ర సాహిత్యంలోని ప్రబంధమే – శ్రీ సారంగ శైలమాహాత్మ్యం. – డా. శ్రీరంగాచార్య

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలానికి చెందిన ‘బండపాలెం’ అనే గ్రామానికి తూర్పున వున్న పర్వతాన్ని సారంగా చలం అని, అక్కడ గుహాంతర్భాగంలో వెలసిన శ్రీరామచంద్ర స్వామిని సారంగాచల రాముడని వ్యవహరించటం పరిపాటి. ఈ క్షేత్ర విషయాన్ని మూడాశ్వాసాల్లో 430 గద్య పద్యాల్లో రచించిన మహాకవి – గోవర్ధనం వెంకట నరసింహాచార్యులు (1846-1936). బహువిధకృతి నిర్మాతయైన ఆచార్యులవారు నల్లగొండ జిల్లా అహల్యా మండలానికి చెందిన ఇబ్రహీంపేట గ్రామం వారు. కొన్నాళ్ల క్రితం వీరి ప్రతాపగిరి మాహాత్మ్యం అనే సిరిసెనగండ్ల నృసింహ క్షేత్ర మహత్మ్యాన్ని గూర్చి (2017 మే ‘తెలంగాణ’) తెల్పినప్పుడు కవి రచనల గూర్చి తెల్పబడింది. ఈ రెండు క్షేత్ర సాహిత్య రచనలేగాక – నకరెకల్లు మండలానికి చెందిన ‘పాలెం’ గ్రామ నృసింహవైభవం – లాలి – ప్రహరి’ని రచించినారు. నల్లగొండ జిల్లాలో వెలసిన ఎందరో దేవతామూర్తుల గూర్చి గొప్పనైన శతకాలను కూడా రచించిన ఆచార్యుల వారి ప్రతిభారీతి ఆశ్చర్యకరం.

సారంగాచలమహాత్మ్యం అనే యీ రచనకే సారంగాచల సీతారామ చంద్ర చరిత్రమని నామాంతరం. కవిగారు ఈ రెండు పేర్లను ప్రయోగించినారు. ఈ క్షేత్రం చాలా ఉననతమైన పర్వతంపైన సహజ సిద్ధమైన కోనేరుతోపాటు గుహాంతర్భాగంలో వెలసిన స్వామిరూపం కన్పడుతుంది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పంచమి నుండి పౌర్ణమి వరకు పాంచరాత్రంగా స్వామి వారి మహోత్సవలు జరుగుతాయి.ఈ సందర్భంగా జరిగే తిరుమంగయాళ్వారు చరిత్ర మనే యక్షగనాన్ని కూడా రచించినారు. ఇది ప్రసిద్ధ కృతి.

సారంగాచల మాహాత్మ్యం మూడాశ్వాసాల పరిధిగా రచతమైన శ్రీమద్రామా యణ కథ. కవిగారు ఎంతొ సంక్షేపంగా రామ కథను చెప్పి – చివర్లో సారంగుడనే తపస్వి – అతని సోదరులైన వీరుడు – భద్రుడు అనే వారి వృత్తాంతాన్ని తెల్పి – ఒక విధంగా మన తెలంగాణలోని మూడు క్షేత్రాల విశేషాలను సంక్షిప్తీకరించినారు. అవి – వీరా చలం = జీడికట్లు, భద్రాచలం = నేటి భద్రాద్రి, సారంగాచలం = ప్రస్తుత బండపాలెం క్షేత్ర విశేషం. విశేషమైన ఈక్షేత్రానికి వందలయేండ్లనాడు దేవాలయం. రామానుజకూటం, యాగశాల – మొదలైన నిర్మాణ స్వామి వారికి దాదాపు 50 ఎకరాల భూమిని సమర్పించి కీర్తనీయులైనవారు – పానుగంటి గృహనామధేయులైన వెలమధొరలు. వీరు బండ పాలెం. చందుపట్ల మర్రూరు, జజ్జూరు గ్రామాల్లో నివసించేవారు. నేటికీ వీరి పౌత్ర ప్రపౌత్ర సంతతి ఈ గ్రామాల్లో వుండటం ఒక విశేషం.

మూడాశ్వాసాల్లో రచితమైన ఈకృతి నిర్మాణ ప్రోత్సాహకులు పానుగంటి శంకరరావు – జగన్నాథరావు దేశముఖ్‌లు – కృత్యాది యందు సంప్రదాయ పరమైన స్తుతి పద్యాలు దాదాపు 18 కలవు. శంకరరావు గూర్చి –

1. శ్రీరమాధీశ్వర సేవాధురంధరుం

డాచార్య భక్తి యుక్తాత్మకుండు

2. మహిత సద్గుణ మణీ సహిత రామారాయ

ధాత్రీశ్వరునకగ్ర పౌత్రకుండు

3. స్థిరకీర్తియుత నారసింహ రాయావనీ

భుజునకు తానగ్ర పుత్రకుండు.

4. లాతిత సారంగశైలి సీతారామ

కరుణా కటాక్ష సంకలిత విభవు

డవని శ్రీపానగంటి వంశాబ్దివిధుడు

పద్మనాయక వర్ణ సంభవుడు సుగుణ

పాత్రుడతిశయ మటునూళ్ళగోత్రవార్ధి

రాజసముడైన శంకరరాయవిభుడు

ఈ విధంగా తెల్పి – తనను గూర్చి శంకర్రావుగారు

అర్థరసామృతోపమగుణాతిశయ ప్రతిమాన శబ్దసం

వర్ధిత సత్‌ ప్రబంధ శతవైభవ శ్రీవిభురాము పేటగో

వర్థన నారసింహగురువర్య భవన్మహిమన్నుతింపగా

సార్థకమయ్యెరామకథ సాదరమొప్పర చింపుడింపుగన్‌ (1-22)

అని ప్రార్థించి తాంబూలాదులొసంగి కృతి ప్రోత్సాహ కులైనారు.
tsmagazine

నైమిశారణ్యంలో వున్న మునివర్గానికి సూతుడు ఈ కథను చెప్పిన్లు కవి మనకు తెల్పుతున్నారు. ఏ క్షేత్ర విషయంగాని, భక్తి సంబంధ విషయంకాని ఒక ముని చెప్పినట్లు తెల్పటం కవుల పద్ధతి. ఇది ఆకర్షణీయం. సామాన్య జనపఠన, శ్రవణానుకూలం, ఈ పరంపరనే సారంగశైలి… కర్త పాటించినాడు.

ప్రథమాశ్వాసంలో దశరధునికి పుత్రప్రాప్తి. విశ్వామిత్రు ని వెంట రామలక్ష్మణులను పంపటం, శివధనుర్భంగం, సీతాకల్యాణం మొదలైనవి తెల్పి ద్వితీయాశ్వాసంలో పుండరీక చర్మధారియైన పరశురాముడు మార్గంలో శ్రీరామునకడ్డుపడి ఎన్నో ప్రగల్భాలను పల్కి – తన పరాక్రమానికి దర్శనంగా కార్తవీర్యార్జుని వృత్తాంతం, అతనిని తాను జయించి వధించటానికి కల కారణాలు తెల్పటం. తరువాత పరశురాముని సర్వశక్తులు శ్రీరాముని లో లీనమై – ఆయనకు భార్గవేయుడు వశంకావడటం. ఈ సందర్భాల్లో చక్కని పద్యాలు – కొన్ని వచనాలున్నాయి.

తృతీయాశ్వాసంలో – శ్రీరామ పట్టాభిషేకానికి కైకేయి విఘ్నం కలిగించగా, రామలక్ష్మణులు సీతాయుక్తులై అరణ్యానికి వెళ్లటం. అక్కడ తాటకాది రాక్షసహరణం – మారీచ కథ. సీతాపహరణం – మొదలైనవి తెల్పి – మారీచవధ సమయంలో ప్రయోగింపబడిన బాణం శిలను ఛేదించి గంగా జలాన్ని తెప్పిస్తుంది. అక్కడ తనస్సు చేస్తున్న వీరుడనేవాడు వచ్చి రామునికి మ్రొక్కి మేరు పర్వత పుత్రుల్లో నేను పెద్ద వాడను, నారద మంత్రోపదేశం వలన తపస్సు చేస్తున్నాను. తమరి దర్శనమయింది కాబట్టి తమరిక్కడే వుండవలెనని ప్రార్థిస్తే – రాముడు సూక్ష్మ్షరూపందాల్చి గుహాంతర్గతుడు కాగా – బాణ ప్రయోగం వలన ఏర్పడిన కుండమే – గుండంగా మారింది. అదే వీరాచలనామక క్షేత్రం జీడికల్లు. అక్కడి జలాశయం అది (నేటి జనగాం జిల్లాలో గల జీడికల్లు క్షేత్రం) తరువాత భద్ర, సారంగులనే వారికి మోక్షం ప్రసాదించటం. వారే భద్రాచల భద్రుడు – సారంగాచల (బండపాలెం) సారంగుడనేవారు. ఇవి కవి తెల్పిన క్షేత్ర విశేష వృత్తాంతాలు. వీటిలో ఆయా సన్నివేశాలు. క్షేత్ర – నదీనద వర్ణనలు చేయబడినవి. ప్రగ్ధర, మత్తకోకిల – మంజుభాషిణి వంటి విశేషమైన ఛందస్సులేగాక – గుహుడు శ్రీరామ చంద్రుని స్తుతించునప్పుడు నిరోష్ఠ్య దండకం కలదు. గుహునిపేరు నిరోష్ట్యం. పెదవుల సన్నికర్ష లేకుండా భక్తుడు – నిరోష్ఠ్య రీతి స్తోత్రం చేయటం ఒక విశేషం. ఆ దండకంలోని కొంత భాగం.

శ్రీశా! ధరాధీశలోకేేన శూలీ! సునాశీరలేఖాశ్రయాశాశు గోద్యత్క్వతాంతా! శరశ్రీదయాండోధినాధాది దిగ్రాజ సం స్తుత్య సత్య క్రియౌన్నత్య నిత్యా! సదాదైత్య హంతా! దురంతారిరాజా సురక్షేణ చక్రా! జితక్రోథ సాధు క్రియానూన దీనానుసంధాన గానానురాగా! దయానీరధే! తార్‌క్ష్యయానా! జనానంద సంధాయకా! స్థితానేకలోకా! లసన్నీరజాక్షా!… ఇత్యాదిగా దండకం సాగింది. ఆయా సందర్భాల్లో కవితా శైలీ విశేషం కన్పడుతూ కవి ప్రతిభాదులను వ్యక్తం చేస్తున్నది.

సారంగాచలక్షేత్రం గూర్చి – యోజన

నియతిన్‌ మీకు వచింతు నీలగిరికిన్‌ నిక్కంబుగా

ద్వయదూరంబున బండపాలెమమరున్‌ తత్‌ ప్రాగ్దిశన్‌ సంతతో

చ్ఛయమొప్పన్‌ విలసిల్లు పర్వతము సారంగాభిధానంబుచే

ప్రియమందన్‌ సరసీరు హాకరతరు శ్రీగండ శైలోన్నతిన్‌ (3-197)

(దీనిలోని నీలగిరి ‘నల్లగొండ’కు నామాంతరం)

ఆ నగరాజ శీర్షమున నానగరాని ప్రభాసమేతుడై

భానుకులుండు రాఘవు డపార కృపామతిబూనివేడ్కచే

జానకిలక్ష్మణుల్‌ గొలువచారుపయః పరిపూర్ణపుష్కరీ

స్థానమునన్‌ గుహాంతరముదాపుననిల్చె జగత్‌ ప్రసిద్ధుడై (3-198)

దీని తర్వాత క్షేత్రోద్ధారకులైన పానగంటివారి గూర్చి 4 పద్యాల్లో తెల్పి – చివర్లో –

సతతామోదము సంఘటింపగను శ్రీసారంగ శైలంబుపై

తతభక్తి ప్రియపూర్వకంబుగను సీతారామ చంద్రోత్సవం

బతివిస్తార పదార్థ జాలములచే నానంద పూర్ణంబుగా

ప్రతి సంవత్సరమున్‌ ఘటించి విబుధ ప్రావణ్యులై ప్రేమచే

3-204

ఇట్లా ఆనాటి పానగంటి గృహనామ వెలమదొరల భక్తి ప్రపత్తులను ఔదార్యాదులను వర్ణించినారు. ఆ నాడు కవికి వారేమి సమర్పించిరో కాని – వీరి వంశమంతా ఆచార్యుల వారి సారంగాచల – కృతివలన అక్షరం’గా నిలిచింది.

శ్రీవేంకట నారసింహాచార్య కవి – స్వస్థాన వేషభాషాభిమానంకలవారైనందున ‘అతి ప్రాచీన దేవతా వృత్తములను ప్రబంధీకరించి – తెలంగాణం అందులో నల్లగొండ జిల్లా యందలి క్షేత్ర సాహిత్యానికి అమూల్యాభరణములందించి శాశ్వత అక్షర యశః కాయులైనారు.

మనరాష్ట్రంలో ఇట్లా ఎన్ని అముద్రిత క్షేత్ర మాహాత్మ్య రచనలున్నాయో! వాటిని కాలమెరుగును ధారుణీ గర్భమెఱుగు !

కవి ఈ గ్రంథమును ”శాలివాహన శక వర్ష బులు 1736 సరియైన ఆనందనామ సంవత్సర శ్రావణ శుద్ధ పూర్ణిమాముతిథి వరకు సంపూర్ణముగారచియించ నయినది” అని వ్రాసుకున్నారు. దీనికి 1911క్రీ.శ. కాలగలు. నోట్‌ బుక్‌ సైజు వ్రాతపుస్తకం, 64 పుటలు, ఎరుపు, నలుపు సిరా ఉపయోగింపబడినది.