నేతన్నకు నైపుణ్య శిక్షణ

రాష్ట్రంలోని అన్ని గ్రామాలను, పట్టణాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పరచేందుకే పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర ఐటి, పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 10వ రోజున నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 10 పడకల చిన్న పిల్లల ఐ.సి.యు. వార్డును కె.టి.ఆర్ ప్రారంభించారు. రూ. 6 కోట్ల అంచనా వ్యయంతో సమీకృత మార్కెట్, రూ. 20 లక్షలతో జిల్లాలో అమర వీరుల స్థూపం ఏర్పాటు, రూ.159.54 లక్షల రూపాయలతో అంబేద్కర్ కూడలి నుండి వీర్‌సావర్కర్ కూడలి వరకు పాదచారులకు రోడ్డుతో పాటు, సుందరీకరణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
చేనేత వస్త్రాలకు అపురూప నిలయమైన నారాయణ పేట చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి అన్ని విధాల ఆడుకోవడానికి శింగారం చౌరస్తా దగ్గర 2.3 ఎకరాలలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న చేనేత నైపుణ్య శిక్షణ, ఉత్పత్తి కేంద్రానికి మంత్రి కె.టి.ఆర్ శంకుస్థాపన చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా 80 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన చిన్న పిల్లల పార్క్, రూ. 1.45 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సైన్స్ పార్క్‌ను ప్రారంభించారు. మహానగరంలో ఉన్నంత అందంగా ఈ పార్కులను తీర్చిదిద్దినందుకు జిల్లా కలెక్టర్, శాసన సభ్యులను మంత్రి కె.టి.ఆర్ అభినందించారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, పక్కనున్న ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణా రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతోందని తెలియజేశారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, 24 గంటల విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ, కే.సి.ఆర్. కిట్లు వంటి సంక్షేమ పథకాలపై వివరించారు. త్వరలోనే చేనేత కార్మికులను ఆదుకోడానికి చేనేత బీమ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు 5 లక్షల బీమా సౌకర్యం ఉచితంగా అంద జేయడం జరుగుతుందన్నారు. నారాయణ పేట జిల్లాకు శాశ్వత సాగు నీటికి కర్వేన రిజర్వాయరు పూర్తి చేసి కాలువ ద్వారా కృష్ణా జలాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు.. తెలంగాణకు న్యాయబద్దంగా రావలసిన కృష్ణ జలాలను తీసుకురావడానికి పొరుగు రాష్ట్రంతోనే కాదు అవసరమైతే దేవునితోనైన సరే పోరాడేందుకు వెనుకాడమని కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు.
ఆగస్టు 10వ తేదిన జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల ప్రాజెక్టు పై ప్రజాభిప్రాయ సేకరణ చేయటం జరుగుతుందని అప్పుడు ఇక్కడి రైతులందరూ ఆ ప్రాజెక్టుకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని కోరారు. నారాయణపేట జిల్లాలో ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇందుకు కనీసం 250 ఎకరాలకు తగ్గకుండా స్థలాన్ని గుర్తించి అప్పగించా ల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు సూచించడం జరిగిందన్నారు. జిల్లాకు నూతన సమీకృత కలెక్టరేట్ భవనం, యస్పి కార్యాలయ భవనాలకు పరిపాలన అనుమతి ఉత్తర్వులు మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించడం జరుగుతుందని, వెల్లడించారు. స్థానిక శాసన సభ్యుల కోరిక మేరకు జిల్లాకు విద్య, వైద్యం రంగాలలో అవసరమైన మేరకు పూర్తి సహాయ సహకారం అందజేయడం జరుగుతుందని ప్రకటించారు. ప్రతి ఒక్కరు దొరికిన ప్రతి చోట మొక్కలు నాటి జిల్లాను హరిత నారాయాణపేటగా తీర్చిదిద్దుకోవాలని, అందుకు ప్రజలు తమవంతు కృషి చేయాలని తెలిపారు. సైన్సు పార్కు దగ్గర మంత్రి మొక్కను నాటారు.

ఈ కార్యక్రమంలో అబ్కారి, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం రాక ముందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కనీస మంచినీరుకు కొట్లాడే పరిస్థితి ఉండేదని, తెలంగాణా రాష్ట్రం వచ్చాక ఇంటింటికి కుళాయి ద్వారా మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన మంచినీరు అందించడం జరుగుతోందని తెలిపారు. ఒకప్పుడు రైతులు వర్షాలు లేక, కరెంటు లేక అవస్థలు పడి వలసలు వెళ్ళేవారని ప్రస్తుతం దేశానికే అన్నం పెట్టె స్థాయికి మన రైతులు ఎదిగారని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి నారాయణ పేటకు సాగు నీరు తీసుకువస్తామని అన్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా వచ్చి రాష్ట్రం ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొ న్నప్పటికి రైతులకు రైతుబందు సహాయం కింద రాష్ట్రంలో రూ. 7,560 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడా సంక్షేమ పథకాలు ఆగలేదని, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటిల అభివృద్ధికి నిధులు ప్రతి నెల విడుదల చేయడం జరుగుతోందని తెలిపారు.
స్థానిక శాసన సభ్యులు యస్. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని, వెనుక బడిన నారాయనపేట జిల్లాలో అనేక అభివృద్ధి కార్యకమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇతర జిల్లాలకు ఏమాత్రం తీసిపోకుండా జిల్లాలో విద్య, వైద్య రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కరోనాతో రాష్ట్రంలో చాలా జిల్లాలు సతమతమైతే అత్యల్ప కరోనా కేసులు కలిగిన జిల్లాగా నారాయణపేట ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డి. హరిచందన పట్టణ ప్రగతిలో భాగంగా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను మంత్రుల దృష్టికి తీసుకు వచ్చారు. పట్టణంలోని అన్ని వార్డులను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి కలియతిరిగి ఆయా వార్డులలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తీర్మానాలు చేసుకోవడం జరిగిందన్నారు. రోజుకో కార్యక్రమం చేపట్టి సమస్యల పరిష్కారం చేయడం జరిగిందన్నారు. ఒక రోజు విద్యుత్ పవర్ డే నిర్వహించి తుప్పు పట్టిన, ఒరిగిన 1015 విద్యుత్ స్తంభాలను మార్చడం జరిగిందని, అవసరమైన చోట ట్రాన్స్ ఫార్మర్లు బిగించడం, వేలాడుతున్న విద్యుత్ తీగలను బిగించే కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడిరచారు. బృహత్తర పట్టణ ప్రకృతి వనంలో భాగంగా 3 ఎకో పార్కులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించేందుకు పకడ్బందిగా ప్రణాళికలు చేసి ప్రతి రోజు చెత్తను సేకరించడం జరుగుతుందన్నారు. అన్ని మున్సిపాలిటిల్లో సేగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగిందని , ఇకనుండి తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువులను సేగ్రిగేషన్ షెడ్లో తాయారు చేసేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగు తుందన్నారు.
హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ సంవత్సరం 48 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని ఇప్పటికే 55శాతం పూర్తి చేయడం జరిగిం దన్నారు. జిల్లాలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేసి ఓడియఫ్ ప్లస్ అవార్డును తీసుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం ఉత్తమ మున్సిపల్ వర్కరుగా కిశ్తమ్మను మంత్రి చేతుల మీదుగా సన్మానం చేశారు. మహిళా సమాఖ్య సంఘాలకు బ్యాంకి లింకేజి కింద రూ. 5 కోట్ల రుణాల చెక్కును మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. చేతనా స్వచ్చంద సంస్థ, కలెక్టర్ నిధులతో పాఠశాలలకు డిజిటల్ తరగతులకై 120 టెలివిజన్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, మండలి విప్ దామోదర్ రెడ్డి, మండలి సభ్యులు కసిరెడ్డి నారాయణ్ రెడ్డి, సురభి వాణి దేవి, జిల్లా పరిషత్ ఛైర్మన్ వనజమ్మ, మహబూబ్ నగర్ జడ్పి ఛైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కోడంగల్ శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, ఆలంపూర్ శాసన సభ్యులు డా. అబ్రహం, మున్సిపాల్ ఛైర్మన్ అనసూయ గందే, వైస్ ఛైర్మన్ హరినారాయణ భట్టాడ్, ప్రిన్సిపాల్ సెక్రెటరి శైలజ రామయ్యర్, సి.డి.యం.ఎ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ కే. చంద్రా రెడ్డి, డి.సి.సి.బి. ఛైర్మన్ నిజాం పాషా తదితరులు పాల్గొన్నారు.