ఆకాశమంత సూర్యుడు!
By: దోర్బల బాలశేఖరశర్మ

‘నవ్యోజ్వల’ (సూపర్నోవా) పరిణామ దశలో వున్న ‘బేటెల్జాస్’ అతి భారీ నక్షత్రం రానున్న కొద్దివేల సంవత్సరాలలోనే విస్ఫోటనం చెందగలదని, అది రేపో మాపో లేదా ఈ క్షణంలోనైనా కావచ్చునని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే, దీనివల్ల మన భూమికి, సౌర వ్యవస్థకూ, ఇంకా చెప్పాలంటే, పాలపుంతకు సైతం వచ్చే ఆపద, ప్రభావం అంటూ ఏమీ ఉండదని వారన్నారు. కారణం, ఇది నెలకొని వున్న ‘ఓరియన్’ నక్షత్ర మండలం పాలపుంతకు కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉండటమే.
‘‘పదార్థం (శక్తి) కేవలం రూపాంతరం చెందుతుందే తప్ప అది పూర్తిగా నాశనం కాదని శాస్త్రవేత్తలు ఏనాడో తేల్చారు. అది మట్టిలోని రేణువైనా, ఆకాశంలోని సూర్యుడైనా అంతే. సమస్త విశ్వం ఇదే సూత్రంపై ఆధారపడి ఉన్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆకాశంలో రాత్రిళ్లూ మినుకు మినుకుమనే తారలకూ ‘‘జనన మరణాలు’ తప్పవన్నమాట. ఇంత మహోన్నత విశ్వంలో ఎక్కడ, ఏ క్షణం, ఏ అద్భుతం జరుగుతుందన్నది తెలుసుకోవడం మానవ మాత్రులకు అంత తేలికైన విషయమూ కాదు. శాస్త్రవేత్తల ప్రస్తుత జ్ఞానానికి అందుతున్న సమాచారం మేరకు ఖగోళశాస్త్రంలో సరికొత్త వింతలు అనేకం వెలువడుతూనే ఉన్నాయి. వాటిలోనిదే ఇదొకటి.
విశ్వంలోని సుమారు రెండు ట్రిలియన్ల (రెండు లక్షల కోట్లు) నక్షత్ర వీధుల (గెలాక్సీ)లో వ్యాపించిన 200 ట్రిలియన్ల (200 లక్షల కోట్లు) తారలలో అతిభారీ విస్ఫోటనాలకు సిద్ధంగా వున్న ‘అరుణ తారలు’ (రెడ్ స్టార్స్) మొత్తం ఎన్ని వున్నాయన్నది ఇప్పటికైతే శాస్త్రజ్ఞుల అంచనాకు అందలేదు. ఒక్క మన పాలపుంత (మిల్కీవే గెలాక్సీ)లోనే ఇలాంటి ‘‘అతి పెద్ద ఎర్ర నక్షత్రాలు’’ 80 వరకూ వున్నట్టు చెబుతున్నారు. భూమికి దాదాపు 310 నుంచి 430 కాంతి సంవత్సరాల దూరంలో, ఓరియన్ నక్షత్ర మండల భుజభాగంలో నెలకొని వున్న ‘బేటెల్జాస్ Betelgeuse వాటిలో ప్రముఖమైంది. నవ్యోజ్వల పరిణామ దశలో వున్న ఈ అతిభారీ నక్షత్రం (supergians star) పూర్తిగా అంతరించే వేళకు ఆకాశమంత నిండుకొంటుంది. అంటే, ఒక వేళ సూర్యుడినే కేంద్రంగా ఇది కలిగివుంటే బుధుడు, శుక్రుడు భూమి మూడు గ్రహాలను మింగేసి అంగారకుని కక్ష్యవరకు దీని అతి భారీ వ్యాసార్థం వ్యాపిస్తుందన్న మాట. (ఎప్పటికో ఒకప్పటికి మన సూర్యుడూ ఈ స్థాయికి చేరుకోగలడని దీనినిబట్టి మనం అర్థంచేసుకోవాలి. కాకపోతే, అందుకు ఇంకా అనేక లక్షల కోట్ల సంవత్సరాల సమయం ఉంది). ఇది సూర్యునికన్నా 370 రెట్లు అధిక వ్యాసార్థం!
‘బేటెల్జాస్’కు ఇది అంతిమ కాలం. ఈ సమయానికి అది ఆకాశమంతా నిండుకొని పేలిపోతుంది. ఆకాశంలో అంత ప్రదేశం మేర నిరంతరాయంగా సుమారు రెండు నెలలపాటు అది కాంతిని ప్రసరింజేస్తుందని కూడా శాస్త్రవేత్తలు అన్నారు. అయితే, ఈ మహోపద్రవం జరగడానికి కొద్దివేల సంవత్సరాల సమయమే ఉందని, అది రేపైనా లేక ఈ క్షణంలోనైనా సంభవించవచ్చుననీ వారన్నారు. ఈ అతి భారీ తార మన సౌర కుటుంబానికి చాలా దూరంలో ఉంది కనుక, దాని ప్రభావం మన వరకు పడకపోవచ్చునని వారు భావిస్తున్నారు.
అతి భారీ నక్షత్రాలు విస్ఫోటనం చెందిన తర్వాత ‘సూపర్నోవా’ (నవ్యోజ్వల తార)గా, ఆ తర్వాత మొత్తం పదార్ధ వ్యవస్థ అంతా కుప్పకూలిపోయి ‘‘న్యూట్రాన్ స్టార్’’ (పరమాణు నక్షత్రం)గానో లేదా ‘కాలబిలం’ (బ్లాక్ హోల్)గానో మారుతుంది. కాగా, ప్రస్తుతం ‘బేటెల్జాస్’ నక్షత్రం వెలుగు మన సూర్యుని ప్రకాశం కన్నా 10,000 రెట్లు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ తరహా ‘ఎర్ర అతిభారీ తారలు’ సాధారణంగా 15 యుక్త వయసు సూర్యుల ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని, వీటి జీవితకాలం సూర్యునిలో 1,000వ వంతు అని వారు తెలిపారు.
కాంతి కణం మహా ప్రయాణం!
‘ఒక కాంతి కణం (Photon) ప్రయాణ ‘తీరూ`తెన్నూ’ తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. సూర్యుని అంతర్భాగం (core) లోంచి ఉపరితలం వరకూ ఇది ప్రయాణించడానికి సగటున మొత్తం 40,000 సంవత్సరాల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరింత, విస్మయకరమైన విశేషం ఏమిటంటే, సూర్యుని ఉపరితలానికి చేరిన తర్వాత ఇదే కాంతి కణం కేవలం 8 నిమిషాలలో మన భూమిని చేరుతుంది. కాంతి కణం పరమాణువు (atom) లోంచి విడుదలైన తర్వాత ఒక్కో ద్రవ్యరాశిలోంచి ఒక్కో తీరున ప్రయాణిస్తుందన్నమాట. సూర్యునిలోని, ఉష్ణ ద్రవ్యరాశిలో 6,96,000 కి.మీ (ఉపరితలం వరకు) దూరం ప్రయాణించడానికి అది అన్ని వేల ఏండ్ల సమయం తీసుకొంటే, అంతరిక్షంలోకి శూన్యంలో మాత్రం 148 మిలియన్ (14.8 కోట్లు) కి.మీ (సూర్యుని నుండి భూమి వరకు) దూరాన్ని చేరుకోవడానికి కేవలం 8 నిమిషాల సమయమే పడుతున్నది. ఇదెలా అన్నది ఒక రకంగా సంక్షిష్టమైన గణాంకమే అయినా, ఫలితం మాత్రం చాలా స్పష్టమని వారంటున్నారు. దీన్ని బట్టి, మనల్ని ఈ క్షణంలో చేరిన సౌర కణాలు సూర్యుని హృదయంలో జన్మించి ఇప్పటికి కొన్ని లక్షల సంవత్సరాలు అవుతున్నట్లుగా భావించాలి. ఇందుకుగాను ‘కాంతి కణం’ అనేక అసంఖ్యాకమైన ‘డ్రంకెన్ జంప్స్’ (తప్పతాగిన స్థితిలో జరిగే ప్రమాదాలు)కు గురి కావలసిఉంటుందని వారన్నారు.