చిన్నారులకు చిరుధాన్యాలు
By: ఎన్. భీమ్‌కుమార్, ఆదిలాబాద్
సామాజిక బాధ్యత క్రింద కార్పోరేట్ సంస్థలు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక చేయూతను అందిస్తున్నాయి. ఒక ప్రక్క విద్యుత్ పంపిణీలో వెలుగులు విరజిమ్ముతున్న పవర్ గ్రిడ్ మరో పక్క సామాజిక సేవలు అందిస్తోంది. అందులో భాగంగా ఆదిలాబాదు జిల్లాలోని బోథ్, గుడిహత్నూర్, ఇచ్చోడ, జైనథ్, నేరడిగొండ మండలాల్లోని 160 అంగన్వాడీ కేంద్రాలలోని 3,200 మంది చిన్నారులకు పౌష్టికాహారం అంధించేందుకు ‘‘చిన్నారులకు చిరుధాన్యాలు’’ అనే పేరుతో 99.64 లక్షల రూపాయలతో పవర్ గ్రిడ్ సంస్థ ప్రతినిధులు సీనియర్ జి.ఎం. జి.వి. రావు, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందం ప్రకారం ఒక ఏడాది పాటు చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలు, ఇప్పపువ్వు లడ్డులను చిన్నారులకు అందించడం జరుగుతుంది. ఒప్పందం కుదుర్చుకున్న నిధుల నుండి 65.59 లక్షల రూపాయలు పౌష్టికా హారం కోసం కేటాయించగా ప్రతి రోజు కొర్రలు, జొన్న, ఉప్మా, రాగి అంబలి, వారానికి మూడు రోజులు ఇప్పపువ్వు లడ్డు అందించడం జరుగుతుంది. 34.05 లక్షలతో అంగన్వాడీ కేంద్రాలలోని చిన్నారులకు పాఠశాల కిట్లు, అంగన్వాడీ కేంద్రాలకు పలు రకాల వస్తువులను అందించనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం లేకుండా ఉండేందుకు సాంప్రదాయ చిరుధాన్యాలు, ఇప్పపువ్వు లడ్డులను పవర్ గ్రిడ్ సంస్థ ద్వారా ఐదు మండలాల్లోని 3200 మంది చిన్నారులకు అందించడం జరుగుతుందని తెలిపారు.
గిరిజన గర్బిణీలకు ఇప్పపువ్వు లడ్డులు
జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లోని గర్బిణీలకు రక్త హీనత సమస్య తలెత్తకుండా వారానికి మూడు రోజులు ఇప్పపువ్వు లడ్డూల పంపిణీకి ఉట్నూర్ మండలంలోని నీలగొంది గ్రామంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐ.టి.డి.ఏ. పి.ఓ. భవేష్ మిశ్రాలు శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టు కింద సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ పరిధిలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలాలను ఎంపిక చేసింది.
ఎంపిక చేసిన మండలాల్లో 200 మంది చొప్పున గిరిజన గర్బిణీలను గుర్తించి రోజుకొక ఇప్పపువ్వు లడ్డూ అంగన్వాడీ కేంద్రంలో తినిపించడం జరుగుతుందని, జాతీయ పోషక సంస్థ వారు గుర్తించిన మహిళల హిమోగ్లోబిన్ శాతాన్ని సేకరించారని, ఆరు మాసాల అనంతరం తిరిగి రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పరిక్షిస్తామని తెలిపారు. ఆరు మాసాల పాటు ఇప్పపువ్వు లడ్డూలు తిన్న గర్బిణీల హిమోగ్లోబిన్ శాతం పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆదిలాబాదు, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 3000 మంది గర్బిణీలకు పౌష్టికాహారంతో కూడిన ఇప్పపువ్వు లడ్డును అందించడం జరుగుతుంది. ఈ ప్రయోగం ఫలిస్తే రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు పరచడానికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.