|

ఆర్థిక సామాజిక న్యాయ సాధన దిశగా.. సబ్బండ వర్ణాల సంక్షేమం..

భారత దేశంలో పేదరికం ఆర్థికమైనదే కాదు సామాజికమైనది కూడా. ఉత్పత్తిలో భాగస్వాములయి సంపదను సృష్టిస్తున్న సబ్బండ వర్ణాలు తర తరాలుగా సామాజికంగా, ఆర్థికంగా అణచివేయబడుతున్న దయనీయ పరిస్థితి నెలకొన్నది. డెబ్బయేండ్ల స్వతంత్రభారతావనిలో ఈ ఉత్పత్తికులాల జీవన విధానం ఎక్కడవేసిన గొంగళి అక్కడనే అన్నట్టున్నది. స్వయం పాలన అమలులోకి వచ్చేనాటికి తెలంగాణలో 85 శాతంగా వున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రం తెచ్చిన గుణాత్మకమార్పును గర్వంగా అంచనావేయలేని పరిస్థితే నెలకొన్నది.

వలస పాలన కాలం మొత్తంగా తెలంగాణకు పనిగట్టుకొని చేసిన అన్యాయాన్ని లెక్కించడానికి అంకెలు, సంఖ్యలు సరిపోవేమో. తెలంగాణ కష్టజీవి సృష్టించిన సంపదను తెలంగాణలో కాకుండా నాటి ఉమ్మడి రాష్ట్రంలోని ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకే ఎక్కువగా పంచిన లెక్కలు చరిత్ర సాక్షాలుగా వేలాడుతున్నయి. నాటి ఆంధ్రా వలస పాలక వ్యవస్థ తెలంగాణ ప్రజల కడుపులు మాడ్చి సంపదనంతా నీళ్ళు, నిధులు, నియామకాలు, తదితర రూపాల్లో వారి ప్రాంతానికి తరలించుకపోయింది. అట్లా నదులకు నదులను నీళ్ళను, లక్షలాది ఉద్యోగాలను, లక్షల కోట్ల విలువయిన నిధులను, వనరులను మలుపుకపోయిన వలస పాలన పన్నిన కనిపించని కుట్రలతో తెలంగాణ పల్లె కన్నీరు పెట్టింది.

దశాబ్దన్నర పాటు సాగిన శాంతియుత పార్లమెంటరీ పోరాట పంథాను నడిపించి కేంద్రం మెడలు వంచి సాధించిన తెలంగాణను అమరుల ఆకాంక్షల సాక్షిగా ఆత్మగౌరవ పథాన నడిపిస్తున్న ఘనత నాటి ఉద్యమ రథ సారధి, నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకే చెందుతుంది. తెలంగాణ పోరు నినాదాలను నిజం చేసే దిశగా గత ఐదేండ్ల కెసిఆర్‌ పాలన అనేక అడ్డంకులను ఎదురీదుతూ అప్రతిహతంగా సాగుతున్నది. తెలంగాణలో సృష్టించిన సంపదను తెలంగాణ జనాభాలో 85 శాతంగా వున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ఖర్చుచేసిన తర్వాతనే ఇతరత్రా ఖర్చు చేయాలనే విధానాన్ని అమలు పరుస్తూ వస్తున్నది ప్రభుత్వం. సబ్బండ వర్ణాల అభివృద్ధి, సంక్షేమ మే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నయి. ‘బతుకు, బతకనివ్వు’ అనే సోషలిజపు ఆర్థిక సామాజిక న్యాయ సూత్రాన్ని ఇరుసుగా చేసుకుని ఎవరెంతో వారికంత అనే సహజ సూత్రాన్ని ఆసరా చేసుకుని తెలంగాణలో మొదటి దఫా పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుని, తెలంగాణ ప్రజల నిండు దీవెనలతో రెండో దఫా కూడా భారీ మెజారిటీతో గెలిచింది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం. రెట్టించిన ఉత్సాహంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న వ్యవసాయాభివృద్ధి అందులో భాగమైన సాగునీరు ప్రాజెక్టుల నిర్మాణం, తాగు నీరు సహా రైతుబంధు బీమా వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలను అమలు పరుస్తున్నది. రైతు వృత్తిని చేపట్టిన దాదాపు అన్ని బీసీ కులాల సంక్షేమం దిశగా వివిధ రంగాలకు చెందిన దాదాపు 500 పథకాలను అమలు పరుస్తున్నది కెసిఆర్‌ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమంలో తోటి రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి, దేశానికి దిశ దశను నిర్దేశించింది. ఈ నేపథ్యంలో.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం తెలంగాణలో గత ఐదు ఏండ్లుగా అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల వివరాలను, అవి అందించే ఫలాలను ఒకసారి మూల్యాంకనం చేసుకుందాం.

జీవితం మీద భరోసా పెంచిన కేసీఆర్‌:
రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ అనే విధానంలో పూర్‌ డాడ్‌ ఆలోచనా విధానంలో మగ్గిపోతున్న బిసీ వర్గాల ఆలోచనా దృక్పథాన్ని సమూలంగా మార్చే దిశగా సిఎం కెసిఆర్‌ సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు పరుస్తున్నరు. చరిత్రలో కనీవినని రీతిలో, దేశం గర్వించే స్థాయిలో నలభై వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం వలసపాలనలో కోల్పోయిన జీవిత భరోసాను తిరిగి ఐదేండ్లలో నెలకొల్పిందని చెప్పవచ్చు. ‘ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులే మిన్న’ అనే లోకనీతిని నిజం చేస్తున్నది కేసీఆర్‌ పాలన. పేదవాని ఆకలిబాధలకు సానుభూతి పలకరింపులతో పై పై పూతపూయకుండా వారికి కడుపునిండా తిండి అందిస్తున్నది. విద్య, వైద్యం, సొంతఇల్లు, కరెంటు తదితర మౌలిక వసతులను కల్పిస్తూ ఆర్థిక భరోసాను పెంచుతున్నది. తద్వారా ఆత్మన్యూనతను తొలగించి ఆత్మగౌరవాన్ని పెంచే పద్ధతిలో అనేక పథకాలను గత ఐదేండ్లుగా అమలుపరుస్తున్నది కెసిఆర్‌ ప్రభుత్వం.

ఎస్సీ ఎస్టీల సంక్షేమం :
తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి శిధిలాలయాలుగా మారిన గిరిజన తాండాలు, గూడాలు, దళిత వాడలలో కోటి ఆశల కాంతి దీపాలను వెలిగించింది. తెలంగాణ ప్రభుత్వం. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక అభ్యున్నతితో పాటు ఆర్థిక ఆలంబనను అందించి వారిని పాలనలో మరింతగా భాగస్వామ్యం కల్పించింది. ఆ దిశగా రాజకీయ నిర్ణయాలను అమలు పరుస్తున్నది. గడిచిన ఐదేండ్ల కాలంలో ఎస్సీల కోసం 104 రెసిడెన్షియల్‌ పాఠశాలలను, 30 డిగ్రీ కళాశాలలను మొత్తంగా 134 గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసింది. ఎస్టీల కోసం ప్రత్యేకంగా 51 గురుకులాలను స్థాపించి విజయవంతంగా నడుపుతున్నది. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, స్టడీ సర్కిళ్ళను ఏర్పాటు చేస్తూ వారి చదువుకు చేయూతనిచ్చింది. 20 లక్షల రూపాయల ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌లను మెయింటెనెన్స్‌ ఫీజులను అందిస్తూ పేదవారికి దేశంలో విదేశాల్లో పెద్ద చదువులను అందిస్తున్నది ప్రభుత్వం. తెలంగాణ సామాజిక రంగాన్ని అత్యంత ప్రభావితం చేసిన దేశానికి ఆదర్శంగా నిలిచిన పథకంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ నిలిచింది. ఆడపిల్లల తలిదండ్రులకు భరోసాగా నిలవడమే కాకుండా బాల్యవివాహాలను నిలువరించిన గొప్పపథకంగా దేశీయ, అంతర్జాతీయంగా అభినందనలు అందుకున్నది ఈ పథకం.

దళిత గిరిజనుల ఇంటి శత్రువు, యజమాని జీవితాన్ని పీల్చిపిప్పి చేసిన గుడుంబా మహమ్మారినుంచి కాపాడిన ప్రభుత్వం గత ఐదేండ్లల్లో వారి అభివృద్దికి నిధులను కేటాయించడమే కాకుండా, స్వయం ఉపాధి కోసం అనేక సబ్సిడీలను పెంచింది. ఇంకా, 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, విద్యుత్‌ బకాయిల మాఫీ, విజిలెన్స్‌ కేసుల ఎత్తివేత వంటి అనేక పథకాలను ఎస్సీ, ఎస్టీలకు తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్నది.

ఆసరా పింఛన్లు, బీడీ కార్మికులకు భృతి, రుణమాఫీ, ఫీజు రీయంబర్స్‌ మెంట్‌, ఆరుకిలోల బియ్యం, సన్న బియ్యం, ఆరోగ్యలక్ష్మీ, వంటి పలు పథకాల ద్వారా మొత్తంగా 30 వేల కోట్ల రూపాయలతో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఖర్చు చేస్తూ వారి జీవితాల్లో గుణాత్మక మార్పుకు బాటలు వేసింది. వారికి వొక జీవిత భరోసానిచ్చింది. వీటితో పాటు సబ్‌ ప్లాన్‌ ద్వారా ఎస్సీ, ఎస్టీ తాండాలను, గూడాలను ప్రధాన స్రవంతిలో సమాజానికి ధీటుగా అభివృద్ధి పరిచి వారిని మందిల కలిపి ఆత్మగౌరవాన్ని పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,177 తాండాలను గూడాలను గ్రామ పంచాయ తీలుగా గుర్తించడం ద్వారా ఉద్యమకాల నినాదంగా వున్న ‘మా తాండాలో మా రాజ్యం’ అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసింది. అదనంగా మరో 1,281 ఆవాస ప్రాంతాల్లోని షెడ్యూలు ఏరియాలను, జనాభా ఆధారంగా మరో 688 గ్రామాలను ఎస్టీలకు రిజర్వు చేసి మొత్తంగా 3,146 మంది ఎస్టీలను సర్పంచులను చేసిన ఘనతను సాధించింది. తద్వారా అట్టడుగు వర్గాలను పాలనలో భాగస్వాములను చేసి దేశ చరిత్రలో ఆదర్శంగా నిలిచిన ఘనత కెసిఆర్‌ ప్రభుత్వానికే దక్కిందని చెప్పవచ్చు. దళితులకు మూడెరాల భూమిని పంచుతూ దున్నేవానికే భూమి అనే సమ సమాజ భావనను అమలు పరిచేందుకు నడుంకట్టింది తెలంగాణ ప్రభుత్వం. భూపంపిణీ అమలులోకి వచ్చిన 35 ఏండ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో దళితులకు భూములు పంచేందుకు కేవలం 2.65 కోట్లు ఖర్చు చేస్తే, నాటి టిడిపి హయాంలో 71 కోట్లు ఖర్చు చేసినయి. అదే గడచిన కేవలం నాలుగేండ్లలోనే టిఆరెస్‌ ప్రభుత్వం 503 కోట్ల రూపాయలను ఖర్చు చేసి నాటి ప్రభుత్వాలకంటే మూడింతల సాగుయోగ్యమైన భూమిని దళితులకు పంచింది. దానికి కొనసాగింపుగా 2018-19 బడ్జెట్‌లో రూ.1469 కోట్లను కేటాయించింది.

మార్కెట్‌ కమిటీల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టి దేశ చరిత్రలోనే రికార్డును సృష్టించిన ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీలను పాలనావ్యవస్థలో భాగస్వాములను చేసే దిశగా అడుగులు వేస్తూ 25 మంది ఎస్సీ రైతులను, 23 మంది ఎస్టీ రైతులను మార్కెట్‌ కమిటీ చైర్మన్లను చేసింది.

యువతీ యువకులకు స్వయం ఉపాధి రంగంలో చేయూతనిస్తూ వృత్తి నైపుణ్య శిక్షణాకార్యక్రమాలను అమలు పరిచి ఆటో మొబైల్‌ సర్వీసింగ్‌, మోటార్‌ డ్రైవింగ్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఎయిర్‌ హోస్టెస్‌, చెఫ్‌, పంచకర్మ ఆయుర్వేద వైద్యం, హెల్త్‌ కేర్‌ వంటి అనేక రంగాల్లో తర్ఫీదునిచ్చి సొంతకాళ్ళ మీద నిలబెడుతున్నది. అందులో భాగంగా దాదాపు 3000 మందికి 11 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేసింది. ఎస్సీ, ఎస్టీ యువతీ యువకులను కేవలం ఉద్యోగాలకు మాత్రమే పరిమితం చేయకుండా వారిని స్వయం ఉపాధి రంగంలో ప్రోత్సహిస్తూ, ఎదిగిన పారిశ్రామిక వేత్తలుగా చూడాలనే సంకల్పానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినరు. అందులో భాగంగా రాయితీలు కల్పించడమే కాకుండా ఇండస్ట్రీయల్‌ పార్కుల్లో ఎస్సీలకు 15.44 శాతం, ఎస్టీలకు 9.34 శాతం స్థలాలను రిజర్వ్‌ చేసింది ప్రభుత్వం. 5 కోట్ల రూపాయలతో ఎకరం స్థలంలో ప్రత్యేక టిఎస్‌ ఫ్రైడ్‌ పేరున తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రాం ఫర్‌ రాపిడ్‌ ఇంకుబేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. పరిశ్రమలను స్థాపించి అభివృద్ధి పరిచేందుకు రాయితీలు ఇస్తూ అన్నిరకాలుగా అండగా నిలుస్తున్నది ప్రభుత్వం. కాంట్రాక్టర్లుగా ఎదిగిన ఎస్సీ, ఎస్టీలకు కాంట్రాక్టు పనుల్లో కూడా రిజర్వేషన్‌ను కల్పించింది.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీల జనాభా శాతం సంఖ్యలో పెరుగుదల కనిపించింది. అందుకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని సిఎం కేసీఆర్‌ కేంద్రం మీద వత్తిడి తెస్తూ ఆ అంశాన్ని రాష్ట్రాల వెసులుబాటుకు వదిలివేయాలని డిమాండు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అందుకోసం కమీషన్లను వేసి సమగ్ర నివేదికలను తయారుచేసి కేంద్రానికి అందించింది. ఈ మేరకు 2017 ఏప్రిల్‌ 16న అసెంబ్లీలో తెలంగాణ రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందింది. ఇందులో ఎస్టీల రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి, ముస్లింలలో వెనకబడిన వర్గాలకు 4 నుంచి 12 శాతానికి పెంచాలని వాటికి రాజ్యాంగబద్ధత కల్పించే దిశగా 9వ షెడ్యూల్‌ లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానించింది.

మైనారిటీల సంక్షేమం :
అనేక రకాల పూలతో నిండిన గుల్‌ దస్తా భారతదేశం. గంగా జమునా తహజీబ్‌ ఈ దేశానికి సొంతం. భారత సమాజం సంక్లిష్టమైన పలు మతాల శాంతియుత జీవన సమాహారం. హిందూమతాన్ని ఆచరించే ప్రజలు ఎక్కువగా ఉండగా ముస్లిం క్రిస్టియన్‌, సిక్కు, తదితర మతాలను ఆచరించే వారి సంఖ్య తక్కువగా వుందీ దేశంలో. అట్లాంటి మైనారిటీ మతస్థుల సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించిన అనేక హక్కులకు తెలంగాణ ప్రభుత్వం రక్షణ కల్పించడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా వినూత్న రీతుల్లో మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నది. అందుకు గాను బడ్జెట్‌ లనే భారీగా నిధులను కేటాయించి వారి సంక్షేమానికి ఖర్చు పెడుతున్నది.

ఇందులో భాగంగా 2015-16 బడ్జెట్‌లో రూ.1,130 కోట్లు, 2016-17 లో 1,204 కోట్లు, 2017-18 లో 1249.66 కోట్లు, 2018-19లో రూ. 2 వేల కోట్లు బడ్జెట్‌లో నిధులను కేటాయింపు జరిగింది. కాగా నాటి ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు కలిపి 2014 -15 లో కేటాయించింది కేవలం రూ. 1,030 కోట్లు మాత్రమే. అదే సందర్భంలో మొత్తం దేశంలోని మైనారిటీల కోసం కేంద్ర బడ్జెట్‌ దాదాపు 4000 కోట్లయితే., వొక్క తెలంగాణ మైనారీటీలకోసం 2000 కోట్లు కేటాయించడమంటే మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.

అధికారికంగా రంజాన్‌, క్రిస్మస్‌ వేడులను నిర్వహించడం, అబ్దుల్‌ కలాం జయంతిని మైనారిటీ సంక్షేమ దినంగా పాటించడం, పారిశ్రామిక వేత్తలకోసం టిఎస్‌ ప్రైమ్‌ను అమలు పరచడం, అనాథలకు అండగా అనీస్‌ ఉల్‌ గుర్భా భవనాన్ని నిర్మించడం, యువతకోసం స్వయం ఉపాధి పథకాలను అమలు పరచడం, ప్రత్యేక శిక్షణాకార్యక్రమాలను అమలు పరచడం, 10 కోట్లతో క్రిస్టియన్‌ భవన నిర్మాణం, ఆజ్మీర్‌లో రుబాత్‌ నిర్మాణానికి చర్యలు, చర్చిల నిర్మాణ అనుమతులను సులభతరం చేయడం, మక్కామసీదు అధునీకరణకు నిధులను కేటాయించడం, జామియా నిజామియా యూనివర్సిటీని అభివృద్ది చేయడం, ఫలక్‌ నుమాలో డిగ్రీకాలేజీ ఏర్పాటు, సెల్ప్‌ ఫైనాన్సింగ్‌ కోర్సులకు నిధుల కేటాయింపు, హజ్‌ యాత్రికుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు, షాదీఖానాల నిర్మాణం, సిక్కులకోసం భారీ గురుద్వారా నిర్మాణం, మైనారిటీల కోసం ప్రత్యేకంగా 206 గురుకులాలు, విద్యార్ధులకు ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్స్‌,ఇమామ్‌ మౌజమ్‌ లకు నెలకు రూ.5000 భృతి, మైనారిటీ శాఖలో ఉద్యోగాల నియామకం, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా వక్ఫ్‌ బోర్డు ఏర్పాటు, పదెరాల విస్తీర్ణంలో ఇస్లామిక్‌ సెంటర్‌ కమ్‌ కన్వెన్షన్‌ హాల్‌ నిర్మాణం, ఉర్దూ భాష పరిరక్షణ అభివృద్ధి కోసం పటిష్ట చర్యలు, తెలంగాణ ఉర్దూ అకాడమీ ఏర్పాటు, ఫస్ట్‌ లాంగ్వేజీ ఆప్షన్‌ గా ఉర్దూ, ఉర్దూ భాషలో నీట్‌ వంటి పరీక్షల నిర్వహణ, వంటి అనేక పథకాలను అమలు పరచడంతోపాటు ముస్లింల జీవన స్థితిగతుల అధ్యయనానికి సుధీర్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది. దాంతోపాటు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లకోసం అసెంబ్లీలో తీర్మానం చేసింది.

బిసీ సంక్షేమం :
మొత్తం దేశ సంపదను సృష్టించడంలో ఈ సబ్బండ వర్ణాలదే కీలక పాత్ర, అయినా వీరు ఇంకా వెనకబడే వుండడం సామాజిక సమస్యనే. భారత సామాజిక వ్యవస్థలో వేల్లూనుకుపోయిన ఈ ఝాడ్యాన్ని రూపుమాపి వెనకబడిన కులాలను ముందు వరసలో నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది. ఇప్పటికే రాజ్యాంగబద్దంగా అమలు పరుస్తున్న కార్యక్రమాలకు మరింత గొప్పగా మెరుగులు దిద్దుతున్నది. దాదాపు 113 కులాలుగా విభజించబడి తెలంగాణ జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 29 (బిసీ ఎ-7 శాతం, బి- 10 శాతం, సి-1 శాతం, డి-7 శాతం, ఇ- 4) శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు

పరుస్తున్నది.బిసీల అభ్యున్నతికి 2014-15 లో రూ.2022.12 కోట్లు, 2015-16 బడ్జెట్లో 2,172 కోట్లు, 2016-17 లో రూ.2,537 కోట్లు, 2017-18 బడ్జెట్లో రూ.5,070.36 కోట్లు, 2018-19 లో రూ.5,919.83 కోట్లు కేటాయించి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరుస్తున్నది. గత ఉమ్మడి రాష్ట్ర పాలనలో బీసీ సంక్షేమం కోసం 2013-14లో 1,659 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. అదే సందర్భలో బిసీల్లో అత్యంత వెనకబడిన వర్గాలను మొట్టమొదటగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వారి (ఎంబీసీల) అభివృద్ధి కోసం ఏడాదికి రూ. 1,000 కోట్లు కేటాయిస్తూ ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నది.

3 వ తరగతి నుంచి పీజీ దాకా చదువుకుంటున్న దాదాపు 85 వేలమంది విద్యార్థులకు రాష్ట్రంలో 700 కు పైగా బీసీ హాస్టల్లను పటిష్టపరిచింది. వాటి నిర్వహణకోసం సాలీనా దాదాపు 300 కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నది. గడిచిన నాలుగేండ్లల్లో బిసీ విద్యార్ధుల చదువులకోసం ఫీజు రియంబర్స్‌ మెంట్‌ అందిస్తున్నది. అందు కోసం దాదాపు 4,500 కోట్లరూపాయలను కేటాయించింది. మెయింటెనెన్స్‌ ఫీజు, బీసీ స్టడీ సర్కిల్ల ద్వారా ఉచిత శిక్షణ, మెస్‌ చార్జీల పెంపుతో పాటు బిసీ విద్యార్ధుల విద్యా వికాసానికి అనేక విధాలుగా తోడ్పాటునందిస్తున్నది.

విదేశాల్లో విద్యను అభ్యసించే వారికోసం మహాత్మాఫూలే ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్పులు (విదేశీ విద్యానిధి) కింద ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలను అందిస్తున్నది. గత పాలనలో బిసీలకు కేవలం 19 మాత్రమే గురుకులాలు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఎం కెసీఆర్‌ ఆలోచనల మేరకు వాటి సంఖ్యను 162కు పెంచింది. అంతేకాకుండా, 2019-20 నడుస్తున్న విద్యాసంవత్సరానికి నియోజకవర్గానికి వొక్కటి చొప్పున మరో 119 బీసీ గురుకులాలు ఏర్పాటు చేసింది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సమగ్ర వ్యూహాన్ని అమలుపరుస్తూ కుల వృత్తులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. ఇందుకు త్రిముఖ వ్యూహాన్ని అమలు పరుస్తున్నది.మనుగడలో వున్న కుల వృత్తులను అవసరాన్ని పట్టి ప్రోత్సహించడం, ఆర్థిక సాయం అందించడం, మొదటి వ్యూహం కాగా, మారుతున్న కాలాన్నిబట్టి మారుతున్న కులవృత్తులను అధునీకరించడం, వాటికి మార్కెటింగ్‌ సౌకర్యాలను కల్పించడం, రెండో వ్యూహం, కుల వృత్తిని కాదనుకుని ప్రత్యామ్న్యాయ ఉపాధి మార్గాన్ని చూసుకునే వారికి తగిన ఆర్థిక సాయం చేయడం అనేది మూడో వ్యూహం. త్రిముఖ వ్యూహాన్నిఅమలు చేసేందుకు బడ్జెట్లో నిధులను కూడా కేటాయించింది.

గ్రామీణ వృత్తులకు తిరిగి ప్రాణం పోసి గ్రామ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేసి గ్రామ స్వరాజ్యాన్ని అమలులోకి తెచ్చే వ్యూహంలో భాగంగా సిఎం కెసిఆర్‌ అమలుపరుస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం చారిత్రకంగానే కాకుండా మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పెంపకం వృత్తిని అవలంబిస్తున్న దాదాపు 6 లక్షల కుటుంబాల గొల్ల కురుమలకు ఈ పథకం ద్వారా వొక్కో కుటుంబానికి లక్షా ఇరువై వేల రూపాయల ఖర్చుతో 20 గొర్లు, ఒక పొటేలను యూనిట్‌గా దాదాపు కోటీ అరవై లక్షల గొర్లను 7.6 లక్షల యూనిట్లుగా చేసి అందిస్తున్నది. అందుకుగాను 5 వేల కోట్ల రూపాయాలను కేటాయించింది. గొర్రెలకు ఉచిత దాణా, గొర్ల సంతలు, వధశాలల ఏర్పాటు, మీట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, మాంసం, కూరగాయ మార్కెట్ల అభివృద్ధితో పాటు బీమా సౌకర్యాన్ని కూడా కల్పించింది. ఆరుదశాబ్దాల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వాలు పంచిన గొర్రెల సంఖ్య కేవలం 12 వేలు మాత్రమే కావడం గమనార్హం. గొల్ల కురుమల ఆత్మగౌరవాన్ని చాటేవిధంగా 10 కోట్లతో పది ఎరాల్లో ఆత్మగౌరవ భవనాన్ని మంజూరు చేసింది.

చేపల పెంపకం :
గొర్రెల పెంపకంతో పాటు మత్స్య సంపద గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నది.ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.. లక్షలాదిగా వున్న బెస్తలు, గంగపుత్రులు, ముదిరాజులు మత్స్య వృత్తిని చేపట్టిన ఇతరుల సంక్షేమం కోసం 100 శాతం

ఉచితంగా చేపపిల్లలను అందిస్తున్నది. ఈ చారిత్రక పథకం ద్వారా 2018 నాటికి మత్స్య కార్మికులకు కోట్లాది ఆదాయం సమకూరడమే కాకుండా దాదాపు నాలుగు లక్షల మంది కి ప్రత్యక్ష ఉపాధి, మరో 30 లక్షలమందికి పరోక్ష ఉపాధి కలుగుతున్నది. వెయ్యి కోట్లతో సమీకృత మత్స్య అభివృద్ది పథకాన్ని ప్రారంభించింది. రొయ్యలసాగును పెంపుచేస్తూ, చేపల అమ్మకం కేంద్రాలకు భారీ సబ్సిడీలను అందిస్తూ, చేపల పెంపకం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న. నీలి విప్లవ పథకం (Blue Revolution) గులాబి విప్లవం (రొయ్యల అభివృద్ధి ) విప్లవాత్మక ఫలితాలను రాబడుతున్నది. ఇట్లా.. వ్యవసాయాభివృద్ధికి హరిత విప్లవంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలను వృద్ధిలోకి తీసుకురావడానికి తెలంగాణ వెనకబడిన వర్గాల కోసం ఎరుపు విప్లవం (మాంసం కూరగాయల ఉత్పత్తుల పెంపకం) శ్వేత విప్లవం (పాలు పాల ఉత్పత్తుల పెంపకం) వెండి విప్లవం (కోడిగుడ్ల ఉత్పత్తుల పెంపకం), బంగారు విప్లవం (పండ్ల ఉత్పత్తుల పెంపకం), ఆహారపు గొలుసు విప్లవం (గిడ్డంగుల ఏర్పాటు)తో పాటు అన్నిరకాల ఉత్పత్తుల పెంపకంతో ఇంధ్ర దనుస్సు విప్లవాలను సృష్టిస్తున్నది.

నేతన్నకు చేయూత :
వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి కల్పనా రంగం చేనేత రంగం.ఈ రంగంలో పనిచేస్తున్న చేనేత కార్మికుల కోసం పలు కార్యక్రమాలను అమలు పరుస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా 2017-18 బడ్జెట్లో రూ. 1270 కోట్లు, 2018-19లో రూ. 1200 కోట్లు కేటాయించి చేనేత రంగాన్ని అధునీకరించి ఉపాధి అవకాశాలను పెంచుతున్నది. గ్రూప్‌ వర్క్‌ షెడ్‌, అప్పరెల్‌ పార్క్‌, మరమగ్గాల అధునీకరణను పూర్తి ఉచితంగా చేపడుతూ., రుణ మాఫీ అమలు పరుస్తూ, యాభై శాతం సబ్సీడీ పై నూలు, రసాయనాలను అందిస్తూ, వస్త్రాల కొనుగోలు పథకాన్ని తెచ్చి నేతకార్మికులకు కూడా బీమా పథకాన్ని అమలు పరుస్తూ నేతన్నకు చేయూత పథకం ద్వారా ఆదుకుంటున్నది. త్వరితగతిన పూర్తి చేసుకోబోతున్న వరంగల్‌లో అతిపెద్దదయిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు ద్వారా తెలంగాణ నేతన్నల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నయి.

గౌడుల సంక్షేమం :
ఇంకా బీసీల్లో ప్రధానకులాల్లో ఒకటయిన గౌడులకోసం కూడా ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నది ప్రభుత్వం. వీరికి 5 లక్షల ప్రమాద భీమాను అందిస్తున్నది. కల్లు దుకాణాలను పునరుద్ధరించి గీత కార్మికుల సంక్షేమానికి పాటుపడుతున్నది. ఈత, తాటి వనాలను పెంచుతున్నది. గౌడుల ఆత్మగౌరవ భవనం గీత భవన్‌ నిర్మాణానికి హైద్రాబాద్‌లో 5 ఎకరాల స్థలం 5 కోట్ల రూపాయలను కేటాయించింది.తాటి చెట్ల పై పన్నును రద్దు చేసి పాత బకాయీలను కూడా మాఫీ చేసింది. లైసెన్సు కాలపరిమితిని 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచింది. సబ్సిడీ ని 25 వేలనుంచి 1 లక్షకు పెంచింది. బిసీ సంక్షేమ శాఖద్వారా నాలుగేండ్ల కాలంలో 21.30 కోట్ల బడ్జెట్‌ ను కేటాయించింది.

ఎంబీసీలకు చేయూత :
ఇంకా ఎంబీసీలుగా వున్న రజకుల జనాభా రాష్ట్రంలో దాదాపు 8,66,243. వీరి కోసం 2017-18 బడ్జెట్లో రూ. 250 కోట్లు 18-19 బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించింది. అధునిక దోభీ ఘాట్ల నిర్మాణం కోసం రూ. 169 కోట్లు, అధునిక యంత్రాలతో లాండ్రీల ఏర్పాటు, అదే విధంగా నాయీ బ్రాహ్మణులు (మంగళి) సంక్షేమం కోసం 2014- 15 బడ్జెట్‌లో రూ. 21.63 కోట్లు, 15-16లో రూ. 20 కోట్లు, 16-17లో రూ. 22 కోట్లు,

18-19 బడ్జెట్‌లో రూ. 250 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. సబ్సిడీపై 5 కోట్ల 26 లక్షల ఆర్ధిక సాయాన్ని 589 మందికి అందచేసింది. రాష్ట్రంలోని దాదాపు 25 వేల మందికి నూతనంగా కటింగు షాపుల కోసం ఆర్ధిక సాయం చేస్తున్నది. సెలూన్లకు గృహ కేటగిరీ విద్యుత్తును అందచేస్తున్నది.

బిసీల్లోని ఇతర ఎంబీసీ సంచార వర్గాలకు కూడా ప్రభుత్వం చేయూతనందిస్తున్నది. వాల్మీకి బోయ, ఫెడరేషన్లకు 11 కోట్లు కేలాయించిన ప్రభుత్వం, సగర ఫెడరేషన్‌కు రూ. 20.73 కోట్లు, భట్రాజు ఫెడరేషన్‌కు రూ.7.61 కోట్లు, కృష్ణ బలిజ (పూసల) ఫెడరేషన్‌కు రూ.15.71 కోట్లు విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ. 34.11 కోట్లు, కుమ్మరి ఫెడరేషన్‌కు రూ.35.27 కోట్లు, మేదర కార్పోరేషన్‌కు రూ.13.63 కోట్లు, వడ్డెర ఫెడరేషన్‌కు రూ. 34.28 కోట్లు కేటాయించింది. ఇంకా ఎంబీసీలకు ప్రత్యేక కార్పోరేషన్‌ ఏర్పాటు చేసి 2017-18, 18-19 ఆర్థిక సంవత్సరాల్లో రూ.2000 కోట్లను కేటాయించింది. ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగానే ఎంబీసీలకు కూడా స్వయం ఉపాధి పథకాల్లో సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించినారు. ఇంకా బీసీలకు వందశాతం సబ్సిడీ రుణాలను అందచేసే దిశగా 11 బీసీ ఫెడరేషన్ల ఎండీలకు విధివిధానాలను సూచించింది.

ఇంకా అనేక బీసీ కులాలకు కూడా విప్లవాత్మకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరుస్తున్నది. సంపదను పెంచి బీదలకు పంచడమనే ఆర్థిక న్యాయమే కాకుండా, అన్నిరంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అభివృద్ధి పథాన నడిపించి గత ఐదేండ్ల కాలంగా సామాజిక న్యాయ సాధన దిశగా కెసిఆర్‌ ప్రభుత్వం అడుగులేస్తున్నది.