ఘనుడు శాశ్వతుడు

By: శ్రీ మాశర్మ

ఈ దేశాన్ని ఎందరెందరో రాజులు, చక్రవర్తులు, సార్వభౌములు, ప్రభువులు, నాయకులు పరిపాలించారు. కానీ, కొందరు మాత్రమే శాశ్వతమైన యశస్సును ఆర్జించారు, ప్రజల హృదయాల్లో సుస్థిరమైన పీఠం వేసుకొని నిలిచి పోయారు. సుపరిపాలన అందించడమే కాక, సంస్కృతికి పట్టంగట్టి గొప్ప సంపదను వారసత్వంగా జాతికి బహూకరించారు. భోజరాజు, శ్రీకృష్ణ దేవరాయలు, రాజరాజనరేంద్రుడు, మనుమసిద్ధి, రేచర్ల రుద్రయ్య వంటి ప్రభువులు ప్రసిద్ధులు.

ఈ సిద్ధికి, ప్రసిద్ధికీ పోషణ, ప్రోత్సాహం, ప్రచారం మూలస్థంభాలు. వారంతా మహాకవులను, కళాకారులను మహాద్భుతంగా పోషించి, మహాకావ్య, కళాసౌందర్య నిర్మాణంలో మూలస్థంభమై నిలిచారు. అనేక దేవాలయాల నిర్మాణంలోనూ, పునఃనిర్మాణంలోనూ అంతే శ్రద్ధాభక్తులు చూపించారు. అందుకు, తెలుగునేలపై విలసిల్లుతున్న రామప్ప, తిరుమల, సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయాల వంటివి సజీవ సాక్ష్యాలు.

రామప్ప దేవాలయానికి ప్రతిష్ఠాత్మకమైన ‘ప్రపంచ హెరిటేజ్‌ వారసత్వ హోదా’ కూడా ఇటీవలే లభించింది. ఈ సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి, దీక్షాదక్షతలే మూలస్థంభాలు. చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, విష్ణుకుండినులు తమ పాలనలో చేసిన సాంస్కృతిక సేవ, భక్తిసామ్రాజ్యంలో నడచిన త్రోవ జగద్విదితం. రాజ్యాలను, చరిత్రను, సంస్కృతిని శోభాయమానం చేసిన ఈ పాలకులందరినీ ఎవరు ఆదర్శంగా తీసుకొని పరిపాలిస్తారో వారు కూడా అదే యశోధనానికి అర్హులవుతారు. యాదాద్రి పునఃనిర్మాణంతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతారనే మాటలు సత్యసుందరాలు.

ఈ ప్రజాస్వామ్య యుగంలో నేటి పాలకులే నాటి ప్రభువులకు వారసులు. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా కవి, రచయిత, సాహిత్యవేత్త, భావుకుడు. అంతకు మించి పరమభక్తుడు, ఆధ్యాత్మిక చింతనాపరుడు. ‘తెలంగాణ’ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పరిపాలన మొదలైన తొలినాళ్ళల్లోనే ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ నిర్వహించి,తెలంగాణ తెలుగు దనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. న భూతో న భవిష్యతిగా ‘అయుత చండీ యాగం’ నిర్వహించారు. ఆ మహాయజ్ఞ ఫలాలు తెలంగాణనేలపై ఆణువణువూ ప్రతిఫలించాయి. యాదగిరి లక్ష్మీనరసింహ దేవాలయన్ని పునఃనిర్మాణం చేయాలని తలపెట్టిన సంకల్పం సామాన్యమైనది కాదు, అది పరమపవిత్రమైన మహాసంకల్పం. అందుచేతనే, ఈ మహానిర్మాణం ఆరేళ్ళ లోపే పరిపూర్ణంగా సంపూర్ణమైంది. ఈ భువన భవనం పూర్తవ్వాలంటే? ఎంతటి వేగంగా కదిలినా 20 ఏళ్ళు పడుతుందని నిర్మాణరంగ నిపుణులు చెబుతున్నారు. అటువంటిది కేవలం 5-6ఏళ్ళల్లోనే సంపూర్ణమైందంటే? ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పబలం, ఆ మహదాశయంలోని పవిత్రత తప్ప వేరు కాదు.ఇది స్వకార్యం కాదు, స్వామికార్యం. అందుకే ఆ నృసింహస్వామి అన్నీ తానై నడిపించాడేమో! అనిపిస్తోంది. ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి. అందుకేనేమో! మారుత వేగంగా కార్యక్రమం యావత్తు నడిచింది. తెలంగాణలో ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో దేవాలయాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. ఇది జ్ఞానభూమి, దేవభూమి. యాదాద్రి మహానిర్మాణంతో ప్రపంచ పర్యాటకులంతా తెలంగాణ వైపు కదలి వస్తారు. ఆధ్యాత్మిక పర్యాటకం కోటి ప్రభలతో విభవిస్తుంది.

పశ్చిమ చాళుక్యరాజు త్రిభువనమల్లుడు యాదాద్రి నృసింహస్వామిని తులసీదళాలతో కొలిచి గుజరాత్‌ పాలకుడైన పృథ్వీవల్లభుడిని యుద్ధంలో ఓడించాడు. ఇటువంటి మహిమలెన్నింటికో నెలవు యాదాద్రి క్షేత్రం. మిగిలిన దేవాలయాలతో పాటు నారసింహ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి. కాకతీయ పాలకులలో గణపతిదేవ మహరాజు ‘నృసింహతత్త్వం’ వ్యాప్తికి ఎంతగానో కృషి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనా కాలంలో పునఃనిర్మాణమైన ‘యాదాద్రి’ నృసింహతత్త్వాన్ని శిఖరాయ మానంగా ప్రతిష్ఠిస్తుంది, అందులో సందేహమే లేదు. ఆగమ, వాస్తుశాస్త్రాలు, ఆధునిక నిర్మాణ సాంకేతికతలు ఆలంబనగా ఈ మహానిర్మాణం జరిగింది. స్తపతులు-ఇంజనీరింగ్‌ నిపుణులు – ఆర్కిటెక్ట్స్‌ మూడు స్థంభాలైతే, నాలుగో స్థంభం ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈ నిర్మాణం వెయ్యేళ్లకు పైగా నిలవాలన్నది కల్వకుంట్లవారి దృఢసంకల్పం.

కాకతీయ, చాళుక్య కట్టడాల రీతులను పరిశీలించి, పరిశోధించి యాదాద్రి నిర్మాణానికి ఉపక్రమించారు ముఖ్యమంత్రివర్యులు. ‘కృష్ణశిల’ను ఎంచు కోవడంలో రహస్యం కలకాలం నిలవాలన్న మహాసంకల్పం. ఆ విధంగా, ప్రపంచంలోనే మొదటి ‘రాతిదేవాలయం’గా యాదాద్రి నిలువబోతోంది. యాదగిరిగుట్ట ‘యాదాద్రి’ అయ్యింది. ఆ అచ్చ తెలుగు పదబంధంలో సంస్కృత భాషీకరణ జరిగింది. ఆ పల్లెసీమ స్వర్ణమయమైంది. అక్కడ భూముల ధరలు బంగారాన్ని దాటిపోయాయి. సామాన్యుడు కూడా కోట్లకు పడగలెత్తుతున్నాడు. యాదగిరిగుట్టకు భక్తుల రాక కొత్త కాదు. శతాబ్దాల నుంచి ఆ స్రవంతి నిరాఘాటంగా సాగుతూనే ఉంది. కాకపోతే, సరైన వసతులు ఉండేవి కావు, సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్టు కనిపించేది. నేటితో ఆ కష్టాలన్నీ కొట్టుకుపోయాయి.

ఆ క్షేత్రమంతా సకల వసతులు, వనరులతో సర్వాంగసుందరంగా ముస్తాబైంది. కోలాటాలు, భజనలు, నృత్య విన్యాసాలు, సంగీత కచేరీలు, ప్రవచనాలతో గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వికాసం జరుగబోతోంది. ఒకప్పుడు ఆ గుట్టల్లో నడుస్తూ ఉంటే మృదంగధ్వనులు వినిపించేవట! అదే రీతిగ, ‘‘రాతి స్థంభాలకే చేతనత్వము కలిగి ‘సరిగమ పదనిస’ స్వరములే పాడగా’’ అన్నట్లుగా రాయలనాటి రసికత మళ్ళీ తాండ విస్తుందని ఆకాంక్షిద్దాం. ఈగ బుచ్చిదాసు వంటి వాగ్గేయకారులు మళ్ళీ పుట్టుకు వచ్చి సరికొత్త సంకీర్తనలు, శతకాలు అల్లుతారని ఆశిద్దాం. ఈ క్షేత్రం జ్ఞాన, ధ్యాన, యోగ విద్యలకు ఆలవాలమై నిలుస్తుందని విశ్వసిద్దాం.

భజన సంప్రదాయం, భక్తి భావనలు కొత్త ఊపిరి పోసుకోవాలని కోరుకుందాం. ‘‘ఒకవైపు ఊర్రూతలూపు కవనాలు – ఒక ప్రక్క ఉరికించు విజయభేరీలు – ఒక చెంప సింగారమొలుకు నాట్యాలు-నవరసాలొలికించు నగరానికొచ్చాము’’ అని యాదాద్రిని చూసి రేపటి పర్యాటకులు అనుకుంటారు.

ఈ పంచ నారసింహక్షేత్రం ప్రపంచ నారసింహక్షేత్రంగా విలసిల్లుతుంది. ఈ పల్లె మహానగరం అవుతుంది. ఇంతటి ఘన నిర్మాణాన్ని ప్రపంచానికి అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజంగా ఘనుడు, శాశ్వతుడు.