|

‘సకల పుణ్యవ్రతాలకోశం’ శ్రావణమాసం

శ్రవణా నక్షత్రంతో కూడిన పూర్ణిమ గల నెల శ్రావణమాసం. పన్నెండు మాసాలలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. వర్షర్తువులో సంభవించే ఈ మాసంలో ప్రకృతి ఎంతో చల్లగా ఉండడం, చక్కని వర్షాలు కురవడం, పైరులన్నీ పచ్చదనాలతో కళకళలాడడం కనబడుతుంది. అందుకే ప్రకృతిలోనూ, జీవజాలంలోనూ ప్రశాంతత వెల్లివిరుస్తుంది. వర్షాలతో నిండు కుండలవలె రూపొందే జలాశయాలు పూర్ణకుంభాలవలె నేత్రానందాన్ని కలిగిస్తాయి. జలసంపద సమృద్ధిగా ఉండడంవల్ల పాడిపంటలకు అనువైన వాతావరణం సతరించుకుంటుంది. రైతుల ముఖాలలో ఆనందం తాండవిస్తుంది. ప్రతి పల్లె, ప్రతి పట్టణం అనే తేడా లేకుండా అంతటా ఆనందసందోహాలు తాండవమాడుతాయి. జనులందరూ ఉల్లాసంతో తమతమ విధులను నెరవేరుస్తూ ఆనందిస్తారు.
tsmagazine

డా|| అయాచితం నటేశ్వరశర్మ
శ్రావణమాసం మానవోన్నతికి మూలకా రణం. ఈ నెలలో ఎన్నో పండుగలు, వ్రతాలు, నియమాలు మనిషిని అధ్యాత్మికంగా ఉన్నతు నిగా తీర్చిదిద్దుతాయి. మనిషి తన ఐహిక జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఎన్నో పుణ్యప్రదాలైన పర్వదినాలు ఈ మాసంలోనే సంభవిస్తాయి. అందుకే ఈ మాసం సకల పుణ్యాలకోశం అనడంలో ఎలాంటి సందేహమూలేదు. ముఖ్యంగా శ్రావణమాసం శివునికి ఎంతో ప్రీతిపాత్రం. ఈ మాసంలోని ప్రతి సోమవారంనాడు శివాలయాలలో మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు చేస్తూ భక్తులు తరిస్తారు. శివుడు అభిషేక ప్రియుడని శాస్త్రాలూ, పురాణాలూ చెబుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షధారలతో ఆకాశమే ఒక అభిషేక పాత్రగా రూపొంది భూమి అనే శివలింగాన్ని అభిషేకంతో పూజిస్తున్నదా అన్నట్లు ప్రకృతి కనబడుతుంది. అందుకే నా ‘ఋతుగీత’లో ఈ మాసాన్ని గూర్చి-

‘పుడమియె శైవలింగమని
పూజలు జేసెదవీవు భక్తితో
వడివడి వానలన్‌ దడిపి
వార్షికవార్షుక వేళలందు, నీ
యొడలభిషేక పాత్రగ
నియ్తుముగాగ తటిల్లతారుచుల్‌
మృడునికి తైజసాత్మక సమృద్ధిగ
గంధపు పూతలయ్యెడిన్‌’

అని స్తుతించాను. ఈ మాసంలో తెలంగాణలోని కాళేశ్వరం, వేములవాడ, కీసరగుట్ట, బిక్కనూరు, రామప్ప, వేయిస్తంభాలగుడి మొదలైన దివ్యక్షేత్రాలలో అభిషేకార్చనలు నిరంతరాయంగా సాగుతుంటాయి. భక్తులు యథాశక్తిగా పత్రం, పుష్పం, ఫలం, తోయం, బిల్వదళాలతో పరమేశ్వరుణ్ణి అర్చించి, శివానుగ్రహాన్ని పొందుతారు. ఈ మాసంలో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి.
tsmagazine

శ్రావణమాసంలో వచ్చే మరొక విశేష పర్వదినం నాగపంచమి. శ్రావణశుద్ధ పంచమినాడు వ్యవసాయానికి రక్షను కలిగించే నాగదేవతను పూజించడం సంప్రదాయం. పూర్వం పంట పొలాలకు ఎలుకలవలన ఎంతో బాధ ఉండేదనీ, ఎలుకలు పంటలను నాశనం చేయకుండా కాపాడేవి సర్పాలేననీ అందుకే పాములు వ్యవసాయానికి రక్షణ కలిగిస్తాయనే విశ్వాసంతో నాగదేవతారాధన ప్రాచీనకాలంనుండే ప్రారంభమైంది. వర్షాకాలంలో ఎక్కువగా సంచరించే పాములను పూజించి, వాటి పుట్టల దగ్గర అర్చనలు చేయడం తమనూ, తమ సంతానాన్నీ కాపాడమని నాగ దేవతను ప్రార్థించడం ఈ పండుగలోని విశిష్టతగా కనబడుతుంది. పురాణేతిహాసాలలోనూ నాగదేవతా పూజలు చెప్పబడినందున దేశమంతటా ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ప్రజలు.

తెలంగాణ జనపదాలలో ఈ పండుగనాడు జొన్నపేలాలను నాగదేవతకు నైవేద్యంగా సమర్పించి, పుట్టలోపాలుపోసి, ఆ పాల చుక్కలను కళ్లకు అద్దుకోవడం వెనుక ఆయురారోగ్యభాగ్యాలు నిరంతరం ఉండాలనే భావన కనబడుతుంది.
tsmagazine
శ్రావణ శుద్ధ పౌర్ణమినాడు ‘రాఖీ పూర్ణిమ’ పెద్ద పండుగ. దీనినే ‘రక్షాబంధనం’ అని పిలవడం పరిపాటి. ఈ పర్వదినంనాడు అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్ళు రక్షాసూత్రాలనుకట్టి, తీపి పదార్థాలను నోటికందించి, వారి ఆశీస్సులను, ప్రేమానురాగాలను స్వీకరిస్తారు. యువతీరక్షణ సంస్కృతిలోని భాగంగా అనాదిగా సకలజనుల హృదయాలలో నిలిచిపోయింది. దుష్టశక్తులనుండి వనితా మాన, ప్రాణ రక్షణమే ప్రధానోద్దేశ్యంగా ఏర్పడిన ‘రాఖీ’ (రక్షాబంధనం) ఒక సామాజిక బాధ్యతగా కూడా జనావళిలో నిలిచిపోయింది.

శ్రావణపూర్ణిమను గురు శిష్య సంప్రదాయంలో సైతం పెద్ద పండుగగా భావిస్తారు. భారతీయ విద్యా సంప్రదాయంలో గురు శిష్య సంబంధం ఎంతో దృఢమైంది. ఈ పరంపరను రక్షించేందుకు శిష్యులు గురువులను ఈ పర్వదినాన అర్చించడం, సత్కరించడం, గురువుల అనుగ్రహాన్ని పొందడం కనబడుతుంది. ఎంత ఆధునిక విద్యలు ఈనాడు వెల్లువెత్తుతున్నా గురువులేనిదే ఏ విద్యకూ పరిపూర్ణత ఉండదు. సాంకేతిక విద్యలు సైతం గురుబోధన లేనిదే అర్థంకావు. కనుక గురుశిష్య పరంపరను రక్షించే సంప్రదాయానికి ప్రతీకగా శ్రావణపూర్ణిమ ‘గురుపూర్ణిమ’గా ప్రఖ్యాతి చెందింది. వేదాలకు శ్రుతులని పేరు. అంటే వేదాలను గురువు నోట నేర్చుకోవలసిందేగానీ, పుస్తకాలను చూసి చదవడం సాధ్యంకాదు. వేేదాధ్యయనానికి ‘శ్రావణ’ (వినికిడికి ప్రాధాన్యం కలిగిన) మాసం ఎంతో కీలకం. కనుక ఈ విధంగా వేద విద్యా పరిరక్షణకు ఈ మాసం ఎంతగానో ఉపకరిస్తుందనే భావన వేదకాలంనుండి వస్తోంది. ప్రతి యేడాదీ ఈ పర్వదినంనాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించడం వైదిక ధర్మంలో ముఖ్యమైన అంశం. యజ్ఞోపవీతధారణ అనేది ఎన్నో ధర్మకార్యాలకు నాందివంటిదని పెద్దలమాట. కనుక విద్యాపరంగా, ధర్మపరంగా, శ్రావణపూర్ణిమ విశిష్టమైన దినంగా నిలిచిపోయింది.

ఇలా శ్రావణమాసం ఆద్యంతం పుణ్యకార్యాలకు నెలవై విరాజిల్లుతోంది. ఈ మాసంలో చేసే జపాలూ, తపస్సులూ, అర్చనలూ, దానాలూ, సత్కర్మలూ, విద్యాభ్యాసాలూ విశేషఫలాలను అందిస్తాయని పురాణాల కథనం. కనుక ఈ మాసాన్ని సత్కర్మాచరణతో సార్థకం చేసుకోవడం మానవధర్మం!